భీమా నది కృష్ణా నది యొక్క ప్రధాన ఉపనదులలో ఒకటి. ఇది మహారాష్ట్ర లోని పశ్చిమ కనుమలలో పుట్టి ఆగ్నేయ దిక్కుగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా 725 కిలోమీటర్ల దూరము ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది.

ప్రముఖ పుణ్యక్షేత్రములైన పండరీపురము, జ్యోతిర్లింగాలలో ఒకటైన భీమ శంకరం ఈ నది ఒడ్డున ఉన్నాయి

పుష్కర నదులు

నీరు పల్లమెరుగు... నది పయనం సముద్రమెరుగు. మరి..!
నేల మీద ప్రవహించే నదికి...ఆకాశంలో పరిభ్రమించే గ్రహాలకు
అంతుచిక్కని పొంతన! పుష్కరుడి రాకతో నదులు ఉరకలెత్తుతాయి...
పుష్కరాల సంబరాలు చేసుకునేవి పన్నెండు నదులు
ఎక్కడ పుట్టి ఏ సముద్రంలో మమేకమవుతాయో చూద్దాం!

గోదావరి నది:

గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర త్రయంబకేశ్వరంలో పుట్టింది. ఈ ప్రదేశం పశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి కొండల్లో ఉంది. సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో పుట్టిన గోదావరి నది ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది.

కృష్ణా నది:

కృష్ణానది మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ దగ్గర సతారా జిల్లాలోని జోర్ గ్రామంలో పుట్టింది. ఈ నది పుట్టిన ప్రదేశం సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో అరేబియా సముద్రానికి 64 కి.మీ. దూరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి కృష్ణాజిల్లా హంసలదీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ప్రవాహదూరం 1400 కి.మీ.లు.

సింధునది

భారతీయ చరిత్ర సింధునదితో మమేకమై ఉంటుంది. 3,200 కి.మీ.ల ప్రవాహంలో ఎక్కువ భాగం పాకిస్తాన్‌లోనే ఉంది. టిబెట్‌లో పుట్టి భారత్ మీదుగా పాకిస్తాన్‌లోకి ప్రవహించి కరాచీ దగ్గర (సింద్ రీజియన్) అరేబియా సముద్రంలో కలుస్తుంది.

గంగానది

గంగానది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గంగోత్రి దగ్గర సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో పుట్టింది. 2,525 కి.మీ.ల దూరం ప్రయాణించి బంగ్లాదేశ్‌లోని గంగ-బ్రహ్మపుత్ర డెల్టా దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. విష్ణుప్రయాగ, నందప్రయాగ, కర్ణప్రయాగ, హరిద్వార్, అలహాబాద్, వారణాసి, కోల్‌కతా, బంగ్లాదేశ్‌లలో ప్రవహిస్తుంది.

తుంగభద్ర

తుంగ, భద్ర నదులు కర్ణాటక రాష్ట్రంలో పుట్టాయి. ఈ ప్రదేశం సముద్రమట్టానికి రెండు వేల అడుగుల ఎత్తులో పశ్చిమ కనుమల్లో ఉంది. రెండూ కలసి తుంగభద్రగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణానదిలో కలుస్తాయి.

సరస్వతి

సరస్వతి నది రుగ్వేద కాలం నాటిది. హిమాలయాల్లో పుట్టి రాజస్తాన్ మీదుగా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలిసేదని, క్రమంగా ఎడారిలో ఇంకి పోయిందని చరిత్రకారులు నిర్ధారించారు.

భీమా

భీమానది పశ్చిమ కనుమల్లోని భీమశంకర్ ఆలయం వద్ద పుట్టింది. ఇది కర్నాటక- తెలంగాణ సరిహద్దులో కృష్ణానదిలో కలుస్తుంది. భీమానదితో పాటు తమిళనాడులోని తామ్రపర్ణి నదికి కూడా పుష్కరాలు వస్తాయి. 

కావేరి

కావేరి నది కర్ణాటకలోని బ్రహ్మగిరులలో పుట్టింది. కర్ణాటక నుంచి తమిళనాడులో ప్రవేశించి తంజావూరు జిల్లా పూమ్‌పుహార్ దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది.

నర్మదా
నర్మదానది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అమర్‌కంటక్ దగ్గర నర్మదాకుండ్‌లో పుట్టింది. మహారాష్ట్ర మీదుగా గుజరాత్‌లోకి అడుగుపెట్టి గల్ఫ్ ఆఫ్ కాంబాత్ దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది.

తపతి

తపతి నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బేతుల్ జిల్లాలోని ముల్తాని దగ్గర సాత్పూర పర్వతశ్రేణుల్లో పుట్టింది. ఈ నది గుజరాత్‌లోని సూరత్ దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది.

యమున

యమునా నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యమునోత్రి దగ్గర పుట్టింది. యమున ఉపనది అయినప్పటికీ ప్రధాన నదికి ఉన్నంత ప్రాధాన్యం ఉంది. ఇది అలహాబాద్ దగ్గర గంగతో కలుస్తుంది.

ప్రాణహిత

మహారాష్ట్రలో పుట్టిన వార్ధా నది, ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్ వద్ద కౌతల అనేచోట వెన్‌గంగతో కలసి ప్రాణహితగా ప్రవహిస్తుంది. ఇది కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుంది.ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment