స్త్రీల వ్రతకధలు | Strila Vratakadalu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

స్త్రీల వ్రతకధలు 
 Strila Vratakadalu
Rs 36/-
----------------------------------------------

                        నోములు వ్రతాలు.

రోజురోజుకొరోజుకొక నోము, లేదా వ్రతం  గురించి తెలుసుకుందాము.

నోములు వ్రతాలు అనగానే స్త్రీలు చేసేవి అనే అభిప్రాయం కలుగుతుంది ఎవరికైనా. ఈ మాట కొంత వరకు నిజం. ఎక్కువగా వ్రతాలు చేసేది మహిళలే. వారికి ప్రతి అవసరానికి ఒక వ్రతమో, నోమో సిద్ధంగా ఉంటుంది. వ్రతాలు చాలా వరకు స్కాందపురాణాంతర్గతమైనవిగా కనపడతాయి. సాధారణంగా ఆడవారు చేసే పూజలు, వ్రతాలు నోములు చాలా వరకు అయిదోతనం కోసం అయి ఉంటాయి. కొన్ని మాత్రం పిల్లలు కావాలనో, ఉన్న పిల్లలు బాగుండాలనో, వారి భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండాలనో చేయటం జరుగుతుంది. చిత్రమైన వాస్తవం ఏమంటే స్త్రీలు చేసే వ్రతాల్లో ఏ ఒక్కటీ తమ కోసం చేసుకొనేది లేదు. ఇంక చిత్రం ఏమంటే మహిళలు తమ భర్తల క్షేమం కోసం, ఆరోగ్యం కోసం, పదోన్నతి కోసం అంటూ ఎన్నో వ్రతాలు, నోములు చేస్తారు. ప్రతి నోము మన సంస్కృతీ సంప్రదాయాలను, మనం ఏవిధంగా జీవించాలో తెలియ చేస్తాయి.కొన్ని వందల నోములు మనం చేసేవి ఉన్నాయి. అందులో రోజూ చేసేవి, సంవత్సరానికి ఒకసారి చేసేవి ఉన్నాయి. రోజుకో నోము గురించి తెలుసుకుందాము.నోములు వ్రతాలు చేసుకునేటప్పుడు సాధారణంగా మనం సుద్దముక్కతో ముగ్గు వేస్తాము. కనీసం  పూజ గదిలోని దేవుని పీఠంపై బియ్యపుపిండితో మాత్రమే ముగ్గు పెట్టాలి. ఏ వ్రత పుణ్యదినాన ఐనా  సూర్యోదయానికి ముందే లేచి (ఐదుగంటలకు), అభ్యంగన స్నానమాచరించి, నూతన వస్త్ర ధారణ చేయాలి.

 ఈ నోములు మాఘ మాసం లో రథసప్తమి నాడు లేదా శివరాత్రి నాడు పడతారు. అంటే ఆరోజు మొదలు పెట్టి కథ చదువుకుని అక్షింతలు వేసుకుంటారు. పట్టిన నోముని బట్టి రోజు లేక సంవత్సరం చేసి ఉద్యాపన చేసుకొంటారు.


పూజకు అవసరమైన సామాగ్రి.
పసుపు, కుంకుమ,  గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, టెంకాయ, దీపపు సెమ్మెలు -2,  హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి కర్పూరం, అగరవత్తులు,  దీపారాధనకు నెయ్యి మొదలైనవి.నైవేద్యానికి వినాయకుడికి బెల్లం, అమ్మవారికి పులగం, పరవాన్నం. మహా నైవేద్యం.

వినాయకుడు విజ్ఞాలకు అధిపతి. ప్రతిపూజకు ముందుగా వినాయకుని పూజ చేసి, అప్పుడు గౌరీ పూజ చేయాలి.

ముందుగా సంపద శుక్ర వారపు నోము గురించి తెలుసుకుందాము.


 


సంపద  శుక్రవారపు నోము 
పూర్వకాలంనాటి మాట. కాంభోజ రాజ్యాన శివశర్మ అను బ్రాహ్మణుడు నివసించేవాడు. ఆయనకు ఏడుగురు కుమారులు. తండ్రి అందరికీ వివాహాలు చేసి ఉన్న ఆస్తిపాస్తులు సమంగా పంచి మరణించాడు. అనంతరం కుమారులు విడిపోయారు. కలసి ఉండేవారుకాదు.అందుకొందరు భ్రష్టులయ్యారు. మరికొందరు ఆచారహీనులయ్యారు. ఏది ఏమైతేనేం అందరికందరు దరిద్రం అనుభవించసాగారు.ఎవరెలా ఉన్నా కాలం ఆగదు. దానిపని అది చేసికొనిపోతుంది.క్రమం తప్పదు. నియమం పాటిస్తూ అది దాని విధి చేసికొంటూ పోతుంది. ఒకనాడు శ్రీలక్ష్మి భూలోక సంచారంచేస్తూ  అష్టకష్టాలు పడే ఆ బ్రాహ్మణుని కుమారుల ఇండ్లకు వెళ్ళింది. వరుసగా చూసింది. అక్కడ వారి ఇండ్లలో........ పెద్దకోడలు పద్మ పాచిచేయక జుట్టు విరబోసుకుని కూతురుకు పేలు చూస్తోంది. రెండవకోడలు సావిత్రి పరచిన తీయక పిల్లలకు చద్దియన్నం పెడుతోంది. మూడవ కోడలు కామాక్షి పాతగుడ్డలు కుడుతూ కూచుంది. నాల్గవ కోడలు జయంతి గచ్చకాయలాడుతోంది. అయిదవ కోడలు అన్నపూర్ణ ఇరుగుపొరుగు వారితో గొడవలు పెట్టుకుంటోంది. అందరినీ చూసి విసిగిపోయి చివరకు ఏడవకోడలు ఇంటికి వెళ్ళింది. ఆమె పేరు విజయ కళ్యాణీ రాధిక. తెల్లవారుజామున లేచింది. ఇల్లు శుభ్రం చేసుకొంది. రంగవల్లులు తీర్చి దిద్దింది. స్నానం చేసింది. కుంకుమబొట్టు పెట్టుకున్నది.  గౌరీదేవికి పూజ లక్ష్మి ఆమెను చూసి ముచ్చట పడినది. లోనికివెళ్ళి అమ్మా! నేను తీర్ధ యాత్రలు చేయుచూ ఈనాడు మీ ఇంటిముందు ఆగినాను. రేపు వెళ్ళిపోతాను.  మీఇంట ఉండవచ్చునా.? అని అడిగింది. అంత ఆ చిన్నది -  తల్లీ  సాక్షాత్తూ  లక్ష్మీదేవిలా  ఉన్నావు. ఉండు తల్లీ. నా భర్త యాయవారమునకు వెళ్ళినాడు. తెచ్చినది వండి వడ్డిస్తాను. లేనిది పెట్టలేను. ఉన్నది దాచుకోను. ఆరగించి సంతోషంగా వెళ్ళవచ్చు అని అన్నది.  లక్ష్మీ పరమానంద భరితురాలయింది. పవిత్రాక్షతలిచ్చి  అమ్మా ! వీటిని తలపై వేసుకుని నీ పనులు చేసుకో అంతే. సరేనని ఆమె తలపై అక్షతలు వేసుకొని పనిలో నిమగ్నమైనది. భర్త ఆనాడు అనుకోకుండా ఎన్నో పదార్ధాలు ఇంటికి తెచ్చాడు. అంత ఆమె తొందరగా వంట వండి నివేదన పెట్టి తన ఇంటికి వచ్చిన లక్ష్మికి వడ్డించింది. దంపతులిద్దరూ ఆమె సరసన కూర్చుని భోజనం చేశారు. రాత్రి వారియింటనే   నిద్రపోయింది.ఆ తల్లి. తెల్లవారగానే ఆమె వెళ్ళిపోయింది. దంపతులు లేచి చూసేసరికి ఇల్లంతా సిరి, సంపదలు, ధనరాశులు. ఆశ్చర్యపోయారు. వచ్చినది మహాలక్ష్మీ దేవియని భక్తిశ్రద్ధలతో సంపద శుక్రవారపు నోము నోచి సుఖ, శాంతులతో జీవించారు.
ఉద్యాపన :-
ప్రతి శుక్రవారం లక్ష్మిని పూజించాలి. ఒక్కపూట భోజనం చేయాలి. నేలపై పరుండాలి. 
 5గురు ముత్తయిదువులకు పసుపు , కుంకుమలతో అలంకారం చేయాలి. తాంబూలం ఈయాలి. అలా 3  సంవత్సరాలు చేయాలి. అనంతరం 5 గురు పేరంటాళ్లను పిలచి తలంటాలి. బొట్టుపెట్టి కాటుక దిద్దాలి.చీర, రవికల గుడ్డ, దక్షిణ తాంబూలం ఇచ్చి భోజనం పెట్టాలి. మహాలక్ష్మీరూపణులుగా  ఆరాధించాలి. తప్పక ఫలితం సిద్ధిస్తుంది.             
             సర్వేజనా సుఖినోభవంతు.
****************************************
                 పసుపు - కుంకుమల నోము.పూర్వకాలంనాటి  మాట. ఆ కాలమున ఒక గ్రామాన ఒక ధనవంతుడైన కోమటి ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె కలిగినది. పెరిగి పెద్దదైనది. ఆమెను వారి కులస్తుడగు ఒక వరునికిచ్చి వివాహం చేసాడు. వివాహమైన కొన్నాళ్ళకు ఆమె భర్త స్థిరత్వం లేక అస్థిరుడై, చంచలుడై ఇంటిపట్టున ఉండక దేశ దిమ్మరిలా తిరుగుతూ ఉండేవాడు. అందుకు అతని భార్య పాపం చాలా బాధపడుతూ ఉండేది.  గౌరిశంకరులను ప్రార్ధించి, అది దంపతులారా! నా కష్టం గట్టెక్కే మార్గమే లేదా? అని వినయంగా అడిగింది.
ఒకనాడు శివుడు కలలో కనిపించి - పిచ్చిదానా!  అధైర్యపడకు. ధైర్యంగా ఉండు. తప్పక కాలం కలసివస్తుంది. పసుపు - కుంకుమల నోము నోచుకో, అని వివరాలు చెప్పి అదృశ్యమయ్యాడు శంకరుడు.
పరమేశ్వరుడు చెప్పిన విధంగా ఆమె ప్రాతఃకాలాన లేచి స్నానంచేసి 5  కుంచముల పసుపు, 5 కుంచముల కుంకుమ సిద్ధం చేసుకుని ముత్తయిదువులకు పంచింది. పంచె సమయాన మౌన ధారణ (మాట్లాడకుండా ఇవ్వడం ) ముఖ్యం. పంపకం పూర్తికాగానే గౌరీ దేవికి కుంకుమ పూజ చేయించి అన్నదానం చేయించింది. తానూ తిన్నది. 
వ్రత ప్రభావం.
తెల్లవారేసరికి ఆమె కెదురుగా ఆమె భర్త నిలబడి ఉన్నాడు. మందహాసం చేస్తూ పరమ శాంతంగా నిలబడ్డాడు. ఆశ్చర్యం, వింత , విస్మయం,కలిగి ఆమె ఇది కలా?  నిజమా? ఈ వ్రతమందు ఇంత అద్భుత శక్తి ఉందా? అనుకొంటూ ప్రతి ఏటా చేసేది. హాయిగా భర్తతో జీవించింది. ఇహమందు సుఖపడి పరమందు మోక్షం పొందింది. 

అందరూ ఈ నోము నోచవచ్చు, ఆచరించవచ్చు. ఫలం  పొందవచ్చు. భక్తిశ్రద్ధలు అవసరం. నమ్మకం ముఖ్యం. విశ్వాసం ప్రధానం. నాస్తికులు చేసిన ఫలితముండదు. దైవమును నమ్మినవారే ఈ నోమును ఆచరించాలి.
_________________________________________________________________________________

                      అంగరాగాల నోము. 

స్త్రీలు ఆచరించవలసిన నోములలో అంగరాగాల నోము ఒకటి. అందం కోరుకునేవారు,ఆనందం కావాలని అభిలషించేవారు, సిరి-సంపద, పసుపు, కుంకుమ, సౌభాగ్యం, పాడి - పంటలు, సుఖ - సంతోషాలు ఇహపరాలయందు సౌఖ్యం, పుత్ర - పౌత్రాభివృద్ధిని ఆకాంక్షించే వారు ముఖ్యంగా స్త్రీలు ఈ నోము చేయవచ్చు. 

" అంగరాగాల నోము అనుభవాల గీము " 
అని చెప్పి శిరస్సున అక్షతలు వేసుకోవాలి. అనంతరం అయిదు బొట్టుపెట్టెలు, అయిదు కాటుకభరిణెలు,  అయిదు కుంకుమ భరిణెలు, అయిదు దువ్వెన్నలు, అయిదుసవరములు, అయిదు అగరవత్తులు కట్టలు, అయిదు గంధపు చెక్కలు, అయిదు నల్లపూసలు,   అయిదు బంగారు పూలు లేదా పూలు, అయిదు అద్దములు, అయిదు చీరలు, తెప్పించి అయిదుగురు సువాసినీ స్త్రీ లను పిలచి వారికి తలంటి నీళ్లు పోసి, పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం పెట్టవలెను.  శ్రద్ధాభక్తులతో దక్షిణ, తాంబూలం, వాయనం ఇవ్వవలెను. ఈ నోము యవ్వనవతులు చేయవలెను. శ్రద్ధతో చేయవలెను. భక్తితో ఆచరించవలెను. ఫలము సిద్దించగలదు.

అంగరాగాల నోము పాట.

1 . రండి తెలిసుకోండి రారండి మీరు
అందాలనోమిది ఆనందాల నోమిది
సిరి సంపద లిచ్చు శుఖ శాంతుల నిచ్చి
పసుపు - కుంకుమ నిచ్చు పాడి పంటల నిచ్చు
సంతాన మిచ్చునది సంతోష మిచ్చునది
ఆడువారందరూ హాయిగా చేయొచ్చు
అంగరాగాల నోము అనుభవాల గేము
ఇహమందు సుఖము పరమందు సౌఖ్యము
కలుగజేసే నోము కలిగించు నోము.2 . విషయాలు తెలుసుకొని వివరంగా మీరు
ఆచరించండి ఫలమను భవించండి
బొట్టుపెట్టెలు లయిదు కాటుకకాయలు 
సవరాలు, దువ్వెన అగరువత్తులు తెచ్చి
నల్లపూసలు, పూలు, గంధపు చెక్కలు
అద్దములు, వస్త్రాలు, ఆభరాణాదులు 
ఐదేసి తెప్పించి అందముగ  ఉంచి
దక్షిణ, తాంబూల వాయనము లిచ్చి
భక్తి శ్రద్ధలతోడ చేయాలినోము.


3 . ముత్తయిదువులను మీరు ముందుగా పిలిచి
అభ్యంగన స్నానాలు చేయించి వారికి
మంచి వస్త్రాలు ఇచ్చి మర్యాదలను చేసి
పిండి వంటలతోను భోజనంపెట్టి
ఏలోటు రాకుండా నోము చేయాలి
ఇహమందును - పరమందు సుఖము పొందాలి
భక్తితో చేసిన ఫలము సిద్ధించును
శక్తి కొలది చేసి స్త్రీలందరూ మీరు
అంగ రాగాలతో హాయిగా ఉండండి.
మంచి చేకూరును మర్యాద కలుగును
యువతులందరకిది యుక్తమైన నోము

యుగయుగా లందునా చేసేటి నోము.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@                అట్లమీద ఆవపూల నోము.

ప్రాచీన కాలంనాటి మాట. ఆ కాలాన ఒక ధనికరాలుండేది. ఆమె గొప్ప శ్రీమంతురాలు. ఆమె అనేక నోములు నోచినది. అందులో అట్లమీద ఆవపూవుల నోము ఒకటి. ఆ నోము పట్టినది కానీ మధ్యలో మానేసింది. ఏ కారణంగానో విడిచిపెట్టింది. దాంతో ఆ శ్రీమంతురాలి భర్త, కుమారులు మరణించారు. సంపద పోయినది. దరిద్రురాలైనది. ఎవరూ ఆదుకోలేదు. గొప్పగా జీవించిన ఆ ఇల్లాలు ఉన్న ఊరిలో ఉండలేక విచారిస్తూ , భాదపడుతూ, దుఃఖిస్తూ అడవులవెంటపడింది.దరి తెన్నూ కానక తిరుగుతోంది.

 అలా తిరిగే ఆమెకు  ఆ అడవిలో పార్వతీపరమేశ్వరులు  కనిపించారు. ఎవరివమ్మా నీవు? అని అడిగారు. ఏ ఊరని ప్రశ్నించాడు. విచారిస్తూ ఇలా అడవిలో సంచరించడానికి కారణం ఏమిటని వివరంగా చెప్పమని అడిగారు. ఆమె బదులు చెప్పలేదు సరికదా విసుక్కుంది. నా విషయం మీకెందుకంది., చీదరించుకుంది. అవునులెండి తప్పు ఆమెది కాదు కష్టాలవల్ల ఆలా అంది. అడిగినవారు గౌరీ - శంకరులని  ఆమెకేం తెలుసు?  వారు ఆమె కష్టాలు తీర్చేవారని మాత్రం ఆమె గుర్తించగలడా? దుఃఖించి ముందుకు పోసాగింది.

అంత పార్వతీపరమేశ్వరులు - పిచ్చిదానా! నీ కథ అంటా మాకు తెలు. మేము ఆదిదంపతులం, ఉమామహేశ్వరులము.నీబాధ తీర్చాలని నీ కష్టాలు  గట్టెక్కించాలని ఇక్కడ ఉన్నాము. నీవు   అట్లమీద ఆవపూల నోము  విడచిపెట్టావు. అందుకే అష్టకష్టాలు పడుతున్నావు. మించిపోయిందేంలేదు. పన్నెండు ఆవకొమ్మలు   తీసుకునిరా. అవి పూతకాయలతో ఉండాలి. వాటిని పన్నెండు అట్లమీద పెట్టు. రవికెలగుడ్డ, దక్షిణ, తాంబూలము, నెయ్యి,బెల్లము తెచ్చి వాయనమిచ్చి నమస్కరించు .అంతే. నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి. బాధలుండవు. చీకు, చింత తొలగిపోతాయి. దరిద్రముండదు. శ్రద్ధాశక్తులతో ఆచరించు, లోపం జరగనీయకు అని చెప్పి వారిద్దరూ అంతర్ధానమయ్యారు. ఆ ఇల్లాలు శివపార్వతులు చెప్పినవిధంగా చేసింది. తన అపచారానికి పశ్చాత్తాప పడింది. భక్తితో వ్రతమాచరించింది. సుఖపడింది. కథ యందు ఉద్యాపన చెప్పబడినది. కావున శ్రద్ధాభక్తులతో ఈ వ్రతం చేసి స్త్రీలు ఫలం పొందండి. స్త్రీలందరూ చేయవచ్చు. అత్యంత ఫలప్రదమైన నోము ఇది. 

పాట. 
అట్లమీద అవపూల నోముఇది
అందరందరాచరించు నోముఇది
పేదవారు చేసిన శ్రీమంతులు అగుదురు 
ధనవంతులు చేసిన కుబేరులే అగుదురు 
పూటా - కాయలుగల ఆవకొమ్మలు తెచ్చి 
పదిలంగా పన్నెండు అట్లపై ఉంచి 
బెల్లము, పేరైన నీటిని తెచ్చి 
దక్షిణ తాంబూలములతోనవి ఇచ్చి 
రవికెలగుడ్డలతో వాయనములనిచ్చి 
ఉద్యాపన జెసి ఉపచారములచేసి 
ఆదిదంపతులు ముందుగా మొక్కి 
శివ - పార్వతులకు మీరు శిరసునేవంచి 
శ్రద్ధతో భక్తితో నియమనిష్టలతోను  
అత్యంత ప్రీతితో వ్రతమాచరించి 
ఫలమును పొంది సుఖమును పొంది 
మీరాచరించి అందరికి చెప్పి 
సుఖశాంతులు పంచండి స్త్రీలందరకూ మీరు
భోగ,భాగ్యాలతో బ్రతకండి అందరు 
మంగళం మంగళం మంగళం శివునికి 
మంగళం మంగళం మహిమగల తల్లికి.
                     శుభంభూయాత్.
****************************************

                          అట్లతద్దె నోము 

ప్రాచీనకాలం నాటిమాట.ఒకరాజుగారి అమ్మాయి తన చెలికత్తెలతో అట్లతద్దె నోము నోచినది. చెలికత్తెలందరూ ఉపవాసముండిరి. రాచకన్య మాత్రం సుకుమారి కావడంవల్ల ఉపవాసముండి సాయంకాలానికి సొమ్మసిల్లి పడిపోయినది.అంట ఆమె సోదరుడు ఆరిక కుప్పకు నిప్పుపెట్టి చెట్టునకొక అద్దము వ్రేలాడదీసి మాన్తా చూపించి చంద్రోదయమైనది భోజనం చేయవచ్చును అని చెప్పాడు. పాపం నిజమనుకుని ఆ రాచబిడ్డ వాయనమందించి  భోజనం చేసినది.కొంతకాలమునకు ఆమెకు యుక్త వయస్సు రాగా నామె అన్నలు పెండ్లి సంబంధములను చూచుచుండిరి.వ్రతమును లోటు కలగడంవల్ల ఆమెకు మంచి సంబంధం కుదరడంలేదు.తనతోటివారందరికీ వివాహాలు అయ్యాయి. ఎన్ని సంబంధములు వెదకినను ముసలి వరుడే దొరకుటచే, కడకు వారు విసిగి తమ చెల్లెలిని ముసలివానికిచ్చి పెండ్లి చేయ నిశ్చయించిరి.ఆ సంగతి తెలసి ఆ రాచబిడ్డ "అయ్యో! అట్లతద్ది నోము నోచిన వారికి పడుచు మగడు దొరుకునని చెప్పిరి, కాని నాకీ ముసలి మగడేల దాపరించుచున్నాడు!" అని విచారించి, వృద్ధ భర్తను వివాహమాడుట కంగీకరింప లేదు. అన్నలామెనెంతో బలవంతపెట్టి వివాహమును జేయనెంచిరి. కాని ఆమె యందులకు సమ్మతింపక, ఒక నాటి రాత్రి అడివికి పోయి ఒక మర్రిచెట్టు క్రింద తపస్సు చేయుచుండెను. 


కొంత కాలమునకు పార్వతి పరమేశ్వరులామెను చూచి "ఓ కన్యామణీ! నీ వేల తపస్సు చేయు చున్నావు? మేము పార్వతీ పరమేశ్వరులము. నీ కష్టమును మాతో చెప్పుము" అనిరి. అంత నామె వారిని అతి భక్తితో నమస్కరించి తన వివాహ విషయమును చెప్పెను. వారది విని "అమ్మా! నీవు అట్లతద్దె నోము నోచి చంద్ర దర్శనము కాక పూర్వమే భోజనము జేసి యుల్లంఘన చేసితివి. అందుచే నీకు ముసలి మగని సంబంధము వచ్చుచున్నది. కావున నీవు యింటికి పోయి నోము నోచుకుని దీపాల వేళ వరకు వుపవాసముండిన పిమ్మట భోజనము జేయు" మని చెప్పి అదృశ్యమయిరి. అంత నామె తన యింటికి వెళ్ళి జరిగిన విషయమును తల్లి దండ్రులకు చెప్పి యధావిధిని నోము నోచుకొనెను. తరువాత నామెకు చక్కని పడుచు మగనితో పెండ్లి జరిగెను. వ్రాత ఫలితంగా ఆమె తన భర్తతో హాయిగా సుఖంగా జీవించింది.


దీనికి వుద్యాపనము

ఈవ్రతము ఆశ్వయుజ మాస మండలి బహుళ తదియనాడు ఉపవసించవలెను. ఈ అట్లతద్దెకి గోరింటాకును తప్పనిసరిగా పెట్టుకుంటారు. పెట్టుకోవాలి. కొంతమంది గోరింటాకు ముద్దను ముందురోజు ముత్తయిదువులకు ఇస్తారు. చంద్రోదయమయ్యే వరకూ ఏమీ తినకుండా ఉపవాసముండి చీకటి పడినంతటనే గౌరీదేవికి పదియట్లు నైవేద్యము పెట్టవలెను. అలా 9  సంవత్సరములు జరుపవలెను. 10 వ సంవత్సరాన 10  మంది ముత్తయిదువులకు తలంటి స్నానం చేయించవలెను.10 మందికి 10 అట్లు, పసుపు, కుంకుమ రవికెల గుడ్డ, దక్షిణ, తాంబూలము  సమర్పించి సంతృప్తిగా భోజనం పెట్టవలెను.

 పద్ధతి తప్పినను ఫలము తప్పదు, భక్తి తప్పకుండిన ఫలము కలుగును.  
++++++++++++++++++++++++++++++++++++++++++++++++


      అన్నం ముట్టని ఆదివారాలు నోము 

ప్రాచీన కాలం నాటి మాట .ఆ కాలాన ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు .ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ఏడుగురు కుమారులు ,మొత్తం తొమ్మండుగురు సంతానం . వారందరిలో చిన్నది శృంగార వతి .తండ్రి అందరికి వివాహము చేసి ఆమెకు కూడా తగిన వరుని వెదకి వివాహం చేశాడు .మంచి ముహూర్తాన ఆమెను కాపురానికి పంపాడు. శృంగార వతి భర్తతో చక్కగా కాపురం చేసుకుంటోంది .కాలం గడుస్తోంది .

ఒకనాడు ఆమె తండ్రి కుమార్తెను చూడ వచ్చాడు .తన ఇంటికి వచ్చిన తండ్రిని ఆదరించి గౌరవించి కుశల ప్రశ్న లడిగి యోగ క్షేమములు తెలిసికుని భోజనాలయ్యాక ఆ చిన్నది -నాన్నా ! నా వివాహమై చాలాకాలమైనది .అయినా కడుపు పండలేదు .కారణం తెలియదు. నాకు సంతాన భాగ్యం లేదా ? పిల్లలు పుట్టారా ? సంతానం లేని ,మాతృమూర్తి ని కాని స్త్రీ జన్మ వృధా అంటారు .వ్యర్ధ మంటారు. గోద్రాలిగా జీవిన్చావలెను. అని విచారించి దుఃఖిస్తూ తన భాదను తండ్రికి వివరించి చెప్పింది.

కుమార్తె గోడు విన్నాడు .తండ్రి చాలా బాధ పడ్డాడు .ఆ తండ్రి వెంటనే సూర్య నారాయణ మూర్తి ని ప్రార్ధించి అతడు ప్రత్యక్షం కాగా నమస్కరించి వినయంగా తన కుమార్తె విషయం వివరంగా చెప్పాడు .విన్న బాల భాస్కరుడు భక్తా ! విచారించకు .ఉపాయము చెప్పెదను అట్లు చేయి .తప్పక నీ కూతురు కడుపు పండి సంతానం కలుగగలదు. సోమి దేవమ్మ దగ్గరకు వెళ్ళు ,ఆమె మూడు వందల అరవై నోములు నోచిన పుణ్యాత్ము రాలు . అంతేకాదు మూడు వందల అరవై నోములు నోచిన ధన్యాత్ము రాలు .నీ కుమార్తె విషయమంతా ఆమెకు చెప్పు .ఉపాయమడుగు. తప్పక ఆమె ఉపాయం చెప్పగలదు. అలా చేయి అని చెప్పి అతడు అంతర్ధాన మయ్యాడు.
బ్రాహ్మణుడు సంతోషించి పరమానంద భరితుడై ఆదిత్యుడు చెప్పిన విధంగా తాను తిన్నగా సోమిదేవమ్మ వద్దకు వెళ్లి తన కుమార్తె విషయం చెప్పి కడుపు పండే మార్గం చెప్పమని అడిగాడు .విన్నది సోమిదేవి . కడు పుణ్యాత్మురాలు ,ధన్యాత్మురాలు ,ఉపకారి ,మంచి చేసే స్వభావం గలది .అందుచేత ఆమె చేసిన పుణ్య ఫలం నుండి పూర్ణ ఫలం ధార పోసింది. వ్రత విధానం వివరంగా చెప్పింది .బ్రాహ్మణుడు సంతసించి ఇంటికి పోయి తన కుమార్తెను పిలిచి విషయమంతా వివరించి చెప్పి -అమ్మా నీవు అన్నం ముట్టని ఆదివారం వ్రతం ఆచరించు ,నీ కడుపు పండి సంతానం కలుగుతుంది .

అనగా విని ఆమె తండ్రి చెప్పిన విధంగా నోము నోచినది .వ్రత ఫలంగా ఆమె కడుపు పండినది .సంతానం కలిగినది .అభీష్టము నెరవేరినది ఇక వివరంగా ఉద్యాపన వివరిస్తాను వినండి.

ఉద్యాపన:

ఈ వ్రతం మూడు సంవత్సరాల లోపున ముట్టంటులు కలవారు చేసికోవాలి .సంవత్సరంన్నర లోపు పెద్దవారు పూర్తి చేసుకోవాలి . గృహ మందు ఒక భాగాన ఆవుపేడతో అలకాలి .చక్కగా రంగ వల్లులతో తీర్చి దిద్దాలి .గణనాధుని సేవించాలి .వాణిని పూజించాలి .బాల భాస్కరుని ప్రతిమను చేసి నిత్య కృత్యాలు పూర్తి చేసికొని స్నాన మాచరించి పట్టు బట్టలు ధరించి శ్రద్దా భక్తులతో వ్రత మాచరించ వలెను. పాల పొంగలిని నైవేద్యము పెట్టవలెను. ఇక పన్నెండు మంది ముత్తయిదువులకు వస్త్రము ,దక్షిణ తాంబూలాలతో నూట ముప్పది మూడు బూరెలను రాగి పళ్ళెము నందుంచి వాయన మీయవలెను .శక్తి వంతమైన పరమ పవిత్రమైన ఫలదాయకమైన నోమిది .ఆచరించి ఆడువారు సంతాన వంతులు కావచ్చు .వ్రత మాచరించండి.ఫలం పొందండి .


వ్రతం తప్పినా ఫలం తప్పకూడదు.

 >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

                 పదహారు ఫలాలు నోము


పూర్వకాలంలో ఒకానొక రాజ్యంలో ఆ రాజుగారి భార్య మంత్రి భార్య పదహారు ఫలాల నోము నోచుకున్నారు.  రాజు భార్యకు గుణ హీనులు, అవిటివారు కుమారులుగా పుట్టారు.  మంత్రి భార్య శ్రద్ధాభక్తులతో ఆచరించింది. ఆమెకు రత్నమాణి క్యాల్లాంటి సుగుణ గుణ సంపన్నులు కలిగారు.  ఇందుకు రాజు భార్య ఎంతగానో చింతించింది.  మంత్రి భార్యను కలుసుకుని ఏమమ్మా!  నువ్వు నేను కలిసే గదా పదహారు ఫలాల నోమును నోచుకున్నాము.  మరి నాకిట్టి బిడ్డలు, నీకు అటువంటి బిడ్డలు పుట్టుటకు కారణమేమిటి, లోపం ఎక్కడ జరిగినది  అని అడిగింది. 


           

రాణి  మంత్రి భార్య చెప్పిన ప్రకారం మంచి పళ్ళను సమకూర్చుకుని, ఎంతో భక్తి శ్రద్దలతో పదహారు ఫలాల నోమును నోచుకున్నది.  అలా ఈ నోము విశేషం వలన ఆమె సంతానం సర్వాంగ సుందరంగా మారడం జరిగింది.  అందుకా రాణి  ఎoతగానో ఆనందించింది.  

ఉద్యాపన:  పరిశుభ్రమైన  పదహారు రకాల పళ్ళు ఎంచుకొని సమకూర్చుకోవాలి.  ఒక్కొక్క రక0 పండును, పువ్వులను దక్షిణతాంబూలాలను  ముత్తైదువునకు  ఇవ్వాలి. అన్ని రకాలు ఒక్కసారే ఇవ్వాలని లేదు. ఎప్పుడైనా ఇవ్వవచ్చు.  తదుపరి సంతర్పణం చెయ్యాలి.                         వ్రతం తప్పినా ఫలం తప్పదు.

******************************************************

               అక్షయ బొండాల నోము 

పరమ పవిత్రమైన భారతదేశమునందు జన్మించిన స్త్రీలకు మన పూర్వులు చక్కని, పవిత్రమైన పుణ్య ప్రదమైన అత్యంత ఫలప్రదమైన అనేక నోములు వివరించి చెప్పారు. వృథా కాలక్షేపం చేయక స్త్రీలు వ్రతమాచరించి ఫలం అనుభవించండి. ఇది అక్ష్యయబొం డాల నోము వివరంగా వివరిస్తాను ఆచరించండి.ఫలం పొందండి.

అక్షయ బొండాలనోము 
అక్షయ సంపద లిచ్చు నోము
అక్షయ బొండాల నోము
అక్షయ సంతతి నిచ్చునోము
అక్షయ బొండాల నోము
అక్షయ మాంగల్య మిచ్చు నోము
అక్షయ బొండాల నోము
అక్షయ మోక్షంబు నిచ్చు నోము
అక్షయ మోక్షంబు నిచ్చు నోము 

అని అనుకొని పవిత్రాక్షతలు శిరసున దాల్చవలెను. ప్రతినిత్యం స్నానం చేసి ఒక సంవత్సరకాలం  పసుపు ముద్దలు అయిదు, కుంకుడుకాయ పరిమాణంలో తయారుచేసికొని 5 గురు ముత్తయిదువులకు సమర్పించవలెను. అనంతరం దక్షిణ, తాంబూలం, రవికెలగుడ్డలు, పసుపు, కుంకుమ మంచి చక్కని బొండాలనూ వాయన మిచ్చుకొనవలెను. వివరాలు తెలిశాయి కదా! ఇక ఆలస్యం దేనికి ఆచరించండి, ఫలం పొందండి. ఈ అక్షయ బొండాలనోము వలన అక్షయ సంపద, సంతతి, అక్షయ మాంగల్యం, అక్షయ మోక్షం ప్రాప్తించును. 

దైవం పై నమ్మకం లేనివారు, దేవతారాధన చేయనివారు ఈ వ్రతం చేయవద్దు, ఫలితముండదు.
    
      విశ్వసించినవారికి ఈ విశ్వమందు అన్ని చేకూరతాయి.


@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


                     కైలాసగౌరి నోము

  పూర్వము ఒక రాజ్యములో మహారాజు తన కుమార్తెను అతి గారాబముగా పెంచి పెద్ద దానిని చేశాడు.  యుక్త వయస్సు రాగానే దేశ దేశాలు గాలించి అత్యంత సుందరాంగుడిని    వెతికి అతనితో తన కుమార్తెకు అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు.  రాజు కుమార్తె అత్తవారింటికి వెళ్ళింది.  ఆమె భర్త వేశ్యాలోలుడు.  భార్యను సరిగా చూసేవాడు కాదు భర్త  అనురాగానికి దూరమై  ఆమె ఎంతగానో దు:ఖిస్తుండేది.  మహారాజు కూడా ఎంతగానో బాధపడేవాడు.  తన బిడ్డ బ్రతుకుని సరిదిద్ద వలసినదిగా పరమేశ్వరరుడిని ప్రార్ధించేవాడు.  ఆ చిన్నది సైతం తన బ్రతుకు బాగుకై పార్వతి దేవిని నిరంతరం ప్రార్దిస్తుండేది.  

  ఒకనాటి రాత్రి సమయాన రాకుమారి గాఢ నిద్రలో ఉండగా వేకువజామున ఆమెకు విచిత్రమైన కల వచ్చినది.   ఆ పార్వతీదేవి ఆమెకు కలలో కనబడి రాకుమారి! దుఃఖించిన ప్రయోజనం లేదు. కైలాస గౌరినోము నోచుకో నీ బ్రతుకు సరియౌతుంది.  నీవు నీ భర్త అనురాగాన్ని పొందగాలుగుతావు అని చెప్పింది.  ఆ ప్రకారం రాకుమారి   కైలాస గౌరీ నోము నోచింది.  అందుకు ఫలితంగా ఆమె భర్తకు, వెలయాలిపై మమతానురాగాలు తొలగిపోయాయి.  ఉంపుడు గత్తెల  కపట ప్రేమ పట్ల అసహ్యత కలిగింది.  భార్యపట్ల ప్రేమ, అనురాగం  కలిగాయి.  ఆనాటి నుండి రాజు కుమార్తె ఆమె భర్త యొక్క అనురాగం పెంపొంది ఆమె సంసార యాత్ర సుఖంగా జరుగుతుండేది.  వారిని చూచిన వారు పార్వతీ పరమేశ్వరులని ప్రశంసిస్తుండేవారు.   
ఉద్యాపన:

పార్వతీ దేవి ఆలయంలో గాని నదీ తీరమునండుగాని అయిదు కుంచాల కుంకుమ అయిదు కుంచాల పసుపు తీసుకుని దోసెడు పసుపు, దోసెడు కుంకుమ ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలు పుష్పములతో పంచిపెట్టి వారి ఆశీస్సులు  పొందాలి.శ్రద్హాభక్తులతో ఎవరి కోరికతో ఆచరిస్తే ఆకోరికలు ఫలించగలవు.అందుకు ఈ రాకుమారి కథయే నిదర్శనం. నోము నోచి ఫలం పొందండి. 

     కైలాసగౌరిని మనసారా స్మరించండి. కార్యసిద్ధి పొందండి.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++


              ఆపదలేని ఆదివారము నోము

పూర్వకాలము నాటి మాట . ఆ కాలాన ఒక బ్రాహ్మణుడు .ఆయన ధనికుడు ,సిరి సంపదలకు లోటు లేదు. సంతానానికి లోటు లేదు. చాలా మంచివాడు. స్వపర బేధము లేకుండా అందరిని ఆదుకునేవాడు .ఎవరికీ ఏ ఆపద వచ్చినా ఆదుకునేవాడు .అందరికి అందుబాటులో ఉండేవాడు .మంచి మనిషిని మర్యాద గల బ్రాహ్మణుడని ప్రసిద్ది కెక్కాడు. మితిమీరిన దానాలు చేసేవాడు. ఎవరేమడిగితే అది ఇచ్చేవాడు. లేదన్నదే లేదు ఆయన నోట .కాలం గడుస్తోంది .కొంత కాలానికి అతడు పేద వాడయ్యాడు . సంపదలు హరించి పోయాయి .బాధలు ప్రారంభమయ్యాయి .సాయం అందినవారే ముఖం చాటేశారు. ఎవరూ ఆదుకోలేదు . అంతేకాదు కీడు తలపెట్టారు కూడా .ఇబ్బందుల పాలు చేశారు. మంచికి మన్నన ఉండదండి ,మర్యాద ఉండదు, మంచి వారికి వంచన తప్పటం లేదు. మోసం జరుగుతోంది ,కుట్రలు జరుగుతాయి .అయినా ఎన్ని బాధలైనా సహించగలరు. గాని మంచివారు మంచిగానే ఉండిపోతారు . గొడ్డలి దెబ్బలు తినే మంచి గంధపు చెట్టు సువాసనను గొడ్డలికి పంచుతుంది. బాధ తాననుభవిస్తూ కూడా .
పాపం ఒకనాడు అష్టైశ్వర్యాలతో తుల తూగిన ఆ బ్రాహ్మణుడు కడు పేద వాడయ్యాడు. అందుకు ఆయన బార్య కర్మ సాక్షి యగు సూర్య భగవానుని - ప్రభూ ! ఏమిటీ వింత ? నా భర్త పది మందికి పెట్టాడే గాని ఎవరి వద్ద ఏం తీసుకోలేదే . అటువంటి మాకు ఏమిటీ పరీక్ష ? ఎందుకీ దరిద్రం ? ఏమిటీ పేదరికం .మా లోపమేమిటి స్వామీ అని శోకించ సాగింది .అంత ఆమె అంతరాత్మ -అమ్మా ! విచారించకు ,బాధపడకు ,కష్టాలు కలకాలం ఉండవు. నీవు ఒక వ్రతం ఆచరించు.  ఆ వ్రత మేమందువా ? "ఆపదలేని ఆదివారపు వ్రతం" . ఆ నోము నోచి చూడు .తప్పక నీకు మరల ఏ లోటు ఉండదు .అని ప్రభోదించి నట్లు అయినది. ఆ ఇల్లాలు ఆ విషయం భర్తకు వివరించి చెప్పినది . భర్త తప్పక ఆ వ్రతమాచరించ మని పలికాడు. అంతేకాదు అందుకు కావలసిన పదార్దములు సిద్దం చేయించాడు . ఆ ఇల్లాలు స్నానం చేసి శుచి అయి శుభ్రంగా చక్కర పొంగలి తయారు చేసి అరటి యాకు నందుంచి మంచి ఆవు నెయ్యి వేసి సూర్య భగవానునకు నైవేద్యము పెట్టినది .కన్నె ముత్తయిదువుకు వాయన మిచ్చినది . ఆ విధంగా క్రమం తప్పకుండా వరుసగా విధి విధానంగా 12 ఆదివారాలు వ్రతం జరిపినది .అనంతరం పదమూడవ ఆది వారాన 26 మంది ముత్తయిదువులకు పసుపు ,కుంకుమ ,రవికుల గుడ్డలు ,దక్షిణ ,తాంబూలములను ఇచ్చి ఒక ముత్తయిదువునకు వాయన మిచ్చి ఉన్నంతలో ,కలిగినంతలో అందరికి భోజనము పెట్టి సుఖంగా జీవించినది ఆఇల్లాలు .
ఉద్యాపన :
 చక్కర పొంగలి తయారు చేసి అరటి యాకు నందుంచి మంచి ఆవు నెయ్యి వేసి సూర్య భగవానునకు నైవేద్యము పెట్టినది .కన్నె ముత్తయిదువుకు వాయన మిచ్చినది . ఆ విధంగా క్రమం తప్పకుండా వరుసగా విధి విధానంగా 12 ఆదివారాలు వ్రతం జరిపినది .అనంతరం పదమూడవ ఆది వారాన 26 మంది ముత్తయిదువులకు పసుపు ,కుంకుమ ,రవికుల గుడ్డలు ,దక్షిణ ,తాంబూలములను ఇచ్చి ఒక ముత్తయిదువునకు వాయన మిచ్చి ఉన్నంతలో ,కలిగినంతలో అందరికి భోజనము పెట్టవలెను.ఈ వ్రతమును శ్రద్దా క్తులతో చేసిన పుణ్యము , ఇహమందు సుఖ సంతోషాలు ,పరమందు మోక్షము సిద్దిస్తాయి .ఇది ఋషులు చెప్పిన విషయం .త్రికాలభాద్యమాన మైన సత్యం ఆచరించి ఫలం పొందండి .

పాట
ఆదివార వ్రతం చేయండి ఆడవారందరూ !
ఆపదలు లేక హాయిగుండండి,
భక్తి శ్రద్దల తోడ మీరూ
శక్తితో అను రక్తితో
ఆదివార వ్రతం చేయండి ఆడవారందరూ !
ఆపదలు లేక హాయిగుండండి,
నోము నోచి ఫలముల నొంది
సుఖంగా మీరందరూ ఉండండి.!!!

               
                     సర్వేజనా సుఖినోభవంతు.
________________________________________________


                 ఉదయ కుంకుమ నోము 

చాలా ప్రాచీన కాలపు మాట. ఆ కాలంలో ఒక  బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు వివాహమైనది. ఆ  బ్రాహ్మణుడికి నలుగురు కుమార్తెలు ఉండేవారు. ఆ బ్రాహ్మణుడు ముగ్గురు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయగా వారి భర్తలు చనిపోయి వాళ్ళు విధవరాళ్ళు అయ్యారు. కుమార్తెలను చూసి ఆ బ్రాహ్మణ దంపతులు బాధపడుతూ ఉండేవారు. ఈ లోపల చిన్న కుమార్తె యుక్తవయస్కురాలు అయింది. ఆమెకు వివాహం చేయాలని ఉన్నా ఆ పిల్ల అక్కలకు ప్రాప్తించిన వైధవ్యం ఈమెకు కూడా వైధవ్యం పోతుందేమో అని బాధపడుతూ ఉండేవాళ్ళు.  ఏమిటి ఈ కర్మ ముగ్గురు కుమార్తెలు వైధవ్యం అనుభవిస్తున్నారు వారి పసుపు కుంకుమలు పోయాయి.కనీసం ఈమె మాంగల్యం అయినా కాపాడు అని ఆ బ్రాహ్మణుడు నిరంతరం భగవంతుడిని తలచుకుంటూ ఈ బిడ్డను అయినా సుమంగళిగా ఉంచమని మొరపెట్టుకునేవాడు. ఒకరోజు పరమేశ్వరుడు ఒక సాధురూపాన వారింటికి వచ్చి ఓ బ్రాహ్మణా దంపతులారా మీ విచారానికి కారణం నాకు తెలుసు భాధ పడకండి. మీ  కుమార్తె చేత ఉదయ కుంకుమ నోము నోయించండి ఆమె మాంగళ్యంనిలిచి పసుపు కుంకుమలతో సుఖంగా జీవిస్తుంది  అని చెప్పిఅంతర్ధాన మయ్యాడు. .సాధువు  మాటలలో నమ్మకం కలిగి అలా చేయడం వలన తమ కుమార్తెకు వైధవ్యం తొలగిపోతుండానే నమ్మకం కలిగిన ఆ దంపతులు తమ ఆఖరి కుమార్తె చేత ఉదయ కుంకుమ నోమును నోయించారు. వ్రత ప్రభావం వలన ఆమెకు పూర్ణాయుష్కుడైన, అందమైనవాడు భర్తగా లభించాడు.  జీవితాంతం సుఖంగా ముత్తయిదువుగా జీవించింది.ఈ ఉదయ కుంకుమ నోముని నోచుకుని గౌరీదేవిని ధూపదీప నైవేద్యాలతో పూజించిన వారికి మాంగళ్యం, సిరిసంపదలు ప్రాప్తిస్తాయి.  
ఉద్యాపన.
 సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి బొట్టూకాటుక పెట్టుకుని  గౌరీదేవికి నమస్కరించాలి.పూజ చేయాలి. ఆలా ఒక సంవత్సరం పాటుచేయాలి.సంవత్సరం పూర్తయిన తరువాత ఒక ముత్తైదువకు  పసుపు పువ్వులు, రవికెల గుడ్డ, దక్షిణ తాంబూలం ఇచ్చి, భోజనం పెట్టి  ఆమె ఆశీస్సులు పొందాలి.నియమ నిష్టలతో వ్రతం చేయాలి. నమ్మకం ఉండాలి. చిత్త శుద్ధితో చేయాలి.తప్పక ఫలితం కలుగును. ఆ చల్లనితల్లిని నమ్మితే ఆ తల్లి తప్పక మనల్ని కాపాడుతుంది.త్రికరణ శుద్ధిగా నోమును ఆచరించి తల్లి దయకు పాత్రులు కండి .
 ఈ ఉదయ కుంకుమ నోము కన్నెపిల్లలు చేసుకుని తీరవలసిన నోము. 
>>>>> >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

                      కళ్యాణ  గౌరీ నోము 

ఈ వ్రతమునకు గాని ,నోమునకు గాని ప్రత్యేకమైన కధ లభించలేదు . పరిశీలనకు ,పరిశోధనకు నేను తీసికున్న గ్రంధాలలో ఏ ఒక్క గ్రంధ మందూ ఏ విధమైన వివరణతో కూడిన కధ లభించలేదు. అందుచేతనే నేను కూడా ఈ గ్రంధ మందు పాటకులకు వివరంగా ఉద్యాపన అందించ లేక పోయాను . ఈ కళ్యాణ గౌరీ నోము స్త్రీలు అందరూ  ఆచరించ వచ్చును. ఈ నోము నోచినవారు ముందుగా 

కళ్యాణ గౌరీ వ్రతం పట్టిన కలికి 
మిన్నకు కడలేని ఐదవ తనము కలుగు
నిత్య కల్యాణం పచ్చ తోరణంబు
కావలసినంత కడుపు పంట పండు
కామితార్ధములీడేరు ఫలసిద్ది కలుగు .

అని చెప్పి ప్రతి దినం స్నానం చేసి శుచిగా అక్షతలు నెత్తిన వేసుకొనవలెను.

ఒక ముత్తయిదువునకు చక్కగా తల దువ్వి బొట్టు పెట్టి ఆమెనే సాక్షాత్తుగా గౌరీ దేవిగా భావించి పవిత్రంగా శుచిగా భక్తి శ్రద్దలతో వినయ విదేయలతో ఆమెకు నమస్కరించాలి . అలా మూడు వందల అరవై రోజులు ఆచరించి సంవత్సరాంతమున సుగంధ ద్రవ్యములు ,పసుపు, కుంకుమ ,పండ్లు ,పూలు , మట్టెలు , మంగళ సూత్రం ,రవిక ,చీర వీటితో బాటు తాంబూలం ఉంచి మంగళ సూత్ర ధారణ జరిగిన పెండ్లి కుమార్తెకు వాయన మివ్వవలెను . ఉద్యాపన పైన వివరించి నట్లు చేయవలెను. కళ్యాణ గౌరీ తప్పక మీకు శుభములు చేయగలదు. నమ్మకంతో ,విశ్వాసంతో ఈ నోము నాచరించి ఫల సిద్ది పొందండి. స్త్రీలందరూ నోచతగ్గ వ్ర తం ఇది.++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

               


 శ్రావణ మంగళ వారం

శ్రావణ మాసం అత్యంత భక్తి శ్రద్ధలతో పండగవాతావరణంతో మంగళగౌరీదేవి మరియు వరలక్ష్మీదేవి పూజలతో కళకళలాడే సమయం.
ఈ శ్రావణ మంగళగౌరీ వ్రతం స్త్రీలు నిత్య సుమంగళిగా ఉండడం కొరకు చేసుకుంటారు. సకల సౌభాగ్య సిద్ధి కలుగజేసి, స్త్రీలకు నిండు నూరేళ్ళు పసుపుకుంకుమలతో వర్ధిల్లే వరాలను ఇచ్చే వ్రతం శ్రావణ మంగళ గౌరీ వ్రతం.
ఈ శ్రావణ మంగళగౌరీ వ్రతం కొత్తగా పెళ్ళైన వధువులు, తొలి సంవత్సరం శ్రావణ మంగళవారంతో మొదలుకొని ఐదేళ్ళ పాటు చేసుకోవడం ఆచారం. తొలి సంవత్సరం ఏ కారణాల చేతనైనా అవాంతరం కలిగినచో రెండవ ఏడాది కూడా పోనిచ్చి, మూడవ సంవత్సరం జరుపుకుంటారు. ఒకవేళ శ్రావణ మాసంలో పెళ్లి జరిగితే, పెళ్ళైన వెంటనే వచ్చే మంగళ వారం వ్రతానికి సంకల్పం చెప్పించి, తరువాత వచ్చే సంవత్సరం తొలి సంవత్సరంగా లెక్క పెట్టుకుని ఈ వ్రతాన్ని చేసుకుంటారు. పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, పద్మాలు వేసి దానిమీద జ్యోతులు పెట్టి కలశం పెట్టి, పూజచేసి, గరిటెకి ఆవునెయ్యిరాసి ,తోరం కట్టి, జ్యోతి వెలిగాంచేక కథ చదువుతూ కాటుక తయారుచేస్తారు. ఈ మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళ వారాలు చేసుకుని తొలి వాయనం తల్లికి ఇవ్వడం శ్రేయస్కరం. కన్న తల్లి పూజకు హాజరు కాలేని పక్షంలో ముత్తైదువను పిలిచి వాయనం ఇస్తారు. ననైవేద్యం కూడా చలిమిడి, పులగం, పరమాన్నం, ఇంకా ఇతర పదార్థాలు, శనగలు పెడతారు. గౌరీదేవికి కూడా వాయినం ఇస్తారు. ఈ వ్రతం చేసుకున్న రోజు చాకు, కత్తిపీట వంటి వాటితో తరిగిన కూర తినరు కొన్ని  ప్రాంతాలలో.

ఈ వ్రతంలో వరిపిండితో దీపపు కుందులను తయారు చేసుకుని ఆవునేతి వత్తులు వేసి జ్యోతులు వెలిగిస్తారు. ఈ జ్యోతులు దీపాలు కొడిగట్టిన తర్వాత, వ్రతం ఆచరించిన ముత్తైదువ తను, తన కుటుంబం మాత్రమే  తినాలి. వ్రతం చేసే సమయంలో ఆవునెయ్యితో కాటుక తయారు చేస్తారు. ఈ కాటుక కంటికి చాలా మంచిది. ఈ కాటుక ధరించడం తోనే ఆ వ్రతమహిమ వలన సుశీల అత్తా మామలకు పోయిన కంటి చూపు తిరిగి వచ్చింది అని వ్రత కథ లో చెప్పబడింది. ఉదయాన్నే వ్రతవిధానంతో, శ్రద్ధా భక్తులతో పూజ జరుపుకున్నాకా, తొలి సంవత్సరం ఐదుగురు, రెండవ సంవత్సరం పది మంది, మూడవ సంవత్సరం 15 మంది ఇలా సంవత్సరానికి ఐదుగురు ముత్తైదువలను పెంచి ఐదు సంవత్సరాలు వ్రతం జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చిన అన్ని మంగళ వారాలు ఈ వ్రతాన్ని ఆచరించి అక్షతలు నెత్తిన జల్లుకోవాలి. ముత్తయిదువల సంఖ్య, జ్యోతుల సంఖ్య మరియు పద్మాల సంఖ్య మొదటి సంవత్సరం ఐదు, రెండవ సంవత్సరం పది, మూడవ సంవత్సరం పదిహేను ఇలా పెరుగుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో ఐదు సంవత్సరాలూ వారానికి ఐదుగురు ముత్తయిదువలకు వాయనం ఇచ్చే పద్ధతి కలదు. ఈనాడు రాత్రి ఉపవాసం ఉండడం, ఆ ముందు రోజు మరియు వ్రతంరోజు బ్రహ్మచర్యం ఆచరించడం తప్పనిసరి.తోర పూజకు కావలసినవి. తెల్లటి దారమును ఐదు పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు పూలు, ఐదు చోట్ల కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు పోగుల దారమును ఉపయోగించి, ఐదు పువ్వులతో ఐదు ముడులతో తోరములను తయారు చేసుకుని, పీఠం వద్ద ఉంచి, పుష్పములు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరములను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరములను తయారు చేసుకున్న అనంతరం పూజకు ఉపక్రమించాలి.

ఈ వ్రతానికి గౌరీదేవి విగ్రహాన్ని తొలివారం ఏ విగ్రహాన్ని వాడతారో చివరి వరకూ అన్ని వారాలూ అదే విగ్రహాన్ని కొన్ని ప్రాంతాలలో ఉపయోగిస్తారు. మరి కొన్ని ప్రాంతాలలో ఏ వారానికి ఆ వారం కలశ స్థాపన లేదా పసుపు గౌరిని చేసి అమ్మవారి ప్రతిరూపంగా భావించి పూజను జరుపుతారు.
ముందుగా వినాయక పూజ చేసి స్వామికి బెల్లం నైవేద్య౦ పెట్టి అప్పుడు మంగళగౌరి షోడశోపచారపూజ, అష్టోత్తరం చదివి తోరపూజ చేసి ఆ తోరం కట్టుకుని అప్పుడు మంగళగౌరి వ్రతకథ భక్తితో చదవుకోవాలి.
వ్రతకథ 

అనగనగా బ్రాహ్మణ దంపతులు. పెళ్ళయి చాలా కాలమయినా సంతతి కలగని కారణంగా, ఈశ్వరుడి గురించి తపస్సు చేశారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై " అల్పాయుష్కుడైన కొడుకు కావాలా? అయిదవతనం లేని కూతురు కావాలా?” అని 

అడిగాడు.
అల్పాయుష్కుడైనప్పటికీ కొడుకునే యిమ్మ" ని ప్రార్థించారు వారు. “తథాస్తు" అని వరమిచ్చి శివుడు తరలిపోయాడు. శివుడిచ్చిన వర ప్రభావం వలన అచిరకాలంలోనే, ఆ బ్రాహ్మణ ఇల్లాలు గర్భం ధరించి, సకాలానికి చక్కటి మగబిడ్డను ప్రసవించింది. తక్షణమే యమభటులు వచ్చి, ఆ బిడ్డను తమతో తీసుకుపోబోయారు. బాలింతరాలైన బ్రాహ్మణ స్త్రీ బోరున విలపించింది. లేక లేక కలిగిన బిడ్డ వీడు. పురుడు తీరేదాక ఆగి, తదుపరి తీసుకువెళ్ళ" మని కోరింది. ఆ తల్లి కోరికను మన్నించి యమదూతలు వెళ్ళిపోయి, పురుడు తీరగానే వచ్చారు. అప్పుడామె "తండ్రులారా! మాటలు రానిదే. మానవుడు కాలేడు గనుక, మా శిశువు నోరార అమ్మా, నాన్నా అని పిలిచే వరకూ ఆగి, ఆ ముచ్చటయినాక గైకొమ్మంది. “సరే" అని వెళ్ళిపోయారు కింకరులు. ఈ విధంగా అనేక కారణాలు చూపసాగింది. ఒక రోజున తల్లి - బిడ్డకు తలంటుతూ త్వరలో మరల రాబోయే యమభటులను తలచుకుని దుఃఖించసాగింది. తల్లి విచారిస్తున్నందని తెలుసుకున్న బిడ్డ "ఎందుకమ్మా ఏడుస్తున్నావు?” అని అడగగా, ఆమె జరిగినదంతయు వివరించింది.విషయం తెలుసుకున్న ఆ బాలుడు " అమ్మా! ఎలాగూ అల్పాయుష్కుడి నయ్యాను. పది కాలాలుండి పుణ్యం చేసే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు నాకు కాశీ వెళ్లి రావాలని వుంది. కనుక, నన్ను వెంటనే పంపించు. ఈ లోపల యమదూతలు వస్తే, నేను వచ్చేదాకా ఆగమను ” అని చెప్పి బయలుదేరాడు. బిడ్డను ఒంటరిగా పంపలేని తల్లితండ్రులు అతనికి మేనమామను తోడిచ్చి కాశీకి పంపారు. వారిద్దరూ కాశీ వెడుతూ వెడుతూ మార్గమధ్యంలో ఒక పూలతోటలో బస చేశారు.అదే వేళకు ఆ పూలతోటలో పూలు కోసుకునే నిమిత్తం వచ్చిన, ఆ ఊరి రాజు కూతురూ, ఆమె చెలుల మధ్య తగవు వచ్చి, ఒకరినొకరు తిట్టుకోసాగారు. అందుకు కోపగించిన రాజు కూతురు "నాకీ రాత్రి పెండ్లి కాబోతూ వుంది. అదీగాక, మా అమ్మ శ్రావణ మంగళవారము నోము నోచుకుని నాకు వాయనమిస్తుంది. ఆ వ్రత మహిమ వల్ల నీ శాపనార్థాలు, తిట్లు ఫలించవు ” అంటూ చేతిలో పూలను నేలమీద పారబోయగా, ఆ పూలన్నీ తిరిగి చెట్ల కొమ్మలకు ఎగిరి అతుక్కుని పోయాయి. అది చూసిన బ్రహ్మణ బాలుడు "ఆ పిల్ల తన భార్యయైతే బాగుండును" అనుకున్నాడు. ఆ రోజున రాజుగారు తన కూతుర్ని పెండ్లి కుమార్తెను చేయించాడు. రాణీ ఆమెకు శ్రావణ మంగళవారం నోము వాయనమిచ్చింది. అందరూ పెళ్లివారి రాక కోసం ఎదురు చూడసాగారు. ఇంతలో పెండ్లి కుమారునికి సుస్తీగా వున్నందున, పెళ్లి మరొక ముహుర్తానికి వాయిదా వేయవలసినదిగా మగ పెండ్లివారి నుండి కబురు అందుతుంది.
వివాహాన్ని వాయిదా వేయడం రాజుకి ఇష్టము లేదు. తాను నిశ్చయించిన ముహూర్తానికి వివాహం చేయకపోవడం పరువు తక్కువగా భావించి, పొరుగూరికి చెందిన వారికి ఇక్కడ విషయం తెలియదనే తలంపుతో మేనమామ మేనల్లుళ్ళలను ఒప్పించి, ఆ మేనల్లుడికి తన కూతురునిచ్చి పెళ్లి జరిపించాడు. ఆ రాత్రి కలలో మంగళ గౌరీ కనిపించి "అమ్మాయీ! ఈ రాత్రే నీ భర్తకు పాము గండము వుంది. జాగ్రత్తగా వుండి, ఆ పామును... నీ తల్లి నీకు వాయనమిచ్చిన కుండలోనికి పట్టి గట్టిగా మూత నుంచమని ఆజ్ఞాపించింది.
ఆ పిల్ల ఉలిక్కిపడి లేచి చూసేసరికి, అప్పటికే ఒక పెద్ద పాము బుసలు కొడుతూ, పెండ్లి కొడుకు మంచం దగ్గరకు పాకుతూ కనిపించింది. వెంటనే రాజకుమార్తె అటకమీద వున్న నోము కుండను తీయబోయింది. అది అందని కారణంగా, వరుని తొడపై నిలిచి, ఆ కుండను దింపి, పాము నందులోనికి పట్టి, ఒక రవికెల గుడ్డతో దాని మీద గట్టి వాసెనకట్టు కట్టి, మరలా అటకపై భద్రపరిచి, తాను నిశ్చింతగా నిద్రపోయింది. తెలతెలవారే వేళ, మేనమామ వచ్చి, పెండ్లి కుమారుడిని నిద్రలేపి, తనతో కాశీ తీసుకు వెళ్ళిపోయాడు.
కొన్ని రోజుల అనంతరం అసలు పెళ్లివారు అట్టహాసంగా వచ్చారు. రాజు సంతోషంగా తిరిగి పెళ్లి ఏర్పాట్లు చేయబోగా, రాకుమార్తె మాత్రం ఆ వివాహానికి ఇష్టపడలేదు. మొదటి ముహూర్తమున తాళి గట్టినవాడే తన భర్త అని ప్రకటించింది. ఎవరెంత చెప్పినా మారు మనువుకు అంగీకరించలేదు. “ అసలా కాశీకి పోయిన వాడే నీ భర్త అనేందుకు నిదర్శనం చూపించు" అని పెద్దలు అడిగారు.
అందుకా చిన్నది "తండ్రీ ! నువ్వొక సంవత్సరం అన్నదానం చెయ్యి. నేనా సంవత్సరమంతా తాంబూలం దానం చేస్తాను. అనంతరం నీకు నిదర్శనం చూపిస్తాను" అంది. అందుకు రాజు అంగీకరించాడు. తక్షణమే సత్రం నిర్మించి నిత్యం అన్నదానం చేయించసాగాడు. ఆ భోక్తలందరికీ రాకుమార్తె తాంబూలదాన మీయసాగింది. ఇంకొన్నాళ్ళలో సంవత్సరం పూర్తవుతుందనగా, కాశీకి వెళ్ళిన మేనమామా మేనల్లుళ్ళు స్వగ్రామానికి తిరిగి వెడుతూ మధ్య మార్గంలోని పూర్వపు పూలతోటలోనే బస చేసి అక్కడి సత్రంలో భోజనాలు చశారు. అనంతరం రాకుమార్తె వద్ద తాంబూల దానం పరిగ్రహిస్తుండగా ఆమె ఆ బ్రాహ్మణ యువకుడిని గుర్తు పట్టి అతని చేతిని పట్టుకొని "ఇతడే నా పెనిమిటి అని యెలుగెత్తి పలికింది. పెద్దలందుకు ఋజువు కోరగా, పెళ్ళినాడు పాత్రలో నుండి తీసి తన వద్ద భద్రపరిచిన ఉంగరాన్ని అతని వేలికి తొడిగింది. అది సరిగ్గా సరిపోయింది. పిమ్మట ఆ రాత్రి కలలో మంగళగౌరీ చెప్పిన పాము విషయం చెప్పి, అటు తరువాత పామును దాచి వుంచిన కుండను తీసి చూపించగా, అందులో పాము బంగారు పామై కనిపించింది. అన్ని ఋజువులూ సరిపోవడం వలన, పెద్దలామె వాదనను అంగీకరించారు. రాజు యథావిధిగా వివాహం చేశాడు. అత్తవారింటికి పంపేటప్పుడు తల్లి ఆమె చేత శ్రావణ మంగళవారపు నోము నోయించి ఆ కాటుక నొక భరిణిలోభద్రపరిచి ఇచ్చింది. అక్కడి బ్రాహ్మణ దంపతులు బిడ్డ గురించిన వేదనతో ఎడతెగని కన్నీరు కార్చి కార్చి, ఆ కారణంగా అంధులై సేవలు చేసేవారు గానీ క్షేమమడిగేవారు లేక నిత్య దుఃఖితులై వున్నారు. అటువంటి సందర్భంలో పెండ్లి కూతురుతో సహా పెండ్లి కుమారుడి లాంఛనాలతో వూరిలోనికి వచ్చిన బ్రాహ్మణ యువకుడిని చూసి, గ్రామస్థులందరూ విప్రదంపతుల వద్దకు వెళ్లి "మీ కష్టాలు తీరాయి. మీ కుమారుడు, రాజవైభవాలతో మీకు కోడలిని తీసుకు వస్తున్నాడు ” అని చెప్పారు. ఆ మాటతో వారికి ఆనందం కలిగినా నమ్మకం కలగని కారణంగా ప్రజలు తమని పరిహస్తున్నారని మరింత శోకగ్రస్తులయ్యారు. అదే సమయంలో ఆ బ్రాహ్మణ కుమారుడు తన భార్యతో సహా వచ్చి తల్లిదండ్రులకు పాదాభినందనం చేశాడు. జరిగింది తెలుసుకుని వాళ్ళు ఆనందించారు. కాని, కొడుకునీ కోడలినీ చూసుకునే అదృష్టం లేనందుకు దిగులుపడగా, రాకుమార్తె తనతో తెచ్చిన శ్రావణ మంగళవారపు నోము కాటుకను అత్తమామల కళ్ళకు పూసింది.అదే తడువుగా వాళ్లకు చూపు వచ్చి, కొడుకునూ, కోడల్నీ చూసుకుని సంబరపడిపోయారు. ఈ మహత్మ్యానికి ఆశ్చర్యపడిన యిగురుపొరుగు వారంతా "ఇంత మహిమ కలగడానికి ఏం నోము నోచేవమ్మా" అని అడగగా "శ్రావణ మంగళవారపు నోము"అని చెప్పిందామె. అది మొదలా వూరిలోని మహిళలందరూ ఆ నోము నోచుకుని తరగని సిరులతో, చెరగని సౌభాగ్యలతో చెప్పలేనంత కాలం సుఖసౌభాగ్యలు అనుభవిస్తూ జీవించారు.
ఉద్యాపన:

ఈ వ్రతానికి ఉద్యాపన కొత్త పెళ్ళికూతురుకి చేసుకుంటారు. గుంట పుస్తెలు, మెట్టెలు, నల్ల పూసలు మరియు 13 జతల అరిసెలు ఇత్తడి గిన్నెలో పెట్టి మూస కట్టి, కొత్త బట్టలు అన్నీ కలిపి, నాగవల్లి క్రతువు పూర్తి అయ్యాకా, వాయనంగా కొత్త పెళ్ళికూతురుకి అందించి ఈ నోముకి ఉద్యాపన చేసుకుంటారు. మొదటి సారి ఈ వ్రతాన్ని ప్రారంభించేవారు పురోహితుని సమక్షంలో శ్రద్ధాభక్తులతో జరుపుకుంటారు. ఈ పైన చెప్పబడిన పద్ధతులు ప్రాంతాలను అనుసరించి చిన్న చిన్న మార్పులతో ఆచరిస్తారు.

*********************************************************************************


                    కంద గౌరీ నోము 

పూర్వ కాలము నాటి మాట .ఆ రోజులలో ఒక బ్రాహ్మణ కుటుంబం .వారికొక కుమార్తె జన్మించినది. ఆమె అకారణంగా ఏడుస్తూ ఉండేది. ఎవరూ ఆ ఏడ్పు మాన్పలేక పోయారు . నిత్యం ఆ గోల పడలేక ఇరుగు -పొరుగు వారందరూ కలసి పాప ఏడుపు కారణంగా ఆ కుటుంబాన్ని అక్కడ నుండి వెడల గొట్టారు. చేసేది లేక ఆ బ్రాహ్మణుడు కుటుంబంతో ఒక అడవి చేరుకున్నాడు. విచారిస్తూ కూర్చున్నాడు .ఏం దారి తోచలేదు. వెక్కి వెక్కి ఏడవ సాగాడు. అంత శివుడు పార్వతీ దేవితో సహా అక్కడకు వచ్చి బ్రాహ్మణుని దుఃఖానికి కారణ మడిగి తెలిసికొని తానిలా చెప్పాడు .-


ఓయీ !బ్రాహ్మణా ! నీ కుమార్తె ఏడుపునకు కారణం లేకపోలేదు .ఈమె గత జన్మమున కంద గౌరీ నోమును నోచి విడిచి పెట్టింది . అందుచేతనే ఈమెకీ శోకం సిద్దించింది . వేరేం కాదు .ఇంటికి పోయి కంద గౌరీ నోము నోయించి ఈమె ఏడుపు మాన్పించుకో . గ్రామస్తులు మంచిగా చూస్తారు. అన్ని సుఖాలు కలుగుతాయి. వెళ్ళు అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు పార్వతీ పరమేశ్వరులు చెప్పిన విధంగా ఇంటికి పోయి కంద గౌరీ నోము నోయించాడు. చిత్రం ఏడుపా ! పాడా !చక్కగా ఉందా ఆ అమ్మాయి ,ధైర్యం ,ఉత్సాహం, ఉల్లాసం, సుఖం, హాయి అన్నీ సిద్ధించాయి . చూచిన వారందరూ ఆశ్చర్య పోయారు. ఎంత విడ్డూరము ! ఏమీ కాదు అంతా నోము మహత్యం . 
 ఉద్యాపన: 
ఈ కధ చెప్పుకుని ఒక సంవత్సర కాలం అక్షతలు నెత్తిపై వేసుకొనవలెను. వెండి ,బంగారం తో చేసిన కంద దుంపలను తయారు చేయించుకొని మామూలు కంద గడ్డ సంపాదించి రవికెల గుడ్డ ,లక్క జోళ్ళు ,నల్లపూసల తాళ్ళు , దక్షిణ తాంబూలం సిద్దం చేసి ముత్తయిదువునకు వాయన మీయవలెను .  ఫలం తప్పక సిద్దిస్తుంది .
))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))

                         ఉండ్రాళ్ళ తద్ది. పూర్వకాలంనాటి మాట. ఒక ఊరిలో స్త్రీలందరు భాద్రపద బహుళ తదియనాడు ఉండరల్లా తద్దె నోముని నోచుకొనుచుండిరి. అప్పుడా ఊరి రాజుగారి వేశ్య నోము నోచుకొనెదనని రాజుతో చెప్పెను.రాజు " నీకు కావలసిన వస్తువులు ఏవో చెప్పు " అని అడిగెను. ఆ భోగమూడి చమత్కారముగా తనకు ఆకూ, గీకూ, పోకా, గీకా, కూరా, గీరా కావాలని చెప్పెను. అది ఎంతపని అని రాజు వాటిని తెచ్చుటకు నౌకరులను పంపెను. వరాన్నిటినీ తెచ్చిరి గానీ " గీ" అను పేరుతొ ఉన్నవాటిని తేలేకపోయిరి. ఆ సంగతి రాజు వేశ్యకు తెలుపగా, ఆమె నవ్వి " ఇంతేనా మీ రాచబడాయి " అని, అప్పటికే ప్రొద్దుపోవుటవుచే పక్క ఇంటి ముత్తయిదువును  పిలచి, అయిదు ఉండ్రాళ్ళు గౌరికి నైవేద్యము పెట్టి అయిదు ఉండ్రాళ్ళను ఆ ముత్తయిదువునకు వాయనమిచ్చెను. ఆవిధంగా ఐదేళ్లు ఆమె ఆ నోము నోచుకుని ఉద్యాపన చేసుకొనెను.


ఉద్యాపన :


తదియ ముందునాడు  తలంటి నీళ్లు పోసుకుని తదియన్తీ తెల్లవారుజామున భోజనము చేసి, నాటి సాయంకాలం వరకు ఎంగిలి పడకుండా ఉండి, చీకటిపడినంతనే గౌరికి అయిదు ఉండ్రాళ్ళు నైవేద్యము పెట్టి ఇంకొక అయిదు ఉండ్రాళ్ళు ముత్తయిదువునకు వాయనమీయవలెను. అట్లు అయిదు సంవత్సరములు చేసినపిమ్మట అయిదుగురు పుణ్యకాంతలకు తలంటి నీళ్లు పోసి గోరింటాకు ఇచ్చి, వారికీ ఒక్కక్కొరికీ అయిదేసి కుడుములు, రవికెలగుడ్డ, దక్షిణ తాంబూలములను ఇవ్వవలెను. కథలోపం వచ్చినను వ్రత లోపము  రాకూడదు. 
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>


       దంపతుల తాంబూలము నోము కథ
 


ఒక భాగ్యశాలిని భర్త పెండ్లియైన కొన్ని నెలలకు వర్తకము చేయుటకై దేశాంతరములకు వెళ్లెను. ఆటను వెళ్లిన రెండు సంవత్సరములకు ఆమె ఆస్థి అంతయు దొంగలు దోచుకొనిపోయిరి. ఎంతకాలమునకు భర్త తిరిగి రాకపోవుటచేతను, ఉన్న ఆస్థి పోవుటచేతను ఆమె విసిగిపోయి అడవికి పోవుచుండెను.దారిలో ఆమె కెదురుగా పార్వతి పరమేశ్వరులు వృద్ధదంపతులవలె వచ్చి ఆమె విచారమునకు కారణం తెలుసుకుని , ''అమ్మా నీవు దంపతుల తాంబూలం నోము పట్టి ఉల్లంగించుటచే ఇట్టి కష్టములు వచ్చెను. కాబట్టి ఆ నోమును తిరిగి నోచుకోని సుఖంగా ఉండుము" అని చెప్పిరి. అదివిని ఆమె ఇంటికివచ్చి నోము నోచుకోని, కథ చెప్పుకొని అక్షతలు వేసుకొని ఏడాది అయినా తర్వాత ఉద్యాపన చేసుకొనెను. పిమ్మట ఆమెభర్త దేశాంతరముల నుండి వచ్చెను. వారంతట సుఖంగా ఉండిరి.
ఉద్యాపన :-

ఒక దంపతులకు సంవతసరం పాటు మగవారికి పండు పెట్టి తాంబూలం, ఆడవారికి పువ్వులు పెట్టి తాంబూలం ఇచ్చి అక్షింతలు వేయించుకోవాలి.  సంవత్సరం అనంతరం దంపతులకు తలంటి నీళ్లు పోసి, భోజనం పెట్టి 108  ఆకులను, పోకలను తాంబూలపు వస్తువులను పళ్లెంలో పెట్టి ఇవ్వాలి.
......................................................................................................................................................................................................................................................................................................................................

                                                    కన్నె తులసెమ్మ  నోము.

పూర్వము ఒకానొక ఊరిలో ఒక చిన్నది వుండేది.  ఆమెకు సవతి తల్లి పోరు ఎక్కువగా వుండేది.  అది భరించలేక ఆ చిన్నది తన అమ్మమ్మ గారి ఇంటికి వెల్లిపోయినది.  సవతి తల్లి ఆ పిల్లను తీసుకు రమ్మని భర్తను వేదించేది.  అందుకు అతడు అంగీకరించలేదు.  ఒకనాడు సవతి తల్లి తన భర్తతో ఆ పిల్లను తీసుకు రమ్మని ఎంతగానో పట్టు పట్టింది.  అప్పుడు ఆమె భర్త నువ్వే వెళ్లి తీసుకొని రమ్మన్నాడు.  చేసేది లేక సవతి తల్లి ఆ చిన్న దాని తాతగారింటికి  వెళ్ళింది.  పిల్లను పంపించమని అడిగింది.  వారు అంగీకరించలేదు.  వారితో జగడమాడి  ఆఖరికి ఎలాగైతేనేం వాళ్ళను ఒప్పించి ఆ చిన్న దానిని తన వెంట ఇంటికి తీసుక వచ్చింది.  
              ఒక రోజున ఆపిల్లకు తనపిల్లనిచ్చి ఎత్తుకోమని చెప్పి అరిసెముక్కను పెట్టి ఆమె తులసి పూజ చేసుకొనెను. చిన్నది తన సవతి తల్లి తులసి పూజ చేయడం చూసింది.  తనకు కూడా ఆసక్తి కలిగి తన చేతిలో గల అరిసెముక్కను   నైవేద్యం పెట్టి తులసి దేవిని పూజించింది.  ఆమె భక్తికి మెచ్చి తులసి దేవి సాక్షాత్కరించి ఓ చిన్నదానా!  గత జన్మలో నువ్వు కన్నె తులసి నోము నోచి ఉల్లంఘించి నందువల్ల  నీకు తల్లి పోయి సవతి తల్లి కలిగింది.  కనుక నువ్వు కన్నె తులసి నోము నోచుకోమన్నది.  ఆ తులసీ దేవి చెప్పిన ప్రకారం ఆ చిన్నది కన్నె తులసి నోమును భక్తి శ్రద్దలతో నోచి సంవత్సరాంతమున ఉద్యాపన చేసుకున్నది.  నాటి నుండి ఆ సవతి తల్లి ఆమె పట్ల ప్రేమానురాగాలు కలిగి ఎంతో ఆదరణతో  సొంత బిడ్డలా చూసుకునేది.  

ఉద్యాపన:  
తులసమ్మకు పదమూడు జతల అరిసెలు నైవేద్యము పెట్టి పూజచేయ్యాలి.  ఒక కన్యకు తలంటు నీళ్ళు పోసి పరికిణి, రవిక ఇచ్చి అరిసెలు వాయనమివ్వాలి.________________________________________________________________________________బచ్చలిగౌరి నోము
పూర్వం ఒకానొక ఊరిలో ఒక ఇల్లాలు చక్కగా ఆనందంగా సంసారం చేసుకుంటున్నది.  ఆమెను పుట్టింటికి తీసుకెళ్ళడానికి ఆమె అన్నగారు వచ్చాడు.  ఆనందంతో ఆ ఇల్లాలు  పిండివంటలు చేసింది.  పులుసు పోపునకు పెరటిలో కరివేపాకు కోసుకురమ్మని  అన్నగారిని పంపింది.  కరివేపాకు రెమ్మలు తుంచుతున్న ఆ అన్నగారిని పాము కరిచింది, నురుగులు కక్కుతూ నేలపై పడిపోయాడు.  ఎంతకూ అన్నగారు పెరటిలోనుండి రాకపోవడముతో ఆమె పెరటిలోనికి వచ్చి నురగలు క్రక్కుతూ క్రింద పది వున్న అన్నగారిని చూసింది.  భోరుభోరున ఏడుస్తున్న ఆమెకు పార్వతీ దేవి వృద్ద స్త్రీ రూపంలో వచ్చి ఊరడించి లోనికి వెళ్లి బచ్చల గౌరీ నోమును నోచుకోమ్మంది,   నీ అన్న బ్రతుకుతాడని చెప్పి వెళ్లి పోయింది.  అది జగన్మాత వాక్కుగా గుర్తించి ఆ ఇల్లాలు బచ్చల గౌరీ నోమును నోచింది.  బయాటకి వచ్చి అన్నను పిలిచింది.ఆమె అన్న బ్రతికాడు ఆనాటినుండి ఈ నోమును నోచుకుని స్త్రీలు, అన్నదమ్ములతో, అక్క చెల్లెళ్ళుతో, ఆడబిడ్డలతో , తోడికోడళ్లతో   సుఖముగా వున్నారు.  ఈ కథ చెప్పుకుని అక్షింతలు వేసుకోవలెను.

ఉద్యాపన:
 బంగారంతోను, వెండితోను, బచ్చాలికాయను చేయించి, పూలతోను, కాయలతోను ఉన్న బచ్చలికాడకు పూజ చేయవలెను.  తరువాత చీర, జాకెట్టు, ఆ బచ్చలి కాడను, బంగారు, వెండి బచ్చలి కాయలను  దక్షిణ తాంబూలములను  ఒక  ముసలి ముత్తైదువుకు వాయన మివ్వాలి.  షక్తి తగ్గినను ఫలము హెచ్చును.
...................................................................................................................................................................                     నందికేశుడి నోము.

ఒకనాడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు లోకంలో జరిగే విషయాలు విశేషాలను ముచ్చటించు కుంటున్నారు  .  పార్వతి పరమేశ్వరుని కాళ్ళు వత్తుచున్నది.   ఆమె చేతులు కఠినముగా ఉన్నందువల్ల పరమేశ్వరుడు ఆమెను పాదాలను పట్టవద్దన్నాడు.  నాదా!  నా చేతులెందుకు కఠినముగా వున్నాయో ఈ కాఠిన్యం పోయి మృదువైయ్యే మార్గామేమితో హేప్పమని వేడుకుంది.  దేవి నీవేవరిపట్లనో కాఠిన్యము పోయి మృదువైయ్యే మార్గమేమిటో  చెప్పమని వేడుకుంది.  దేవి నేవేవరిపట్ల నో కాఠిన్యముగా ఉండడమే ఈ నీ చేతులు కఠినత్వమునకు గల కారణం ఇందుకు నీవు నీళ్ళాట రేవుకు వెళ్లి వచ్చీపోయే వనితలకు తలంటి నీళ్ళు పోయవలసిందని ఇందువాళ్ళ ఒక భక్తురాలికి తలంటి నీళ్ళు పోయడం వల్ల స్నానం చేయిన్చేదవో వారికి గల కాఠిన్యము కూడా నశించి పోవునని పరమేశ్వరుడు పార్వతీ దేవికి ఉపదేశించాడు.  

             ఆమాటమేరకు పార్వతి భూలోకానికి వచ్చి నీళ్ళాట రేవు వద్ద నిలబడి వచ్చీపోయే మగువలను పిలచి తలంటి నీళ్ళు పోస్తూ వచ్చింది. అలా వచ్చినవారందరికీ తలంటు పోయగా అహంకారవతియై ఒక వృద్ద పేరంటాలు రేవుకు వచ్చింది.  పార్వతి ఆమెను తలంటి నీళ్ళు పోస్తాను రమ్మన్నది.  నేను ఎన్నో వ్రతాలు చేసాను ఇదేమి వ్రతము?  తలారా స్నానం చేయవచ్చిన నాకు తలంటుతానంటే కాదనడం ఎందుకు అని అలగేకాని  తలవంచుకుని కూర్చున్నది ఆ ముదుసలి పేరంటాలు.  పార్వతి ఆమెకు తలదిద్ది స్నానం చేయించి సాగనంపింది.  ఆ ముదుసలి వెళుతూ కనీసం పార్వతీ దేవిని మర్యాద కోసమైనా మన్నింపు మాటలతో తనియింప చేయలేదు.  అయినా పార్వతి తన చేతులు మరుడువుగా మారడం వల్ల ఆ ముదుసలి పెరంటాలిని అనుగ్రహించి సిరిసంపదలు ప్రసాదించింది.  పలు నోములు నోచితినన్న అహంకారం ధనదాన్యాది సిరులున్నాయన్న అహంభావం ఆవృద్దురాలిలో కలిగాయి.  తనంతటి దానను కనుకనే పార్వతి  స్వయంగా వచ్చి తలారా స్నానం చేయిన్చిందన్న గర్వం కలగడంతో ఆమె అందరి పట్ల చులకనగా ప్రవర్తిస్తుండేది.  ఈ విషయాన్ని గమనించిన పార్వతి ఆమె సిరులే ఆమె అహంకారానికి కారణమని సిరిని తొలగిస్తే ఆమె స్థిరపడుతుందని నిశ్చయించుకుంది.  

విఘ్నేశ్వరుడ్ని పిలిచింది.  ఆమె అహంకారాన్ని వివరించి ఆమె భాగ్యాన్ని తీసివేయవలసిందని చెప్పి పంపించింది.  ఆమె ఇంటికి గణపతి వెళ్ళాడు.  ఆమె విఘ్నేశ్వరునికి ఉండ్రాళ్ళు పెట్టింది.  పార్వతి పుత్రుడు ప్రసన్నుడై ఆమెకు మరికొంత సిరిని అనుగ్రహించాడు.  
ఈ సంగతి తెలిసిన పార్వతి బాగా ఆలోచించి నందిని ఆమెవద్దకు పంపించింది వచ్చిన నందిని ఆ వృద్ద పేరంటాలు ఆరాధించి శనగలు వాయనమిచ్చింది.  దానితో నందికేశ్వరుడు ఆమెకున్న భాగ్యాన్ని తీయకుండా వెనుదిరిగి పోయాడు.

ఆ తదుపరి పార్వతి భైరవుడ్ని పంపించింది.  వచ్చిన భైరవునకు వృద్ద పేరంటాలు గారెలు పెట్టింది.  అందుకా భైరవుడు ఆమె సిరులు తొలగించకుండా  తిరిగి వచ్చెను.


  పార్వతి చంద్రుడిని పంపించింది.  వచ్చిన చంద్రునకు వృద్దురాలు చలిమిడి చేసి పెట్టింది.  చంద్రుడు ఏ విధంగాను ఆమె సిరులు తొలగించకుండా వెను తిరిగెను.  

              

 అటుపై పార్వతి సూర్యుడిని పంపించగా ఆ వృద్దురాలు క్షీరాన్నాన్ని ఆరగించమని పెట్టింది.  అందుకా సూర్యుడు ప్రసన్నుడై ఆమె సిరులపట్ల ఏవిధమైన చర్య తీసుకోలేదు. 

అర్జునుడిని పంపగా ఆమె అతనికి అప్పాలు నైవేద్యంగా పెట్టుటచే భాగ్యము హరింపలేక పోయెను..   


తరువాత పార్వతీదేవి,  గౌరీ  దేవిని  పంపగా అట్లు నైవేద్యము పెట్టెను. గౌరీ  దేవి కూడా ఆమె   భాగ్యము హరింపలేకపోయెను. వీరివల్ల సాద్యం కాదని సిరులను తొలగించుటకు పరమేశ్వరుడిని పంపించింది పార్వతి.  వచ్చిన సదాశివునికి ఆ వృద్ద భక్తురాలు చిమ్మిలిని పెట్టింది.  శంకరుడు వచ్చిన పని కాదని వెను తిరిగి వెళ్ళాడు.  

                ఇంక పార్వతీ దేవి స్వయముగా తానె కార్యసాధన నిమిత్తం వృద్ద పేరంటాలు ఇంటికి వచ్చింది.  తన ఇంటికి వచ్చిన పార్వతిదేవిని సాదరంగా ఆహ్వానించి పీఠంవేసి  కూర్చోబెట్టి భక్తురాలు పసుపు వ్రాసింది.  కుంకుమ బొట్టు పెట్టింది.  ధూప దీప నైవేద్యాడులతో ఆరాధించింది.  పులగంవండి నివేదించింది.  పార్వతీ దేవి ప్రసన్నురాలై తన నిర్ణయాన్ని విరమించుకుంది ఆమె కాఠిన్యము తగ్గింది.  మనస్సు తనువూ మృదువయ్యాయి.  ఆమెకు మరింత సిరిసంపదలను ఆగ్రహించింది.  

                ఓ భక్తురాలా!  నీవు నేను పంపించిన దేవతలకు నివేదించిన పదార్ధాలు నివేదించి పూజాపూర్వక ఉద్యాపన చేసిన వారికి సమస్త దేవతల అనుగ్రహం కలిగి కాఠిన్యము తొలగి పటుత్వంగా రూపొంది సమస్త సిరులు సమస్త భోగాలు కలుగుతాయని పార్వతి వెళ్లిపోయెను. ఈ కథ చెప్పుకుని అక్షింతలు వేసుకోవాలి.

రకానికి 5 శేర్లు చొప్పున తయారు చేసి, ఆయా దేవతలను పూజించి నివేదన చేసి బ్రాహ్మణులను ఇంటికి పిలిచి తృప్తిగా భుజింప చేయాలి. పదార్థాలు గడపదాటించరాదు. సూర్యాస్తమయంలోగడ సరుకు చెల్లిపోవాలి. 

 ఉద్యాపన:
వడుగులో వటువుకు నాందీ ముఖం వేళ 5 శేర్ల పెసరపప్పు నానబెట్టి ఓ ఇత్తడి పాత్రలో పోసి క్రొత్త పట్టు పంచ వాసెన కట్టి బంగారు నంది, వెండి నంది, దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. 

 
 

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment