Karthika Masam, Lord Siva, Lord Vishnu, Lord Lakshmi Narayana, Sivakesava, Shivakesava, Harihara, Lord vishnu and Lord Siva, Lord Siva and Lord Vishnu, Annavaram Satyanarayana Swamy Vratham, Satyanarayana Swamy Vratham, Mohanpublications, Bhakti Books, Granthanidhi, Bhakti Pustakalu

------
online లో
కొనుగోలు చేయుటకు Devullu.Com
క్లిక్ చేయగలరు.

------

కార్తికం హరిహరాత్మకం. శివకేశవులిద్దరికీ ప్రీతికరం... ఆధ్యాత్మిక సాధనకు అద్భుత సమయం... అందుకే కార్త్తికాన్ని మించిన మాసం లేదు... నకార్తీక సమో మాసః అని స్కాంద పురాణం చెబుతోంది... పూజల్లో శివకేశవులకు సమాన ప్రాధాన్యం దక్కే మాసమిది. ఈ కాలంలో మహావిష్ణువుకు కార్త్తిక దామోదరుడని పేరు. పరమ శివుడు కార్త్తిక మహాదేవుడు. చలిపొద్దులలో నదీస్నానాలు కార్త్తిక దామోదరుడికి అంకితం. ఉభయ సంధ్యల్లో ప్రత్యేక దీపారాధనలు మహాదేవుడికి ధారాదత్తం. నమక చమకాలతో నిత్యాభిషేకాలు, బిల్వార్చనలు శివుడికి కైంకర్యాలైతే... ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి రోజుల్లో హృదయాభిషేకాలు మహా విష్ణువుకు భక్తితో సమర్పించే నీరాజనాలు. శివకేశవుల అభేదాన్ని స్మరించవలసిన, చాటాల్సిన కాలమిది...

నీవు శివుడవు జగములకు మంగళకరుడవు. విష్ణువనగా, శివుడనగా ఒకరేనని దివ్య చక్షువు గ్రహిస్తుంది. - దక్షయజ్ఞం అనంతరం శివుడితో మహర్షులు

శివాయ విష్ణు రూపాయ...
ఈ సృష్టి నిర్వహణం, నిర్మూలనం అనే రెండు భాగాలుగా కనబడుతూ ఉంటుంది. వీటిని నిర్వహించే దైవం కూడా రెండు స్వరూపాలుగా కనబడుతుంది. అంటే ఒకే చైతన్యాన్ని రెండు రూపాలుగా చూస్తున్నామని అర్థం. ఆ చైతన్యం సగుణం, సాకారం అయినప్పుడు శివకేశవాత్మకంగా... నిర్గుణం, నిరాకారం అయినప్పుడు అది పరమాత్మ, ఓంకార స్వరూపంగా వేదాలు ప్రతిపాదించాయి. అంటే శుద్ధ చైతన్య స్వరూపం ఓంకారం కాగా... నిర్వహణ బాధ్యత విష్ణువుది. నిర్మూలన బాధ్యత పరమ శివుడిది. ఇదే ఈ సృష్టి రహస్యం. వీరిద్దరూ సృష్టి నిర్వహణలో అనునిత్యం ఒకరికొకరు సహకరించుకుంటూనే ఉంటారు. ఈ విషయాన్ని భగవద్గీత మనకు తెలియజేసింది. అందులోని పదకొండో అధ్యాయంలో విశ్వరూప సందర్శనం అనంతరం అర్జునుడు మీకింత ప్రళయ సదృశ్యమైన రూపమెందుకని కృష్ణుడిని అడిగినట్లు కనిపిస్తుంది. అప్పుడు కృష్ణుడు రుద్రాణాం శంకరశ్చాస్మి... నేను రుద్రులలో శంకరుణ్ణి అని అంటాడు. అంతేకాదు ఇది నా కాల స్వరూపం. లోకాలను క్షీణింపజేయడానికి ఈ రూపంలో వ్యక్తమవుతాను అని బదులిస్తాడు. కాబట్టి వృత్తి ధర్మంగా నిర్వహణకు విష్ణువు, నిర్మూలనకు శివుడు బాధ్యతవహిస్తున్నా వారిద్దరూ ఒకటేనన్నది నిశ్చయం. ఈ భావాన్ని హరిహరఅద్వైతం అనే పేరుతో మనకు వ్యాసమహర్షి అందించారు. ఆ చైతన్యానికి సంబంధించిన విషయాలను అనేక సందర్భాల్లో తెలుగు కవులు తిక్కన, పోతన వంటివారు మనకు వివరించారు. హరిహరతత్త్వాల మధ్య ఉండే అన్యోన్యతను, వాటి మధ్య ఏకత్వ భావనను వ్యాస భగవానులు మనకు అనేక సందర్భాల్లో, అనేక కథల రూపంలో వివరించారు. శివకేశవ అభేదాన్ని లోకానికి గుర్తు చేసి ప్రజలను సరైన మార్గంలోకి తీసుకురావాలన్న వ్యాసమహర్షి లక్ష్యానికి కొనసాగింపే మహాభారతంలో తిక్కన ప్రతిపాదించిన హరిహరాద్వైత భావన.

వేదం అంతర్యామి తత్త్వాన్ని పురుషుడు అనే పేరుతో ప్రతిపాదించింది. ఆ పురుషుడు శివుడనిగానీ, విష్ణువని గానీ చెప్పలేదు. పురుషసూక్తం పురుషుణ్ణి వర్ణించిన మహా మంత్రం. అందులో ఎక్కడా శివకేశవుల ప్రస్తావన రాదు. వేదాల్లో అలా పురుషుడిగా ప్రతిపాదించబడిన అంతర్యామి సర్వవ్యాపిగా వర్ణితమైనప్పుడు విష్ణువుగా... శుభకరుడు, మంగళకరుడు అనే ప్రతిపాదనల్లో శివుడిగా కనిపిస్తాడు. ‘విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచమ్‌’ అనే విష్ణత్వ వైభవం, నమశ్శివాయచ శివతరాయచ అనే పరమశివ వైభవం అంటూ అంతర్యామికి చెందిన రెండు వైభవాలను వేదం వర్ణించింది. ఇక్కడ ఉన్నది ఒక్కడే అనేదే వేద ప్రతిపాదనగా మనం గ్రహించాల్సి ఉంది.

నువ్వు ఎవరికి తెలుస్తావో, వారికి నేను అర్థమవుతాను. నిన్ను సేవించడమంటే నన్ను ఆరాధించడమే. మనిద్దరి మధ్య భేదమనేది లేదు.
- శివుడితో విష్ణువు అన్నట్లు మహాభారతం శాంతి పర్వం చెబుతుంది


* మహాభారతం ద్రోణపర్వంలో శ్రీకృష్ణుడు తనతో పాటు అర్జునుణ్ణి తీసుకుని కైలాసానికి వెళతాడు. అక్కడ శివుడి మెడలో ప్రకాశించిన మాల్యాను లేపనాదులను అర్జునుడు గుర్తిస్తాడు. అవి తానే స్వయంగా కృష్ణుడికి సమర్పించినవి. దాంతో వారిద్దరూ ఒకటేనని తెలిసివస్తుంది. అలాగే అర్జునుడు యుద్ద రంగంలో విజృంభించి బాణపరంపరతో శత్రు సైన్యాన్ని ఊచకోత కోస్తుంటే ఒక విశేషాన్ని గుర్తిస్తాడు. తనకన్నా ముందు ఒక దివ్యాకృతి త్రిశూలాన్ని చేత ధరించి శత్రు సంహారం చేస్తూ కనిపిస్తుంది. అలా శూలం తెగటార్చిన తర్వాత తన బాణాలు వెళ్లి ఆ దేహాలకు గుచ్చుకుంటున్నాయి. అంటే పరాక్రమం శూలానిది. కీర్తి అర్జునుడిది. ఆ తర్వాత వ్యాసమహర్షిని అర్జునుడు ‘అయ్యా! ఆ దివ్య స్వరూపం ఎవది’దని అడిగితే ‘ఆయన సాక్షాత్తు పరమ శివుడయ్యా. ఒక దివ్య ప్రణాళికను అనుసరించి కృష్ణుడు, శివుడు ఒకరికొకరు అలా సహకరించుకుంటూ పోవడం మామూలే’నని చెబుతాడు.* విష్ణురూపాయ నమశ్శివాయ... అని పోతన స్పష్టంచేశారు. ఆయన రాసిన భాగవతం దశమ స్కంధంలో బాలకృష్ణుడు శరీరం దుమ్ము కొట్టుకుపోయేలా ఆటలాడుకుంటుంటే ఆ దివ్యమంగళ రూపాన్ని ఇలా వర్ణిస్తారు.
 
తనువుననంటిన ధరణీ పరాగంబు
పూసిన నెరిభూతి పూఁతగాగ
ముందర వెలుగొందు ముక్తాలలామంబు
తొగలసంగడికాని తునుకగాగ
ఫాలభాగంబుపై బరగు కావిరిబొట్టు
కాముని గెల్చిన కన్నుగాగ
గంఠమాలికలోని ఘననీల రత్నంబు
కమనీయమగు మెడకప్పుగాగ
హరివిల్లు లురగహార వల్లులుగాగ
బాలలీల బ్రౌఢబాలకుండు
శివుని పగిది నొప్పె శివునికి దనకును
వేరులేమి దెలుప వెలయునట్లు!!

శరీరాన్నంటుకున్న దుమ్ము విభూతి పూత అవగా, తలకు పెట్టుకున్న ఆభరణంలో ముందరి భాగాన ఉన్న పెద్ద ముత్యం ఫాలముననున్న చంద్రవంక కాగా, నుదుటి మీద పెట్టిన నల్లని బొట్టు మన్మధుని కాల్చిన మూడో కన్నులా గోచరించగా, కంఠమాలికలోని పెద్ద నీలపు రత్నం శివుడి మెడలోని నల్లదనంలా కనిపించగా, మెడలోని హారాలు శివుడి మెడలోని పన్నగ హారాలుకాగా, బాల లీలలు చూపుతున్న శ్రీకృష్ణుడు శివునకు, తనకు ఎలాంటి భేదం లేనట్లుగా దర్శనమి,చ్చాడు.
- ఎర్రాప్రగడ రామకృష్ణ

శుభ కార్త్తికం

* కార్తికం అంటే కృత్తికా నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలిగిన పుణ్యప్రదమైన మాసం. కృత్తికా నక్షత్రానికి సంబంధించిన చాంద్రమానం కార్తిక మాసానికి నాలుగు పేర్లున్నాయి. 1.కార్తికం 2.బాహులం 3.ఊర్జం 4.కార్తికికం.
ఈ నాలుగు పేర్లలోనూ ఒక్కో పేరుకు ఒక్కో విశిష్ఠత ఉంది. కృత్తికా నక్షత్రానికి అగ్ని నక్షత్రం అని పేరు. చలి బాధ అధికమైన ఈ మాసంలో శరీరంలోని అగ్నిని చల్లార్చకుండా కాపాడేది కాబట్టి ఈ మాసం కార్త్తికం అయింది. బహుళమైన ప్రయోజనాలు అందించే మాసం కాబట్టి దీనికి బాహుళం అని కూడా పేరు. ఊర్జం అంటే ఉత్సాహం. కార్తికికం అంటే కృత్తికా నక్షత్రంతో అనుబంధమైన మాసం కాబట్టి ఈ పేరు వచ్చింది.

* కార్త్తిక మాసానికి కౌముదీమాసం అని కూడా పేరు. కౌముది అంటే వెన్నెల. శరత్‌కాలపు స్వచ్ఛమైన వెన్నెల ఈ మాసంలో ఉంటుంది. దీపావళి మొదలుకొని నెల రోజుల పాటు కార్త్తిక మాసంలో ఉదయ, సాయంకాలాల్లో దీపాలని వెలిగిస్తే ఉత్తమ లోకాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. సంధ్యాదీపాలు, ఆకాశ దీపాల పేరుతో ఈ మాసమంతా తళతళ్ల్లాడుతుంటుంది.

* కార్త్తిక శుద్ధ సప్తమిని శాకసప్తమి అంటారు. ఈ పవిత్ర దినాన బిళ్వదళాలు, పద్మాలు, తామరతూండ్లతో అర్చించడం సంప్రదాయం. అష్టమినాడు గోవులను పూజిస్తారు. భూమండలం ఓ గోవులాంటిది. దానిని ఎంత రక్షించుకుంటే అంత సంపదలు కలుగుతాయని భావిస్తారు.

* కార్త్తిక శుద్ధ దశమిని కృతయుగారంభంగా పరిగణిస్తారు. దర్మం నాలుగు పాదాలుగా విస్తరించి ఉండే కృతయుగం అన్ని యుగాలకూ ఆదర్శం. ఈ రోజు జగద్ధాత్రీ పూజను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. కార్త్తిక శుద్ధ దశమినాడు రాజ్యాధికారాన్ని కోరేవారు సార్వభౌమవ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే సార్వభౌములైన చక్రవర్తుల్లా వెలిగిపోతారని నమ్మకం.


* కార్త్తిక శుద్ధ ఏకాదశి ప్రభోదనైకాదశిగా సుప్రసిద్ధం. ఆషాఢశుద్ధ ఏకాదశితో ప్రారంభమైన చాతుర్మాస్య దీక్షకు ముగింపును సూచించే పుణ్యదినం ఇది. ఈ రోజున మహావిష్ణువు నిద్ర నుంచి మేల్కొంటాడని నమ్మకం. అందుకే ఈ దినాన్ని ప్రబోధనైకాదశి అనే పేరుతో పిలుస్తారు. దీనికే ఉత్థాన ఏకాదశి, హరి ప్రబోధనోత్సవం అనే పేర్లు కూడా ఉన్నాయి.

* కార్తీక పౌర్ణమి పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైంది. చంద్రకళాధరుడైన శివుడి జటాజూటంలో కొలువై ఉన్న చంద్రుడు ఈ పవిత్ర దినాన అమృత కళలను ప్రసాదిస్తాడని నమ్మకం.

* కార్త్తిక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. దీన్నే చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్ర దినాన మహావిష్ణువు క్షీరసాగరం నుంచి బయలుదేరి తులసీ నిలయమైన బృందావనంలోకి ప్రవేశిస్తాడని ఐతిహ్యం. అందుకే ఈ రోజు తులసీ బృందావనాలలో పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్ర దినాన్నే మథన ద్వాదశి అని కూడా పిలవడం పరిపాటి. అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించినట్లు, అమృతత్వ సిద్ధి కోసం ఉపాసకులు ఈ రోజు విష్ణువును ఆరాధిస్తారు.
- అయాచితం నటేశ్వరశర్మ

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment