శ్రీ సాయిబాబా సచ్చరిత్ర
Sri Sai Satcharitra
Rs 108/-
-------------------------------------
సాయి రూపం జ్ఞాన దీపం
సాయినాధుని సమకాలీకులైన హేమాడ్ పంత్ 1929లో రచించిన శ్రీ సాయి సచ్ఛరిత్ర నుంచి సేకరించిన వివరాలివి...
యాసాయీ (రండి సాయి)... అన్న షిరిడీ వాసుల ఆహ్వానం కోట్లాది మంది అదృష్టం పండించింది... ఓ పెళ్లి బృందంతో పాటు ఆ మారుమూల గ్రామంలో అడుగుపెట్టిన ఆ ఫకీరు తర్వాత భక్త హృదయ చక్రవర్తిగా మారిన వైనం అద్భుతం... అపూర్వం... ‘మాఝియా భక్తాంబే ధామీ! అన్నవస్త్రాంస నాహీకమి!’ నా భక్తుల ఇళ్లలో అన్నవస్త్రాలకు లోటుండదని పలికిన ఆ యోగి రాజు లీలలు సదా స్మరణీయాలు... ఆయన జీవితంలో ప్రతి ఘట్టం హృదయాన్ని ఆనందడోలికల్లో ముంచెత్తుతుంది... బతుకు పాఠాలు నేర్పుతుంది... ఆ మహాత్ముడి సమాధి శతాబ్ధి సందర్భంగా అందులో కొన్ని..
వారు... నేనే!
సాయి సంపూర్ణ అద్వైత స్ధితికి నిదర్శనంగా నిలిచేవారు. తాను షిరిడీ వదిలి ఒక్కరోజు కూడా బయట లేకున్నా ఆయన సర్వవ్యాపకత్వాన్ని అడుగడుగునా ప్రదర్శించేవారు. |
...ఆ జ్ఞానముందా!
బ్రహ్మజ్ఞానం... ప్రతి జీవీ అందుకోవాల్సిన అమృతమది. దాన్ని గురించి చెప్పడానికి యోగి రాజైన సాయినాథునికన్నా గొప్ప గురువు ఎవరుంటారు?‘బాబా చాలా దూరం నుంచి వచ్చాను. నాకు ఎలాగైనా బ్రహ్మను చూపండి’ అని అడిగాడు. బాబా కూడా ‘చింతపడకు. వెంటనే బ్రహ్మను చూపిస్తాను. డబ్బు, సంతానం, సుఖాలు కోరిన వాళ్లున్నారుగానీ, నీలాగా బ్రహ్మజ్ఞానం కోసం నా దగ్గరకు వచ్చిన వాళ్లు లేరు. ఇక్కడ అరువు బేరం లేదు’ అని అతన్ని కూర్చోబెట్టి బాబా మరోపనిలో మునిగిపోయారు. కాసేపటి తర్వాత ఓ పిల్లవాణ్ణి పిలిచి ‘ వెంటనే వెళ్లి బాబాకి అవసరపడింది. ఓ అయిదు రూపాయలు ఇవ్వమని నందూ మార్వాడీతో చెప్పు’ అన్నారు. పిల్లాడు నందూ వాళ్లింటికి వెళ్లి వచ్చి వాళ్లింటికి తాళం పెట్టి ఉందని చెప్పాడు. ‘మళ్లీ వెళ్లు! బాళా వ్యాపారి ఇంటికెళ్లి అతన్నడిగి డబ్బుతే’ ఆ పిల్లాడికి చెప్పాడు బాబా... ఈ ప్రయత్నం కూడా వ్యర్థమైంది. బాళా కూడా ఇంట్లో లేడు. తర్వాత ఇంకో రెండు చోట్లకి బాబా పిల్లాణ్ణి పంపాడు. అయినా చిల్లుగవ్వ కూడా దొరకలేదు. అదే సమయంలో బ్రహ్మజ్ఞానం పొందడానికి వచ్చిన వ్యక్తి జేబులో రెండువందల యాభై రూపాయలున్నాయి. ఆ విషయం సాయినాథులకు తెలుసు. అయినా ఆ బ్రహ్మార్థి బాబాకు అయిదు రూపాయలు అప్పుగా ఇవ్వలేదు. తిరిగి వస్తాయా? లేదా? అనే సందిగ్ధత అతనిది. ధనమోహంలో చిక్కుకున్న అతను బాబాను రెట్టించి అడిగాడు ‘బ్రహ్మను చూపండి’ అని. బాబా ఇలా అన్నారు. ‘బ్రహ్మ కోసం పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు భగవంతుడికి సమర్పించవలసి ఉంటుంది. అరిషడ్వర్గాలను విడిచిపెట్టాల్సి ఉంటుంది. డబ్బుపై వ్యామోహం, లోభాన్ని కూడా వదల్లేని నువ్వు పరమగతిని ఎలా పొందాలనుకుంటున్నావు? |
తారక మంత్రం
బాబా శిష్యుడు దాసగణు ఈశావాస్యభావార్థ బోధిని అనే గ్రంథాన్ని మరాఠీలో రాయడం మొదలుపెట్టారు.అయినా దాసగణుకి ఏదో సందేహం. ఓ రోజు బాబా దగ్గర ఏకరవుపెట్టాడు. ‘నీవు ప్రశాంతంగా ఉండు. ఓ పనిపిల్ల నీ శంకను నివారిస్తుంది’ అభయమిచ్చారు బాబా పనిపిల్లా... వేదానికి అర్థం చెప్పడమా... అందరితో పాటు దాసగణుకీ ఆశ్చర్యం. తర్వాత దాసగణు పార్లే గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఆయన నిద్ర మేల్కొంటున్న సమయంలో ఓ ఎనిమిదేళ్ల పాప మృదుమంజుల స్వరంతో అద్భుతంగా పాడుతోంది. నడుముకి చిరిగిన పరికిణీ కట్టుకున్న ఆ పిల్ల ఆ చీరనే వర్ణిస్తూ తన్మయత్వంతో పాడుతోంది. ఆమెకు కడుపునిండా తిండి లేదు. మంచి దుస్తులూ లేవు. అయినా ఆమెలో ఉప్పొంగుతున్న ఆనందాన్ని చూసి సంతోషపడ్డ దాసగణు అక్కడుతున్న అధికారితో ఇలా చెప్పాడు. ‘చూడండి... ఆమెకు ఓ చీరివ్వండి. మీ సేవను దేవుడు మెచ్చుతాడు’. విన్నపానికి స్పందించిన అధికారి ఓ అందమైన చీర ఆమెకు ఇచ్చాడు. ఆ అమ్మాయి ఆ చీరను చూసి ఎంతో సంతోషించింది. దాన్ని కట్టుకుని ఇతర పిల్లలతో కలిసి ఒప్పులకుప్ప ఆడింది. మరునాడు ఆ చీరను దాచిపెట్టి ఇదివరకటి చిరిగిన బట్టల్లోనే వచ్చింది. అయినా ఆ పిల్లలో ఎలాంటి నిరుత్సాహం లేదు. అదే సంతోషం. అదే అవ్యక్తానందం. అప్పుడు తట్టింది దాసగణుకి బాబా మాటల్లోని అంతరార్థం. ‘తేన త్యక్తేన భుంజిథా’ మంత్రార్థం. ఆ పనిపిల్ల నిరుపేద. కడపు నిండా అన్నం, కట్టుకోడానికి దుస్తులు లేవు. అయినా ఆమె ఆనందానికి మాత్రం ఢోకాలేదు. ఇతరుల వైభవం చూసి ఆమెకు అసూయ లేదు. తన దైన్యానికి సిగ్గుపడనూ లేదు. తన పాత చీర గురించి కూడా ప్రేమతో పాట పాడింది. మర్నాడు ఆమెకు కొత్తచీర లభించింది. ఆమె దాన్ని కూడా ఇష్టంగా కట్టుకుంది. కానీ అదే సర్వస్వం అనుకోలేదు. ఆశ కలగలేదు. మర్నాడు ఆ చీరను పెట్టెలో దాచి, పాత చీర కట్టుకున్నా అంత ఆనందంగానూ ఉండిపోయిందామె. సంసారంలో ఎలా వ్యవహరించాలో బాబా ఆ పనిపిల్ల ద్వారా తెలియజెప్పారు. |
అలా చూడరాదు
తనను నమ్ముకున్న వారి యోగక్షేమాలన్నీ తానే చూస్తానని మాటిచ్చారు సాయినాథులు.త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధలోభాలు నరకానికి మూడు ద్వారాలు. వాటివల్ల మనిషికి నష్టం జరుగుతుంది. సాయి సమర్థులు అత్యంత దయామూర్తి. భక్తులకు వీటి అదుపుపై శిక్షణనిచ్చేవారు. కామం మనిషిలోని విచక్షణను అణచివేస్తుంది. దాని నుంచి భక్తులను చాకచక్యంగా బయటపడేసేవారు బాబా. నానా సాహెబ్ చాంద్రోర్కర్ గొప్ప పండితుడు. ఉన్నత పదవులు నిర్వహించారు. బాబాకు సన్నిహితంగా ఉంటూ ఎంతో మందికి దర్శనభాగ్యం కలిగించేవాడు. తన ఉపన్యాసాలతో బాబా కీర్తిని కొంకణ్ ప్రాంతంలో విస్తరింపజేశారు. ఒకసారి ఒక ముస్లిం భక్తుడు తన భార్యలతో కలిసి బాబా దర్శనానికి షిరిడీ వచ్చారు. స్త్రీలంతా అప్పుడు బురఖాలు ధరించి ఉన్నారు. వాళ్లు రావడం చూసిన నానాసాహెబ్ చాంద్రోర్కర్ అక్కడి నుంచి వెళ్లాలని అనుకున్నాడు. కానీ బాబా అతన్ని ఆపారు. ఆ స్త్రీలు బాబాకు నమస్కరించేటప్పుడు తమ బురఖాలను ముఖంపై నుంచి తీశారు. అప్పుడు అందులో ఒక స్త్రీ సౌందర్యం చూసిన నానాకు ఆమెను మళ్లీమళ్లీ చూడాలనే ఆలోచన మనసులో వచ్చింది. అతని మనస్సులో కలిగిన అలజడి ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ బాబా నుంచి తప్పించుకోలేరు కదా. బాబా వారంతా వెళ్లిపోయాక నానాతో దేవుడు ఈ అందమైన సృష్టిని మనం చూసి ఆనందించడానికే ఇచ్చాడు. మనసులో దురాలోచనలకు తావివ్వకూడదని చెప్పారు. నానా కూడా సహజంగా పండితుడు, విజ్ఞుడు కావడంతో వెంటనే సాధన చేసి పరిపూర్ణత సాధించాడు. తప్పు చేయడమే కాదు తప్పుడు ఆలోచన కూడా మంచిది కాదని బాబా చాటారు. |
గురు బోధ
భక్తి అంటే మధురమైన సీతాఫలం, జ్ఞానమంటే బాగా పండిన రామాఫలం. రసంతోనిండి ఒకదానికంటే మరొకటి మధురంగా ఉంటాయి. రెండింటి సుగంధం కూడా ఒక్కలాగే ఉంటుంది.’ మీరు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఫలాపేక్షను వదలండి. మీకు ఫలాన్నివ్వడానికి మీ వెనక నేను నిలబడి ఉంటాను |
- శ్రీవిజయదుర్గ
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
|
No comments:
Post a Comment