పురాణపండ భారతం | Puranapanda Bharathammahabharatham, mahabharatham telugu, mahabharatam telugu lo, mahabharata, putana mahabharata, mahabharatham images, BhaktiBooks, Bhakti Pustakalu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

పురాణపండ భారతం 
 Puranapanda Bharatham 
Rs 108/-


     వ్యాసుడు మహాభారతాన్ని రచించడానికి సంకల్పించిన తరువాత దాన్ని లిఖించే సమర్థుడెవరన్న సందేహం కలిగింది. కాసేపు కన్నులు మూసుకుని దేవతలందరినీ తలచుకుంటూ పోతున్నాడు వ్యాసుడు. ఈ క్రమంలో ఓం ప్రథమంగానే పార్వతీ తనయుడైన గణపతి రూపం మదిలో మెదిలింది. తన కావ్య రచనకు సమర్థుడు వినాయకుడే అని అవగతమైంది, ఆయనను ప్రార్థించాడు.

     వెను వెంటనే గణపతి ఘంటం పట్టుకుని ప్రత్యక్షమైనాడు. ‘ధన్యోస్మి వినాయకా’ అని వేదవ్యాసుడు నమస్కరించగా, ‘‘వేదపారాయణా మీకు నమస్సులు’’ అని గణపతి ప్రతి నమస్కారం చేశాడు. మహాభారతాన్ని తాను చెబుతుంటే, గణపతి లిఖిస్తే బాగుంటుందన్న తన అభిలాషను వ్యక్తం చేశాడు వ్యాసుడు. గణపతి అందుకు ఆనందంగా అంగీకరిస్తూనే, ‘‘నేను సంతోషంగా రాస్తాను కానీ, వ్యాసమహర్షీ., నాదొక విన్నపం..’’ అన్నాడు వినాయకుడు. ఏమిటన్నాడు వ్యాసుడు. ‘‘నా ఘంటం ఆరంభించిన తరువాత ఆగదు, ఆగితే నేను వెళ్లిపోతాను’’ అని చెప్పాడు వినాయకుడు. పెద్ద చిక్కే వచ్చిపడిందే.. అని వ్యాసుడనుకుని ‘‘అయితే నా విన్నపం కూడా ఒకటుంది వినాయకా... నేను చెప్పిన శ్లోకం వెంట వెంటనే లిఖిస్తే సరిపోదు. ఒక్కొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్న తరువాతనే రాయాలి సుమా..’’ అన్నాడు.అమ్మో ఈ వ్యాసుడు సామాన్యుడు కాడు. సరే ననక తప్పదు అనుకుని, ‘నాకూ మంచిదే ఆ మహాగ్రం«థమెన మహాభారతాన్ని అర్థం చేసుకుని లిఖించే అవకాశం దక్కింది’ అని సరిపెట్టుకున్నాడు గణపతి. ఇద్దరూ విజ్ఞాన ఘనులే. లక్షశ్లోకాల మహాభారత రచన ఒక నదీ ప్రవాహంలా నిరాటంకంగా, నిరంతరాయంగా సాగిపోతోంది. వ్యాసుడు చెప్పిన ప్రతి శ్లోకాన్నీ వినాయకుడు అర్థం చేసుకుంటూ తల పంకిస్తూ, ఆ మహాకావ్య అద్భుత కవితా సౌందర్యాన్ని, కథా వైభవాన్ని, కథన సోయగాన్ని ఆస్వాదిస్తూ, ప్రశంసిస్తూ ఆనందిస్తూ దానిని గ్రంథస్థం చేసుకుంటూ పోతున్నాడు. తదుపరి శ్లోక రచనకు తనకు ఇంకాస్త సమయం కావాలనుకున్నప్పుడు వ్యాసుడు ఒక కఠినమైన శ్లోకం చెప్పేవాడు. ఆ శ్లోకాన్ని విశ్లేషిస్తూ గణపతి కాస్త నెమ్మదించినపుడు తరువాత శ్లోకాన్ని మనసులో అల్లుకుంటూ ఉండేవాడు వ్యాసుడు. ఆ విధంగా ఇద్దరూ ఒకరి వైదుష్యానికి మరొకరు భంగం కలిగించకుండా తమ పని తాము చేసుకుంటూ పోయారు ఒకరికొకరు ఏమీ తీసిపోకుండా. అందుకే దేనికైనా సమఉజ్జీలు ఉండాలంటారు.  – డి.వి.ఆర్‌.
-----------------
    ‘వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి’ అని సామెత. భారతేతిహాసానికి ఉన్న గొప్పతనం అది. ‘భారతం ఏమిచ్చింది?’ అని ప్రశ్నిస్తే- ‘భారతం ఏమివ్వలేదు?’ అని ప్రశ్నించడమే గొప్ప సమాధానం! మానవ జీవనానికి కావలసిన అన్ని విషయాలనూ భారతం ఇచ్చింది. అందుకే భారతాన్ని గురించి మహర్షులు ‘ఇందులో లేనిది లోకంలో లేదు. లోకంలో ఉన్నవన్నీ ఇందులో ఉన్నాయి’ అని ప్రశంసించారు. నిజమే. భారతంలో లేని మానవధర్మం లేదు. మనిషి పుట్టినప్పటి నుంచి మహాప్రస్థానం దాకా ఎలా మసలుకోవాలో సోదాహరణంగా చెప్పిన జీవనేతిహాసం భారతం.

భారతానికి రత్నహారం లాంటిది భగవద్గీత. భగవద్గీతలో నరనారాయణులైన అర్జున శ్రీకృష్ణుల సంవాదాలు అష్టాదశాధ్యాయాలుగా విస్తరించి ఉన్నాయి. మానవ సంబంధమైన అనేక బలహీనతలు అర్జునుడి మాటల్లో వ్యక్తమయ్యాయి. వాటికి సత్వర పరిష్కారాలు శ్రీకృష్ణుడి సమాధానాల రూపంలో బహిర్గతమయ్యాయి. 
కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఆయుధం చేజారి దిక్కుతోచక డీలాపడిన అర్జునుణ్ని కర్తవ్యోపదేశంతో ముందుకు నడిపించాడు శ్రీకృష్ణుడు. పుట్టడం, బతకడం, చావడం కాలానుగుణంగా జరిగే పరిణామాలేగాని, అది ఎవరి వల్లా ఆపడం సాధ్యంకాదని వివరంగా చెప్పి అర్జునుడి మనసులో చెలరేగిన డోలాయమాన స్థితిని తొలగించిన మార్గదర్శకుడు శ్రీకృష్ణుడు. 
మహాభారత యుద్ధం ముగిసింది. పాండవులకు విజయశ్రీ లభించింది. ధర్మరాజ్యం సుస్థిరమైంది. అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన గీతోపదేశం మాటి మాటికీ గుర్తుకు వస్తోంది. ఎంత తెలుసుకున్నా ఇంకెన్నో సందేహాలు పీడిస్తున్నాయి. జీవన పరమార్థం ఏమిటో ఇంకా తెలియడం లేదు. శోకంలేని అశోక స్థితికోసం, దుఃఖం రాని బాధా నివృత్తికోసం, ప్రత్యక్షానికి అతీతమైన మానసికానందం కోసం అన్వేషణ- అర్జునుణ్ని తొలిచివేస్తోంది. ఏం చేయాలి? 


అర్జునుడు శ్రీకృష్ణుడి సన్నిధికి పయనమయ్యాడు. పాదాలపై మోకరిల్లాడు. తన మనసు ఇంకా సంశయశంసలోనే కొట్టుమిట్టాడుతోందని, తన సందేహాలకు జ్ఞానోపదేశం చేసి మనోవ్యాకులతను దూరం చేయాలని వేడుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడికి అర్థమైంది- అర్జునుడు ఆధ్యాత్మికమైన అశాంతితో రగిలిపోతున్నాడని... ఆత్మానందాన్ని కాంక్షిస్తున్నాడని! వెంటనే మళ్ళీ గీతాచార్యుడైపోయాడు. ఉత్తరగీతారూపంలో మరో చిన్న భగవద్గీతను ఉపదేశించాడు-

‘అర్జునా! నీ మనోగతాన్ని గ్రహించాను. నీ మనసు ఆత్మలో లీనంకానిదే నీకు శాంతి లభించదు. ఆత్మలో మనసు లీనం కావడమే ‘లయ’ అంటారు. అది సర్వశ్రేష్ఠమైంది. కోటిపూజలకంటే ఒక స్తోత్రం గొప్పది. కోటి స్తోత్రాల కంటే ఒక నామజపం గొప్పది. కోటినామ జపాల కంటే ఒక ధ్యానం గొప్పది. కోటి ధ్యానాల కంటే ఒక ఆత్మలయ గొప్పది. కనుక నీవు శాశ్వతానందదాయకమైన ఆత్మలో మనసును లీనం చేయడానికి పూనుకో. బాహ్య విషయాలను వదిలేసి, నిరంతర ధ్యానంతో మనసును ఏకాగ్రం చేసి, ఆత్మలయాన్ని సాధించు. అప్పుడు నీకు ఈ ప్రపంచంలో ఎక్కడా అశాంతి కనబడదు’ అని తేనెలొలికే మాటలతోఅర్జునుణ్నిప్రశాంతచిత్తుణ్ని చేశాడు. 
ప్రతి మానవుడూ అర్జునుడి వంటివాడే. ఎన్నిసార్లు గురువులు, పెద్దలు కర్తవ్యోపదేశాలు చేసినా, వాటిని మరచిపోతాడు. మళ్ళీ మళ్ళీ అశాంతిలోకి జారుకొంటాడు. మానవ స్వభావాలను దివ్యదృష్టితో గ్రహించిన వేదవ్యాసుడు అశాంతితో కూడిన అల్లకల్లోల మనస్కులైన మనుషుల్ని సరైన మార్గంలో నడపడానికే భారత రచనకు పూనుకొన్నాడు. భారతంలోని అశ్వమేధ పర్వంలోని ఎన్నో అనుగీతలలో చేరినదే ఈ ఉత్తరగీత. మానవజన్మను ఉద్ధరించడానికి ఇలాంటి ఘట్టాలెన్నో ఈ మహేతిహాసంలో నిక్షిప్తమయ్యాయి. ఇవన్నీ వారసత్వంగా లభించిన సారస్వత నిధులు. వీటిని మననం చేసుకుంటూ, అశాంతిని దూరం చేసుకొని, ప్రశాంత చిత్తంతో జీవితాన్ని ఒక మధుర ఫలంగా అనుభవించడమే ఈ ఇతిహాసాల లక్ష్యం!
- డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

-------------

పురాణపండ భారతం | Puranapanda Bharathammahabharatham, mahabharatham telugu, mahabharatam telugu lo, mahabharata, putana mahabharata, mahabharatham images, BhaktiBooks, Bhakti Pustakalu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

కష్టాలే గీటురాళ్లు 

     ఏ వ్యక్తి జీవితమూ పూర్తిగా పూలపాన్పు కాదు, పూర్తిగా ముళ్ల బాటా కాదు. సుఖదుఃఖాలు వెంటవెంటే ఉంటాయి. సాధారణ వ్యక్తులు కష్టాలన్నీ తమనే చుట్టుముట్టాయని, మిగిలిన అందరూ బాగున్నారని వాపోతారు. దేవుడనేవాడు ఉంటే ఇన్ని కష్టాలెందుకని దైవనింద చేస్తుంటారు. తమ కష్టాలు కన్నీళ్లను తోటివారితో పంచుకుంటూ, పదేపదే తలచుకుంటూ, బాధను పెంచుకుంటూ, ఏ పనీ చేయకుండా ఉండిపోతారు. 

కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. ఒక్కోసారి అనుకున్న పనులు వేగంగా జరిగిపోతుంటాయి. మరోసారి పరిస్థితులు ఎదురు తిరుగుతాయి. విజ్ఞులైనవారు ఆ సమయంలో విషయ పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటూ, తగిన అవకాశాల కోసం ఎదురుచూస్తారు. వ్యక్తులు సంతోషం, సంతృప్తులతో ఉన్నప్పుడు వెంటనే ఏదో బాధో, సమస్యో, కష్టమో వారిని ఆశ్రయిస్తుంది. ఇది విధి విలాసం. పురాణ పాత్రలకైనా, లౌకిక వ్యక్తులకైనా తరతమ భేదాల్లేకుండా వర్తించే అంశమిది. 
శ్రీకృష్ణుడి కోరికపై మయుడు అద్భుతమైన సభా భవనం నిర్మించి ధర్మజుడికి కానుకగా ఇస్తాడు. రాజసూయం చేయాల్సిందిగా నారదుడు సలహా ఇస్తే, శ్రీకృష్ణుడు ఆశీస్సులందిస్తాడు. రాజసూయం నిర్విఘ్నంగా పరిసమాప్తమవుతుంది. తోటివారి సంతోషం, వైభవాలను చూసి సహించలేని అసూయాగ్రస్తులు పక్కనే ఉంటారు. ఇది లోకసహజం. అందరికీ ఆనందాన్ని కలిగించిన రాజసూయం, దుర్యోధనుడిలో అసూయ రగిలించింది. పాండవ లక్ష్మిని సహించలేకపోయాడు. శకుని, ఆ సంపదనంతా మాయాద్యూతంలో పొంది దుర్యోధనుడికి ఇస్తానంటాడు. దుర్యోధనుడు, తండ్రి ధృతరాష్ట్రుని అందుకు అంగీకరించమంటాడు. లేకపోతే ఆత్మాహుతి చేసుకుంటానని బెదిరిస్తాడు. పుత్రప్రేమతో ధృతరాష్ట్రుడు విచిత్ర మణిమయ సభను హస్తినలో నిర్మింపజేసి పాండవులను పిలిపిస్తాడు. విధి ప్రేరితుడై ధర్మరాజు జూదానికి అంగీకరిస్తాడు. రాజసూయంతో పొందిన సంతోషం ఎక్కువకాలం నిలవకుండానే జూదంలో ఓడిపోవడం, అరణ్యవాసం, అజ్ఞాతవాసం ప్రాప్తిస్తాయి. సంతోషం వెంట దుఃఖం అంటే ఇదే! 
ఆపదలే శీలానికి వన్నె తెచ్చే సదవకాశాలు. అగ్నిలో పడితేనే బంగారం వన్నెతేరి ప్రకాశిస్తుంది. కష్టాలను అనుభవించడం వల్లే కొందరు వ్యక్తులు చిరస్మరణీయ మహిమ పొంది మహనీయులయ్యారు. జీవితంలో ఒత్తిడిని అనుకూలంగా మలచుకుని శ్రమించేవారే మనీషులవుతారు. 

మహాభారతంలో వనపర్వం ఓ విజ్ఞాన పర్వం. దైవం అనుకూలించనప్పుడు, రాబోయే మంచిరోజుల కోసం ఎదురుచూస్తూ మనుషులు భౌతిక, మానసిక శక్తుల్ని ఎలా పెంపొందించుకోవాలో ఇది బోధిస్తుంది. 

ధర్మరాజు మహర్షుల సూచన మేరకు తీర్థయాత్రలు చేశాడు. పుణ్యక్షేత్రాలు దర్శించాడు. ఆయా ప్రాంత విశేషాలను తెలుసుకున్నాడు. పుణ్యసముపార్జన చేశాడు. ఏయే క్షేత్రాలను దర్శిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకున్నాడు. నిరంతర విద్యార్థిగా మసిలాడు. 
అర్జునుడైతే శివుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందాడు. ఇంద్రుడిచే అర్ధ సింహాసన గౌరవం పొంది, ఊర్వశి శాపాన్ని అజ్ఞాతవాస సమయానికి అనుకూలంగా మలచుకున్నాడు. పాండవులు భవిష్యత్తులో జరగబోయే సంగ్రామానికి కావలసిన శక్తి సామర్థ్యాలను, వనరులను సంపాదించుకున్నారు. 

తమలా అరణ్యాల్లో బాధలు పడ్డవారున్నారా అని ధర్మరాజు అడిగినప్పుడు, బృహదశ్వుడనే ముని నల మహారాజు పడిన బాధలు వివరిస్తాడు. ధర్మరాజుకు అరణ్యవాసంలో ద్రౌపది, తమ్ములు తోడున్నారని, విజ్ఞాన విషయాలను చెప్పడానికి మునులు ఉన్నారని చెప్పి ఊరట కలిగించాడు. 

బాధల విలువ తెలుసుకుంటూ మనిషి ఎదగాలి. సమస్యలు వచ్చినప్పుడు తట్టుకుని మనోబలంతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి. ఎవరికైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా వారి మనోబలమే తోడు. అరణ్యపర్వం ఇదే చెబుతుంది.  - చెంగల్వ బొడ్డపాటి రామలక్ష్మి
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment