సంపూర్ణ ఆయుర్వేద - చిట్కా వైద్యం |   Sampoorna Ayurveda - Chitkaa Vaidyam

సంపూర్ణ ఆయుర్వేద - చిట్కా వైద్యం 
Sampoorna Ayurveda - Chitka Vaidyam

----------------------------------------
బిందాస్‌గా బతికేద్దాం... నిండునూరేళ్ళు!చిరంజీవ... అంటూ చిన్నారుల్నీ దీర్ఘాయుష్మాన్‌భవ... అంటూ కాస్త పెద్దవారినీ దీవిస్తారు పెద్దలు.‘ఆఁ... ఉత్తుత్తి దీవెనలే కానీ ఈ రోజుల్లో వందేళ్లు ఎవరు బతుకుతున్నార్లే’ అనుకుంటున్నారా? వందేళ్లేం, అంతకన్నా ఎక్కువ కూడా బతకొచ్చు. కాకపోతే ‘షరతులు వర్తిస్తాయి’.
ఓ ఇంట్లో ఇద్దరు తండ్రీ కొడుకులు ఉంటారు. వయసులో సెంచరీ కొట్టిన తండ్రికి జీవితంలో ప్రతిక్షణాన్నీ ఆస్వాదించడం ఇష్టం. 116 ఏళ్లు బతికి దీర్ఘాయుష్కుడిగా చైనా వ్యక్తి పేరు మీద ఉన్న రికార్డును తన పేరుమీద రాయించుకోవాలన్నది అతడి జీవితాశయం. అందుకని ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూ ఉత్సాహానికి చిరునామాలా సరదాగా రోజులు గడిపేస్తుంటాడు. కొడుకు ఆయనకు పూర్తిగా విరుద్ధం. వయసు 75 ఏళ్లే అయినా, ఆరోగ్యం అంతా బాగానే ఉన్నా, రోజూ డాక్టర్‌ దగ్గరికి వెళ్లి చెకప్‌లు చేయించుకుంటుంటాడు. ప్రతి చిన్న విషయానికీ భయపడుతూ జీవితాన్ని నిరాసక్తంగా గడిపే నిరాశావాది. అతడు అలా ఉంటే తన ఆశయం నెరవేరదనుకున్న తండ్రి కొడుకుని వృద్ధాశ్రమంలో చేరమంటాడు. ‘నువ్వు ఎక్కువ కాలం బతికితే సంతోషించేది నేనే కదా, ఎందుకు నన్ను వెళ్లిపొమ్మంటున్నావు’ అని అడుగుతాడు కొడుకు. ‘జీవితానికి

అర్థమన్నది లేకుండా ఎప్పుడూ భయపడుతూ ప్రతిదానికీ బాధపడుతూ నువ్వు పక్కన ఉంటే నేను ప్రశాంతంగా బతకలేను, నా కోరిక తీరదు. అలా వెళ్లడం ఇష్టం లేకపోతే నువ్వు మారాలి’ అని చెప్పి, కొన్ని షరతులు పెట్టి, కొడుకుని కూడా తనలా మార్చేస్తాడు తండ్రి.

ఆ మధ్య వచ్చిన ‘102 నాట్‌ అవుట్‌’ అన్న హిందీ సినిమా కథ ఇది.


సినిమా సరదాగా ఉన్నా విషయం మాత్రం ఆలోచించదగ్గదే. కుటుంబాల్లో అలాంటి పరిస్థితులు ఇక ముందు సర్వసాధారణం కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆయుఃప్రమాణాలు పెరుగుతున్నాయి మరి! పెరగడమే కాదు, చాలాకాలంగా పోటీ లేకుండా మొదటి స్థానంలో కొనసాగుతూ వస్తున్న జపాన్‌కి గట్టి పోటీ కూడా వస్తోందిప్పుడు. మరో ఇరవయ్యేళ్ల తర్వాత ప్రపంచ దేశాల్లో ప్రజల ఆయుఃప్రమాణాలు ఎలా ఉండబోతున్నాయీ, ఆయుర్దాయాన్ని పెంచుతున్న అంశాలేమిటీ, తగ్గిస్తున్న అంశాలేమిటీ అన్నదానిమీద జరిగిన ఓ అధ్యయనాన్ని ఇటీవల లాన్సెట్‌ పత్రిక ప్రచురించింది. దాని ప్రకారం 2040కల్లా 85.8 ఏళ్ల సగటు ఆయుర్దాయంతో దీర్ఘాయుష్మంతుల జాబితాలో స్పెయిన్‌ తొలిస్థానంలో ఉంటుందట. ప్రపంచంలోనే ఆరోగ్యవంతమైన దేశంగా ఈ దేశం ఇప్పటికే రికార్డుల్లోకెక్కింది. దాని ఫలితమే ఆయుఃప్రమాణం పెరగడం కూడా. దాంతో జపాన్‌ ఒక్క పిసరు వెనకబడి రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వస్తుందట. దాని వెనకాలే సింగపూర్‌, స్విట్జర్లాండ్‌, పోర్చుగల్‌, ఇటలీ, ఇజ్రాయెల్‌, ఫ్రాన్స్‌, లగ్జెంబర్గ్‌, ఆస్ట్రేలియా వరసగా తొలి పదిస్థానాల్లో ఉండబోతున్నాయి. దక్షిణ కొరియా మహిళల ఆయుర్దాయం ఏకంగా 90 ఏళ్లకి చేరనుంది. అమెరికా అయితే 79.8 సంవత్సరాల సగటుతో జాబితాలో 64వ స్థానానికి పడిపోతోంది. 2016-2040 మధ్య ప్రపంచవ్యాప్తంగా సగటు ఆయుర్దాయం 4.4 సంవత్సరాలు పెరగనుండగా అమెరికాలో మాత్రం ఒక్క ఏడాదే పెరగనుంది.
మన దేశానికి వస్తే...

‘మా తాత వందేళ్లు గుండ్రాయిలా బతికాడు. ఏనాడూ గట్టిగా చీది ఎరగడు’ అంటూ వెనకటి కాలం వారి గురించి చెప్పుకోవడం వింటుంటాం. కానీ నిజానికి ఆరోజుల్లో ఆయుఃప్రమాణాలేమీ అంత గొప్పగా లేవు. అంత బాగా నిండునూరేళ్లూ బతికినవారూ అరుదే. ఏ పదిమంది పిల్లల్నో కంటే వారిలో సగమే పురిటిగండాల్నీ, బాలారిష్టాల్నీ దాటుకుని బతికి బట్టకట్టగలిగేవారు. స్త్రీలకు ప్రతి కాన్పూ ఓ గండంగానే గడిచేది. వైద్యరంగంలో ప్రగతి ఆ గండాలన్నీ గట్టెక్కేందుకు తోడ్పడడంతో వందేళ్ల క్రితానికీ ఇప్పటికీ మన ఆయుర్దాయం బాగా పెరిగింది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో మనదేశంలో సగటు ఆయుఃప్రమాణం మూడుపదులే ఉండేది. అది క్రమంగా పెరుగుతూ నేడు 69 ఏళ్లకి చేరింది. అందుకే ఇప్పుడు 90 ఏళ్లూ, వందేళ్లూ జీవించిన వారి గురించి తరచూ వార్తల్లో చూడగలుగుతున్నాం. ఇక 2040 నాటికి మన దేశంలో ఆయుర్దాయం పెరుగుదల 5.9 సంవత్సరాలు. అంటే సగటు ఆయుష్షు 74.5 ఏళ్లకి చేరుతుంది. అయినా జాబితాలో 135 నుంచి 129వ స్థానానికి మాత్రమే వెళ్లగలుగుతాం. పొరుగుదేశమైన చైనా ఈ విషయంలో మనకన్నా చాలా ముందుంది. అక్కడ ఇప్పటి సగటు ఆయుర్దాయం 76.3 సంవత్సరాలు. 2040 నాటికి అది 81.9కి చేరుతుందట.


అమెరికాలోని సియాటిల్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఇవాల్యుయేషన్‌ అనే సంస్థ క్రమం తప్పకుండా అన్ని కోణాల్లో సమాచారాన్ని సేకరించి ప్రపంచదేశాల ఆయుఃప్రమాణాల్ని అంచనా వేస్తుంటుంది. ఇలా ఏయే దేశాల్లో ఆయుర్దాయం ఎలా పెరగబోతోందో చెప్పేందుకు ఆ సంస్థ చేసిన అధ్యయనం అందుకు తోడ్పడుతున్న కారణాలనీ, పెరగకుండా అడ్డుకుంటున్న అవరోధాలనీ కూడా విశ్లేషించింది.
ఈ ఐదూ అవరోధాలే!

ఆధునిక వైద్యశాస్త్రం ఏ రోజుకారోజు సరికొత్త ఆవిష్కరణలతో ముందుకెళుతోంది. యాభై ఏళ్ల క్రితం సాధ్యం కాని ఎన్నో విషయాలు ఇప్పుడు మనకి చాలా మామూలయ్యాయి. కాన్పు సమయంలో తల్లీ బిడ్డల మరణాల్ని దాదాపుగా అరికట్టగలిగాం. మహమ్మారి రోగాలనూ మంత్రదండం లాంటి మందులతో నిలువరించగలుగుతున్నాం. అయినా మనిషి ఆయుష్షు పెరగాల్సినంత పెరగడం లేదన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. అందుకు అవరోధాలుగా పరిణమిస్తున్నవేమిటో కూడా వారు తెలియజేస్తున్నారు. స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, పొగాకు వినియోగం, మద్యపానం... ఈ ఐదూ ఆరోగ్యకరమైన మనిషి జీవితకాలానికి ప్రధాన అవరోధాలుగా మారుతున్నాయట. అందులో మొదటి మూడూ ఆరోగ్య సమస్యలైతే తర్వాతి రెండూ వ్యసనాలుగా మారుతున్న అలవాట్లు. పైగా అన్నీ జీవనశైలికి సంబంధించినవే. ఇక ఆరో స్థానంలో వాయు కాలుష్యం కొత్తగా చేరడాన్ని గమనించమంటున్నారు పరిశోధకులు. ఓ పక్క ఆయుష్షు పెరుగుతున్నా 2040 నాటికి అకాల మరణాలకు కారణం కానున్నాయి- గుండె జబ్బులు, స్ట్రోక్‌, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల సమస్యలు, ఆల్జీమర్స్‌, మధుమేహం లాంటి వ్యాధులూ, రోడ్డు ప్రమాదాలూ. ఇవీ చాలావరకూ జీవనశైలితో లింకు ఉన్నవే. ఆయుష్షును పెరగకుండా అడ్డుకుంటున్నవి ఇవన్నీ అయితే, అసలు ఆయుష్షుకు కారణమైనవి ఏమిటో చూద్దాం.


అసలు కారణాలు

మనిషి ఆయుష్షును ప్రభావితం చేసే అంశాలు చాలానే ఉన్నాయి. నివసించే ప్రాంతం, లైంగికత, జన్యువులు, వ్యక్తిగత పరిశుభ్రత, తీసుకునే ఆహారం, వ్యాయామం, వైద్యసౌకర్యాల అందుబాటు, జీవనశైలి... ఇవన్నీ కలిసి ఆయుఃప్రమాణాల్ని నిర్దేశిస్తాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే వీటన్నిటినీ రెండు ముఖ్యమైన విభాగాలుగా చేయవచ్చు. ఒకటి జన్యుపరమైనది కాగా రెండోది మన జీవనశైలి. జన్యువులు వారసత్వంగా వచ్చేవి కాబట్టి వాటిని మార్చుకోలేం. కానీ జీవనశైలిని మార్చుకోవచ్చు. అది మన చేతుల్లోనే ఉంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడం ద్వారా ఆయుష్షుని ఎంతో కొంత పెంచుకోవచ్చంటున్నారు పరిశోధకులు. జీవనశైలి అనగానే చాలామంది గంటలతరబడి కూర్చోకూడదూ జంక్‌ఫుడ్‌ తినకూడదూ వ్యాయామం చేయాలీ... అంతేకదా అనుకుంటారు కానీ అంతకన్నా ఎక్కువే ఉంటుంది. మనసూ శరీరమూ రెండిటినీ సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని సాధన చేయాల్సి ఉంటుంది. అదెలాగో కూడా నిపుణులు సూచిస్తున్నారు. వారానికో విషయం చొప్పున వీటి మీద దృష్టి పెట్టి క్రమంగా వాటిని జీవితంలో భాగంగా చేసుకోగలిగితే చాలు- ఆరోగ్యాన్నీ ఆయుష్షునీ కూడా పెంచుకోవచ్చు.
దీర్ఘాయుష్షుకు డజను సూత్రాలు

* ముందుగా ఆరోగ్యంగా జీవించాలన్న నిర్ణయాన్ని ఒకటికి పదిసార్లు గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. అప్పుడే దానికి కట్టుబడి ఉండటానికి మనసూ శరీరమూ కూడా సిద్ధమవుతాయి.

* సానుకూల దృక్పథాన్నీ, దృఢమైన మనస్తత్వాన్నీ అలవరచుకోవాలి. వ్యాయామం, యోగా, ధ్యానం... రోజువారీ కార్యక్రమాల్లో భాగం చేసుకోవాలి.

* రోజూ కాసేపు తప్పనిసరిగా ప్రియమైనవారితో గడపాలి. మనసారా నవ్వుకోవాలి. జీవితంలో ప్రతి విషయాన్నీ సీరియస్‌గా తీసుకోకపోవడమూ అందుకు తోడ్పడుతుంది.

* ప్రతివారికీ ఒక ఆశయమంటూ ఉంటుంది. వయసును బట్టి అది మారుతూ ఉంటుంది కూడా. ఆ ఆశయాన్ని బాధ్యతగానో బరువుగానో కాక మనస్ఫూర్తిగా నెరవేర్చాలి.

* శాకాహారానికి ప్రాధాన్యమిస్తే అకాలమరణం సంభవించే రిస్క్‌ 12శాతం తగ్గినట్లే. అలాగని రోజూ అన్నమూ పప్పూ తింటే సరిపోదు. కూరగాయలూ, పండ్లూ ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. పాలూ, పాల ఉత్పత్తులూ, తీపిపదార్థాలూ బాగా తగ్గించాలి.

* ఏడెనిమిది గంటల పాటు మంచి నిద్రపోవాలి. రోజుకు ఆరుగంటలకన్నా తక్కువ నిద్రపోయేవాళ్లలో అకాల మరణం ప్రమాదం 4 రెట్లు ఎక్కువ.

* చురుగ్గా ఉండాలి. ఆఫీసులో ఎనిమిది గంటలు కూర్చుని పనిచేయాల్సి వస్తే గంటకోసారి లేచి నాలుగడుగులు నడవాలి. ఇంట్లో టీవీ చూసేటప్పుడు కూడా ఎన్నో పనులు చేయొచ్చు. పిల్లల హోంవర్కును పర్యవేక్షించడం, వారితో కలిసి బోర్డ్‌ గేమ్స్‌ ఆడటం లేదా ఇంటి పనులు... ఏవైనా సరే, శరీరం కదలడం ముఖ్యం..

* శక్తిమేరకు ఇతరులకు సాయం చేయాలి. అది మానసికంగా తృప్తినిస్తుంది. ఉత్సాహాన్ని పెంచుతుంది.

* ఉద్యోగమైనా వ్యాపారమైనా మరో వృత్తి అయినా- నూటికి నూరుపాళ్లూ అంకితమై పనిచేయాలి. అంటే పనిలో ఆనందాన్ని పొందగలగాలి. అప్పుడు మనసు మీద ఒత్తిడి ఉండదు.

* కుటుంబసభ్యులతో సన్నిహితంగా గడపాలి. బీటలువారిన బంధాలను దీర్ఘకాలం కొనసాగనివ్వకూడదు. క్షమించడం, క్షమించమని కోరడం- బంధాలను దగ్గర చేస్తాయి.

* శరీరంలాగే మనసుకీ వ్యాయామం ఉండాలి. ఖాళీగా ఉండకుండా మంచి సాహిత్యం చదవడం, చిన్న చిన్న పజిల్స్‌ చేయడం, పొడుపు కథలు విప్పడం లాంటివి సాధన చేయాలి. ఏదైనా కళ, హాబీ సాధన చేయడం కూడా మెదడుకి మంచి వ్యాయామమే.
అనుకరించలేం!

దీర్ఘాయుష్కులు ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రజల ఆహారపుటలవాట్లనీ జీవనశైలినీ అనుకరిస్తే సరిపోతుంది కదా అన్ని దేశాలవారూ ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చు- అనుకుంటే పొరపాటే. ఎవరి జీవనవిధానమైనా అక్కడి భౌగోళిక పరిస్థితులను బట్టి ఏర్పడుతుంది. పైగా అవి ఏవీ కూడా శాశ్వతం కాదు. మార్పు సహజం. తరాలతో పాటే జీవన విధానాలూ మారుతుంటాయి. ఎన్నో ఏళ్లుగా ఆరోగ్యకరమైన దేశంగా పేరొందిన జపాన్‌లోనూ ఉద్యోగాల్లో ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. అయినా వారు తట్టుకుని నిలబడగలుగుతున్నారంటే తమ సంస్కృతీ సంప్రదాయాలకు నూరుశాతం కట్టుబడి ఉండటం వల్లే. శతాయుష్కుల దీవిగా పేరొందిన ఒకినావాలోనూ ఇప్పుడిప్పుడే పాశ్చాత్య సంస్కృతి ప్రభావం పడుతోంది. అందుకని ఒకరిని అనుకరించడం వల్ల లాభం ఉండదు. తరతరాలుగా మన జన్యువులకు అలవాటైన ఆహారమే తీసుకుంటూ జీవనశైలి సమస్యలను దరికి రానీయకుండా ఆయుష్షును ప్రభావితం చేసే అంశాలపై దృష్టిపెడితే సరిపోతుంది.

* * *

చేసే పని మనసుకు ఆనందాన్నివ్వాలి.తీసుకునే ఆహారం కడుపుకి తృప్తినివ్వాలి. ఎంచుకునే వ్యాయామం శరీరానికి సుఖాన్నివ్వాలి... ఈ మూడింటినీ దృష్టిలో ఉంచుకుంటే చాలు. వందేళ్లు బిందాస్‌గా బతికేయొచ్చు... ఏమంటారు?

ఆహారమే అమృతమట!
అమృతం తాగి రాలేదు కానీ జపాను వాళ్లు అమృతంలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు. గుండె ఆరోగ్యానికి తోడ్పడే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలుండే చేపలు వారి ఆహారంలో ప్రధానభాగం. ఇక తోఫు, సీవీడ్‌, ఆక్టోపస్‌ లాంటివీ ఎక్కువగా తినడం వల్ల కొన్నిరకాల క్యాన్సర్లూ, రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం లాంటివి తగ్గుతాయట. దానికి తోడు వారు ఆహారాన్ని తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు తీసుకుంటారు. అది నోటికే కాదు, కంటికీ ఇంపుగా ఉండాలని కోరుకుంటారు. అందుకే చిన్న చిన్న పాత్రల్లో ఎంతో అందంగా అలంకరించి

వడ్డిస్తారు. చూస్తేనే సగం ఆకలి తీరిపోయేలా ఉంటాయి ఆ వంటకాలు. అందుకే అక్కడ స్థూలకాయులు కూడా తక్కువే. ఈ కారణాలన్నిటివల్లా జపనీయుల్లో ఆయుర్దాయం పెరుగుతోంది. అక్కడ 90 ఏళ్లు పైబడ్డవారి సంఖ్య గత ఏడాది 20 లక్షలు దాటింది. వందేళ్లు దాటినవారు ఎక్కువగా ఉన్న ఒకినావా ద్వీపం అయితే ఏకంగా ‘ల్యాండ్‌ ఆఫ్‌ ఇమ్మోర్టల్స్‌’ అన్న పేరు పొందింది. ఇక దీర్ఘాయుష్షులో వీరితో పోటీపడుతున్న స్పెయిన్‌ వారి ఆహారంలో అయితే ఆలివ్‌ నూనె, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉంటాయి. దానికి తోడు మధ్యాహ్నం ఓ కునుకు తీయడానికి వీలుగా ఉంటాయి అక్కడి ఆఫీసులూ దుకాణాల పనివేళలు. అమ్మమాటే నా ఆరోగ్య రహస్యం!
డాక్టర్‌ మహతిర్‌ మహమ్మద్‌ వయసు 93 ఏళ్లు... మలేసియా ప్రధానమంత్రి. ఆ హోదాలో ఆయన ఇప్పుడు ఏ దేశం వెళ్లినా అక్కడివారు అడిగే మొదటి ప్రశ్న ‘మీ ఆరోగ్యరహస్యం ఏమిటీ’ అనే. దానికి ఆయన నవ్వుతూ చెప్పే సమాధానం ఏమిటో తెలుసా...

‘నాకు సిగరెట్‌ అలవాటు లేదు. మందూ తాగను కాబట్టి రాత్రి పార్టీలకు ఎప్పుడూ దూరమే. ఏ టైమ్‌కి పడుకున్నా వేకువనే నిద్ర లేస్తాను. తప్పనిసరిగా కాసేపు వ్యాయామం చేస్తాను. చిన్నప్పుడు మా అమ్మ ఒకమాట చెప్పేది- ‘ఆహారం ఎంత రుచిగా ఉన్నా పొట్టలో కాస్త ఖాళీ ఉండగానే తినడం ఆపేయాలీ’ అని. ఇష్టమైన పదార్థం ఎదురుగా ఉంటే తినకుండా ఉండటం కాస్త కష్టమే. కానీ అలవాటైతే అంతకన్నా హాయి ఇంకొకటి ఉండదు. ఆహారం మీద అదుపు ఉంటే బరువు పెరిగే ప్రసక్తే ఉండదు. నాకు విశ్రాంతి తీసుకోవడం ఇష్టం ఉండదు. ఏదైనా వస్తువుని వాడకుండా పక్కన పెడితే కొన్నాళ్లకి అది పనికి రాకుండా పోతుంది. మన మనసూ శరీరమూ కూడా అంతే. రిటైరయ్యామని చాలామంది ఈ రెండిటికీ మితిమీరిన విశ్రాంతి ఇచ్చేస్తారు. నిజానికి మనసుకి వయసుతో సంబంధం లేదు. మనం ఎప్పుడూ మనసుతో జీవించాలి. మనసుకీ శరీరానికీ కూడా ఎప్పుడూ ఏదో ఒక పని చెబుతూ ఉండాలి. మా ఇంట్లో లిఫ్ట్‌ ఉంది. అయినా నేను మెట్లెక్కే వెళ్తాను. సొంత బ్లాగు రాసుకుంటాను. పత్రికలకు వ్యాసాలు రాస్తాను. ఇప్పుడు ప్రధాని పదవిలో తీరిక లేకుండా ఉన్నాను కానీ, ఆ పదవి లేకపోయినా ఖాళీగా మాత్రం ఉండను’ అని చెబుతారు మహతిర్‌. మనమే తగ్గించుకుంటున్నామా!

నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని అందరమూ కోరుకుంటాం. కానీ అందుకు మనం ఏంచేస్తున్నాం? ప్రత్యేకంగా ఏమీ చెయ్యకపోగా, పెరుగుతున్న ఆయుష్షుని మనమే చేతులారా తగ్గించుకుంటున్నామని మాత్రం కచ్చితంగా చెబుతున్నారు నిపుణులు. మన జీవనవిధానానికి సంబంధించి వేర్వేరు అధ్యయనాల్లో తేలిన కొన్ని అంశాలు ఆయుష్షుని ఎలా తగ్గిస్తున్నాయో చూడండి.


ఆలస్యం అమృతం విషం: రాత్రి పెందలాడే పడుకుని, ఉదయం త్వరగా నిద్రలేవడం మంచి అలవాటని అందరికీ తెలుసు. కానీ ఆచరించేది ఎంతమంది? ఆ అలవాటున్నవారితో పోలిస్తే ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా నిద్రలేచే వారిలో ఆయుక్షీణత 10శాతం పెరుగుతోందట. నాణ్యమైన నిద్ర తగ్గడమే కాదు, మానసిక, నాడీ సంబంధ సమస్యలు పెరగడానికీ, మధుమేహం సమస్య రావడానికీ ఆ అలవాటే కారణమవుతోంది.


నిద్రాహారాలు: నిద్ర ప్రభావమే ఆహారం మీదా పడుతోంది. సరైన నిద్ర లేని చికాకు వారిని జంక్‌ఫుడ్‌వైపు ఆకర్షితుల్ని చేస్తుందట. దాంతో సమతులాహారానికి దూరమై అనారోగ్యాలను ఆహ్వానిస్తున్నారు.


దురలవాట్లకు నాంది: ఆలస్యంగా నిద్రపోయే అలవాటే పలు దురలవాట్లకూ దారితీస్తోంది. పొగతాగడం, మద్యం అలవాట్లు అలా అవుతున్నవే. ఏ దేశ ప్రజల ఆయుఃప్రమాణాల్ని పరిశీలించినా పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ కాలం బతకడానికి కారణం వారిలో దుర్వ్యసనాల జోలికి వెళ్లేవారు తక్కువ కావడమే.


కాల్చేస్తుంది: మనం సిగరెట్‌ కాలిస్తే సిగరెట్‌ మన ఆయుష్షును కాల్చేస్తుంది. పొగ తాగడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలే వస్తాయనుకుంటాం కానీ శరీరంలోని అన్ని అవయవాల మీదా దాని ప్రభావం పడుతుంది. ఫలితంగా కాల్చే ప్రతి సిగరెట్టూ 11 నిమిషాల ఆయుర్దాయాన్ని తగ్గించేస్తుంది.


నిద్ర... ‘పోతోంది’: రోజుకు కనీసం 8 గంటల నిద్ర ఉండాలని డాక్టర్లు చెప్పడమే తప్ప ఎవరూ అంత నిద్రపోవడం లేదు. 1942లో ప్రజల సగటు నిద్ర 7.9గంటలు ఉండేదట. ఇప్పుడది 6.8 గంటలకు తగ్గిపోయింది. నగరాల్లో విద్యార్థులూ ఉద్యోగులూ అయితే ఐదారు గంటలే పడుకుంటున్నారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నిద్ర శరీరానికీ మనసుకీ విశ్రాంతి నిస్తుందనే మనకు తెలుసు. కానీ కీలకమైన ఆ సమయంలో శరీరం ఎన్నో మరమ్మతులు చేసుకుంటుంది. నిద్ర తగ్గేకొద్దీ ఆ పనులూ ఆగిపోతాయి. 
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment