జీఎస్‌టీ 365 రోజుల్లో | GST DAY |  GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakaluజీఎస్‌టీ 365 రోజుల్లో 

జీఎస్‌టీ అమల్లోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో విశ్లేషణాత్మక పరిశీలన 
365కి పైగా ప్రశంసలు.. 365కి పైగా విమర్శలు 
365కి పైగా సమస్యలు.. 365కి పైగా సర్దుబాట్లు.. 
365కి పైగా ఊరటలు.. 365కి పైగా ఇబ్బందులు.. 
365కి పైగా సందేహాలు.. 365కి పైగా స్పష్టీకరణలు 
365కి పైగా నోటిఫికేషన్లు.. 365కి పైగా వాయిదాలు.. 
365కి పైగా ఉల్లంఘనలు.. 365కి పైగా కోర్టుల్లో కేసులు.. 
తొలి ఏడాదిలో స్థూలంగా జీఎస్‌టీ ప్రయాణమిది.
మన జీఎస్‌టీ ప్రత్యేకతలు* ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన జీఎస్‌టీ విధానం మనదేనని ప్రపంచ బ్యాంక్‌ ధ్రువీకరణ 
* ఇప్పటివరకు జీఎస్‌టీ అమల్లో ఉన్న దేశాలు 115 
* తొలుత జీఎస్‌టీ విధానాన్ని అమల్లోకి తెచ్చిన దేశం ఫ్రాన్స్‌ కాగా.. తాజాగా ప్రవేశపెట్టిన దేశం భారత్‌ 
* మన జీఎస్‌టీలో గరిష్ఠ స్లాబు 28%. ఆసియాలో ఇదే అత్యధిక పన్ను రేటు కాగా.. ప్రపంచంలో రెండో అత్యధికం
జీఎస్‌టీ మండలి.. అన్నీ తానై* జీఎస్‌టీ అమలు విజయవంతంలో కీలక పాత్ర జీఎస్‌టీ మండలిదే. 2016 సెప్టెంబరు 12న ఏర్పాటైంది. 
* జీఎస్‌టీ మండలికి కేంద్ర ఆర్థిక మంత్రి నాయకత్వం వహిస్తారు. ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు.
* జీఎస్‌టీ మండలి ఇప్పటివరకు 27 సమావేశాలను నిర్వహించింది. ప్రతి సమావేశంలో ఆయా సందర్భానికి తగ్గట్లుగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి పలు సూచనలు, సిఫారసులు చేసింది. 
* జీఎస్‌టీ మండలిలో కేంద్ర ప్రభుత్వానికి మూడింట ఒక వంతు (1/3) ఓటు హక్కు ఉంది. మూడింట రెండొంతుల (2/3) ఓటు హక్కు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంది. ఏదేని ప్రతిపాదనకు ఆమోదం లభించాలంటే 75 శాతం మంది ఆమోదం అవసరం. 
* తదుపరి జీఎస్‌టీ మండలి సమావేశం జులై 21న జరగనుంది. రిటర్న్‌ల సరీళకరణతో పాటు 28% స్లాబులో ఉన్న కొన్ని ఉత్పత్తులను 18 శాతానికి తీసుకొచ్చే ప్రతిపాదనపై ఇందులో చర్చించే అవకాశం ఉంది.
చేయాల్సినవి ఇవి..* జీఎస్‌టీ విధానంలో చాలా రిటర్న్‌లు దాఖలు చేయాల్సి వస్తుండటం, ఒక్కో రిటర్న్‌కు ఒక్కో గడువు తేదీ ఉండటం వల్ల వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల ఈ సమస్యకు ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చూపాలి. ఒకటే రిటర్న్‌ను దాఖలు చేసేందుకు వీలు కల్పించాలి. 

* గడువు తేదీ వరకు ఆగి ఆఖరి నిమిషంలో రిటర్న్‌లు దాఖలు చేయడం సర్వసాధారణంగా చాలా మంది చేసే పని. ఆ తర్వాత ఎప్పుడైనా రిటర్న్‌ల దాఖలులో ఏమైనా పొరపాటు చేశామని గుర్తిస్తే తిరిగి సవరించిన రిటర్న్‌లను దాఖలు చేస్తుంటారు. అయితే జీఎస్‌టీ విధానం వచ్చాక రిటర్న్‌ల్లో పొరపాట్లను సరిదిద్దే విషయంలో వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని సవరించిన రిటర్న్‌ను దాఖలు చేసే అవకాశాన్ని కల్పించాలి. 

* పైన చెప్పినట్లుగానే ఆఖరి నిమిషంలో ఎక్కువ మంది రిటర్న్‌లు దాఖలు చేస్తుండటంతో తరుచూ జీఎస్‌టీ నెట్‌వర్క్‌ సర్వర్‌ స్తంభించిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎన్ని రిటర్న్‌లు వస్తాయో ముందుగా ఓ అంచనాకు వచ్చి దాని ఆధారంగా జీఎస్‌టీ నెట్‌వర్క్‌ను ప్రభుత్వం సన్నద్ధం చేయాలి. 

* ప్రస్తుతం జీఎస్‌టీ విధానంలో పరిహారపు సెస్సుతో కలుపుకొని సున్నా నుంచి 290% వరకు వివిధ రకాల పన్ను రేట్లు ఉన్నాయి. పన్ను రేట్ల సంఖ్య విషయంలో జీఎస్‌టీకి ముందు ఎలాంటి పరిస్థితి ఉందో.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. అందువల్ల పన్ను రేట్ల సంఖ్యను రెండు లేదా మూడుకు తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి. అలా చేస్తే నిబంధనలను పాటించే విషయంలో వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెండో, మూడో పన్ను రేట్లు ఉంటే వినియోగదారుడుకి కూడా పన్ను చెల్లింపుల విషయంలో అవగాహన ఉంటుంది.* పన్ను ఎగవేతకు దోహదం చేసే టీడీఎస్‌ (మూలం వద్ద పన్ను కోత), టీసీఎస్‌ (మూలం వద్ద పన్ను వసూలు), రివర్స్‌ ఛార్జీ విధానం లాంటి నిబంధనలను వెంటనే అమల్లోకి తేవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. జీఎస్‌టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి వీటి అమలును ప్రభుత్వం వాయిదా వేసుకుంటూనే వస్తోంది. ఇప్పుడు తాజాగా వీటి అమలు గడువును సెప్టెంబరు 30కి పొడిగించింది. 

* వినియోగదారుల సమస్యలను పరిష్కరించే విషయంలో రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు ఇవ్వలేదు. జీఎస్‌టీ నెట్‌వర్క్‌ను ఆ విధంగా కేంద్రం రూపకల్పన చేసింది. అందువల్ల న్యాయ ప్రయోజన అంశాలను దృష్టిలో ఉంచుకొని జీఎస్‌టీ పరంగా ప్రజలకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్రాలకు కూడా అధికారాలు కల్పించాలి. 

* జీఎస్‌టీ నెట్‌వర్క్‌ను ఉపయోగించే విషయంలో సంబంధిత అధికారులకు కూడా అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అయితే అధికారులతో సంబంధం లేకుండా జీఎస్‌టీ నెట్‌వర్కే ఆదేశాలు జారీ చేస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం అధికారులకైనా ఇబ్బందులు లేకుండా జీఎస్‌టీ నెట్‌వర్క్‌ను తీర్చిదిద్దేందుకు జీఎస్‌టీ నెట్‌వర్క్‌ బృందం చర్యలు చేపట్టాలి. 

* తప్పుడు రశీదుల ద్వారా అర్హతకు మించి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌కు క్లెయిమ్‌ చేసుకోవడం, బిల్‌ ట్రేడింగ్‌ లాంటి అవకతకవలకు పాల్పడటంతో ఏడాదికాలంలో పలువురిని అధికారులు అరెస్టు చేశారు. ఇలాంటి అవకతవల నియంత్రణపై యాంటీ ప్రాఫిటరింగ్‌ అథారిటీ నిరంతర పర్యవేక్షణ చేయాలి. అయితే యాంటి ప్రాఫిటరింగ్‌ అథారిటీని ఏర్పాటు చేసినప్పటికీ, ఇప్పటివరకు అది నిర్వర్తించాల్సిన విధులపై పూర్తి స్పష్టతను ప్రభుత్వం ఇవ్వాలి.
* ప్రపంచంలోనే అత్యుత్తుమ జీఎస్‌టీ విధానం మనది కావాలంటే పెట్రోలియమ్‌ ఉత్పత్తులు, స్టాంప్‌ డ్యూటీ, విద్యుత్‌ను కూడా జీఎస్‌టీ పరిధిలోకి తేవాలి. 

* పన్ను రీఫండ్‌లు నిలిచిపోవడంతో ఎగుమతిదార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్న ఎగుమతిదార్లకు మూలధన కొరత ఏర్పడుతోంది. దీంతో రుణాలపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ పరిణామం వారి కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని రీఫండ్‌ల జాప్యానికి కారణమవుతున్న సమస్యలను ప్రభుత్వం సత్వరం పరిష్కరించాలి.
ఈనాడు వాణిజ్య విభాగం
#GST
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment