సరస్వతి సహస్రనామాలు
Saraswati Sahasranamalu
Rs 27/-
సరస్వతీ దేవీ సకల విద్యాస్వరూపిణి.....................!!
ఈ ఆధునిక యుగంలో చదువే సమస్తానికి మూలమని అందరికీ తెలుసు. విద్యతోనే పిల్లలు సభ్య మానవులై, మంచి జీవితాన్ని గడపగలుగుతారు. కవి, లేఖనుడు, సమీక్షక్షుడు, ఆలోచనాపరుడు, పాఠకుడు, గాయకుడు, సంగీతజ్ఞుడు, తార్కికుడు, అధ్యాపకుడు, ప్రవక్త, ఉపదేశకుడు, జ్యోతిష్కుడు, వక్త మొదలైన వారందరికీ కావలసింది వాక్పటుత్వం. వాక్చాతుర్యం ద్వారానే వ్యక్తులు ఇతరులపై ప్రభావం చూపగలుగుతారు. సంగీత ఇతర లలిత కళలకు కూడా సరస్వతి అధిష్టాన దేవత. పవిత్రంగా, మనపూర్వకంగా, నిర్మలమైన మనస్సుతో ఆరాధిస్తే చాలు ఆ చదువులమ్మ ప్రసన్నమై కోరిన విద్యలు ప్రసాదిస్తుంది.
సరస్వతీ దేవీ సకల విద్యాస్వరూపిణి. సకల సవాజ్మయానికీ మూలం. మనం నోటితో ఏదైన మధురంగా మాట్లాడుతున్నామంటే అది ఆ తల్లి చలవే. ఆమె అంతర్వాహినిగా ఉండటం వల్లే మనలో మేధాశక్తి పెంపొందుతుంది. ఆమె అనుగ్రహం లేకపోతే అజ్ఞానాంధకారం లో కొట్టుమిట్టాడవలసిందే. అందుకే ఆ చల్లని తల్లి అనుగ్రహం ప్రతీ ఒక్కరికీ అవసరం.
యా కుందేదు తుషార హర ధవళా
యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి భిర్దేవ్యై స్సదా పూజితా
సామాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహ
అని స్తుతిస్తాం సరస్వతిని. ఆ తల్లిని పూజిస్తే బుద్ది వికాసం కలుగుతుందని, సకల శుభాలూ సమకూరుతాయని భక్తుల విశ్వాసం. వాక్కు, బుద్ధి, విద్య, జ్ఞానాలకు, భాషకు, లిపికి అధిష్టాన దేవత సరస్వతీ దేవి. ఈమె వీణా పుస్తక ధారిణి. శుద్ద సత్య స్వరూపిణి. హంస ఆమె వాహనం. సరస్వతి బ్రహ్మదేవుని నలుకయందు నివసిస్తుంది. పలుకు తేనెల బంగారుతల్లి. వేదాలకు జనయిత్రి. తెల్లని వన్నెలు విరజిమ్ముతూ, తెల్లని వస్త్రాలు ధరించి వీణ, పుస్తకాలు చేదాల్చి, రత్న భూషణాలు మెడలో ధరించి, సకల శాస్త్రాలకూ అధి దేవత అయిన సరస్వతీదేవి అవిర్భవించింది. ఆమె దయ ఉంటే మూర్ఖుడు సైతం పండితుడు కాగలడు. ఆమెను తృణీకరించిన మహపండితుడుసైతం జ్ఞాన భ్రష్టునిగా, వివేకశూన్యునిగా మారి సర్వం పోగొట్టుకుని పిచ్చివాడయిపోతాడు. అందుకే ఆ తల్లి కరుణ కోసం పరిపరివిధాల ప్రాధేయపడతాం.
సరస్వతీదేవి ఇతర నామాలు
సరస్వతీదేవి పలు నామాలతో విలసిల్లుతోంది. భారతి, మహవిద్య, వాక్, మహరాణి, ఆర్య, బ్రహ్మి, కామధేను, బీజగర్భ, వీణాపాణి, శారద, వాగీశ్వరీ, గాయత్రి, వాణి, వాగ్దేవి, విద్యావాచస్పతి తదితర నామాలు ఉన్నాయి.
అక్షరాభ్యాసానికి అనుకూలం
అక్షరాభ్యాసం లేదా విద్యారంభానికి మంచి ముహూర్తం ఉత్తరాయణం. అంటే మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాల లో శుక్లపక్షంలో విదియ, తదియ, పంచమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, తిధులు, అశ్వని, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్ర, స్వాతి, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, రేవతి నక్షత్రాలు శ్రేష్ఠం. మంగళ, శని వారాలు తప్ప తక్కిన వారాలన్నీ మంచివేనని శ్రీ కాశీనాధోపాధ్యాయ విరచిత ధర్మసింధు పేర్కొంది.
సరస్వతీ వ్రతం
ధనానికి అధిదేవత అయిన లక్ష్మీదేవికి వరలక్ష్మీ వ్రతం చేసినట్లుగానే విద్యాధిదేవత సరస్వతీదేవి వ్రతం కూడా ఉంది. ఈ వ్రతం చేయడం వల్ల అజ్ఞానంతో చేసిన పాపాలన్నీ తొలగి జ్ఞానప్రాప్తి కలుగుతుంది. పాండిత్యం సిద్ధిస్తుంది. ఆ వ్రతవిధానమిది. ఈ వ్రతానికి మాఘశుద్ధ పంచమి లేదా ఏ మాసమైనా శుక్లపక్ష పంచమి, పూర్ణిమ తిధులు శ్రేష్ఠం. సంకల్పం చెప్పుకున్న శుభముహూర్తాన ఉదయం పూట శుచిగా సరస్వతిని పూజిస్తామని సంకల్పించుకోవాలి. స్నానాదికాలు, నిత్యకృత్యాలు అయిన పిదప కలశ స్దాపన చేయాలి. గణపతిని పూజించి, కలశంలో దేవిని అవాహాన చేయాలి. విద్యాదాయిని సరస్వతీదేవికి ధవళ వస్త్రాలను సమర్పించి, తెల్లని నగలు అలంకరించాలి. తెల్లని పూలు, అక్షరాలతో, మంచిగంధంతో, ధ్యానావాహనాది షోడశోపచారాలతో పూజించిన అనంతరం పాయసం నివేదించాలి. పూజానంతరం కధ చెప్పుకుని అక్షంతలు శిరస్సున ధరించి పాయస ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టాలి. ఈ విధంగా 5 వారాలు చేసిన తదుపరి ఉద్యాపన చేయాలి.
ఉద్యాపన విధానం
ఐదుగురు పిల్లలను గణపతి ప్రతిరూపాలుగా భావించి, పూజించి, నూతన వస్త్రాలు కట్టబెట్టి, పలకాబలపాలు లేదా పుస్తకం, కలం ఇచ్చి సంవత్సరంపాటు వారిని చదివించాలి. లేదా వారి చదువుకయ్యే ఖర్చు భరించాలి. ఎవరైనా తమకిగానీ, తమవారికిగానీ అసాధారణ విద్య అబ్బాలనుకున్నా, ఉన్నత విద్యాప్రాప్తి, లేదా పదోన్నతి కావాలనుకుంటే ఈ వ్రతం ఆచరించి సత్ఫలితాలు పొందవచ్చు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
|
No comments:
Post a Comment