సంపూర్ణ శ్రీ గురు చరిత్ర | Sampurna Sri Guru Charitra

సంపూర్ణ శ్రీ గురు చరిత్ర 
 Sampurna Sri Guru Charitra 
108/-
-------------------------
గురువై ఇలలో జ్ఞానమై మనలో
ఈనెల 22 దత్త జయంతి
త్యజించడం దత్తం... జయించడం దత్తం... మనస్సును దేదీప్యమానం చేయడం దత్తం... సాక్షాత్తు దైవం గురువుగా మారితే, మానవుడికి ముక్తి మార్గాన్ని చూపితే... జ్ఞాన దీపాలు వెలుగుతాయి, చిమ్మ చీకట్లు తొలగుతాయి... దత్తుడి అవతరణ, కార్యాచరణ రెండూ ప్రత్యేకమే, సమాజానికి అత్యావశ్యకమే...
నం భగవంతుడి అవతారాలన్నీ నిశితంగా పరిశీలిస్తే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ లక్ష్యాలుగా ఉంటాయి. ఆ ప్రత్యేకమైన విధి నిర్వహణ తర్వాత ఆ అవతారాలు పరిసమాప్తి అవుతాయి. కానీ దత్తాత్రేయ అవతారం అలాకాదు. ఆయన ఆవిర్భావం వెనక ఒక నిగూఢమైన, నిరంతరాయమైన కార్యక్రమం ఉంది. మనుషుల్లో జ్ఞాన, వైరాగ్య, ఆధ్యాత్మికోన్నతి కలిగించడం అనే ముక్కోణ ప్రణాళిక ఉంది. అందుకే భాగవత మహాపురాణం మహావిష్ణువు ధరించిన 21 అవతారాల్లో దత్తాత్రేయ అవతారాన్ని గురించి ప్రత్యేకంగా వివరించింది. 
సత్త్వ, రజో, తమో గుణాలను జయించిన మహా తపశ్శాలి అత్రి మహాముని. అసూయలేని సాధ్వీమణి అనసూయ. ఈ దంపతులిద్దరి తపో ఫలితంగా త్రిమూర్తుల అంశతో మార్గశిర పూర్ణిమనాడు దత్రాత్రేయుడు జన్మించాడు.
దత్తుడు జ్ఞానానికి ప్రతీక. ఇతర దైవాల తీరులో ఆయన రాక్షస సంహారం చేయలేదు. ఆయన దృష్టిలో మనిషిలో ఉండే అజ్ఞానం, అహంకార‌ మమకారాలే రాక్షసులు. మనిషిలోని దుర్గుణాలే అతడిని రాక్షసుడిని చేస్తాయి. అందుకే దత్తుడు అజ్ఞానాన్ని సంహరించి, జ్ఞానదీపాలు వెలిగించాడు. అసలు దత్తాత్రేయుడి పేరులోనే ప్రత్యేకత ఉంది. దత్తం అంటే త్యజించడం అనే అర్థముంది. సూక్ష్మ, స్థూల, కారణాలనే మూడు రకాల శరీరాలను,  జాగృత్‌, స్వప్న, సుషుప్తి అనే మూడు స్థితులను, సత్త్వ, రజో, తమో గుణాలను జయించినందుకు ఆయన దత్తాత్రేయుడయ్యాడు.
మహా యోగీశ్వరుడైన దత్తుడు జగదాచార్యుడు కూడా.. సకల లోకాలకు గురుమూర్తి. మిగిలిన భగవదవతారాల్లో దైవత్వం మాత్రమే దర్శనమిస్తుంది. కానీ దత్తావతారంలో మాత్రమే దైవలక్షణాలతో పాటు గురులక్షణాలు కూడా కనిపిస్తాయి. శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి, స్వామి సమర్థ, మాణిక్య ప్రభు మహరాజ్‌, షిరిడీ సాయినాధులను భక్తులు దత్తావతారాలుగా భావించి కొలుస్తారు. మనం గమనిస్తే ఈ అవతారాలన్నీ నరుడి ఆకారంలో ఉన్న నిరాకారాలే. వారంతా సకల గురు స్వరూపాలు. దత్తాంశతో జన్మించిన సిద్ధ గురువులందరి లక్ష్యం ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యలకు పరిష్కారాలు తెలుపుతూ, వారిని సన్మార్గంలో నడిపించడం.
అంతేకాదు ఆయన మహా అవధూత. ప్రకృతి పరిశీలన ద్వారా భూమి, మిడత, చేప, ఏనుగు, సాలె పురుగు వంటి 24 చరాచరాల నుంచి దత్తుడు జ్ఞానాన్ని గ్రహించాడు. వాటినే గురువులుగా భావించి సృష్టిలోని మార్మికతను అర్థం చేసుకుని లోకానికి వివరించాడు.  యాదవ వంశానికి మూలపురుషుడైన యదు మహారాజుకు ఈ విషయాన్ని స్వయంగా దత్తుడే చెప్పాడు. భూమి, వాయువు, ఆకాశం, జలం, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, పావురాయి, కొండచిలువ, తుమ్మెద, తేనెటీగ, ఏనుగు, జింక, చేప, సర్పం, గద్ద, సాలీడు, సముద్రం, వేశ్య, కన్య, లోహకారుడు, చిమ్మెట, కందిరీగ... ఈ విషయాలను దత్తాత్రేయుడు గురువులుగా స్వీకరించాడు. భూమి నుంచి క్షమ, వాయువు నుంచి నిస్సంగత్వం, ఆకాశం నుంచి సర్వవ్యాపకత్వం, జలం నుంచి నిర్మలత్వం, అగ్ని నుంచి తేజస్సు... ఇలా ప్రతి జీవి నుంచి ఒక్కో అంశాన్ని గ్రహించాడు. సృష్టిలోని ప్రతి ప్రాణినీ గౌరవించాలి. రూపభేదాలు భౌతికమైన దేహానికే గానీ మనసుకి లేదు. ప్రతి ప్రాణి హృదయంలో ఉండే భగవంతుడు ఒక్కడే. ప్రతి ప్రాణిలో పరమాత్మను దర్శించగల స్థాయికి చేరుకోవాలి. ప్రకృతి వైవిధ్యం విలసిల్లేలా మన కార్యకలాపాలు ఉండాలి. అనంతమైన ప్రకృతిలోని ప్రతి అణువు నుంచి మనం గ్రహించాల్సిన అంశాలెన్నో ఉంటాయి. రూపం వెనకాల ఉన్న భావాన్ని గ్రహించాలని ప్రకటించటమే ప్రకృతిలోని వివిధ విషయాలను దత్తుడు గురువులుగా స్వీకరించటంలో ఉన్న అంతరార్థం.
నేపాల్‌లోని చిత్ర‌కూటం స‌మీపంలో ఉన్న అన‌సూయ‌ప‌హాడ్ ద‌త్తాత్రేయ‌స్వామి అవ‌త‌రించిన స్థ‌ల‌మ‌ని చెబుతారు.
బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా దత్తపురాణం ఉంది. మనకు లభిస్తున్న మొదటి గురుచరిత్ర ఇది. వ్యాసమహర్షి దీనికి కర్త. భాగవత మహాపురాణం, మార్కండేయ పురాణాల్లో కూడా దత్తుడికి సంబంధించిన ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పిన ఉద్భవగీతలో మొదటి అధ్యాయం పూర్తిగా దత్తాత్రేయుడి గురించి వివరిస్తుంది. జగన్మాతను అర్చించే శ్రీవిద్యా సంప్రదాయంలో కూడా దత్తాత్రేయుడికి ముఖ్యస్థానం ఉంది.
- శ్రీదత్తా
సాధారణంగా దత్తాత్రేయుడి రూపం మూడు ముఖాలు, వెనుకవైపు గోవు, ముందుభాగంలో శునకాలు ఉండే సన్నివేశంతో కనిపిస్తుంది. బాహ్యదృష్టిలో ఇవన్నీ ఏమాత్రం ప్రాధాన్యత లేని అంశాలు. కానీ, దత్తాత్రేయుడి రూపం మనిషికి కర్తవ్యపూరితమైన సందేశాన్నిస్తుంది. దత్తాత్రేయుడి మూడు ముఖాలు భూత, వర్తమాన, భవిష్యత్‌ కాలాలకు సంకేతంగా నిలుస్తాయి. గతాన్ని పునాదిగా చేసుకుని, వర్తమానానికి అనుగుణంగా జీవిస్తూ, భవిష్యత్‌కు బాటలు పరుచుకోవాల్సిన కర్తవ్యం మనిషికి ఉంది. మూడు ముఖాల దేవుడు అందించే మహోన్నత సందేశం ఇది. మనిషిని కర్తవ్యబద్ధుడిని చెయ్యటమే మాధవుడి లక్ష్యం. దత్తుడు చేసింది ఇదే. దత్తుడి వెనకాల గోవు ఉంటుంది. గోవు ప్రకృతికి సంకేతం. మనిషి ప్రకృతికి బద్ధుడుగా జీవించాలి. ప్రకృతిని ఆశ్రయించాలే కానీ ఆక్రమించకూడదనే సందేశం గోవు ఇస్తుంది. దత్తుడిని అనుసరించి ఉండే శునకాలు భూతదయకు సంకేతాలు. 
నేపాల్‌లోని చిత్రకూటం సమీపంలో ఉన్న అనసూయపహాడ్‌ దత్తాత్రేయస్వామి అవతరించిన స్థలమని చెబుతారు.
దత్త వాక్కు
దత్తాత్రేయుడి మొదటి అవతారంగా భావించే శ్రీపాద శ్రీవల్లభులు మనిషి జీవితాన్ని తీర్చిదిద్దే ధర్మ, జ్ఞాన బోధలను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపదేశించేవారు. ఆయన భక్తులతో కూడా జ్ఞానోపదేశాలు చేయించారు. ఆయన బోధల్లో నిత్యస్మరణీయాలు...
మనిషి అభివృద్ధి చెందాలంటే శ్రద్ధతో పాటు దృఢమైన విశ్వాసం కావాలి. మనం విశ్వాసాన్ని ఆధారంగా తీసుకుని జీవించాలి. అవసరమైన సమయంలో సహాయం అందుతుందనే నమ్మకం మనలో నిరంతరం ఉండాలి. దానివల్ల ఒకవిధమైన భద్రతా భావన కలుగుతుంది. అదే ఆత్మవిశ్వాసం అవుతుంది.
ఆత్మ సాక్షాత్కారం అంటే భగవంతుని నీడయిన ఈ సృష్టితో సమన్వయం కలిగి ఉండడం. అంతరంగంలో సమతూకం ఏర్పడడం దీని మొదటి లక్షణం..
శక్తిహీనమైన జ్ఞానం నిర్లిప్తతతకు దారితీస్తుంది. జ్ఞానహీనమైన శక్తి వినాశనానికి కారణమవుతుంది. అందువల్ల మనిషి జ్ఞానంతో ప్రకృతి బంధాల నుంచి విడుదల పొందాలి. ఆ తర్వాత శక్తి అనుగ్రహంతో పరిపూర్ణత సాధించాలి.
మనుషులు మాట్లాడే మాటలను వాక్కు అంటారు. అది అయిదు రకాలు. బయటకు వినిపించే వాక్కు స్థూలవాక్కు. పెదాల మధ్య గొణుగుతూ ఉన్నట్లు, బయటకు వినిపించకుండే ఉండే మాటను మధ్యమ వాక్కు అంటారు. వినీవినబడనట్లు, అర్థంకానట్లుగా బయటకు వచ్చే వాక్కును వైఖరీ వాక్కు అని పిలవాలి. గొంతు నుంచి బయటకు రాకుండా మనస్సులో ఉండిపోయే మాటను పశ్యంతి వాక్కు అంటారు. అసలు బయటకు తెలియకుండా సంకల్పమాత్రంగా మిగిలిపోయేది పరా వాక్కు. అసలు వాక్కు అనేది అమ్మ స్వరూపం. ఇది ప్రతి మనిషిలోనూ పలుకుతుంది.
ఆనందం అనేది పరమేశ్వరుడికి సంబంధించిన విషయం. పారవశ్యం యోగికి కలిగే అనుభవం. అసలు కోరికలు లేనివారికి కలిగేది హర్షం. సమస్త జీవులకు అందుబాటులో ఉంది సుఖం. అయితే దానితో పాటు దుఃఖం కూడా ఉందని గుర్తించాలి. అందుకే సుఖం కలిగితే పొంగిపోవద్దు. దుఃఖంలో కుంగిపోవద్దు. అంతా దైవేచ్ఛగా భావించాలి.
ఎవరికైనా భోజనం కావాలన్నా వారు గత జన్మలలో ఇతరులకు భోజనం పెట్టి ఉండాలి. ఎవరైనా ఒక గింజ దానం చేస్తే, దేవతలు దాన్ని వెయ్యి గింజలుగా చేసి  ప్రతిఫలంగా ఇస్తారు. వేదాల నీతిసారం దానం, ధర్మం.
వారే వీరు...
యుగాల నాటిదైన దత్తావతారం ఇప్పటికీ అనేక రూపాల్లో వ్యక్తమవుతూ సమాజంలో జ్ఞానజ్యోతుల్ని వెలిగిస్తూనే ఉంది.
శ్రీపాదశ్రీవల్లభుడు
దత్తాత్రేయుడికి ‘స్మర్తృగామి’ అనే పేరు ఉంది. కేవలం స్మరణతోనే  అజ్ఞానాన్ని తొలగించే లక్షణం ఇది. ఇందుకు ప్రతిరూపమే శ్రీపాద శ్రీవల్లభుడు. దత్తాత్రేయుడి తొలి అవతారం ఇది. పరిపూర్ణ జ్ఞానమూర్తి శ్రీపాదుడు. తన బోధనల ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించారు.
ఈయన జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, కార్యస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా కురువపురం. ఇవి ప్రఖ్యాత దత్త క్షేత్రాలు
నరసింహ సరస్వతి
దత్తాత్రేయుడి రెండో అవతారం సృసింహ సరస్వతి. ఓంకార నాదాన్ని పలుకుతూ ఆవిర్భవించాడంటారు. నిరంతర మౌనంతోనే భక్తులకు సందేహనివృత్తి చేసేవారాయన.
మహారాష్ట్రలోని కరంజలో జన్మించారు. గుల్బర్గా సపపంలోని గాణుగాపురంలో నివసించారు. ధర్మబోధ కొనసాగించారు.
మాణిక్యప్రభు
ప్రకృతిని తరగతిగా, ఆత్మని గురువుగా భావించి లోకానికి పరమార్థాన్ని బోధించిన దత్తావతారం మాణిక్యప్రభువు. తనను ద్వేషించేవారిని కూడా ప్రేమించి, అంతిమంగా వారిలో మార్పుతీసుకువచ్చిన ప్రేమమూర్తి.
బీదర్‌ సమీపంలోని మాణిక్యనగర్‌ ఆయన కార్యస్థానం
స్వామి సమర్థ
కుల, మత, వర్గ భేదాలు లేకుండా సమాజంలోని ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకుని జ్ఞానులుగా తీర్చిదిద్దారీయన  అత్యున్నతమైన కరుణ ఈ అవతారం ప్రత్యేకత.
మహారాష్ట్రలోన షోలాపూర్‌ సమీపంలో ఉన్న అక్కల్‌కోట నుంచి కార్యాచరణ నిర్వర్తించారు.
షిర్డీ సాయిబాబా
శాంతి, సహనం, కరుణలకు భౌతికరూపం ఏర్పరిస్తే అది సాయిబాబా. షిర్డీ నుంచి ప్రపంచమంతా ప్రేమామృతాన్ని పంచారు సాయి. బాలల్లో భగవంతుడు ఉంటాడని, అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటే తప్ప బాహ్యశుద్ధికి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పిన అవతారం ఇది.


ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment