శ్రీ వరలక్ష్మి వ్రతం | Sri Varalakshmi Vratam | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

శ్రీ వరలక్ష్మి వ్రతం 
Sri Varalakshmi Vratam
Rs 10/-

వరలక్ష్మీ వ్రతం.. 
మంచి జరగాలంటే ఏం చేయాలంటే...

అష్టలక్ష్ముల్లో వరలక్ష్మిది ప్రత్యేక స్థానం
హిందూ స్త్రీలు భక్తిశ్రద్ధలతో కొలిచే పెద్ద పండుగ
సకల ఐశ్వర్యాలు, ఐదోతనం కోసం స్త్రీల నోము
అమ్మవారి ఆశీస్సులతో శుభపలితాలు కలుగుతాయని నమ్మకం
పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉపదేశించిన వ్రతం
వ్రతం వెనుక సామాజిక ప్రయోజనాలు, వైద్య రహస్యాలు
రేపు వరలక్ష్మీ వ్రతం
అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవిది ప్రత్యేకత. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రం కూడా చెబుతోంది. శ్రీహరికి ప్రీతికరమైనదేకాక విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరుతో వచ్చే శ్రావణమాసంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే అంతా శుభం జరుగుతుందన్నది ఓ నమ్మకం. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభిష్టాల కోసం, నిత్యసుమంగళిగా వర్థిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. సకల శుభకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీ వ్రతం జగదానందకరమన్నది భక్తుల విశ్వాసం.


‘పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి, విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్‌ పాదప్మంమయి సన్నిధత్స్వో’ అంటూ నిత్యం ప్రతిహిందువు కొలిచే శ్రీమహాలక్ష్మికి శ్రావణమాసం ప్రత్యేకం. ఈ నెలలో అమ్మవారికి ప్రత్యేక ఆరాధనలు చేస్తే మరింత శుభం జరుగుతుందని నమ్మకం. శ్రావణ శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీవ్రతంగా జరుపుకొం టారు. హిందూ స్త్రీలకు ఇదే పెద్ద పండుగ. శుభఫలితాలను ఒసగే వరదాయనిగా అమ్మవారిని కొలుస్తారు. ఈ వ్రతాన్ని రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణటకలో అధికంగా చేస్తారు. మహిళలు కొత్తచీరలతో భక్తిప్రపత్తులతో ఆచరించే వరలక్ష్మీవ్రతం ఈనెల 24న జరుపుకోనున్న సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది.


పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించినది
వరలక్ష్మీ వ్రతం గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించి ఆచరింపజేసినట్లు స్కాందపురాణం తెలియ జేస్తోంది. లోకంలో స్త్రీలు అష్టైశ్యర్యాలు, పుత్రపౌత్రాదులు పొందేందుకు ఏదైనా వ్రతాన్ని సూచించాలని పార్వతీదేవి కోరగా శంకరుడు ఈ వ్రతం గురించి తెలిపినట్టు కథనం. అదే సందరర్భంలో భర్త అత్తమామల పట్ల గౌరవం ప్రదర్శిస్తూ అమ్మవారిని త్రికరణ శుద్ధిగా కొలిచిన చారుమతి వృత్తాంతాన్ని తెలియజేసినట్టు చెబుతారు. ఆ తర్వాత నైమిశారణ్యంలో సూతుడు శౌనకాది మహర్షులకు ఈ వ్రతం గురించి బోధించారని పురాణప్రాశస్త్యం.


ప్రార్థన
‘నమోస్తేస్తు మహామాయే, శ్రీపీఠే సురపూజితే,
శంఖ చక్ర గధా హస్తే, మహాలక్ష్మీ నమోస్తుతే
యాదేవీ సర్వభూతేషు ‘లక్ష్మీ’ రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః’


వ్రత విధానం ఇదీ

తెల్లవారుజామునే నిద్రలేచి ఇళ్లు, వాకిళ్లు కడిగి ముగ్గులు పెట్టుకోవాలి. గుమ్మాలకు మంగళతోరణాలు కట్టాలి.
గడపలకు పసుపురాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంట్లో తూర్పుదిక్కున మండపం ఏర్పర్చుకోవాలి.


మండపంలో వెనుక వైపు లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటాన్ని లేదా యథాశక్తి స్వర్ణ, రజిత, ఇతర లోహాలతో చేసిన విగ్రహాన్ని ఉంచాలి.
తొలుత పసుపుతో గణపతిని పూజించి కలశంలోకి దేవిని ఆవాహనం చేసి షోడశోపచారాలు సమర్పించాలి. అంగపూజ చేయాలి.
తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామాలను చదివి ధూప, దీప, నైవేద్యాలు, తాంబూలాది షోడశోపచారాలతో పూజించి కర్పూర నీరాజనం, మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇవ్వాలి.
తోరగ్రంథి పూజచేసి తోరబంధన మంత్రం పఠిస్తూ నవసూత్రాన్ని కుడిచేతికి కట్టుకోవాలి.
నవకాయ పిండివంటలు, పండ్లు మొదలైన వాటిని అమ్మవారికి సమర్పించి చివరిగా వాయినదాన మంత్రం పఠిస్తూ ముత్తైదువులకు తాంబూలాలను సమర్పించాలి.
ముత్తైదువులనే మహాలక్ష్మిలుగా భావించి ‘సిద్ధి బుద్ధి ప్రదేదేవి, భుక్తిముక్తి ప్రదాయిని, మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే’ అని ప్రార్థించాలి. సిద్ధిని, బుద్ధినీ ప్రసాదించి ముక్తిని అనుగ్రహించమని దీని తాత్పర్యం.
అంశారూపాలు అనంతం
క్షీరాబ్ది కన్యక శ్రీమహాలక్ష్మి అంశారూపాలు అనంతం. లోకస్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడుని పత్నిగా పాతాళంలో నాగలక్ష్మిగా, సూర్యునిలో తేజోలక్ష్మిగా, గృహాల్లో గృహలక్ష్మిగా...ఇలా అనంతరూపాల్లో ఆమె వ్యక్తమవుతుంది. అయితే మానవ జీవిత మనుగడకు అష్టరూపాల్లో నీరాజనం అందుకుంటుంది. మహిషాసుర మర్థనం అనే లోక కల్యాణ కార్యక్రమం కోసం త్రిమూర్తుల క్రోధం అనే దివ్యతేజం నుంచి పరాశక్తి శ్రీమహాలక్ష్మిగా అవతరించింది. అవతార ప్రయోజనం దుష్టరాక్షస సంహారం కాబట్టి రౌద్రరూపిణిగా అష్టాదశ బాహువులతో వివిధ ఆయుధాలు ధరించి సింహవాహినిగా అవతరించింది. అయితే సమస్త ప్రాణకోటి మనుగడకు కావాల్సిన వివిధ రకాల ఐశ్యర్యాలను ప్రసాదించేందుకు వివిధ శక్తులుగా వ్యక్తమైంది. సర్వలోకాలకు పోషణ శక్తిగా ఆవిష్కృతమైంది. ‘సర్వం లక్ష్మీమయం’గా విరాజిల్లుతోంది.


అమ్మ ఆవిర్భావం గాథ
శ్రీమహాలక్ష్మి ఆవిర్భావం గురించి పురాణగాథ ఇలావుంది. శ్వేతవరాహకల్పంలో సృష్టి ఆది సందర్భంగా పరమాత్మ సంకల్పంతో ఆయన వామ భాగం నుంచి దివ్యతేజో రూపం వ్యక్తమయింది. దక్షిణ భాగం నుంచి మరొక దివ్యసుందర రూపం వ్యక్తమయింది. పరమాత్ముని వామభాగం నుంచి ఉద్భవించిన దివ్యతేజం ‘శ్రీమహాలక్ష్మి’ రూపం దాల్చగా స్వామి చతుర్భుజుడై శంఖచక్ర గదాధారి, కౌస్తుంబాలంకృతుడిగా మారి లక్ష్మీదేవితో వైకుంఠం చేరాడు. శుద్ధ సత్య స్వరూపిణిగా శ్రీమన్నారాయణుని చేరిన లక్ష్మి సకల లక్ష్మీరూపాలకు మూలప్రకృతి. ధనాన్ని ప్రసాదించే ధనలక్ష్మిగా, లౌకిక ఆధ్యాత్మిక, అన్ని కళలను ప్రసాదించే విద్యాలక్ష్మిగా, పాడిపంటలను ప్రసాదించే ధాన్యలక్ష్మిగా, సహనం, ఓర్పు సాహసం, కార్యదీక్ష, ధీరత్వాన్ని, మానసిక శారీరక స్తైర్యాన్ని ప్రసాదించే విజయలక్ష్మిగా, సత్సంతానంతో వంశాభివృద్ధిని ప్రసాదించే సంతానలక్ష్మిగా, పాలకులకు శౌర్యాన్ని పరాక్రమాన్ని ప్రసాదించే వీరలక్ష్మిగా, రాజయోగాలను, అధికారం, రాచరిక వైభవం ప్రసాదించే గజలక్ష్మిగా మహాలక్ష్మి లోకంలో పూజలందుకుంటోంది. సదాచారం, సంప్రదాయం, శుచీశుభ్రత పాటించే వారింట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. సత్ప్రవర్తన, సత్యభాషణం, దానశీలం, పరోపకారం, దయ, ధర్మవర్తనం కలిగిన ఉత్తముల ఇంటిలోకి ప్రవేశిస్తుంది. వారినే అనుగ్రహిస్తుంది. శ్రీవిభూతిని కోరేవారు సచ్చీలురై, సదాచార సంపన్నులై, సంప్రదాయానువర్తనులై, సత్యవ్రతులై, సద్గుణవంతులై సిరుల తల్లికి భక్తిశ్రద్ధలతో కైమోడ్పులు అర్పించాలి.


సామాజిక ప్రయోజనం ఉంది
వరలక్ష్మీ వ్రతం వంటి వ్రతాల్లో సామాజిక ప్రయోజనం కూడా ఉంది. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లున్న ఈ ఆధునిక కాలంలో వ్రతాలు, పండుగలు బంధాలు పెరిగేందుకు దోహదపడతాయి. చుట్టుపక్కల వారిని పూజలకు ఆహ్వానించడం, భోజనతాంబాలాలు ఒసగడం వంటివి బంధాన్ని గట్టిపరుస్తాయి.


వరలక్ష్మీ వ్రతం వెనుక వైద్య రహస్యాలు
శ్రావణ మాసంలో ఆచరించే నోముల్లో అనేక అర్థాలు, పరమార్థాలు, వైద్యపరమైన రహస్యాలు దాగివున్నాయి. వ్రతాల్లో వాడే పసుపుకుంకుమలు శుభప్రదమే కాదు ఆరోగ్యదాయనిలు. పసుపులో క్రిమిసంహారక లక్షణాలు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వర్షాకాలంలో పనుల పరంగా స్త్రీలు ఎక్కువగా నీటిలో తిరుగుతారు. అందువల్ల ఫంగల్‌ ఇన్‌స్పెక్షన్లు సోకే అవకాశం ఉంది. పాదాలకు పసుపు రాసుకుంటే దీన్ని నివారించవచ్చును. ముఖానికి పసుపు రాయడం వల్ల ఛాయ పెరుగుతుంది. మొటిమలు, పొక్కులు పోతాయి. నోము నోచిన వారు నానబెట్టిన శనగలు వాయినంగా ఇస్తారు. శెనగల్లో పోషక విలువలు పుష్కలం. విటమిన్‌ ఎ, సీ, ఇతోపా బి కాంప్లెక్స్‌ లభిస్తాయి. తాంబూలం వేసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. వ్రతం సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల పండ్లను నివేదన చేసి వాటిని ఇంటిలోని పిల్లాపాపలతో సహా అందరూ తింటారు. పండ్లలోని పోషక విలువలు శరీరానికి మేలు చేస్తాయి.
--------------------------------------------
వ్రత గామిని వరదాయిని

‘వర’ అంటే ‘కోరుకున్నది’ అనీ. శ్రేష్ఠమైనది అనీ అర్థం. అంటే అందరూ కోరుకొనే సంపదలు వరాలు. వాటిని ఇచ్చేదీ, వాటి రూపంలో ఉన్నదీ వరలక్ష్మి. వారి వారి ప్రజ్ఞాస్థాయీ భేదాల రీత్యా ఒక్కొక్కరికీ ఒక్కొక్కటి వరం. కోరినవేవి కావలన్నా భగవత్సంకల్పం లేనిదీ, ఆయన దయ రానిదీ పొందలేం. అసలు ఆనందం, సంపదలేని వస్తువును మనం కోరుకోం. అలా మనం కోరుకునే వాటిలో ఆనందరూపంగా ఉన్నదీ, ఆనందాలను ప్రసాదించేదీ వరలక్ష్మి. వరాలిచ్చే మాతను కొలువు దీర్చడం, ధూపదీప నైవేద్యాలతో అర్చించడం, భక్తి శ్రద్ధలతో పూజించడం అన్నీ ప్రాముఖ్యం కలిగినవే. అమ్మవారి వ్రత విధానంలో మనకు ఉపయోగపడే అంశాలు, జీవన శైలికి ఉపకరించే విలువైన పాఠాలూ ఎన్నో ఉన్నాయి.      





           కలశం: సృష్టికి సంకేతం. లోపల ఉన్న నీరు సమాజానికి ప్రతి రూపం. కలశానికి కట్టే సూత్రం అనుబంధానికి సూచిక. ఒక్క నీటి చుక్కలో కదలిక ఉంటే చాలు, దానంతటదే వ్యాపిస్తుంది. అలాగే పండుగ రోజున మంచి ఆలోచనలు, మనల్ని ముందుకు నడిపించే యోచనలు చేయాలి. అవి బహుముఖీన విస్తరించాలని అమ్మవారిని కోరుకోవడమే కలశ ప్రాధాన్యం. కలశం అడుగున ధాన్యం ఉంచుతాం. ధాన్యమంటే. జీవనాధారం. అంటే జీవిక కోసం మనం ఏ వృత్తి చేపట్టినా శ్రద్ధగా చేయాలనేదే దాని భావం.

కలశ వస్త్రం: వస్త్రం రంగు ప్రకృతికి నిదర్శనం. ఆ వస్త్రంలో అగ్ని, వరుణ, వనస్పతి, ఆదిత్య, పిత దేవతలు, నక్షత్రాలు ఉంటారు. అగ్నిదేవుడు శుభ్రతను నేర్పుతాడు. సూర్యుడు తేజస్సు, వనస్పతి త్యాగం, పితదేవతలు అనుబంధం, నక్షత్రాలు స్థిరత్వానికి నిదర్శనం. వస్త్రానికి చంద్రుడు అధిదేవత. చంద్రుడి నుంచి సౌఖ్యం, అమృతత్వం ప్రాప్తిస్తాయి. పైగా చంద్రుడు అమ్మవారికి తమ్ముడు. కాబట్టే మనకు చందమామ. ఒక కుటుంబ వ్యవస్థను సూచించే ఈ వ్రతం నుంచి.. మహిళలే కాదు.. పురుషులూ తెలుసుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. రేపు రాబోయే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పూజా ద్రవ్యాలపై అవగాహనకు...

మామిడి ఆకులు: కలశానికి మామిడి ఆకులతో అలంకరణ చేస్తాం. మామిడి ప్రాణశక్తిని అందిస్తుంది. చెడును పరిహరిస్తుంది. అందుకే బంధుమిత్రులు వచ్చే సమయంలో... శుభకార్యాలవేళలో మామిడి తోరణాలు తప్పనిసరి.

కొబ్బరికాయ: నిస్వార్థమైన జీవితానికి, అందులోని నీరు మనం పొందాల్సిన ఆనందానికి సంకేతాలు. కష్టపడి కోయడం, పెచ్చుతీయడం, పగులగొట్టి పెంకు తొలగించడం... ఇవన్నీ చేస్తే కానీ కొబ్బరి, తియ్యని నీళ్లు రావు. ‘‘ఆ కష్టం మాకు తెలుసు, అయినప్పటికీ అన్ని సందర్భాల్లో మేం ఆ స్థాయిని ప్రదర్శించలేం. అలంకరించిన ఈ కొబ్బరికాయని సమర్పిస్తున్నాం. స్వీకరించి మాకు శుభాలనివ్వు తల్లీ!’’ అంటూ వరలక్ష్మిని కోరుకోవడమే నారికేళం విశిష్టత.

పసుపు కుంకుమలు: ఎరుపు అనురాగానికి ప్రతీక. పసుపు త్యాగాన్ని సూచిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా, సాఫీగా సాగడానికి ఈ రెండూ అవసరం. అవి కుటుంబంలోని అందరికీ ప్రసాదించమని అమ్మవారిని మనసారా ప్రార్థించాలి.

పానకం, వడపప్పు: ప్రకృతి సిద్ధంగా వచ్చే మార్పుల్ని తట్టుకోవడానికి స్త్రీలకు శక్తి కావాలి. శరీరానికి చలవ అవసరం. అమ్మవారికి నైవేద్యం పెట్టే పెసరపప్పు, పానకంలో అవి లభిస్తాయి. పెసరపప్పు శక్తినిస్తుంది. పానకం చలవ. తేనె భార్యభర్తల అనురాగాన్ని.. పాలు.. ఆత్మీయ అనుబంధాన్నీ సూచిస్తాయి.

పూలసేవ: వరలక్ష్మీదేవతా మూర్తిని పూలతో పూజిస్తాం. అందుకు కలువ, మందార పూలు ప్రశస్తమైనవి. కలువ పూలకు సౌందర్యం, సౌకుమార్యం, సౌగంధం.. అనే మూడు విశేష లక్షణాలున్నాయి. ఇవి స్త్రీ తత్వాన్ని, ప్రత్యేకతను, విలువను తెలపుతాయి. కలువలది ఎంత సౌందర్యం అంటే నీటిలోంచి తీయగానే వాడిపోతాయి. ఎంత సౌకుమార్యమంటే చేత్తో తాకితేనే కందిపోతాయి. సౌగంధం అంటే పరిమళాన్నందించడం. ఏ ఇబ్బందులు లేకుండా, భర్తతో ఆనందమయ జీవితాన్ని కోరుకుంటూ అమ్మవారికి కలువ పూలతో పూజ చేయాలి. మందార పూలు వైవాహిక జీవితానికి సంకేతం. అందంగా విరిసిన నాలుగు రేకులు, పుప్పొడి కుటుంబ వ్యవస్థను ప్రతిఫలిస్తాయి. మందారం అంటేనే సంతోషం కలిగించేదని అర్థం. ఆ పూలతో పూజించడం అంటే కుటుంబ శ్రేయస్సుని కాంక్షించడమే.

అష్టోత్తర శతనామాలు: అమ్మవారిని 108 నామాలతో పూజిస్తాం. ఒక్కొక్క నామానికి ఓ విశిష్టత. వేదాల్లో వాటికి సంబంధించి 108 కథలున్నాయి. బ్రహ్మ వైవర్త, విష్ణు, స్కంద, పద్మ, ఖాండ పురాణాల్లో లకీ‡్ష్మ మాత వైభోగం, పూజాప్రాశస్త్యం గురించి అద్భుతంగా చెప్పబడింది. అమ్మవారి పూజలో పదహారు శ్రీ సూక్తాలున్నాయి. ఉపచారాలున్నాయి. ఆ పూజ అమేయ శక్తినిస్తుంది. అనేక శుభాలను ఒనగూరుస్తుంది. ధనలాభం, సౌభాగ్యం, విద్య, సంసార సౌఖ్యం, వాగ్ధాటి, వాహన ప్రాప్తి, శరీరకాంతి, ధైర్యం... ఇలా పదహారు ప్రయోజనాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

మహత్వం: లక్ష్మీ అమ్మవారిని బిల్వ నిలయ అంటారు. బిల్వవృక్షం వద్ద యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు. అప్పుడు రాక్షసులు చెట్టు దాకా రాగలరు కానీ, ఏ ఆటంకం కలిగించలేరు. అమ్మవారు నిర్దాక్షిణ్యంగా కట్టడి చేసి యజ్ఞ కార్యానికి ఇబ్బంది రాకుండా కాపాడుతుంది. అంతటి ప్రభావాన్వితమైన వరలక్ష్మీ దేవిని పూజించడం వల్ల సిద్ధి, బుద్ధి, శక్తి, సంపదలు సంప్రాప్తిస్తాయి.

వాస్తవానికి ‘ప్రతి స్త్రీలోనూ లక్ష్మీ కళ ఉన్నది’ అని ఆర్ష వాక్యం. అందుకే స్త్రీలను లక్ష్మీరూపాలుగా ఆరాధించడం, స్త్రీలు లక్ష్మీరూపాన్ని అర్చించడం – ఈ శ్రావణ వరలక్ష్మీ వ్రతం దివ్యత్వం. ఏ పనికైనా మహిళే ఆదిశక్తి. ఆమెదే ఉన్నత స్థానం. అందరి మాటలు ఓర్పుగా వింటుంది. ఇతర దేవతలతో పనులు చేయిస్తుంది. గుణాల చేత వ్యాపిస్తుంది. దోషాలు తొలగిస్తుంది. ఈ అనంత విశ్వాన్ని ‘లక్షించేది’ లక్ష్మి. అందరూ లక్షించేది లక్ష్మిని. లక్షించడం అంటే చూడటమని అర్థం. అందరినీ తన కరుణామృతపూర్ణమైన చలువ చూపులతో ‘కనిపెట్టుకుని’, గమనించి, పాలించే శక్తి – అని భావార్థం. కనులు తెరవడాన్ని సృష్టిగా, రెంటి నడుమ ఉన్నది స్థితిగా భావించవచ్చు.

పరమేశ్వర శక్తితో జరిగే సృష్టి స్థితి లయలే ‘ఈక్షణ’ శక్తిగా వేదఋషులు అభివర్ణించారు. సర్వసాక్షియైన ఈ భగవద్దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించడం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత. అందరూ ఆనందాన్నీ, ఐశ్వర్యాన్నీ, జ్ఞానాన్నీ, ‘లక్ష్యం’గా పెట్టుకొనే జీవిస్తారు. ఇలా అందరికీ లక్ష్యమైన జ్ఞాన, ఆనంద, ఐశ్వర్యాల సాకార రూపమే ‘లక్ష్మి’. ఈ దివ్యభావాన్ని సగుణంగా, లీలారూపంగా పురాణాలు వ్యక్తీకరించాయి. జ్యోతిషపరంగా దర్శిస్తే భృగు ప్రజాపతికి ప్రధానమైన రోజు శుక్రవారం. అందుకే దీనిని ‘భృగు’వారమనీ వ్యవహరిస్తారు.

భృగు పుత్రికగా లక్ష్మీదేవికి ’భార్గవి’ అని దివ్యనామం. పర్వతరాజు పుత్రి పార్వతిలాగా భృగు పుత్రిక భార్గవి. ఈ లక్ష్మిని నారాయణుడికిచ్చి వివాహం చేశాడు భృగువు. నారాయణుడి సంకల్ప, దయాశక్తుల రూపం లక్ష్మి. విష్ణు దయనే ఆయా లోకాల్లో లక్ష్ములుగా, ఆరు ఐశ్వర్యాల రూపంగా వివిధ నామాలతో పేర్కొంటారు. స్వర్గలక్ష్మి, భూలక్ష్మి, గృహలక్ష్మి, వనలక్ష్మి...ఇలా విశిష్ట శోభ, సంపద కలిగిన చోట్లను లక్ష్మీ స్థానాలుగా చెబుతారు.

--------------------

    ‘పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్‌ పాదపద్మంమయి సన్నిధత్స్వ...’ అని స్తుతిస్తూ వరలక్ష్మీపూజలో సమర్పించే కమలం... ఆధ్యాత్మికతనీ అమరత్వాన్నీ ఆరోగ్యాన్నీ అందాన్నీ అనుగ్రహించే అపురూప పుష్పం..! 
లక్ష్మీదేవిని మాత్రమే కాదు, సరస్వతీ, బ్రహ్మ, విష్ణువు... ఇలా దేవీదేవతలందరినీ పద్మనామంతో స్తుతిస్తుంటారు. విష్ణుమూర్తి నాభి నుంచి పద్మం ఉద్భవించడంతో ఆయన్ని పద్మనాభుడనీ, ఆ నాభి నుంచి పుట్టి, ఆ పద్మాన్నే ఆసనంగా చేసుకున్న బ్రహ్మదేవుణ్ణి పద్మాసనుడనీ అంటారు. దేవతలూ రాక్షసులూ చేసిన క్షీరసాగరమథనంలో హాలాహలం తరవాత రెండు చేతుల్లో కమలాలతో సహా ఆవిర్భవించిన శ్రీలక్ష్మి, గులాబీరంగు తామరపువ్వునే ఆసనంగా చేసుకుందని చెబుతూ ఆ పద్మాలతోనే మహాలక్ష్మిని పూజిస్తారు. శుభాల్ని అందించే వినాయకుడికి గులాబీరంగు కమలమూ, చదువులతల్లి సరస్వతీదేవికి తెల్లని తామరపువ్వే ఆసనాలు. బౌద్ధులకీ ఈ సుందర సరోజం పవిత్రమైనదే. ఆ నీరజ రూపమే ఓ శక్తి కేంద్రంగా విశ్వసించే బహాయీలు నిర్మించుకున్నదే దిల్లీలోని లోటస్‌ టెంపుల్‌.
పద్మదళ సోయగం 

సూర్యోదయంతో విచ్చుకుని సూర్యాస్తమయంతో ముడుచుకునే కమలాన్ని పుట్టుకకీ పరిపూర్ణతకీ స్వచ్ఛతకీ సచ్ఛీలతకీ ధ్యానానికీ జ్ఞానానికీ ప్రతీకగానూ; సిరిసంపదలకీ పునరుత్పత్తికీ సంకేతంగానూ భావిస్తారు ఆధ్యాత్మికవాదులు. ఆ కారణంతోనే కావచ్చు, కమలాన్ని జాతీయ పుష్పంగా గౌరవించింది భారత ప్రభుత్వం. పద్మశ్రీ, పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌... తదితర పురస్కారాల్లోనూ పద్మాన్నే భాగం చేసింది. 

కమలం రేకులు వెడల్పుగా ఉండి, అందంగా విప్పారతాయి. అందుకే విశాలమైన కళ్లున్న స్త్రీని పద్మాక్షి అనీ, పురుషుడిని పద్మనేత్రుడనీ అంటారు. మొగ్గదశలోనూ కమలం సౌందర్యం అద్వితీయమే. అయితే ఆ పవిత్ర పుష్పాన్ని ఏ చెరువులో వికసించినప్పుడో చూసి ఆనందించడమే తప్ప, గులాబీ, లిల్లీ, మందారం, నందివర్ధనం... వంటి పూలమొక్కల మాదిరిగా పెరట్లో పెంచడం అరుదే. కాస్త బురద ఎక్కువగా ఉండే మంచినీటి కొలనుల్లోనే- అదీ అనుకూల వాతావరణ పరిస్థితుల్లోనే కమలం వికసిస్తుంది. కానీ ఆ పద్మదళ సోయగానికి ముగ్ధులైన పూలప్రేమికులు ఇప్పుడు వాటిని తొట్టెల్లోనో, చోటు ఉంటే పెరట్లో చిన్నకొలనులు కట్టించుకునో పెంచుకుంటున్నారు. దానికి తగ్గట్లే ఇప్పుడు రంగురంగుల హైబ్రిడ్‌ రకాలూ మీనియేచర్‌ కమలాలూ వస్తున్నాయి.
కమలంలో తెలుపు, గులాబీ రంగులే కాదు, ఎరుపు, నీలం, పసుపు...ఇలా ఎన్నో రంగులూ...రెండు, మూడు, నాలుగు... ఇలా మరెన్నో రేకుల వరసలున్నవీ ఉన్నాయి. మనం పవిత్రమైనదిగా భావించే కమలం రకం గులాబీరంగులో అందంగా విచ్చుకుంటే, పసుపు రంగులోని పెర్రీస్‌ జెయింట్‌ సన్‌బరస్ట్‌ పెద్దగా కప్పులా ఉంటుంది. ఈ పచ్చని పద్మం పగలు విచ్చుకుంటూ రాత్రికి మూసుకుంటూ అలా మూడురోజులకి పూర్తిగా విప్పారుతుంది. గులాబీ రంగులో విచ్చుకుని రెండో రోజుకి పసుపూగులాబీ రంగులోకీ మూడోరోజుకి పసుపురంగుకీ మారే మిసెస్‌ పెర్రీ డి స్లోకమ్‌ సుగంధాన్ని వెదజల్లుతుంటుంది. గులాబీని తలపించే చైనీస్‌ డబుల్‌ రోజ్‌, తెల్లని తెలుపురంగులో మధుర పరిమళంతో వికసించే ఆల్బాగ్రాండిఫ్లోరా, తెలుపూ గులాబీ కలగలిసిన చావన్‌ బసు, ముద్దగులాబీలా విరిసే మోమోబోటాన్‌... ఇలా ఎన్నో రకాలు.
తామర సాగు! 

పద్మం పుట్టింది మనదేశంలోనే అయినా ప్రస్తుతం అది తామరతంపరగా వికసించేది మాత్రం చైనాలోనే. జపాన్‌, ఆస్ట్రేలియా, వియత్నాం, ఈజిప్టు, అమెరికా దేశాల్లోనూ పంకజం పరిమళిస్తుంది. ఆ తేజస్సుకి మురిసే కొరియా, చైనా, జపాన్‌ వాసులు ఏటా లోటస్‌ వేడుకల్ని జరుపుకుంటారు. అదీగాక తామర రకాలను పూలకోసమే కాదు, నేలలో ఊరే వాటి దుంపవేళ్లూ, కాడలూ, ఆకులకోసం కూడా ప్రాచీనకాలంనుంచీ ప్రత్యేక నీటి కొలనుల్లో పెంచుతున్నారు. ఉష్ణోగ్రతని సమన్వయం చేసుకునే శక్తి తామర మొక్కకి ఉన్న మరో ప్రత్యేకత. తామరపూలు పూయడానికి కనీసం 30-35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. వాతావరణంలో ఆ ఉష్ణోగ్రత లేకపోతే లోపలి నుంచే వేడిని ఉత్పత్తి చేసుకుంటుంది. ఇలా మొక్కల్లో వేడి పుట్టడం అరుదైన ప్రక్రియ. తామరగింజలకి మరణం లేదు. దాదాపు 1500 సంవత్సరాలనాటి తామరగింజ కూడా మొలకెత్తిన నిదర్శనాలు ఉన్నాయి. అందుకే ఉష్ణోగ్రత సమన్వయానికీ విత్తనాల్లో కణాల రక్షణకీ కారణమైన వీటి ప్రొటీన్లను బయోఇంజినీరింగ్‌ ప్రక్రియ ద్వారా మందుల తయారీలోనూ వాడుతున్నారు. 
ఆరోగ్యం-ఆహారం..! 

గింజలతోపాటు తామరతూళ్లు- అంటే కాడల్లోపలి భాగాన్నీ వేళ్లలోని దుంపభాగాల్నీ ఆహారంగా వాడతారు. ఆసియా, ఐరోపా, ఆస్ట్రేలియా దేశాల్లో వీటి వాడకం ఎక్కువ. అందుకే అక్కడ వీటిని ప్రత్యేక కొలనుల్లో పెంచుతారు. పైగా దుంప వేళ్లు, గింజలు, పువ్వులు... ఇలా ఒక్కోభాగంకోసం ఒక్కో రకం మొక్కను పెంచుతారు. చైనాలో దుంపలకోసమైతేనేం, గింజలకోసం అయితేనేం, సుమారు ఏడు లక్షల యాభై వేల ఎకరాల్లో తామరను పెంచుతారు. వేయించిన తామరగింజలే ఫూల్‌ మఖానా. ఈ గింజల్ని కూరలతోబాటు, పిండి పట్టించి కేకులూ ఐస్‌క్రీముల్లో వాడుతుంటారు. 

తామరపూలలో కూడా విటమిన్లూ ఖనిజాలూ ఇతరత్రా పోషకాలూ లభ్యమవుతాయి. అందుకే పూరేకుల్ని గ్రీన్‌ టీ మాదిరిగా తాగితే గ్యాస్ట్రిక్‌ అల్సర్లు తగ్గడంతోబాటు రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. ఆకుల్లోనూ బోలెడు పోషకాలు. పైగా పద్మ రేకుల్ని ఫుడ్‌ డెకరేషన్‌లో వాడితే, కొన్ని రకాల వంటకాల్ని ఉడికించేందుకు తామరాకుల్ని ఉపయోగిస్తారు. దుంపల్లోనూ కాడల్లోనూ సి-విటమిన్‌ ఎక్కువ. దుంపల్ని ఉడికించి తిన్నా, సూపులా తీసుకున్నా రక్తహీనత తగ్గుతుంది. నెలసరిలో రక్తం ఎక్కువగా పోయేవాళ్లకి ఇవి ఎంతో మేలు. అయితే గింజల్లో పోషకాలు ఎక్కువ. వీటిలో ప్రొటీన్లూ విటమిన్లూ ఖనిజాలూ దొరుకుతాయి. బి, బి2, బి6, ఇ-విటమిన్లూ సమృద్ధిగా ఉంటాయి. గింజల్లోని సంక్లిష్ట పిండిపదార్థాలూ పాలీఫినాల్సూ బీపీ, పిత్తాశయ రాళ్లూ, మధుమేహమూ మంటా తగ్గడానికి తోడ్పడతాయి. గింజల్లోని నెఫెరిన్‌ అనే పదార్థానికి క్యాన్సర్‌ను నిర్మూలించే శక్తి ఉందనేది తాజా పరిశోధన. 

తామరమొక్క భాగాలన్నింటినీ తరతరాలనుంచీ ఆయుర్వేదం, చైనా సంప్రదాయ వైద్యాల్లో ఉపయోగిస్తున్నారు. గింజల్ని గోరువెచ్చని నీళ్లలో నానబెట్టి పంచదార కలిపి తాగితే డయేరియా తగ్గుతుందట. గింజల్ని పొడి చేసి తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. పూలను కూడా డయేరియా, కలరా, జ్వరాలు తగ్గడానికి వాడతారు. 

మృదువైన చర్మసౌందర్యంకోసం లినోలిక్‌ ఆమ్లం, ప్రొటీన్లూ ఇతరత్రా పదార్థాలూ ఉండే పద్మదళాలను ఫేషియల్‌ క్రీముల తయారీలో వాడతారు. అలాగే పూల తైలం మెలనిన్‌ ఉత్పత్తికి తోడ్పడటం ద్వారా తెల్లజుట్టుని నిరోధిస్తుంది. 

ఆయురారోగ్యాల్నీ పంచి ఇచ్చే కమలం, మానవాళికి మనోవికాసాన్నీ కలిగిస్తుంది. 
‘రాగద్వేషాలకతీతంగా ధర్మబద్ధంగా తన విధిని తాను నిర్వర్తించి, ఫలితాన్ని మాత్రం ఆ భగవంతుడికి వదిలేసేవాళ్లకి- నీళ్లలోనే ఉన్నా తామరాకుమీద నీరు నిలవనట్లే, బురదనీటిలో పుట్టినా కమలానికి బురదేమీ అంటనట్లే- ఎలాంటి పాపమూ సోకద’ని చెబుతున్నాయి పురాణాలు. అదే కమలంలోని గొప్పతనం. అందుకే పద్మం... పవిత్ర పూజాపుష్పం..!

------------------------------------------
శ్రావణ శోభకు స్వాగతం!

జడివానలతో జీవితాలను పండించే మాసం కనుకే శ్రావణానికి శుచి మాసమనీ పేరుందిమహిళలకు, మరీ ముఖ్యంగా ముత్తయిదువుల మనసు దోచిన మాసం శ్రావణం. నోములు, వ్రతాలు, పూజలు, ప్రత్యేక ఆరాధనలతో అత్యంత శోభాయమానంగా వెలుగులీనే కాలమిది. నెల ఆసాంతం శుభప్రదమే. ఏ గుడిని చూసినా, ఏ ఇంట అడుగిడినా, ఎవరిని పలుకరించినా.. భక్తి రసాత్మకత, శుభకార్యాల తోరణాలు, ఆధ్యాత్మిక పారవశ్యత ఆశ్చర్య పరుస్తాయి. ఆఖరుకు శ్రావణమాసం శోభనం అంటూ ఒక సినీకవి రక్తి కవిత్వానికీ ఈ ముప్పయి రోజుల పెళ్లి వేడుకలు అద్దం పడతాయి.

శ్రవణా నక్షత్రంతో పున్నమి వెన్నెల నెమలి పింఛంలా విచ్చుకొనే సమయమిది. కాబట్టే, ఈ నెలకు శ్రావణం అని పేరొచ్చిందని పంచాంగ కర్తలు అంటారు. ఈ నెలను ఒక్కమాటలో వర్ణించాలంటే, శుభకార్యాలకు స్వాగతం పలుకుతుంది. పండుగలు, పబ్బాలకు నట్టింటి వరండాలో పీటలు వేసి పవిత్రంగా కూర్చో పెడుతుంది. అధిక జ్యేష్ఠ, ఆషాఢాల రెండు నెలల శూన్యకాలం తర్వాత పెండ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి గొప్ప శుభముహూర్తాలకు ఈ మాసంలోనే తలుపులు బార్లా తెరచుకోవడం విశేషం.

శ్రావణ మాసం ఎంత విశిష్టమంటే.. అటు విష్ణుమూర్తికి, ఇటు ఈశ్వరునికి, మరోపక్క లక్ష్మీదేవికి, వేరొకపక్క లలితా పరమేశ్వరికి, ఇంకా గణపతి ఆదిగా శ్రీవేంకటేశ్వరస్వామి నుంచి శనీశ్వరుని వరకు హైందవ దేవతందరికీ.. ఈ నెల పొడుగునా అత్యంత అట్టహాసంగా పూజాదికాలు జరుగుతాయి. ఈ నెలంతా, వారం మొత్తంలో ప్రతీ రోజూ ఏదో ఒక శుభకార్య సందోహం కానవస్తుంది. మహావిష్ణువుకు ఈ కాలం ఎందుకు ప్రీతికరమంటే, స్థితికారుడైన ఆ స్వామి జన్మించిన మహాశుభ నక్షత్రం శ్రవణం కనుక! ఈ మాసంలోని ప్రతీ సోమవారం నాడు ఈశ్వరుని విశేష ఆరాధనకూ సరైన కారణం లేకపోలేదు. పౌరాణిక కథల ప్రకారం ఈ మాసంలోనే పరమశివుడు పాలసముద్ర మథనవేళ వెలువడిన హాలాహలాన్ని నోట మింగి, కంఠంలో నిక్షిప్త పరచి నీలకంఠుడైనాడని పురాణాలు చెప్తున్నాయి.

హైందవులు ఈ మాసంలోని ఒక్కోరోజు ఒక్కో దైవాన్ని వారం రోజుల పాటు ఆరాధిస్తారు. శ్రావణ సోమవారం పేరు చెబితేనే శివ భక్తుల మనసులు పులకించి పోతాయి. ఈ రోజు విధిగా గుడికి వెళ్లి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేయించే వారూ కోకొల్లలు. ప్రతీ శివాలయం భక్తులతో క్రిక్కిరిసి పోతుంది. గుళ్లకు వెళ్లలేని వాళ్లు కనీసం తమ ఇళ్లల్లో అయినా ఈశ్వరారాధన చేయడం ఈరోజు అత్యంత పుణ్యప్రదం. అలాగే, ప్రతీ మంగళవారం కొత్తగా పెళ్లయిన ముత్తయిదువులు మంగళగౌరీ నోములను నోచుకొని తోటి, పెద్ద ముత్తయిదువులకు తాంబూలాలిస్తారు. ప్రతీ ముత్తయిదువనూ గౌరీదేవి స్వరూపంగా భావించి, వారి కాళ్లకు తమ స్వహస్తాలతో పసుపు పెట్టి, పళ్లు-పూలతో ఆరాధించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ.

ప్రతీ బుధవారం విఠలేశ్వరునికి పూజలు చేస్తే, ప్రతీ గురువారం దత్తాత్రేయస్వామిని ఆరాధిస్తారు. ప్రతీ శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు ఈ నెల విశేషం. ముఖ్యంగా రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. శనివారం నాడు శ్రీ వేంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిలతోసహా శనీశ్వరుణ్ణీ ఆరాధిస్తారు. ఇవే కాక, ఈ నెలలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలనూ ఆచరిస్తారు. ఇంకా నాగపంచమి, గరుడపంచమి, రాఖీ (జంధ్యాల) పూర్ణిమ, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పర్వదినాలూ ఈ నెలలోనే జరుపుకుంటాం.

ఇక, ఈ వారం ప్రారంభంలోనే అంటే రేపు (శనివారం, 11వ తేది) చుక్కల అమావాస్య. పేరుకు అమావాస్యే అయినా ఇదీ ముత్తయిదువులకు ఒక పర్వదినమే. ఇవాళ్టితో ఆషాఢమాసం ముగుస్తుంది. ఇదొక రకంగా పిండపితృ యజ్ఞకార్యాలతో పాటు ముత్తయిదువులు ఈ రోజు ప్రత్యేకించి పార్వతీదేవికి చుక్కల వ్రతం ఆచరిస్తారు. బియ్యం పిండిలో కాసిన్ని పాలు కలిపి, ముద్దలుగా చేసి అమ్మవారికి నివేదన చేస్తారు. చుక్కల అమావాస్య అని దీనిని ఎందుకంటారనడానికి పెద్ద ముత్తయిదువులు ఒక పురాణకథ చెప్తారు. మర్నాటి నుంచి శ్రావణమాసం మొదలు. బుధవారం (15వ తేది) నాగపంచమి, గరుడపంచమిలతోపాటు సూర్యపూజ, సూర్యషష్ఠీ వ్రతం వంటివీ జరుపుకుంటారు. ఇదే రోజు ప్రసిద్ధ భారతీయ యోగపురుషుడు అరవింద్ ఘోష్ జయంతి. అంతేకాక, మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన శుభసమయం కూడా.

ఇంతేనా, ఇంకా ఉన్నాయి. శ్రావణ పూర్ణిమ నాడే శ్రీ సంతోషీమాత జయంతి. కాబట్టి, ఆ అమ్మవారి పేరుమీద ముత్తయిదువులు వ్రతమాచరిస్తారు. ఆ రోజు విష్ణుమూర్తి స్వరూపంగా భావించే హయగ్రీవ జయంతి కూడా. వారి ద్వారా ఉపదేశితమైన శ్రీలలితా సహస్రనామ స్తోత్రాన్ని ఆనాడు పారాయణంగా చదువుకొని, గుగ్గిళ్లు నైవేద్యం పెట్టడం ఆచారం. అంతేకాక, విష్ణుమూర్తి వేదాల రక్షణ కోసమే హయగ్రీవునిగా జన్మించినందున ఈ పుణ్యదినాన వేదపారాయణమూ ఎంతో శ్రేష్ఠమని పండితులు చెప్తారు. ఇక, శ్రావణ బహుళ ఏకాదశి రోజూ ప్రత్యేక వ్రతం, శ్రావణ అమావాస్య నాడు వృషభ పూజ అత్యంత విశేష ఫలాలనిస్తాయనీ వారు అంటారు. ఇదంతా ఒక ఎత్తయితే.. ఆయా నోముల సందర్భంగా ముత్తయిదువులు చెప్పుకొనే ప్రత్యేక పురాణ, ప్రాచీన కథలు మరో ఎత్తుగా.. తరతరాలుగా స్ఫూర్తిదాయకమవుతున్నాయి.

అటు వరలక్ష్మీ, ఇటు మంగళగౌరికోరిన వైభోగాలనిచ్చే లక్ష్మీదేవి వరలక్ష్మిగా, శక్తి స్వరూపిణి పార్వతీదేవి మంగళగౌరిగా అవతరించింది శ్రావణ మాసంలోనే! అటు ప్రతీ శుక్రవారం, ఇటు ప్రతీ మంగళవారం నెలంతా ఇద్దరమ్మలూ ఘనంగా పూజలందుకుంటారు. అష్టయిశ్వర్యాలతో తులతూగేలా చేయమని వేడుకొంటూ ఎందరో ముత్తయిదువులు ఆ అమ్మవార్లను తమ ఇళ్లకు రమ్మంటూ మనసారా ఆహ్వానం పలుకుతారు. కన్నులపండువుగా నోములు నోచుకొని నిండైన హారతులు సమర్పిస్తారు. ఈ నెలలోనే పున్నమికి ముందు వచ్చే (రెండో) శుక్రవారం ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రతాన్ని, అలాగే, ప్రతీ మంగళవారం (నాలుగైనా, అయిదైనా) మంగళగౌరీ నోములను ఉన్నంతలో వైభవంగా జరుపుకుంటారు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment