శ్రీ సువర్చలాహనుమద్దీక్ష | Sri Suvarchala Hanumadeeksha | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

శ్రీ సువర్చలాహనుమద్దీక్ష 
 Sri Suvarchala Hanumadeeksha
Rs 25/-
        
హనుమాన్‌ దీక్ష స్వీకరించిన దీక్ష పరులు ఉదయం నాలుగు గంటలకు లేచి సంధ్యవేళ ప్రార్థన చేసుకొని పండ్లు పాలతో అల్పహారం తీసుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటలకు బిక్ష చేస్తారు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత రాత్రి పూట పూజ నిర్వహిస్తారు. అనంతరం దీక్ష స్వాములు వారి వారి ఇండ్లలో పిఠ పూజను ఏర్పాటు చేసుకొని భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. దీక్ష స్వీకరించిన స్వాములు అందరు కలిసి హనుమాన్‌ మందిరంలో సన్నిదానం ఏర్పాటు చేసుకొని కలశంపెట్టి 41 రోజులు కఠినమైన పూజలు నిర్వహిస్తారు. దీక్ష విరమణ అయినంత వరకు కలశంలోని కొబ్బరిని తీసుకొని గుమ్మానికి కడతారు. పీఠం మీద ఉన్న బియ్యాన్ని వండుకొని బిక్ష చేస్తారు. 


   
      హనుమాన్‌ స్వాములు భక్తితో ప్రార్థన, పీఠానికి హరితి, సన్నిదానంలో నిద్రించుట, ప్రతి నిత్యం మందిర దర్శనం, మాటిమాటికి ‘జైహనుమాన్‌ జీ’, 'జై శ్రీరాం' , అని పలుకరించి రామనామ స్మర ణం చేయటం ద్వార ప్రతీ ఇంట్లో సుఖ శాంతులు ఏర్పడడం చెప్పుకొదగ్గ విషయం. హనుమాన్‌ దీక్షలో చాల కఠినమైన నిబంధనలు ఉండడంతో ఒక్కసారి దీక్షను స్వీకరించిన స్వాముల్లో తప్పకుండా మార్పు వస్తుంది. ఆ మార్పే నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. ఈ విధంగా దీక్ష స్వీకరించిన స్వాముల్లో అధిక శాతం యువకులు ఉండడంతో వారిలో మార్పు రావడం ఎంతగానో దోహదపడుతుంది.

--------------------------------------------
పవనసుతుడి హృదయం


పవన తనయుడి హృదయం రామచరిత మానసం. అది రామ భక్తితో నిండిపోయింది. ఎక్కడ రామ సంకీర్తనం జరుగుతుందో అక్కడ తాను ఆనంద పారవశ్యంలో అంజలి ఘటించి నిలుస్తానన్నాడు హనుమంతుడు. ఎక్కడ రామ, హనుమత్‌ సంకీర్తనలు కొనసాగుతాయో అక్కడ తాను ఆనందాశ్రుపూర్ణవదనంతో నిలుస్తానన్నాడు తులసీదాసు.

హనుమను ఆరాధించే భక్తకోటికి ‘హనుమాన్‌ చాలీసా’ కంఠస్థమై ఉంటుందంటే అతిశయోక్తి కాదు. హనుమాన్‌ చాలీసా ఆవిర్భవించడానికి వెనక ఒక ఐతిహ్యం ఉంది. తులసీదాసు తీర్థయాత్రలు చేస్తూ ఒకనాడు చంద్రభాగానదీ తీరంలో విఠలనాథుణ్ని ధ్యానిస్తున్నాడు. అదే సమయంలో ఒక అంధుడు ఆత్మహత్య చేసుకొనేందుకు నదిలోకి దూకబోతూ ధ్యానంలో ఉన్న తులసీదాసును పాదాలతో తాకాడు. వెంటనే తులసీదాసు అతణ్ని పట్టుకొని, పైకి లేవదీసి, ‘నన్ను క్షమించు నాయనా!’ అన్నాడు. ఆ మాటలకు పరవశుడైన అంధుడు విలపిస్తుండగా, ‘నాయనా! అటు చూడు’ అంటూ తులసీదాసు ఆయనకు మార్గం చూపాడు. వెంటనే అతడికి గుడ్డితనం పోయింది. అప్పుడతడు తాను ఆత్మహత్యకు పూనుకోనని, దైవాన్ని ధ్యానిస్తూ గడుపుతానని తులసీదాసుకు మాట ఇచ్చి వెళ్లిపోయాడు.

ఈ వృత్తాంతాన్ని తెలుసుకున్న రాజు ఆశ్చర్యచకితుడై తులసీదాసును తన ఆస్థానానికి తెమ్మని భటులను పంపాడు. కానీ తులసీదాసు ‘నేను ఏ ప్రభువులనూ ఆశ్రయించను. నేను రాముడికి, హనుమంతుడికి తప్ప ఎవరికీ తలవంచను’ అని నిష్కర్షగా చెప్పి పంపివేశాడు. ప్రభువుకు ఆగ్రహం కలిగి అతణ్ని ఈడ్చుకొని రమ్మని మళ్ళీ భటులను ఆదేశించాడు. వారు వెళ్లి తులసీదాసును పట్టుకోబోగా, వందలాది కోతులు ప్రత్యక్షమై ఆ భటులను తరిమికొట్టాయి. ఇది విన్న ప్రభువు, తప్పు తెలుసుకుని, తానే స్వయంగా వెళ్ళి తులసీదాసు పాదాలపై పడి క్షమాపణ వేడుకొన్నాడు. అప్పుడు తులసీదాసు హనుమంతుడి వైభవాన్ని కొనియాడుతూ ‘హనుమాన్‌ చాలీసా’ను ఆశువుగా కీర్తించి, గానం చేశాడు.

మానవశరీరం బుద్ధిహీనతవల్ల ఏర్పడిందని, దాన్ని పవిత్రంగా మార్చుకోవడానికి కావలసిన బుద్ధిబలం హనుమంతుడి స్మరణ వల్లనే లభిస్తుందంటాడు తులసీదాసు. బుద్ధి కుశలత, అపార బలం, చిరకీర్తి, కొండంత ధైర్యం, మృత్యువుకు సైతం భయపడని నిర్భయత్వం, ఏ రోగాలూ దరిజేరకపోవడం హనుమత్‌ స్మరణవల్లనే సాధ్యమని నిరూపించాడు ఈ మహాయోగిపుంగవుడు. హనుమంతుడిది వజ్రంలాంటి దేహం. అలాంటి దేహం కావాలంటే హనుమదుపాసన ఒకటే మార్గం. తూర్పు, పడమటి కొండలపై కాలుమోపి, ఒకే దినంలో సూర్యుడి నుంచి సమస్త విద్యలనూ నేర్చుకొన్న ఆ పవనాత్ముజుడి దీక్ష లోకానికి శ్రీరామరక్ష!

హనుమ అణిమాది సిద్ధులను వశం చేసుకొన్న తపస్వి. అందుకే సూక్ష్మరూపంలో అశోకవనంలో సీతమ్మకు కనిపించి, ఆమెకు ధైర్యాన్ని చెప్పాడు. భయాన్ని పోగొట్టాడు. వికటరూపంలో లంకలోని రాక్షసులను మట్టుబెట్టాడు. లంకను కాల్చి, తన ధర్మవీరాన్ని చాటుకొన్నాడు. సంజీవని పర్వతాన్ని అవలీలగా పెకలించి తెచ్చి లక్ష్మణుడి ప్రాణాలు కాపాడాడు. సాక్షాత్తూ రామచంద్రుడే హనుమంతుణ్ని తన సోదరుడైన భరతుడితో సమానంగా భావించాడంటే హనుమ రామభక్తి ఎంతటిదో విశదమవుతుంది!

రామ నామం అమృతరసాయనం. అది హనుమ దగ్గర ఉంది. ఆ అమృతాన్ని గ్రోలాలంటే హనుమంతుణ్ని ఆశ్రయించవలసిందే. మానవుల సంకటాలకు, కష్టాలకు, నష్టాలకు, పీడలకు ఏకైక రక్షణ హనుమంతుడి రూపమే. ఆ రూపాన్ని తలచుకొని, ఆ నామాన్ని స్మరించి, అన్ని విజయాలనూ అవలీలగా సాధించవచ్చునని ప్రత్యక్షంగా తెలుసుకొని నిరూపించినవాడు తులసీదాసు. వాస్తవంలో ఆయన హనుమకు దాసు!   - డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment