శ్రీ అయ్యప్ప లీలామృతం |  Sri Ayyappa Leelaamrutham

శ్రీ అయ్యప్ప లీలామృతం 
Sri Ayyappa Lilamrutham 
Rs 36/-

మకర కాంతుల మణికంఠ



కుళత్తుపుళై బాలకనే శరణం అయ్యప్పాఅరియన్‌ కావు అయ్యనే శరణం అయ్యప్పాఅచ్చెన్‌ కావు అరశనే శరణం అయ్యప్పాశబరిమలై అయ్యనే శరణం అయ్యప్పాకాంతి మలై జ్యోతినే శరణం అయ్యప్పా

అని భక్తులు శరణుఘోషలో స్వామిని స్తుతిస్తుంటారు. చిత్రం ఏమిటంటే, చాలామంది భక్తులకు శబరిమల తప్ప ఈ జాబితాలోని మిగిలిన ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. వాస్తవానికి ఇవన్నీ శబరికి దగ్గరలోనే అటవీ ప్రాంతంలో ఉంటాయి. పైగా ఈ అయిదు ఆలయాలు కూడా స్వయంగా పరశురామ ప్రతిష్టిత ఆలయాలే. వీటిని కూడా శబరిమలై ఆలయం పరిపాలన బాధ్యతలు చూస్తున్న ట్రావెన్‌కోర్‌ దేవస్థానం వారే పర్యవేక్షిస్తూ ఉంటారు. 

1. కుళత్తుపుళై
ఇక్కడ అయ్యప్పస్వామి బాలకుని రూపంలో దర్శనం ఇస్తారు. కుళత్తు పుళై అన్నది కేరళలోని కొల్లమ్‌ జిల్లా పత్తనాపురమ్‌ తాలూకాలో ఒక చిన్న గ్రామం. కొల్లమ్‌ – షెన్‌ కొట్టయ్‌ జాతీయ రహదారికి చేరువలో కనిపిస్తుంది. తిరువనంతపురంకు, కొల్లమ్‌కు దగ్గరగా కనిపిస్తుంది. కుళత్తు నదికి ఆనుకొని గ్రామం ఉన్నందున ఈ పేరు వచ్చింది. నదికి అవతల వైపున గుడి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అయ్యప్ప బాలుని రూపంలో దర్శనం ఇస్తారు. ఉదయం సాయంత్రం అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ఇదే మందిరంలో శివుడు, యక్షి, విష్ణుమూర్తి, గణపతి, భూతనాథన్, నగర్, కరుప్ప స్వామి వంటి దేవతామూర్తుల ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ కొలనులో చేపలకు ఆహారం వేసే సేవకు మీనొత్తుసేవ అని పేరు. చర్మరోగాలతో బాధపడేవారు ఈ సేవ చేయించుకుంటారు. 
2. అరియన్‌ కావు
ఇది కేరళ తమిళనాడు సరిహద్దుల్లో నెలకొని ఉన్న గుడి.. కేరళ లోని కొల్లమ్‌ జిల్లా పథనాపురమ్‌ తాలూకాలోని అరియన్‌ కావు గ్రామం ఉంది. గుడి ఉన్న ప్రాంతం కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో ఉంటుంది. ప్రతీచోట అయ్యప్పస్వామి చిన్ముద్రతో కూర్చొని కనిపిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఏనుగు మీద కూర్చొన్న భంగిమలో దర్శనం ఇస్తారు. కుడి కాలు కిందకు ఉంటే, ఎడమ కాలు మడిచి ఉంచుతారు. ఇక్కడ కూడా శబరిమలై మాదిరిగా పదునెట్టాంపడి ఉంటుంది. ఆలయంలో స్వామికి ఎడమవైపున అమ్మవారు, కుడివైపు పరమేశ్వరుడు దర్శనం ఇస్తుంటారు. ఆలయానికి వెలుపల నాగరాజు విగ్రహాలు, పుట్ట కనిపిస్తాయి. పాండియన్‌ ముడి, త్రిక్కళ్యాణమ్, కుంభాభిషేకం ప్రత్యేక ఉత్సవాలు.
3. అచ్చెన్‌ కోవిల్‌
శబరిమలైకు వెనుకగా దట్టమైన అడవుల్లో నెలకొని ఉన్న ప్రాంతంగా అచ్చెన్‌ కోవిల్‌. సాధారణంగా అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అవతారం అని మన అందరికీ తెలుసు. అయితే అచ్చెన్‌ కోవిల్‌లో మాత్రం పూర్ణ, పుష్కల అనే ఇద్దరు భార్యలతో స్వామి దర్శనం ఇస్తారు. మహా వైద్యన్‌ రూపంలో అయ్యప్పను కొలవటం ఇక్కడ ఆనవాయితీ. ఇక్కడ పూజాదికాలన్నీ తమిళ సాంప్రదాయంలో నిర్వహిస్తుంటారు. ఇక్కడ స్వామి విగ్రహం రుద్రాక్షశిలతో చేసినదిగా చెబుతారు. అయ్యప్పతోపాటు మాళికాపురత్తమ్మ, దుర్గ, నాగరాజా, గణపతి, మురుగ, కరుప్పస్వామి, కరుప్పయి అమ్మ, చెప్పని ముదరన్, చెప్పని మాదన్, మాదన్‌ తేవన్‌ వంటి దేవతామూర్తులు కనిపిస్తారు. వెనుకభాగంలోని నాగప్రతిష్ట దర్శించతగినది. 
4. శబరి మలై
శబరి మలై గురించి భక్తులు అందరికీ తెలుసు. ప్రధానమైన అయ్యప్ప ఆలయంతోపాటు ఉండే ఉప ఆలయాల గురించి మాత్రం చాలా మందికి తెలియక పోవచ్చు. మహిమాన్వితమైన మూర్తిగా అయ్యప్ప భక్తుల్ని అనుగ్రహిస్తుంటారు. తండ్రి రాజశేఖరునికి ఇచ్చిన వరం మేరకు ఇక్కడ స్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో స్వామి విగ్రహాన్ని మకర సంక్రాంతి రోజున ప్రతిష్టించారట. అందుకే ఆలయంలో సంక్రాంతి పర్వదినాన అత్యంత వైభవంగా పూజలు నిర్వహిస్తుంటారు. మకర సంక్రాంతి రోజున తిరువాభరణాల్ని స్వామికి అలంకరించి పూజలు చేయిస్తారు. అందుకే శబరిమలైలో సంక్రాంతికి అంతటి ప్రత్యేకత.


ఇక శబరిమలై గుడిమీదనే అయ్యప్ప గుడికి ఆనుకొని కన్నెమూల గణపతి గుడి కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి కుడివైపున ఉండే ఈ ఆలయం ఎదుట కూడా ఇరుముడిని చూపించటం ఆనవాయితీ. ఇక్కడ జరిగే గణపతి హోమం విశేషమైనది గా చెప్పుకోవచ్చు. అలాగే నాగ రాజీవ గుడి కూడా ప్రశస్తమైనది. అయ్యప్పకు చిన్నన్నయ్య హోదాలో పూజలు అందుకొంటారు. దీంతో పాటు ప్రధానమైన ఆలయం మాళికాపురత్తమ్మ. అయ్యప్ప స్వామి మీద మనస్సు పడ్డ లీలావతి ఈ రూపంలో కొలువై ఉందని చెబుతారు. ఆది పరాశక్తి అంశలో దర్శనం ఇస్తుంది. 

5. కాంతిమలై
అయిదు ఆలయాల్లో ఈ కాంతిమలై విశిష్టమైనది. మిగిలిన నాలుగు ఆలయాలకు భక్తులంతా చేరుకొనే వీలు ఉంది. కానీ కాంతిమలైకు మాత్రం భక్తులు వెళ్లటం సాధ్యం కాదు. శబరిమలైకు ఎదురుగా ఉండే కొండనే కాంతిమలైగా పిలుస్తుంటారు. ఇక్కడకు సమీపంలోని పొన్నంబల మేడు నుంచి మకర సంక్రాంతి రోజున సాయంత్రం సమయంలో జ్యోతి రూపంలో అయ్యప్ప దర్శనం ఇస్తారని భక్తుల నమ్మకం. అందుచేత దూరంనుంచే కాంతి రూపంలో అయ్యప్పను దర్శించుకొని వెనక్కి మళ్లుతారు. పరమత సహనానికి శబరిమలై పెట్టిందిపేరు. అయ్యప్ప క్రీస్తుశకం వెయ్యివ సంవత్సరాల కాలంలో నడయాడినట్లు చెబుతారు. అప్పటికే కేరళలో ముస్లిం కుటుంబాలు స్థిరపడి ఉన్నాయి. అందులో వావర్‌ అనే ముస్లిం యువకునితో అయ్యప్పన్‌కు స్నేహం కుదిరింది.

వావర్‌ స్వామియే, వావరిన్‌ తోళరే అని శరణు ఘోషలో భక్తులు పఠిస్తూ ఉంటారు. ఈ వావర్‌కు గుర్తుగా శబరిమలై కొండమీద వావరన్‌ నాడా (కోవెల) కనిపిస్తూ ఉంటుంది. మాళికపురత్తమ్మ ఆలయానికి సమీపంలో ఇప్పటికీ మనం చూడవచ్చు. అలాగే ఎరుమేలికి వెళ్లినప్పుడు అక్కడ వావర్‌ స్వామి మసీదు కనిపిస్తుంది. భక్తులందరూ వావర్‌ స్వామి ఆశీస్సులు తీసుకోవటం ఆనవాయితీ. మలయాళ సాహిత్యం ప్రకారం అయ్యప్ప స్వామి అర్యన్‌ కేరళ వర్మ (రాజుల పేరు) తో పందళ రాజ్యంలో పెరిగారని చెబుతారు. మణిమాల ఉన్నందున మణికంఠుడిగా పిలుచుకొనేవారు. మహిషిని అంతం చేసేందుకు వచ్చినందున ఆ ప్రక్రియ ముగిశాక అయ్పప్ప అవతారం చాలించారని చెబుతారు.

ఇందులో భాగంగా ఇప్పుడు శబరికొండపై ఉన్న మణి మండపం ప్రాంతంలో స్వామి తపస్సు చేసుకొన్నారని, స్వామికి సన్నిహితులైన వారంతా అక్కడకు చేరుకొన్న తర్వాత అయ్యప్ప స్వామి అకస్మాతుగా మకర సంక్రాంతి రోజు సాయంత్రం అదృశ్యం అయ్యారట. అదే సమయాన పొన్నంబల మేడ్‌ సమీపంలో ఒక దివ్యకాంతి జ్యోతిరూపంలో దర్శనం ఇచ్చిందట. అంతటితో అయ్యప్ప అవతారం పూర్తయిందని నమ్మిన భక్తులు.. శబరిమలైలో సంక్రాంతి రోజున పూజాదికాలు విశేషంగా జరిపిస్తుంటారు. ప్రతి ఏటా జ్యోతి దర్శన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అదే అయ్యప్ప గుడికి, మకర సంక్రాంతికి ఉన్న అనుబంధం. ఈ మకర సంకాంతి సందర్భంగా స్వామివారి ఆశీస్సులతో అందరికీ అన్ని శుభాలూ చేకూరాలని కోరుకుందాం.
– రమా విశ్వనాథన్‌



Tags: 
sabarimala
Ayyappa Swami
devotees


అయిదు కొండల స్వామి 


ఏడు కొండలస్వామి సప్తగిరి వేంకటేశుడైతే- అయిదు కొండల స్వామి, పంచగిరీశుడు శబరిగిరినాథుడు స్వామిఅయ్యప్ప. కేరళ రాష్ట్రంలో ఎరుమేలి నుంచి దట్టమైన అరణ్యం ప్రారంభమవుతుంది. మహిషి అనే రక్కసిని సంహరించడానికి హరిహరసుతుడైన మణికంఠుడు ఈ భువిపై అవతరించాడు. పంబాతీరంలో వేటకు వెళ్ళిన పందళరాజుకు స్వామి శిశువుగా కనిపిస్తాడు. ఆయన పెంపకంలో పెరగడం వల్ల పందళరాజకుమారునే శరణమయ్యప్పని స్వామి వారిని కీర్తిస్తారు.

మణికంఠుడు పులి పాలకోసం అడవులకు వెళ్ళినప్పుడు ఎరుమేలి చేరగానే వావార్‌ అనే గజదొంగ స్వామిని అడ్డగించి యుద్ధానికి దిగుతాడు. వావర్‌ యుద్ధంలో మణికంఠుడి చేతిలో అతడు ఓడిపోతాడు. చెలిమి కోరడంతో స్వామివారు అంగీకరించి విందులో పాల్గొని ఆటవికుడిగా అలంకరించుకుని వావర్‌తో కలిసి పేట తుళ్ళై నృత్యం చేస్తారు. అందుకే నేటికీ దీక్షతో శబరిమల యాత్ర చేసేవారు ఎరుమేలిలో ఆగి ఆటవికుడిలా అలంకరించుకుని నాట్యం చేసి అక్కడ ధర్మశాస్తను, వావర్‌స్వామిని దర్శించి యాత్రకు ఉపక్రమిస్తారు.

మణికుంఠుణ్ని పందళ ప్రజలు, రాణి, రాజు అంతా అయ్య-అప్పా అని ముద్దుగా పిలవడంతో స్వామివారి పేరు అయ్యప్పగా మారి శాశ్వత నామధేయంగా ఉండిపోయింది. పులిపాల కోసం ఒంటరిగా బయలుదేరిన అయ్యప్పస్వామి ఎరుమేలి నుంచి అళుదామేడు చేరేసరికి గగనంలో విహరిస్తున్న మహిషి కనిపించగానే తన అవతార లక్ష్యం గుర్తుకు వస్తుంది. మహిషితో పోరాడి సంహరిస్తాడు. మహిషి దేహం పెరగకుండా పెద్ద బండరాతితో అదిమి పెట్టాడని చెబుతారు. అందుకే నేటికీ శబరిమల యాత్ర చేసే స్వాములు అళుదామేడు చేరగానే ‘కళ్ళిడం-కుండ్రు’ అనే ప్రదేశంలో అళుదా నది నుంచి రెండు రాళ్లను తీసుకువెళ్లి అక్కడ వేస్తారు. మహిషి చనిపోయేముందు పశ్చాత్తాపంతో కార్చిన కన్నీరే అళుదా నదిగా ఏర్పడిందని ఒక కథ ఉంది.

మహిషి సంహారం గావించాక మణికంఠుడు పులుల మందతో వ్యాఘ్రారూఢుడై పందళం చేరతాడు. ప్రజలు, రాజదంపతులు భీతిల్లి పులిమందను ముందు వెనక్కి పంపమని ప్రార్థించడంతో స్వామి అలాగే చేస్తాడు. అవతార లక్ష్యం పూర్తికావడంతో తాను వేసిన బాణం పడినచోట అవతారం చాలిస్తానని బాణం విడిస్తే అది వెళ్లి శబరిగిరిపై పడుతుంది.రాజదంపతులు, పరివారం అందరూ చూస్తూ ఉండగానే అయ్యప్పస్వామి పట్టబంధాసనంలో కూర్చుని అభయ హస్తం చిన్ముద్రతో దర్శనమిచ్చి జ్యోతి రూపంలో అంతర్థానమయ్యాడు. తరవాత పరశురాముడు శబరిమలలో పదునెనిమిది మెట్లు నిర్మించి స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడంటారు. అవన్నీ అయ్యప్పస్వామి సంచరించిన ప్రదేశాలు కనుక, ఎంతో పవిత్రంగా భావించి యాత్ర చేసే స్వాములు చెప్పులు ధరించరు. స్వామివారికి బ్రహ్మచర్య దీక్ష ఇష్టమని మండల దీక్షతో తలపై ఇరుముడితో శబరిమలకు వస్తారు. స్వామివారి అభిషేకం కోసం ముద్రకాయలో ఆవు నెయ్యి నింపుకొని ఇరుముడితో పూజా సామగ్రితోపాటు తెచ్చి పదునెనిమిది మెట్లు ఎక్కి హరిహరసుతుడు అయ్యప్పను దర్శిస్తారు. 
శబరిమల యాత్రలో సర్వమానవ సౌభ్రాతృత్వానికి అర్థం తెలుస్తుంది. ముక్కు, ముఖం తెలియకపోయినా మార్గమధ్యంలో పలువురు సేవలు అందిస్తారు. యాత్రలో అలిసిపోయి చెమటతో ముద్దయినవారికి వింజామరలు వీచి సేద తీరుస్తారు. నడవలేనివారికి చేయూతనిచ్చి నడిపిస్తారు. ఏ మాత్రం అహంకారం, గర్వం ఉన్నా శబరిమల యాత్రలో అవి పటాపంచలవుతాయి. 41 రోజుల మండల దీక్షతో శబరిమల యాత్ర చేస్తే మనసంతా స్వామివారిపైనే లగ్నమై శరణు ఘోషతో దైవం కనిపిస్తాడు.      - మహాభాష్యం నరసింహారావు
------------------
సన్నిధానం చేరే దారిదీ!
శబరిమల... నియమాల మాల వేసిన ప్రతి భక్తుడి గమ్యం. ఇటీవల వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళలోని ఈ దివ్యక్షేత్రం ఇప్పుడెలా ఉంది? అక్కడకు చేరుకునే మార్గాలేంటి? మండల పూజ కోసం భక్తులు ఇప్పుడు బయల్దేరవచ్చా? అక్కడకు చేరుకున్న వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అక్కడి వాస్తవ పరిస్థితులపై ఈనాడు కథనమిది..


 శబరిమల అయ్యప్ప ఆలయాన్ని దాదాపు ప్రతినెలలోనూ కొన్ని రోజుల పాటు దర్శించుకునే వీలుంది. కానీ భారీ వర్షాలు, వరదల వల్ల చింగం మాస పూజ (ఆగస్టు 16-21 తేదీలు), ఓనం పండగ (ఆగస్టు 23-27) తేదీల్లో అయ్యప్పను దర్శించుకోవడం కష్టసాధ్యమైంది. అక్కడి పరిస్థితులపై సరైన సమాచారం లేక, ఈనెలలో ప్రయాణానికి రిజర్వేషన్‌ చేయించుకున్న భక్తుల్లో చాలామంది రద్దు చేసుకున్నారు కూడా. అయితే ఇబ్బందులు తగ్గడంతో, కన్ని మాస పూజ (ఈనెల 16-21) సందర్భంగా వెళ్లిన భక్తులు అయ్యప్పను దర్శించుకోగలుగుతున్నారు. తులా మాస పూజ (అక్టోబరు 16-21), శ్రీచిత్ర అట్ట తిరుణాల్‌ (నవంబరు 5-6), మండల మహోత్సవం (నవంబరు 16- డిసెంబరు 27 తేదీలు) సందర్భంగా శబరి ప్రయాణానికి రిజర్వేషన్‌ చేయించుకుంటున్న భక్తులు కొద్దిపాటి జాగ్రత్తలతో యాత్ర పూర్తి చేయొచ్చు.

ఓనం పండగ సమయంలో భారీ వర్షాలు, వరదల వల్ల, రహదారులు ధ్వంసమయ్యాయని, శబరిమలకు వచ్చే భక్తులు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వమే విజ్ఞప్తి చేసింది. ఆ పరిస్థితుల నుంచి క్రమంగా ఆ రాష్ట్రం తేరుకుంటోంది. విమానాశ్రయాలు, ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి శబరిమల (పంబ)కు దారితీసే మార్గాలు రాకపోకలకు అనువుగా మారాయి. పంబ నుంచి సన్నిధానం వరకు కూడా భక్తులు పెద్దగా ఇబ్బందులు పడకుండానే చేరేలా చక్కబడుతున్నాయి.

నీలక్కల్‌ నుంచి పంబకు... 
తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే అయ్యప్ప భక్తులు కొట్టాయం, ఎర్నాకుళం, చెంగన్నూర్‌ రైల్వేస్టేషన్ల నుంచి, కొచ్చి-తిరువనంతపురం విమానాశ్రయాల నుంచి పంబకు వాహనాల్లో బయలుదేరతారు. ఈ కేంద్రాల నుంచి పంబ సమీపంలోని నీలక్కల్‌కు రోడ్డుమార్గం బాగానే ఉన్నందున, ఆర్‌టీసీ బస్సులు నడుస్తున్నాయి. ప్రైవేటు వాహనాలు, ట్యాక్సీలలో వెళ్లినవారు, కూడా తమ వాహనాలు నీలక్కల్‌లో నిలపాల్సిందే. అక్కడ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంబకు కేరళ ఆర్‌టీసీ బస్సుల్లో చేరాలి. నీలక్కల్‌ నుంచి పంబ మధ్య ఒకటి, రెండు చోట్ల రోడ్డుకు మరమ్మతులు చేస్తుండటం, పంబ వద్ద కొన్ని ప్రాంతాల్లో రోడ్డు, పార్కింగు స్థలాలు ఇటీవలి వరదలకు కోసుకుపోవడంతో ప్రైవేటు వాహనాలను పంబ వరకు అనుమతించడం లేదు. నీలక్కల్‌-పంబ మధ్య ఆర్టీసీ బస్సులు భక్తుల అవసరాలకు అనుగుణంగా నడుస్తున్నాయి. గతేడాది మండల దీక్ష సమయంలో నిర్ణయించిన ట్యాక్సీ ఛార్జీల బోర్డులను మార్చలేదు. అయితే నీలక్కల్‌ వరకే నడుస్తున్నందున, ఆమేరకు తగ్గించే రుసుమును ట్యాక్సీల నిర్వాహకులు తీసుకుంటున్నారు.

పంబ వద్ద.. 
పంబ బస్టాండ్‌ వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగుతున్నాయి. అక్కడనుంచి 1-2 కిలోమీటర్లు నడిస్తేనే పంబా నదికి చేరవచ్చు. అందువల్ల సాధ్యమైనంత తక్కువ సామగ్రితో వెళ్తేనే సౌకర్యంగా ఉంటుంది. నది ఒడ్డున త్రివేణిబ్రిడ్జి, అయ్యప్ప వారధి మీదుగా ఆవలి ఒడ్డుకు చేరాలి. ప్రవాహ ఉద్ధృతి తగ్గినా, ఇసుక, మట్టి పేరుకున్నందున, ఈ వంతెన సమీపంలోనే పంబా నదిలో పుణ్యస్నానం ఆచరించే వీలుంది. భద్రతా సిబ్బంది సూచించిన చోటే స్నానమాచరించాలి. కొండనుంచి తిరిగి వచ్చాక, మళ్లీ బస్టాండు వరకు నడిచి వచ్చి, నీలక్కల్‌ బస్‌ ఎక్కాల్సిందే.

తినుబండారాలకు లోటు లేదు 
తినుబండారాలు కొనుగోలు చేసుకోడానికి నడక మార్గం పొడవునా దుకాణాలున్నాయి. ప్రారంభంలో కొబ్బరి బొండాలతో ప్రారంభించి, దారిపొడవునా ఉండే దుకాణాల్లో చాలావరకు తెరచి ఉంచారు. సోడాలు, చిరుతిళ్లు, శీతల పానీయాలు వీటిల్లో అందుబాటులో ఉన్నాయి. సన్నిధానం సమీపంలోనూ ఆర్యన్‌ హోటల్‌ తెరచినందున, అల్పాహారం ఇబ్బంది లేదు.

నెట్‌వర్క్‌ సమస్య లేనట్లే... 
పంబ, సన్నిధానం, నీలక్కల్‌ ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌ బాగా పనిచేస్తోంది. భారతీ ఎయిర్‌టెల్‌, ఐడియా కొంతవరకు పనిచేస్తున్నాయని, జియో నెట్‌వర్క్‌ సరిగా లేదని భక్తులు చెబుతున్నారు. టెలికాం సంస్థలు నెట్‌వర్క్‌ల పునరుద్ధరణ యత్నాల్లో ఉన్నాయి. వచ్చే నెలకు అన్నీ సరికావచ్చు.

అందుబాటులో గదులు 
దేవస్థానానికి భక్తుల సంఖ్య తక్కువగా ఉన్నందున, కొండపైన గదులు కూడా అద్దెకు లభిస్తున్నాయి. దేవస్థానం అద్దెకు ఇచ్చే గదులు, ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లు కూడా తెరచినందున, విశ్రమించేందుకు అవకాశం లభిస్తోంది. ప్రసాదాలు కూడా సాధారణంగానే విక్రయిస్తున్నారు.

రక్షిత నీరూ లభిస్తోంది 
రక్షిత నీటి కోసం గత రెండేళ్లుగా చేసిన ఏర్పాట్లు కొంత దెబ్బతిన్నా, పునరుద్ధరించారు. దారి పొడవునా, సన్నిధానం సమీపంలోనూ ఆర్‌ఓతో శుద్ధిచేసిన తాగునీరూ లభిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్లాస్టిక్‌ కవర్లు, సీసాలను అనుమతించేది లేదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అందువల్ల మరీ అవసరమైతే తాగునీటి కోసం ప్రత్యేక బాటిల్‌ను భక్తులు వెంటతీసుకెళ్లడం మంచిది. నీటిని పొదుపుగా వాడుకోవాలని దేవస్థానం సూచిస్తోంది.

తక్కువ సామగ్రితో... 
వరద ఉద్ధృతికి పంబ వద్ద షెడ్డులోని దుకాణాలన్నీ కొట్టుకుపోయాయి. ప్రస్తుతానికి క్లోక్‌రూమ్‌లు కూడా తెరవలేదు. అందువల్ల సూట్‌కేసులు, బ్యాగులు పంబ వద్ద ఉంచుకోవడం వీలుకాదు. సాధ్యమైనంత తక్కువ సామగ్రితో వెళ్తేనే సౌకర్యంగా ఉంటుంది. దుకాణాల షెడ్డు వెనుకగా ఉన్న మార్గం ద్వారా, కన్నిమూల గణపతి ఆలయం చేరుకోవాలి. అక్కడనుంచి పోలీస్‌ చెక్‌పోస్టు మీదుగా నడకమార్గానికి చేరే దారి సాధారణంగానే ఉంది. మెటల్‌ డిటెక్టర్లు సహా అన్నీ యథావిథిగానే ఉన్నాయి.

నడకకు ఆటంకాలు లేవు 
నడకమార్గంలో వీధిదీపాలు పనిచేస్తున్నాయి. చెట్ల కొమ్మలు, ఆకుల వంటివి మాత్రమే దారిపొడవునా ఉన్నాయి కానీ, నడకకు ఆటంకం కలిగించేలా లేవు. బురద కూడా లేదు. వర్షాల నేపథ్యంలో విషపురుగులు, పాములు సంచరిస్తాయని అధికారులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. కానీ భయపడాల్సిన పరిస్థితేమీ లేవని వెళ్లొచ్చిన భక్తులంటున్నారు. లైట్ల వెలుతురు బాగానే ఉన్నందున, రాత్రిళ్లు కూడా భక్తుల నడక గతంలో మాదిరే సాగుతోంది.
- కాకుమాను అమర్‌కుమార్‌
-----------------------------------------------------
18 మెట్లకు చాలా ప్రాధాన్యత

18 పరిపూర్ణతలను సాధించిన ఙ్ఞానికి సంకేతం. ఆ ఙ్ఞాన సాధనే 18 మెట్లు ఎక్కడం. 

ఈ 18 మెట్లకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మెట్లు పంచలోహముల (బంగారు, వెండి, రాగి, ఇనుము మరియు తగరం యొక్క ఒక ప్రత్యేక మిశ్రమం) పూతతో కప్పబడి ఉంటాయి. 

41 రోజులు (మండలం) అయ్యప్ప దీక్షచేసిన వారు మాత్రమే పదునెట్టాంబడి ఎక్కుటకు అర్హులు. ఇది శబరిగిరీశుడు అయ్యప్ప నడిచిన దారి. అందుకే అత్యంత పవిత్రమైనది. ఎవరైతే పదునెట్టాంబడిని 18 సార్లు ఎక్కుతారో వాళ్ళు శబరిమలలో ఒక కొబ్బరి మొక్కని నాటుతారు.

మొదటి 8 మెట్లు - అరిషడ్వర్గములను(6) మరియు రాగములను (2) సూచిస్తాయి - కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, దంబం, అహంకారం. 

తదుపరి 5 మెట్లు పంచేంద్రియములను సూచిస్తాయి - నేత్రములు, చెవులు, నాసిక, జిహ్వ, స్పర్శ.

తదుపరి 3 మెట్లు మూడు గుణములను సూచిస్తాయి - సత్వం, తామసం, రాజసం.

చివరి 2 మెట్లు - విద్య, అవిద్యలను సూచిస్తాయి.

- హిందూ వేదాంతం ప్రకారము '18' వ అంకెకు గొప్ప గుర్తింపు ఉంది. అయ్యప్ప 18 ఆయుధాలతో చెడును నిర్మూలిస్తాడు. ఆ 18 మెట్లు 18 ఆయుధాలను సూచిస్తాయని చెబుతారు.

- భగవద్గీతలో, మహాభారతంలో, చతుర్వేదాలలో (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము) 18 అధ్యాయాలు ఉన్నాయి. 

- 18 పురాణాలు, ఉపపురాణాలు కలవు. మహాభారత యుధ్ధం మరియు రావణ సంహారం 18 దినములు జరిగింది. 

- కేరళలోని అయ్యప్ప సన్నిధానం 18 గొప్ప పర్వతాల మధ్యన ఉంటుంది. ఆ 18 పర్వతాలు - పొన్నంబలమేడు, గౌడెన్మల, నాగమల, సుందరమల, చిట్టంబలమల, ఖల్గిమల, మతంగమల, మ్య్లదుంమల, శ్రీపాదమల, దేవర్మల, నిలక్కలమల, తలప్పరమల, నీలమల, కరిమల, పుదుసేర్య్మల, కలకెట్టిమల, ఇంచిప్పరమల & శబరిమల).


కామం - 1వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "గీతా మాత".ఈ మెట్టు ఎక్కడం ద్వారా మనిషికి పూర్వజన్మస్మృతి కలుగుతుంది. గతజన్మలో తాను చేసిన పాపపుణ్యకర్మల విచక్షణాజ్ఞానం కలిగి మనిషి మానసికంగా శుద్ది పొందుతాడు. 
"లైంగిక కోరికను" సంస్కృతంలో "కామము" అని అంటారు. ఇంకా విస్తృతంగా కోరిక, వాంఛ అని కూడా అంటారు.

క్రోధం - 2వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "గంగా దేవి". ఈ మెట్టును స్పరించడం వలన మనిషికి తాను దేహాన్ని కాదు పరిశుద్ధాత్మను అనే జ్ఞానం కలుగ్తుంది.
"తన కోపమే తన శత్రువు". మన మనసుకు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు. అందుకే క్రోధం కలిగినప్పుడు ఆవేశానికి లోను కాకుండా మనకు మనం శాంతపర్చుకోవడం ఎంతైనా అవసరం.

లోభం - 3వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "గాయత్రీ మాత". ఈ మెట్టును స్పరించడం వలన మనిషికి పిశాచత్వం నశించి ఉత్తమగతులు కలుగుతాయి.
అవసరాలకంటే ఎక్కువ కావలనుకునే బుద్ది. కీర్తి కోసం అత్యాశ, తీవ్రమైన మరియు స్వార్థపూరిత కోరిక. దురాశ దుఖాఃనికి చేటు.

మోహం - 4వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "సీతా దేవి". ఈ మెట్టు జ్ఞానయోగానికి ప్రతీక.
ఒక పరిస్థితిని లేక నమ్మకమైన ఒక కారణం, ప్రత్యేకించి ఒక వ్యక్తి పై ప్రేమ /అనుబందం భావన.

మదం - 5వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "సత్యవతీ మాత". ఈ మెట్టు కర్మసన్యాసయోగానికి ప్రతీక. 4 & 5 మెట్లు స్పర్శించిన గృహములో ఉన్న పశు-పక్ష్యాదులకు సైతం పాపాలు నశించి, ఉత్తమగతులు కలుగుతాయి. 
తాను అనుకున్న లేక నమ్మిన దానినే ఉత్తమమైనదిగా భావించే మనసత్వం.

మాత్స్యర్యం - 6వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "సరస్వాతీ దేవి". ఈ మెట్టు స్పర్శల వలన విష్ణుసాయుజ్యం, సమస్త ధాన ఫలం కలుగుతుంది.
ఇతరుల సంతోషాన్ని కాని ఆనందాన్ని ఒర్వలేని బుద్ది

దంబం - 7వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "బ్రహ్మవిద్యా దేవి". ఈ మెట్టు స్పర్శల వలన విజ్ఞానయోగాధ్యాయం కలిగి పునర్జన్మ కల్గదు.

అహంకారం - 8వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "బ్రహ్మవల్లీ దేవి". ఈ మెట్టు స్పర్శ వలన స్వార్ధం, రాక్షసత్వం నశిస్తాయి.
నాకు మాత్రమే తెలుసు లేక నేనే గొప్ప అనుకునే బుద్ది

నేత్రములు - 9వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "త్రిసంధ్యా దేవి". ఈ మెట్టు స్పర్శ వలన అప్పుగాతీసుకున్న వస్తువుల వల్ల సంక్రమించిన పాపం హరిస్తుంది. 
దేవుడు సృష్ఠించిన ఈ లోకాన్ని చూడడానికి ఉపయోగపడే ఇంద్రియమే నేత్రములు (నయనాలు లేక అక్షులు) “సర్వేంద్రియానం నయనం ప్రధానం”

చెవులు - 10వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "ముక్తిగేహినే దేవి". ఈ మెట్టు స్పర్శ వలన ఆశ్రమధర్మ పుణ్యఫలం, జ్ఞానం కలుగుతుంది. ఇవి మంచిని వినుటకు మాత్రమే ఉపయోగించవలెను.
స్వామి కీర్తనలను, నామాలను వినుటకు ఉపయోగపడే ఇంద్రియమే చెవులు.

నాసిక - 11వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "అర్ధమాత్రా దేవి". ఈ మెట్టు స్పర్శ వలన అకాలమృత్యుభయం ఉండదు. 
వాసనను గ్రహించే ఇంద్రియమే నాసికం.

జిహ్వ - 12వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "చిదానందా దేవి". ఈ మెట్టు స్పర్శ వలన ఇష్టదేవతా దర్శనము లభిస్తుంది. దీనిని కఠొరంగా మాట్లాడుటకు ఉపయోగించకూడధు. 
షడ్రుచులను తెలిపే ఇంద్రియమే జిహ్వ (నాలుక). ఈ ఇంద్రియంతోనే స్వామిని కీర్తనలతో, నామాలతో స్మరించి ఆ రుచిని కూడా పొందాలి.

స్పర్శ - 13వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "భవఘ్నీ దేవి". ఈ మెట్టు స్పర్శ వలన వ్యభిచార, మద్య, మాంసభక్షణ, పాపాలు నశిస్తాయి. 
స్వామి పాదములను స్పర్శించుటకు ఉపయోగపడే ఇంద్రియమే స్పర్శ.

సత్వం - 14వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "భయనాశినీ దేవి". ఈ మెట్టు స్పర్శ వలన స్త్రీహత్యాపాతకాలు నశిస్తాయి.
స్వచ్ఛత, ప్రశాంతత, ఆనందం, శక్తి, మంచితనం యొక్క నాణ్యత. కొన్నిసార్లు మంచితనం గా అనువదించబడిన సాత్వ యొక్క దశ తేలిక, శాంతి, పరిశుభ్రత, జ్ఞానం, మొదలైన లక్షణములు కలిగి ఉంటుంది.

తామసం - 15వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "వేదత్రయూ దేవి". ఈ మెట్టు స్పర్శ వలన ఆహారశుద్ధి, మోక్షం,కలుగుతాయి. 
అతి నిద్ర , చాలా సోమరి, చీకటి, అజ్ఞానం, మందగతి, విధ్వంసం, భారము, వ్యాధి, మొదలైన లక్షణములు కలిగి ఉంటుంది.

రాజసం - 16వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "పరాదేవి". ఈ మెట్టు స్పర్శ వలన దేహసుఖం, బలం లభిస్తాయి. 
రాజసం యొక్క దశ. చర్య, అభిమానం, సృష్టి, దుడుకు, చురుకు మొదలైన లక్షణములు కలిగి ఉండటం.

విద్య - 17వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "అనంతాదేవి". ఈ మెట్టు స్పర్శ వలన దీర్ఘవ్యాధులు సైతం నశిస్తాయి. 
అభ్యాసం లేదా అధ్యయనం ద్వార సాధించే ఆధ్యాత్మిక అవలంబనే విద్య.

అవిద్య - 18వ మెట్టు
ఈ మెట్టుకు అధి దేవత "జ్ఞానమంజరీదేవి". ఈ మెట్టు స్పర్శ వలన యజ్ఞాలు చేసిన పుణ్యఫలం, ఆర్ధిక స్థిరత్వం కలుగుతాయి.
విద్య లేకపొవటమే అవిద్య. విద్య లేని వాడు వింత పశువు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment