దైవారాధన 
 Daivaradhana 
Rs 108/-

అంతటా అన్నీ ఆయనే... 

అంతరంగం(మనసు)లో ఉండి జ్ఞాన-కర్మ ఇంద్రియాల ప్రవర్తనా సరళిని నియంత్రించే శక్తిని అంతర్యామి అంటారు. అంతటా నిండి ఉండి సృష్టి ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా లోకానికి ఆధారభూతమైన స్వరూపం అదేనని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. 

భాగవతం ఆ మూర్తిస్వరూపాన్ని ‘ఏకాకృతి’ అని వర్ణించింది. దాని కథనం ప్రకారం- ‘సృష్టికి ముందు ఈ విశ్వమంతా సూక్ష్మచేతనా రూపమై ఆ ఏకాకృతిలో నిక్షిప్తమై ఉంది. సృష్టి వ్యాపించి ఉన్నప్పుడు అదే అందరికీ ఆధారభూతమై ఉంది. సృష్టి పరిసమాప్తి పొందగానే లోకాలు, లోకులు, లోకపాలకులు (సమస్త సృష్టీ) దానిలోనే లయమైపోతాయి. ఇలా అన్ని స్థితుల్లోనూ ఉనికి కలిగిఉన్న ఆ స్వరూపమే ఏకాకృతి. సృష్టి రహితమై లోకం ఖాళీగా ఉన్నప్పుడు అంతటా పెనుచీకటి ఆవరించుకున్న వేళ, ఆ చీకటికి వెనక ప్రకాశవంతమైన సూక్ష్మరూపంతో వెలుగులీనుతూ స్థిరమై ఆ పరమాత్మ నిలకడగా ఉంటాడు. ఆ వెలుగే సృష్టికి మూలమని భాగవతం చెబుతోంది. 

ఒక దీపం అనేక దీపాలకు మూలమైతే, మొదటి దీపం రూపం ఏమాత్రం మారదు. వెలుగు ఇసుమంతైనా తగ్గదు. పైగా దాని ఆధారంతో వెలిగిన దీపాల సంఖ్య పెరిగేకొద్దీ అంతకంతకూ కాంతి అధికమవుతుంది. అలాగే, ఏకాత్మ రూపుడైన ఆ పరమాత్మ జీవులందరిలోనూ అనేక ఆత్మరూపులుగా మారి, తద్వారా తానే ఈ లోకమంతా నిండి ఉంటాడు. అంటే- ‘ఆయనే అనేక రూపాలుగా అవతరించాడు’ అని స్పష్టమవుతుంది. ‘సర్వము తానైనవాడు’ అనే పోతన ప్రయోగానికి అర్థం అదే. 

అంతా తానే కాబట్టి రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు. శరీరంలో ఏ ఒక్క భాగం దెబ్బతిన్నా శరీరమంతా బాధకు లోనైనట్లు, కుటుంబంలో ఏ ఒక్కరికి ఏమి జరిగినా యజమాని బాధ్యత వహించినట్లు- సృష్టిలో ఏ ఒక్కరికి ఏమి జరిగినా ఆ బాధ, బాధ్యత ఆయనవే. అందుకే దుష్టశిక్షణలో భాగంగా రాక్షస సంహారం చేసినా, భక్తి-ప్రేమ-అనురాగాలతో ఆయన అండ కోరినవారిని ముక్తి పేరుతో రూపరహితులుగా చేసినా అందరినీ ఐక్యం చేసుకునేది తనలోనే. అందరికీ ప్రసాదించేది మోక్షాన్నే. (అందుకే రాక్షసులు సైతం ఆయన చేతిలోనే మరణం కోరుకుంటారు.) ఆయన చర్యలు అర్థంకాక ఒకసారి వివరణ అడిగినవారికి శ్రీకృష్ణుడు- ‘ఈ సృష్టిలో ఉన్న చరాచరాలన్నీ తన ఆత్మజ్యోతి స్వరూపమే’ అని సమాధానం చెప్పాడు. జ్యోతిస్వరూపమై జీవులను తనలో ఐక్యం చేసుకుంటాడు కాబట్టి పరంజ్యోతి అని, ఆత్మలన్నింటికీ ఆధారభూతమైనవాడు కాబట్టి పరమాత్మ అని పిలుస్తారు. 

సాధారణంగా కొంత పరిమాణంగల పదార్థానికి మరికొంత పరిమాణం గల పదార్థం కలిస్తే దాని పరిమాణం పెరుగుతుంది. ఇది అల్పమైనవాటి విషయంలో మాత్రమే జరుగుతుంది. కానీ భూమి, ఆకాశం, సముద్రం, అగ్ని... వంటి అధిక పరిమాణం కలవాటి విషయంలో ఇలా జరగదు. ఎందుకంటే సృష్టిలోని అన్ని వస్తువులూ వాటి నుంచి రూపాంతరం చెందినవే కాబట్టి. అలాంటి పంచభూతాలకు నియామకుడు, నియంత్రకుడూ ఆ పరమాత్మే. అన్నీ, అంతా ఆయన నుంచి పుట్టి ఆయనలో కలిసిపోయేవే. కాబట్టి ‘మూలకారణుడు’ అనే పదాన్ని వాడాడు పోతన. 
భాగవతం దీన్ని అంతగా వివరించడంలో ఆంతర్యం ఉంది. అది ఏమిటంటే- ‘నీలో, నాలో, మనందరిలో ఉండేది ఒక్కరే, ఒక్కటే’ అని. ఆ దైవీశక్తి రూపమే లోకులంతా. కాబట్టి ఆ ఏకాత్మరూపానికి ప్రతిరూపమైన ప్రతివారూ ఆ లక్షణాలనే కలిగి ఉండాలని ఉద్బోధిస్తున్నది భాగవతం!  - అయ్యగారి శ్రీనివాసరావు
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment