ఏ దేవునికి ఏ విధముగా దీపారాధన చేయాలి? | Ye Devuniki Ye vidhamga Deeparadhana Cheyali ? | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

ఏ దేవునికి ఏ విధముగా
 దీపారాధన చేయాలి? 
 Ye Devuniki Ye vidhamga
 Deeparadhana Cheyali ? 
Rs 36/-


దీపలక్ష్మీ నమోస్తుతే!


దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపాన్ని వెలిగిస్తారు. దేవీదేవతల ముందు దీపం వెలిగించడమే దీపారాధన. దేవుడిని పూజించడం కంటే ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తామన్నమాట. షోడశోపచారాల్లో దీపారాధన ప్రధానమైంది. అన్ని ఉపచారాలూ చేయలేకపోయినా ధూపం, దీపం, నైవేద్యాలను తప్పక చేయాలంటారు పెద్దలు. ముక్కోటి దేవతలకూ వాహకంగా నిలిచే అగ్ని సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపం కూడా. అందుకే దీపాన్ని అర్చించిన వారికి లక్ష్మీకటాక్షం తప్పక లభిస్తుందంటారు. ఎన్నో విశిష్టతలకు నెలవైన దీపాన్ని ఎలా ఆరాధించాలీ, దీపారాధన సమయంలో ఎలాంటి నియమనిబంధనలు పాటించాలీ మొదలైన అంశాలను కూడా శాస్త్రాల్లో నిక్షిప్తం చేశారు మన పెద్దలు. సాధారణంగా మూడు అడ్డ వత్తులు లేదా బొడ్డు వత్తులను చేసి, ప్రమిదలో ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె పోసి వీటిని వెలిగిస్తారు. ప్రత్యేక పూజలూ నోములూ చేసేటప్పుడు అయిదు పోగులూ, తొమ్మిది పోగులూ, కమలవత్తుల పేరుతో ఎనిమిది పోగులూ... ఇలా రకరకాలుగా వత్తులను వెలిగిస్తారు. సాధారణంగా దీపారాధన సమయంలో కింది శ్లోకాన్ని చదువుతారు.
‘సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్‌
భక్త్యా దీపం ప్రయాచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్‌ ఘోరాత్‌ దివ్యర్యోతి ర్నమోస్తుతే’
‘మూడు వత్తులను తీసుకుని, తైలంలో తడిపి, అగ్నిని జతచేసి శుభప్రదమైన, మూడులోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించి, పరమాత్మకు భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకం నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను’ అని రోజూ దీపానికి నమస్కరిస్తాం. చిన్న దీపం పెట్టి ‘అది నా ఇంటినే కాదు ముల్లోకాల్లోనూ వెలుగు నింపాల’న్నది ఎంత గొప్ప భావన! మరెంతటి ఉదాత్తమైన ఆలోచన! దీపంలో ఉపయోగించిన మూడు వత్తులు ముల్లోకాలకీ, సత్వ రజ తమోగుణాలకూ, త్రిసంధ్యలకూ సంకేతంగా భావిస్తారు. పూజలో చేసే దీపారాధనకే కాదు సంధ్యా దీపానికీ ఉన్నతమైన స్థానాన్ని కల్పించింది హైందవ సంప్రదాయం. లోకానికి వెలుగునీ తేజస్సునీ ప్రసాదించే సూర్యుడు జీవులమీద దయతో వారికి జీవాన్నీ, శక్తినీ ప్రసాదించడానికి తాను అస్తమిస్తూ ఆ తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట. అందుకే సర్వప్రాణులకూ ప్రాణప్రదాత అయిన సూర్యుడి అస్తమయం కంటే ముందుగానే ఇంట్లో సంధ్యా దీపం పెట్టే సంప్రదాయాన్ని ఏర్పరిచారు మన పెద్దలు. తిరిగి సూర్యోదయం వరకూ దీపాన్ని వెలుగుతూ ఉంచడం మన సంస్కృతిలో ఒక భాగమే.


లక్ష్మికి ప్రతిరూపం
దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం
దీపేన హరతే పాపం దీపలక్ష్మీ నమోస్తుతే!
దీపం ముమ్మూర్తులా పరబ్రహ్మ స్వరూపమే. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది. పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని పోగొట్టడం. అంధకారమంటే... కేవలం చీకటి మాత్రమే కాదు. మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే! ఆ చీకట్లను పటాపంచలు చేసి, జ్ఞానాన్ని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి. ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి. అందుకే లోకంలో లక్ష్మీస్థానంగా చెప్పే వాటిల్లో దీపం కూడా ఒకటి. దీపం లక్ష్మీదేవి స్వరూపం ఎలా అయిందన్నదానికీ ఒక కథ ఉంది. పూర్వం ఇంద్రుడు దుర్వాస మహర్షి ఆగ్రహానికి లోనై సకల సంపదలూ కోల్పోతాడు. అప్పుడు దిక్కుతోచక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే ఆయన జ్యోతి రూపంలో లక్ష్మీదేవిని పూజించమని సలహా ఇచ్చాడట. ఇంద్రుడు అలా భక్తితో పూజించి తిరిగి తన సంపదలను పొందాడనీ అప్పటినుంచే లక్ష్మీ దేవి దీపలక్ష్మీదేవి అయిందనీ చెబుతారు. తమిళులు కూడా లక్ష్మీపూజ దీప స్తంభానికే నిర్వహిస్తారు. అమ్మవారి ప్రతిరూపాలు ఉన్న కుందుల్లో మీనాక్షి దీపాలను వెలిగిస్తారు. జ్ఞానసముపార్జనకూ ఊర్ధ్వదృష్టికీ ప్రతీక అయిన దీపానికి మనం నమస్కరిస్తాం, ప్రదక్షిణలు చేస్తాం, పండగలు చేసుకుంటాం. మరో కథనం ప్రకారం... దీపం సకలదేవతలకూ సాక్షీభూతమని చెబుతారు. దీపం వెలిగించే కుంది కింది భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణుమూర్తి, ప్రమిదలో శివుడు, వత్తి వెలుగులో సరస్వతి, వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని ప్రతీతి. అందుకే పూజలో భాగంగా దీపాన్నీ పూజిస్తారు. పూలూ అక్షతలూ జల్లుతారు, నైవేద్యం పెడతారు.

ఏ దేవుడికి ఎలా?
దేవీదేవతలనుబట్టి దీపారాధనను సమర్పించే విధానమూ మారుతూ ఉంటుంది. శివుడికి ఎడమవైపు, విష్ణువుకి కుడివైపు దీపారాధన చేయాలి. ఏ దేవుడికీ ఎదురుగా దీపారాధన చేయకూడదు. అమ్మవారికైతే తెల్లని బియ్యం రాశిగా పోసి, దానిమీద వెండికుందిని పెట్టి దీపారాధన చేస్తే మేధస్సూ, సాత్విక మార్గంలో సంపాదనా పెరుగుతాయంటారు. గుమ్మానికి ఎదురుగా ఉండే తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రావని నమ్ముతారు. శనీశ్వరుడిని పూజించడం మాట అటుంచితే తలచుకోడానికి కూడా చాలా మంది భయపడతారు. అయితే మనలోని జీవశక్తికీ, ఆయుష్షుకూ అధిదేవత శనీశ్వరుడే. అందుకే ఆయనకు అరచేతిలో నల్ల వస్త్రాన్ని తీసుకుని అందులో నల్లనువ్వులు పోసి మూటకట్టి దాన్నే వత్తిగా చేసి దీపారాధన చేయాలి. అలా చేస్తే శనిదోషాలు తొలగిపోతాయంటారు.


కార్తిక దీపం
దీపం మనలోని తమస్సును పోగొడుతుంది. కాబట్టి ‘తమసోమా జ్యోతిర్గమయా!’ అని రుషులు ప్రార్థించారు. అజ్ఞానం పోగొట్టి జ్ఞానదీప్తి కలిగించే ఈ దీపాన్ని కార్తికమాసంలో వెలిగిస్తే విశేష ఫలితాలు ఉంటాయంటారు. కృత్తికా నక్షత్ర ప్రాధాన్యం ఉన్న కార్తిక మాసంఅగ్ని ఆరాధనకు ముఖ్యమైంది. కృత్తిక అంటే అగ్ని. ఆ అగ్నిని యజ్ఞం ద్వారా ఆరాధిస్తాం. ఏ దేవతకైనా హవ్యాలు అగ్ని ద్వారానే సమర్పిస్తాం. ఆ అగ్నికి సూక్ష్మరూపమే దీపం. దీపం జీవగతమైంది. ప్రత్యక్ష దైవాల్లో ఒక్కటైన అగ్నిని దీపరూపంలో ఆరాధించడమంటే పరోక్షంగా ఆ పరబ్రహ్మానికి కృతజ్ఞతలు చెప్పడమేకాదు సమస్త ప్రాణకోటికీ లబ్ధి చేకూర్చడమేనని చెబుతారు.
కీటాఃపతాంగాః మశకాశ్చవృక్షాః జలేస్థలే యే నివసంతి జీవాః
దృష్ట్యా ప్రదీపం నచజన్మ భాగినః భవన్తి త్వం శ్వపచాహి విప్రాః
అంటే... కీటకాలూ పక్షులూ వృక్షాలూ జలచరాలపైన నేను వెలిగించిన దీపపు కాంతి ప్రసరించి వాటికి మోక్షాన్ని ప్రసాదించమని అర్థం. కేవలం నేనూ నా కోసం అనే స్వార్థ చింతనకు తావులేని కార్తిక దీపం వల్ల ప్రకృతిలోని ప్రతిపాణీ తరిస్తుందన్న భావన ఎంత గొప్పదో కదా!
కార్తిక పురాణం ప్రకారం... కార్తిక మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వల్ల సంతానాన్ని పొందాడనీ, వారికి కుమారుడైన శత్రుజిత్తు కార్తిక మాసంలో దీపాన్ని వెలిగించడం వల్ల కైలాసాన్ని చేరుకున్నాడనీచెబుతారు. కార్తిక మాసం మొత్తం రెండు సంధ్యల్లోనూ దీపారాధన చేస్తుంటారు. అయితే ఇందులో సాయం సంధ్యా దీపం మరింత విశిష్టమైంది. సాయంత్ర వేళల్లో శివాలయంలో కానీ, వైష్ణవాలయంలోకానీ దీపాన్ని వెలిగిస్తే మంచిదంటారు. ఆలయ ద్వారం, గోపురం, గర్భగుడిలోÅ, ధ్వజస్తంభం దగ్గర... ఇలా ఎక్కడ దీపాన్ని వెలిగించినా పుణ్యమే. గుడిలో దీపాలను వెలిగించడం కుదరనివారు ఇంట్లో పూజామందిరంలో కానీ, తులసికోట దగ్గర కానీ దీపారాధన చేస్తూ ఉంటారు. వీటితోపాటు రావి, ఉసిరి లాంటి దేవతావృక్షాల కింద, నదీ తీరాల్లో దీపారాధన చేసినా విశేష ఫలితం లభిస్తుందన్నది పెద్దల మాట.

ఒక్కరోజైనా...
కార్తిక మాసమనే కాదు నిత్యం ఆ పరమాత్మకు దీపారాధన చేయడం తప్పనిసరి అంటుంది శాస్త్రం. అలా నిత్యదీపారాధన కుదరకపోతే కార్తికమాసం మొత్తమైనా, అదీ కుదరకపోతే కార్తిక సోమవారాలూ, శుద్ధ ద్వాదశీ, చతుర్దశీ, పౌర్ణమి లాంటి తిథుల్లోనైనా దీపాలను వెలిగించమని చెబుతారు.
ఇది కూడా సాధ్యం కానివారు కనీసం కార్తిక పౌర్ణమి రోజైనా 365 వత్తులు ఉన్న గుత్తి దీపాన్ని వెలిగిస్తే ఏడాది పొడవునా దీపాలు వెలిగించినంత పుణ్యం ప్రాప్తిస్తుందని చెబుతారు.


దీపాలూ రకాలూ
సాధారణంగా దీపాన్ని లేదా దీపారాధనను మూడు రకాలుగా చెబుతారు. ఇంట్లో చేసే నిత్య దీపారాధన, ఆలయాల్లో వెలిగించే అఖండ దీపారాధన, ఏదైనా పనిని ప్రారంభించేముందు నిర్వహించే జ్యోతిప్రజ్వలనం. వీటితోపాటు దీపారాధన చేసే ప్రదేశాన్ని బట్టి కూడా దీపానికి పేరు మారుతుంది. లక్ష్మీదేవి విగ్రహం ముందు వెలిగిస్తే లక్ష్మీదీపం అంటారు. అలాగే నిత్యపూజలో భాగంగా వెలిగించే దాన్ని అర్చనాదీపంగా పేర్కొంటారు. గర్భాలయాల్లోని దీపాన్ని నందాదీపమనీ, తులసికోట దగ్గర చేస్తే బృందావన దీపమనీ చెబుతారు. పారాయణల్లో లేదా ఏదైనా దైవసంబంధ కార్యక్రమాలు చేపట్టినప్పుడు ముందుగా వెలిగించే దీపాన్ని అఖండదీపమంటారు. ఈ దీపం, తలపెట్టిన కార్యక్రమం పూర్తయ్యేవరకూ వెలుగుతూనే ఉంటుంది. ధ్వజస్తంభం మీద వెలిగించే దీపమే ఆకాశదీపం. సాధారణంగా కార్తిక మాసం నెలరోజులూ శివాలయాల్లో దీన్ని తప్పక వెలిగిస్తారు. మరీ చిన్నచిన్న ప్రమిదల్లో ఎక్కువ దీపాలు వెలిగిస్తే నిరంజన దీపావళి అనీ, కార్తిక పౌర్ణమిరోజున తోరణం మాదిరిగా వెలిగించే దీపాన్ని జ్వాలాతోరణమనీ పేర్కొంటారు.


దీప హారతులు
పూజ మొత్తం ముగిసిన తర్వాత మంగళహారతులు ఇవ్వడం పరిపాటి. హారతిని భక్తుడిలోని ఆత్మకు ప్రతీకగా భావిస్తారు. సాధారణంగా కర్పూర హారతినే ఇస్తూ ఉంటారు. అయితే దీపాన్నే హారతిగా సమర్పించే సంప్రదాయమూ కొన్ని కొన్ని దేవాలయాల్లో మనకి కనిపిస్తుంది. దేవుడికి ఎన్ని దీపాలతో హారతి ఇవ్వాలి, అలా ఇచ్చేవాటిని ఏమని పిలుస్తారన్న విషయాలను వేదాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఒకటి నుంచి 251 వరకూ వత్తులతో సమర్పించే ఈ హారతులకూ ఒక్కో పేరు ఉండటం విశేషం. అసలు దీపహారతిని సమర్పించే పళ్లెమే దైవస్వరూపంగా పేర్కొంటారు. ఆ పళ్లెం పై భాగం అగ్నికీ, పిడి భాగం ఈశ్వరుడికీ, అడుగు భాగం ప్రజాపతికీ ప్రతిరూపాలుగా చెబుతారు. ఒకే ఒక దీపంతో ఇచ్చే హారతిని ఏకహారతనీ, రెండు ఉంటే ద్విహారతనీ... వత్తుల సంఖ్యను బట్టీ హారతి పేర్లు కూడా మారిపోతుంటాయి. దీప హారతిని ఇచ్చే పళ్లాలను దీపపు సెమ్మెలు అంటారు. వీటిలో కూడా పాము ఆకృతిలో ఉండే దీపపు సెమ్మెలను నాగదీపమని, రథాకారంలో ఉంటే రథ దీపమనీ, కొండ - మేరు దీపమనీ, కుండ - కుంభదీపం... ఇలా అనేక రకాల దీపపు సెమ్మెలకు అనేక రకాల పేర్లున్నాయి. అలాగే దీపపు సెమ్మెల సంఖ్యను బట్టీ, ఆకారాన్ని బట్టీ ఈ దీపహారతులకు మహేశ్వరుడు, త్రిమూర్తులూ, పంచభూతాలూ, సప్తరుషులు, అష్టమూర్తులూ... మొదలైనవారిని ఆయా దీపాలకు అధిదేవతలుగా పేర్కొన్నారు.


దీప దానం
‘ఏక సర్వదానేని దీపదానం తదేకథః’ అంటే... ప్రపంచంలోని అన్ని దానాల్లో దీపదానమే శ్రేష్ఠమైందని భావం. అందుకే హైందవ సంప్రదాయంలో దీపారాధనకు ఎంత ప్రాముఖ్యాన్ని ఇచ్చారో దీపదానానికీ అంతే విశిష్టమైన స్థానాన్ని కల్పించారు. కార్తికమాసంలో చేసే దీపదానం వల్ల పద్దెనిమిది రకాలైన ఫలితాలు వస్తాయంటారు. జ్యోతిర్లింగాలను సందర్శిస్తే కలిగే ఫలితమే దీపం దానం చేసినా లభిస్తుందన్నది ఆర్యోక్తి. మనలోని అజ్ఞానపు చీకట్లను పోగొట్టడమే కాకుండా జ్ఞానజ్యోతులను పంచే ఈ దీపదానం చేయడానికి క్షీరాబ్ది ఏకాదశి, ద్వాదశి, కార్తిక పౌర్ణమి రోజులు అనుకూలమైనవిగా చెబుతారు. సాధారణంగా ఉసిరి కాయమీద బొడ్డు వత్తి వెలిగించిన దీపాన్ని దానమిస్తారు. దీంతో పాటు వెండి ప్రమిదలో బంగారు వత్తివేసి, దక్షిణతాంబూలాలతో సహా దానమివ్వడం పరిపాటి. మరికొన్ని నోముల్లో వ్రతాల్లో బియ్యం పిండి లేదా గోధుమపిండితో దీపాన్ని తయారుచేసి, దాన్ని ఆవునేతితో నింపి జ్యోతులు వెలిగించి వాటిని ముత్తయిదువులకు దానంగా అందిస్తారు. పూజలైనా దానమైనా ఉన్నది నలుగురితో పంచుకోవడమనే గొప్ప భావన వీటిలో దాగుంది.

* * * * * * * * * *

పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక దీపం. మట్టి ప్రమిద భూతత్వానికీ, తైలం జలతత్వానికీ, వత్తి ఆకాశతత్వానికీ, వెలగడానికి తోడ్పడే గాలి వాయుతత్వానికీ, జ్యోతి అగ్ని తత్వానికీ ప్రతీకలు. మనిషి శరీరమూ పంచభూతాల సమాహారమే కాబట్టి దీపాన్ని వెలిగించడమంటే మనల్ని మనం వెలిగించుకోవడమే. మనలోని అజ్ఞానపు అంధకారాల్ని నశింపజేసే ఆ పరమాత్మకు సమీపంగా వెళ్లడమే. దీపం దానంతట అది ఎలా వెలగలేదో మనిషీ పుట్టుకతో జ్ఞాని కాలేడు. అందుకే దేవుడి ముందు దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో మన ఆత్మదీపాన్ని వెలిగించుకుంటాం. లోలోపలి చీకట్లను వదిలించుకుంటాం. దీపానికి ఉండే మరో ప్రత్యేకత... అది ఎప్పుడూ ఊర్ధ్వదృష్టినే కలిగి ఉండటం. దీపం నుంచి అజ్ఞానమనే చీకట్లను పారదోలడం నేర్చుకున్నట్లే మనస్సును అల్పవిషయాలవైపు మళ్లించకుండా ఊర్ధ్వదృష్టిని కలిగి ఉండటమూ నేర్చుకోవాల్సిన పాఠమే!




ఎన్ని వత్తులు..?దీపారాధన చేసే సమయంలో ఇన్ని వత్తులే వేయాలన్న నియమం ఏదీ స్పష్టంగా లేదు. రెండు వత్తులకు తగ్గకుండా తమ శక్తిమేరకు ఎన్ని వత్తులనైనా వెలిగించుకోవచ్చు. నిత్య దీపారాధన చేసేవాళ్లు సాధారణంగా కుందిలో నాలుగు వత్తులను రెండు వత్తులుగా చేసి రెండు జ్యోతులుగా వెలిగిస్తారు. అయితే చేసే పూజను బట్టీ ఆచరించే నోమును బట్టీ వత్తుల సంఖ్య మారుతూ వస్తుంది. కుంది కాకుండా ప్రమిదలో దీపాన్ని పెట్టాలనుకునేవారు ప్రమిద కింద మరో ప్రమిదను పెట్టి దీపారాధన చేయాలంటారు. ఇలా ఎందుకు చెబుతారంటే - అన్ని భారాల్నీ భరించే భూమాత దీపం వేడిని భరించలేదట. అందుకే వేడి తగలకుండా రెండు ప్రమిదలను ఒకదానిమీద ఒకటి ఉంచి వెలిగిస్తారు. ఆ దీపజ్యోతి ఉత్తర దిశగా ఉండేలా పెడితే సర్వకార్యాల్లోనూ విజయం లభిస్తుందనీ, తూర్పు దిశగా పెడితే ఆరోగ్యమూ, మనశ్శాంతీ లభిస్తాయనీ నమ్మకం.
నిత్యదీపారాధనలో కాకుండా ఏ గుడిలోనో ఏ నదీప్రవాహం దగ్గరో విశేష దీపారాధన చేయాలనుకున్నవారికి వారి జన్మరాశిని బట్టి ఎన్నెన్ని వత్తులు వెలిగించాలో శాస్త్రంలో సుస్పష్టంగా పేర్కొన్నారు.
* మేష, కర్కాటక, ధనుస్సు రాశులు - 3 వత్తులు
* వృషభ, కన్య, కుంభ రాశులు - 4 వత్తులు
* సింహ, వృశ్చిక, మీన రాశులు - 5 వత్తులు
* తులా రాశి - 6 వత్తులు
* మిథున, మకర రాశులు - 7 వత్తులు


-----------------------------------

తమోహరం... సంపత్ప్రదం!

దీపారాధన సనాతన భారతీయ సంస్కృతిలో ప్రధానమైనది. దీపం ప్రాధాన్యాన్ని ఋగ్వేదం ఎంతో గొప్పగా నిర్వచించింది. సృష్టి, స్థితి, లయాలకు దీపంతో సన్నిహితమైన సంబంధం ఉంది. దీపం ప్రజ్వలించినప్పుడు వచ్చే ఆ కాంతిని త్రిమూర్తులకు ప్రతీకగా పూర్వ ఋషులు పేర్కొన్నారు. ఆ కాంతిలో అంతర్లీనంగా కనిపించే నీల వర్ణం స్థితికారుడైన విష్ణువుకు, తెల్ల రంగు లయకారుడైన శివునకు, ఎర్ర రంగు సృష్టికర్త బ్రహ్మకు సంకేతాలుగా అభివర్ణించారు. విద్య, శక్తి, సంపదలను ప్రసాదించే ముగ్గురమ్మలు సరస్వతి, దుర్గ, లక్ష్మి- ఆ కాంతిలో కొలువై ఉంటారని పెద్దలు అంటారు. అందుకే- 

‘‘దీపం పరంజ్యోతి కళాది నమో నమో 

దీప మంగళ జ్యోతి నమో నమో’’ 
‘పరంజ్యోతి అయిన దీపానికి నమస్కారం. శుభాలను ఇచ్చే దీపానికి నమస్కారం’ అని ప్రార్థిస్తాం. 

‘‘వైరాగ్య తైల సంపూర్ణే, భక్తి వర్తి సమన్వితే 
ప్రబోధ పూర్ణపాత్రేతు జ్ఞానదీపం విలోక్యత్‌’’ అన్నారు పూర్వ ఋషులు. అంటే ‘ప్రబోధం’ అనే ప్రమిదలో, ‘వైరాగ్యం’ అనే తైలం పోసి, ‘భక్తి’ అనే వత్తిని వెలిగించి, జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేయాలని అర్థం. ఆ జ్యోతి ప్రసరించే ప్రకాశాన్ని దర్శించి, వారు ముక్తి పొందారు. 

నర(క) స్వభావం నశించి నారాయణత్వం 
దీపావళికి సంబంధించిన కథలు చాలా ఉన్నాయి. ప్రధానంగా నరకుడనే రాక్షసుడిని శ్రీకృష్ణుడు సంహరించగా, లోకాలన్నీ ఆనందంతో పండుగ చేసుకున్నాయనీ, ముల్లోకాలనూ చీకట్లలో నింపిన అసురుని మరణంతో తిరిగి వెలుగులను నింపి చీకట్లను తరిమేయాలనే ఉద్దేశంతో ప్రజలంతా దీపాలను వెలిగించి, కాంతిని నింపారనీ ఒక కథనం. 

నరకుని సంహారాన్ని లోతుగా పరిశీలిస్తే, అతనిలో నరతత్త్వం ప్రధానంగా కనిపిస్తుంది. ప్రాగ్జ్యోతిషపురం అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని అతను పరిపాలించేవాడు. అది నరకుని మనస్తత్త్వానికి దీటైనది. వెలుగు లేనిది. దుర్మార్గాలకు ఆలవాలమైనది. అరిషడ్వర్గాలనూ ఆసరాగా చేసుకొని, స్వార్థచింతనే పరమావధిగా భావించి అతను చేయని అకృత్యం లేదు. ద్వాపరంలో సత్యభామగా అవతరించిన భూదేవి తన కుమారుడి అకృత్యాలను చూడలేక... నరకుడిని వధించాలని తన పతి అయిన శ్రీకృష్ణుడిని కోరింది. నరక సంహారం జరిగింది. 

చీకట్లు తొలగేయి. ప్రాగ్జ్యోతిషపురంలో శ్రీకృష్ణుని కారణంగా ఉదయకాంతులు వెల్లివిరిశాయి. ప్రజలందరూ ఆనంద హేలలో దీపాలను వెలిగించి దీపావళి చేసుకున్నారు. నారాయణుడిని నమ్మితే మనలోని నర(క) స్వభావాలు తొలగి, నారాయణత్వం సిద్ధిస్తుంది. దేహభావం నరకుడైతే, ఆత్మభావన నారాయణుడు. శరీరం తాను కాదనీ, అందులో ఉన్న క్షేత్రజ్ఞుడు (ఆత్మ) తాననీ తెలుసుకున్నప్పుడు పొందే అనుభూతే నరక సంహారం. ఇలా దీప ప్రజ్వలనాన్ని ప్రపంచంలో దాదాపు అన్ని మతాలవారూ సంప్రదాయబద్ధంగా ఆచరిస్తారు. సనాతన భారతీయ సంస్కృతికి సంకేతంగా నిలిచిన దీపారాధన- దీపావళి పర్వంగా ప్రాచుర్యం పొందింది. 

లక్ష్మి స్థిరంగా ఉండేది అక్కడే! 
ముక్తిని ప్రసాదించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మకు సంకేతం జ్యోతి. ‘పరమాత్మే పరంజ్యోతి’ అని వేదం అంటోంది. పరమాత్మ యజ్ఞ స్వరూపుడు. యజ్ఞ చిహ్నాన్ని దీపంగా భావిస్తారు. జ్యోతి లేదా దీప ప్రజ్వలన అంటే యజ్ఞం చేయడమే! దీపావళి రోజున దీపాలను ప్రజ్వలింపజేసి, జగన్మాతకు ధారపోసి, భక్తి ప్రపత్తులను సమర్పించుకోవడమే దీపయజ్ఞం. ఆ దీపాలను ఇంటి ముంగిట, దైవీ వృక్షాల చెంత, ఇంటిలోని ద్వారాల దగ్గర వరుసలుగా పేర్చడం దీపయజ్ఞంలో భాగమే. దీప దర్శనం పాపాలను హరిస్తుంది. దీపకాంతి దేవతలకు అత్యంత ప్రీతికరం. అందుకనే ప్రతి పూజారంభానికీ, శుభకార్యాలకూ దీప ప్రజ్వలనం ముఖ్యం. లౌకికంగా చెప్పాలంటే, మన ‘హృదయా’న్ని ప్రమిదగా భావించి, అందులో ‘భకి’్త అనే తైలం పోసి, ‘ప్రేమ’ అనే వత్తి నిలిపి వెలిగించేదే దీపం. 

కళ్ళలో కనిపించే వెలుగు దాని కాంతి. జ్ఞానాన్ని దీపకాంతిగా, అజ్ఞానాన్ని చీకటిగా సంభావించారు. దీపకాంతి బాహ్యంలో చీకట్లను తొలగించడమే కాక, ఆంతర్యంలో ఆధ్యాత్మికతకు బీజం వేస్తుంది. కాబట్టి ప్రతి ఇంటా ఉభయ సంధ్యలలో దీపాలు వెలిగించాలి. దీపకాంతులు విరజిమ్మే ఇంటిలో లక్ష్మిసుస్థిరంగా ఉంటుందనీ, ఆ ఇంట సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయనీ, అశుభాలకు తావు ఉండదనీ శాస్త్రాలు అంటున్నాయి. యజ్ఞరూపమైన దీపారాధనకూ, లక్ష్మీ కృప పొందేందుకూ దీపావళి దోహదకారి అయిన పర్వం. ప్రతి ఇంటి ముంగిట దీపావళి రోజున దీపాల వరుసలు ప్రసరించే వెలుగులు అమవస నిశిని పున్నమి వెన్నెలతో నింపుతాయి. ఎటు చూసినా ఆనంద హేల. ప్రతి ఒక్కరిలో సంతోషాల సంరంభం. 

మన పురాణాల్లో... కావ్యాల్లో... 
దీపావళి పర్వాన్ని గురించి పురాణేతిహాసాలు విస్తృతంగా ప్రస్తావించాయి. రామాయణంలో రఘుకులాన్వయదీపునిగా రాముణ్ణి కీర్తిస్తూ, వనవాసానంతరం సీతారాముల పట్టాభిషేక సమయంలో అయోధ్యలో ప్రజలు దీపోత్సవం జరుపుకొన్నారట. కురుక్షేత్ర సంగ్రామానంతరం ధర్మరాజు విజయుడై పట్టాభిషేకం చేసుకున్న సందర్భంలో హస్తినాపుర ప్రజలు ఆనందోత్సాహాలతో దీపాలను వెలిగించి పండగ చేసుకున్నారని మహాభారతం చెబుతోంది. నచికేతుడు తన మేధస్సుతో యముడిని సంతృప్తిపరచి, ఆత్మను గురించి తెలుసుకున్నాడు. యముడి నుంచి స్వేచ్ఛ పొంది, నచికేతుడు తిరిగి భూలోకానికి వచ్చిన సందర్భంలో జరిగిన దీపోత్సవమే దీపావళి అని ‘కఠోపనిషత్తు’ కథనం. క్షీరసాగర మథన సమయంలో అవతరించిన శ్రీమహాలక్ష్మికి దీపాలను వెలిగించి దేవతలు స్వాగతం పలికారని ‘పద్మపురాణం’ పేర్కొంటోంది. దుష్ట దనుజులను దునుమాడిన మహాకాళిని జ్యోతిగా, లక్ష్మీస్వరూపంగా ఆరాధించినట్టు కాళికాపురాణం చెబుతోంది. 

దుర్వాస ముని శాపంతో ఇంద్ర పదవిని దేవరాజు కోల్పోయి, శ్రీ మహావిష్ణువును శరణు వేడాడనీ, ‘లక్ష్మీ జపధ్యానాలు చేస్తే, తిరిగి నీ పదవి నీకు దక్కుతుంద’ని విష్ణుమూర్తి చెప్పాడనీ, ఆ ప్రకారం లక్ష్మీదేవి కోసం అతను తపస్సు చేసి, ఇంద్రపదవిని తిరిగి పొందాడనీ ఒక కథ ఉంది. దీపావళిని ‘దీపాన్విక’గా భవిష్య, నారద పురాణాలు పేర్కొన్నాయి. స్కాంద పురాణంలో దీపావళి గురించిన వివరణ విస్తారంగా ఉంది. నారద పురాణం దీన్ని ‘దీప దాన మహోత్సవం’ అని చెప్పింది. ముద్రారాక్షస గ్రంథం ‘శారదోత్సవం’గా, నాగానందం గ్రంథంలో ‘దీప ప్రతిపాదనోత్సవం’గా దీపావళిని పేర్కొన్నారు.సంస్కృత కావ్యాల్లోనే కాదు, పాళీ భాషలో కూడా దీపావళి మహోత్సవ ప్రస్తావన ఉంది. కేవలం హిందువులేకాదు, జైన, బౌద్ధ మతానుయాయులు కూడా దీపావళి పండుగను పాటిస్తారు. క్రైస్తవ, మహమ్మదీయ మతస్థులు వారివారి ఆచార సంప్రదాయాలను అనుసరించి దీపాలను వెలిగించడం కద్దు.  -ఎ. సీతారామారావు
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment