ప్రాణాయామము - యోగ | Pranayama - Yoga | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
ప్రాణాయామము - యోగ 
Pranayama - Yoga 
RS 63/-















  • ఆరోగ్య యోగం!

  • శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో వ్యాయామమూ అంతే అవసరం. ‘ఈ విషయం మాకూ తెలుసు. కానీ అందుకు సమయమెక్కడిదీ?’ అంటున్నారా? వ్యాయామం కోసం జిమ్‌కే వెళ్లనవసరం లేదు. ‘యోగా’నూ అనుసరించవచ్చు. బిజీ జీవితాల్లో, తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం అందించే యోగాసనాలు ఉన్నాయి. సెడెంటరీ లైఫ్‌ స్టయిల్‌ మూలంగా వచ్చే రుగ్మతల నుంచి రక్షణ పొందాలంటే కొన్ని యోగాసనాలు సాధన చేయాలి!

  • థైరాయిడ్‌ సమస్యలు పోవాలంటే...
  • శరీర జీవక్రియలు క్రమబద్ధంగా నడవాలంటే థైరాయిడ్‌ గ్రంథి సక్రమంగా పని చేయాలి. లేదంటే శరీరం శక్తిని ఖర్చు చేసే వేగంలో అవకతవకలు ఏర్పడి నాణ్యమైన జీవితాన్ని గడపలేం! చర్మం పొడిబారడం, నిస్సత్తువ, మానసిక వ్యాకులత, అకారణంగా బరువు పెరగడం, గొంతు వాపు, జుట్టు రాలడం థైరాయిడ్‌ హార్మోన్‌ హెచ్చుతగ్గులకు సూచనలు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే థైరాయిడ్‌ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచే ఆసనాలు వేయాలి.
  • యోగాసనాలు: హలాసనం మెడ దగ్గరున్న థైరాయిడ్‌ గ్రంథిని ప్రేరేపించి, అది సక్రమంగా పని చేసేలా ప్రోత్సహిస్తుంది. మత్స్యాసనం కూడా మెడను సాగేలా చేసి, థైరాయిడ్‌ గ్రంథిలో చైతన్యాన్ని తెప్పిస్తుంది.

  • హలాసనం
  • వెల్లకిలా నేల మీద పడుకోవాలి.
  • విశ్రాంతిగా ఉంటూ కాళ్లను దగ్గరకు చేర్చి, చేతులు శరీరానికి దగ్గరగా ఉంచాలి.
  • ఊపిరి బిగబట్టి రెండు కాళ్లనూ నిలువుగా పైకి లేపాలి. ఇలా కాళ్లను లేపేటప్పుడు పొట్ట దగ్గరి కండరాలు, నడుమునే ఆసరా చేసుకోవాలి.
  • కాళ్లను అలాగే పైకి లేపుతూ తల వెనక్కి తీసుకెళ్లి నేలకు ఆనించాలి.
  • ఈ భంగిమలో ఎంత ఎక్కువ సమయం ఉండగలిగితే గ్రంథికి అంత ఎక్కువ మేలు జరుగుతుంది.
  • తర్వాత నెమ్మదిగా కాళ్లను పైకి లేపుతూ నేల మీదకు చేర్చి, వెల్లకిలా పడుకున్న భంగిమలోకి రావాలి.

  • మత్స్యాసనం
  • పద్మాసనంలో కూర్చోవాలి.
  • నెమ్మదిగా వెనక్కి వంగుతూ శరీరాన్ని విల్లులా వంచి తలను నేలకు తాకించాలి.
  • ఇలా చేస్తున్నప్పుడు మోచేతులను నేల మీద ఉంచి వాటి ఆధారంగా వెనక్కి వంగాలి.
  • తల నేలకు తాకిన తర్వాత చేతులతో కాలి బొటనవేళ్లను పట్టుకోవాలి.
  • ఈ భంగిమలో వీలైనంత ఎక్కువ సమయం ఉండాలి.

  • ఊబకాయం తగ్గాలంటే..
  • హైపర్‌టెన్షన్‌, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌, హార్మోన్లలో హెచ్చుతగ్గులు... ఇలా చెప్పుకుంటూపోతే ఊబకాయం తెచ్చిపెట్టే ఆరోగ్య సమస్యలు లెక్కలేనన్ని! కాబట్టి అధిక బరువును తగ్గించే యోగాసనాలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. ఎక్కువ సమయంపాటు కూర్చుని ఉద్యోగాలు చేసేవాళ్లు, ఇంట్లో ఉన్నా ఎక్కువ సమయం విశ్రాంతిలో గడిపేవాళ్లు... తేలికపాటి యోగాసనాలతో ఊబకాయాన్ని దరి చేరకుండా చేయొచ్చు.

  • సూర్య నమస్కారం
  • 12 రకాల సూర్య నమస్కారాల్లో తేలికగా సాధన చేయగలిగినవి ఇవే!
  • సూర్యునికి అభిముఖంగా నిలబడి చేతులను జోడించాలి.
  • రెండు చేతులను పైకి లేపి శరీరాన్ని విల్లులా వెనక్కి వంచాలి.
  • ముందుకు వంగి తలను మోకాళ్లకు, అర చేతులను నేలకు తాకించాలి.
  • నేల మీద పద్మాసనంలో కూర్చుని ఒక కాలును నెమ్మదిగా వెనక్కి చాపి, చేతులను గాల్లోకి లేపి జోడించి వెనక్కి వంగాలి.

  • వీరభద్రాసనం
  • నిటారుగా నిలబడి, చేతులను గాల్లోకి లేపి జోడించాలి.
  • ఒక కాలును ముందుకు ఉంచి మడుస్తూ, మరో కాలును వెనక్కి చాపాలి.
  • ఈ భంగిమలో వీలైనంత ఎక్కువ సమయంపాటు ఉండి తిరిగి మామూలు స్థితికి రావాలి.

  • షుగర్‌ పరార్‌!
  • యోగాసనాల వల్ల గ్రంథుల పనితీరు మెరుగవుతుంది. పిత్తాశయం, కాలేయం నుంచి స్రావాల విడుదల క్రమబద్ధమవుతుంది. ఫలితంగా కొలెస్ట్రాల్‌, చక్కెర స్థాయులు పెరగ కుండా ఉంటాయి. చక్కెర వ్యాధికి మందులను వాడుతూ యోగాసనాలు వేయగలిగితే ఇన్సులిన్‌ ఉత్పత్తి మెరుగై మధుమేహం అదుపులోకొస్తుంది. ఈ రుగ్మతకు తగిన ఆసనాలు ఇవే!

  • లఘు వజ్రాసనం
  • మోకాళ్ల మీద కూర్చుని నడుము పై నుంచి శరీరాన్ని వెనక్కి వంచాలి.
  • వెనక్కి వంచిన తలను నేలకు ఆనించాలి. చేతులతో మోకాళ్లను పట్టుకోవాలి.
  • ఈ భంగిమలో కొన్ని సెకన్ల నుంచి కనీసం ఒక నిమిషం పాటు ఉండాలి.
  • తర్వాత నెమ్మదిగా శరీరాన్ని మామూలు స్థితికి తీసుకొచ్చి, చేతులను వదులుగా వదిలేయాలి.

  • త్రికోణాసనం
  • నిటారుగా నిలబడి చేతులను శరీరానికి పక్కన ఆనించి ఉంచాలి.
  • తర్వాత రెండు కాళ్ల మధ్య రెండు నుంచి మూడు అడుగుల దూరం ఉండేలా కాళ్లను జరపాలి.
  • కుడి కాలును శరీరానికి 90 డిగ్రీల కోణంలో తిప్పి, ఎడమ కాలును కూడా 45 డిగ్రీల కోణంలో తిప్పి నిలబడాలి.
  • నడుము పైభాగాన్ని కుడి కాలు వైపుకు తిప్పాలి.
  • ఇలా శరీరాన్ని వంచినప్పుడు ఎడమ చేయి, కుడి కాలు పక్కగా నేలను తాకాలి.
  • కుడి చేయి నిటారుగా గాల్లోకి లేపి ఉంచాలి.
  • తల, చూపులు ఆకాశం వైపు ఉండాలి.
  • ఇదే ఆసనాన్ని ఎడమ వైపు వంగి కూడా చేయాలి.

  • కీళ్ల నొప్పులిక మాయం!
  • ఈ మధ్య కాలంలో యువతనూ ఆర్థ్రయిటిస్‌ సమస్య వేధిస్తోంది. కీళ్లకు తగినంత వ్యాయామం దొరకకపోవడం, తప్పుడు భంగిమలలో కాళ్లను మడిచి కూర్చోవడం, కుదురుగా ఉండని చెప్పులు ధరించడం వల్ల కాలి కీళ్లలో సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో మృదులాస్థి దెబ్బతిని, ఎముకలు రాపిడికి గురై కీళ్ల మార్పిడి చేయించుకోవలసిన దుస్థితీ దాపురిస్తుంది. కాబట్టి ఈ ఇబ్బందిని అధిగమించడం కోసం కీళ్లకు బలాన్నిచ్చే ఆసనాలు వేయాలి. అవేంటంటే.....

  • శిశువాసనం
  • మోకాళ్ల మీద కూర్చుని పిరుదులను కాళ్లకు ఆనించాలి.
  • రెండు చేతులు పైకి లేపి నడుము పైభాగాన్ని ముందుకు వంచి, తలను నేలకు తాకించాలి.
  • ఈ భంగిమలో చాపిన చేతులు కూడా నేలకు తాకాలి.
  • పూర్తి శరీరాన్ని రిలాక్స్‌డ్‌గా ఉంచి, ఊపిరి పీల్చుకోవాలి.
  • ఈ భంగిమలో సాధ్యమైనంత ఎక్కువ సమయం ఉండి, తిరిగి పైకి లేవాలి.

  • అధోముఖశ్వానాసనం
  • మోకాళ్ల మీద కూర్చుని, అర చేతులను నేలకు ఆనించాలి.
  • ఇప్పుడు నెమ్మదిగా నడుమును పైకి లేపాలి.
  • కాళ్లు, చేతులు నిటారుగా, ఉండేలా పైకి లేవాలి.
  • ఈ భంగిమలో తలను చేతలు మధ్య ఉంచాలి, చూపులు నేల వైపు ఉండాలి.
  • ఈ భంగిమలో వీలైనంత ఎక్కువ సమయంపాటు ఉండి తిరిగి కాళ్లను మడిచి కూర్చోవాలి.

  • వెన్ను నొప్పి... ఇట్స్‌ గాన్‌!
  • ఎక్కువ సమయంపాటు కూర్చునే ఉండడం, కూర్చునే భంగిమలో తప్పులు, వెన్ను వంచి కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి, వెన్నెముకలోని పూసలు పట్టుతప్పడం, అరిగిపోవడం, తొలగడం లాంటి సమస్యలు మొదలవుతాయి. కాళ్లూ, చేతులూ లాగడం, వీపు నొప్పి లాంటి లక్షణాలు మొదలైతే ఈ సమస్యను సరిచేసే యోగాసనాలు సాధన చేయాలి. అవేంటంటే....

  • సుప్త మత్స్యేంద్రాసనం
  • వెల్లకిలా పడుకుని, చేతులను పక్కలకు చాపాలి.
  • కుడి కాలును మడిచి, ఎడమ కాలి మీదుగా శరీరం పక్కకు వంచి, నేలను తాకించాలి.
  • అలా నేలకు తాకించిన కుడి కాలును ఎడమ చేత్తో పట్టుకోవాలి.
  • ఇలా చేస్తున్నప్పుడు నడుము కింది భాగం మాత్రమే కదలాలి. కానీ శరీరం మొత్తం కాలుతో పాటు కదలకూడదు.
  • ఈ భంగిమలో అర నిమిషంపాటు ఉండి, రెండో వైపు కూడా చేయాలి.
  • ఆసనం పూర్తయిన తర్వాత కాళ్లు రెండూ నేలకు ఆనించి పడుకుని, నెమ్మదిగా పైకి లేవాలి.

  • వృక్షాసనం
  • నిటారుగా నిలబడి, రెండు చేతులు తల మీదుగా పైకి లేపి జోడించాలి.
  • ఒక కాలిని ఆసరాగా చేసుకుని, రెండో కాలిని మడిచి తొడ ప్రదేశంలో పాదాన్ని ఆనించాలి.
  • ఈ ఒంటి కాలి భంగిమలో వీలైనంత సమయం ఉండి, రెండవ కాలితో కూడా ఇలాగే చేయాలి.
  • యోగా... శరీరానికి ఫ్లెక్సిబిలిటీనీ, దృఢత్వాన్నీ అందించే సాధనం! యోగాసనాలు శరీర అంతర్గత అసమతౌల్యాలను సమం చేసి, వ్యాధుల నుంచి పోరాడే శక్తిని సమకూరుస్తుంది. ఆసనాలు వేస్తున్నప్పుడు శరీరంలోని ప్రతి కండరం సాగుతుంది, సాంత్వన కలుగుతుంది. యోగా మన మనసు, శరీరం, ఆత్మలను అనుసంధానిస్తుంది. కాబట్టే లైఫ్‌స్టయిల్‌ సంబంధిత రుగ్మతలకు సమర్థంగా సమాధానం చెప్పగలుగుతోంది. జీవన విధానం సక్రమంగా లేకపోతే ఊబకాయం, రక్తపోటు, మధుమేహం, వెన్ను సమస్యలు.... ఇలా ఎన్నో ఇబ్బందులు వెంటాడతాయి. వాటిని దరి చేరకుండా ఉంచడం కోసం ఆయా రుగ్మతలకు కారణమైన అవయవాలను ఆరోగ్యంగా ఉంచే యోగాసనాలను సాధన చేయాలి.
  • యోగి సంజయ్‌ సోలంకి,--యోగా గురు, జిమ్స్‌ హోమియోపతి మెడికల్‌ కాలేజ్‌, హైదరాబాద్‌.

  • *************

  • ధ్యాత్మిక సాధనలో ప్రతి అంశమూ ప్రధానమైందే. అది చిన్నదా పెద్దదా అన్నది సమస్యే కాదు. ఎంత గొప్ప గమ్యమైనా వేసే ప్రతి అడుగూ దూరాన్ని తగ్గించేదే. ప్రతి అడుగూ గమ్యాన్ని చేరువ చేసేదే. అష్టాంగయోగంలో ప్రతి అంగమూ, అంగంలోని ప్రతి అంశమూ చిట్టచివరి అంకమైన సమాధి స్థితిని సిద్ధింపజేసే ప్రయత్నంలో అవసరమైందే. అనుకూలించేదే. యమనియమ అంగాలను సాధాన చేశాక తదుపరి అంగం ఆసనం. మృగచర్మం, దర్భచాప, వస్త్రం లాంటివి ఏర్పరచుకున్న తరవాత సాధకుడి ఆసన భంగిమ, ఆసనస్థితి మరింత ముఖ్యమైనవి.
  • విషయం ఏదైనా ప్రతి పనికి, ప్రతి సాధనకు ఒక భంగిమ అవసరమవుతుంది. అలాగే ధ్యానసాధనకూ. నిజానికి కొన్ని భంగిమలే మనం ఎన్నుకున్న అంశానికి తగిన అనుకూలతను, అవగాహనను కలిగిస్తాయి. అసలు అలా సహకరించే భంగిమల్నే మనం ఎన్నుకోవాలి. మన ధ్యానసాధనకు అత్యంత ఉపయుక్తమైనది పద్మాసనం. వెన్నుపూస నిటారుగా నిలిపేందుకైనా, అలా నిలబెట్టిన మేరుదండం (వెన్నుపూస) ఎక్కువసేపు నిలిచేందుకైనా ఈ ఆసనం తగినది.
  1. భుజాలను పక్కలకు విరిచి, వదులుగా వదిలేసి, ఛాతీని విస్తరించి ముందుకు పొంగించి, అదే సమయంలో శరీరాన్ని వదులుగా, భారరహితంగా వదిలేసి, శరీరస్పృహను పూర్తిగా విస్మరించే ప్రయత్నానికి పద్మాసనం అన్నివిధాలా అనుకూలమైనది. కుడికాలును ఎడమ తొడమీద, ఎడమ కాలును కుడితొడమీద ఉంచుకుని అరచేతులను కలిపి ఒళ్లో పెట్టుకున్న ఆ భంగిమ సాధకుడి చుట్టూ ఒక ఆధ్యాత్మిక వలయాన్ని నిర్మించినట్లుగా ఉంటుంది. దుష్టశక్తుల్ని ప్రవేశించనివ్వని రక్షణవలయం అది. సాధకుణ్ని శక్తిసమన్వితం చేసే శక్తిమంతమైన ఆరా అది. ఆధ్యాత్మిక భావజాలానికి, సాధనల సంకలనానికి పరిమితమై ఉన్న ఆ స్వయం నిర్మిత వలయం సాధకుడి ధ్యాన సాధనకు ఒక కవచంలా పనిచేస్తుంది.
  • సాధనతో పరిణతి పెరిగేకొద్దీ అంతరిక్షం నుంచి పొందే చైతన్య కిరణాలను, చిత్‌శక్తి తరంగాలను మన వెన్నుపూసలోని చక్రాలే స్వీకరించి నిక్షిప్తం చేస్తాయంటారు. కుండలినీ శక్తి చలనంలో, ఊర్ధ్వగతి చోదకంలో యాంటెనాలా పనిచేసే వెన్నుపూస నిటారుగా లేకపోతే దివ్యచైతన్య తరంగాలను ఆకర్షించటంలో అది విఫలమవుతుంది. వెన్నుపూస అలా నిలబడాలంటే పద్మాసనాన్ని మించిన ఆసనం లేదు. వజ్రాసనం, సిద్ధాసనం కొంతమేరకు అలా పనిచేసినా అవికూడా పద్మాసనం తరవాతివే. అందువల్లే సాధన ప్రారంభదశ నుంచే గురువులు తమ శిష్యులకు పద్మాసనంతోనే శిక్షణ మొదలుపెడతారు. తదనంతర కాలంలో వయోభారంవల్లో, అనారోగ్యంవల్లో, ధ్యానపారవశ్యంలోనో ఆసనాలు, భంగిమలు మారిపోయినా సాధకుడు ఒక స్థాయి వచ్చేవరకు పద్మాసనాన్ని అనుసరించక తప్పదు.
  • ఆలయాల్లో చిత్రపటాల్లో దేవతల విగ్రహాలు చతుర్భుజులైనా, అష్టభుజులైనా ఆ భంగిమలు పిరమిడ్‌ ఆకారంలో ఒక వలయానికి లోబడినట్లుగా ఉంటాయి. ఆ విధానం అత్యున్నత స్థితికి, స్థాయికి సంకేతం. ఉత్కృష్టతకు పరాకాష్ఠ.
  • పద్మాసనంలోని శరీర భంగిమ, చేతుల అమరిక సహజంగానే సాధకుణ్ని ధ్యాన స్థితిలోకి తీసుకువెళతాయి. ఎక్కడా బిగువు ఏర్పడని దేహం, పూర్తిస్థాయిలో సడలించిఉన్న దేహం, దేహ స్పృహ నుంచి విడివడే దిశగా తనకుతాను సిద్ధమవుతుంది. కలిసిఉన్న హస్తాల్లోని సూక్ష్మనాడులు మెదడు ఎడమవైపున ఉండే ఆధ్యాత్మిక కేంద్రానికి అనుసంధానమై లౌకిక స్పృహనుంచి విడివడేలా చేస్తాయి. సహజంగానే ఖేచరీ ముద్ర ఏర్పడే అవకాశమూ ఉంటుంది. నిజానికి ఇదంతా పద్మాసనాన్ని వేసినంత మాత్రాన జరిగేపని కాదు. ఎంతో సాధన కావాలి. అది ఎన్ని సంవత్సరాలో ఎవరూ చెప్పలేరు. అది మన ఆర్తిమీదా,  భగవంతుడి అనుగ్రహం మీదా ఆధారపడి ఉంటుంది. కాకపోతే స్థిర మానసంతో పనిచేసే సాధనలో మొదటి అడుగు ఆసనమే. అది పద్మాసనమే అయిఉండాలి. పద్మాసనాన్ని సాధనచేసి సాధనకు ఉపకరణగా మనం ఎంచుకుంటే మాయా తివాచీలా అది మనల్ని పరంధామానికి చేర్చే అవకాశం ఉంది!

  • ప్రాణాయామము - యోగ | Pranayama - Yoga | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

  • ప్రాణాయామము - యోగ | Pranayama - Yoga | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


  • ప్రాణాయామము - యోగ | Pranayama - Yoga | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


  • ప్రాణాయామము - యోగ | Pranayama - Yoga | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

  • ప్రాణాయామము - యోగ | Pranayama - Yoga | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu



ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment