------
online లో
కొనుగోలు చేయుటకు Devullu.Com
క్లిక్ చేయగలరు.

------

పసుపు తినండహో..!

పసుపు హిందువులకి పరమ పవిత్రమైనది. పూజల్లో ముందుగా పసుపుతో చేసిన విఘ్నేశ్వరుడిని చేసి కొలుస్తారు. పూజలూ వ్రతాలూ చేసేటప్పుడు దేవీపటాలకీ కలశాలకీ పసుపు బొట్లు పెట్టడం తెలిసిందే. పసుపు కొట్టడంతోనే పెళ్లిపనులు మొదలవుతాయి. పెళ్లికి ముందు ఒంటికి పసుపు పూయడం మంగళప్రదమైన వేడుక. పెళ్లిపిలుపుల కార్డుకి పసుపు పూశాకే అది శుభలేఖ. పెళ్లికి ఒకప్పుడు పసుపుపారాణే మెహందీ. పసుపు కలిపితేనే బియ్యం తలంబ్రాలవుతాయి, అక్షతలుగా మారతాయి. పెళ్లిలోని తాళీ పసుపుతాడే. బంగారు సూత్రాలు లేకున్నా పసుపు కొమ్ము ఉంటే చాలు, పెళ్లయిపోతుంది. అందుకే పసుపు అన్నమాటే మనకు ఎంతో శుభకరం. 
భారతీయ సంస్కృతీసంప్రదాయల్లోనూ అంతగా మమేకమైన పసుపును ముఖానికీ పాదాలకూ రాసుకోవడం ప్రాచీనకాలం నుంచీ వస్తోంది. అందులో అందంతోబాటు ఆరోగ్యమూ దాగుంది. పసుపు పూసిన ముఖం పచ్చగా మెరుస్తుంది. 
మొటిమలకి అది మంచి మందు. పాదాలకి రాస్తే ఇన్ఫెక్షన్లని రానివ్వదు. గాయాలూ త్వరగా మానతాయి. 

మన ఆహారంలోనూ పసుపు వాడకం ఎక్కువే. ఏ కూర చేయాలన్నా తాలింపులో చిటికెడు పసుపు వేయాల్సిందే. ఇక, పులిహోర, మజ్జిగపులుసుల సంగతి సరేసరి. జలుబు చేసినా, జ్వరం వచ్చినా గోరువెచ్చని పాలల్లో పసుపు పడాల్సిందే. అందుకే పసుపు అద్భుత సౌందర్య లేపనం. అంతకుమించిన ఆరోగ్య కషాయం. 

సర్వ రోగనివారిణి! 
ఐదు వేల సంవత్సరాల క్రితం మన ఆయుర్వేద, గృహవైద్యాల్లో వాడుకలో ఉన్న పసుపు గురించీ అందులోని కుర్‌క్యుమిన్‌ అనే రసాయనం గురించీ కొత్త సంగతులెన్నో చెప్పుకొస్తున్నారు పాశ్చాత్య నిపుణులు. కేవలం మూడు నెలలపాటు క్రమం తప్పకుండా రోజుకు సుమారు 750 మి.గ్రా. చొప్పున కుర్‌క్యుమిన్‌ ఇవ్వడంవల్ల ఆల్జీమర్స్‌ రోగుల్లో జ్ఞాపకశక్తి పెరిగిందట. రోజుకి 100 మి.గ్రా. తీసుకున్నా మంచి ఫలితం కనిపించిందట. అందుకే, వేగంగా విస్తరిస్తోన్న మతిమరపు జబ్బుకి పసుపుని మించిన మందు లేదు అంటున్నారు సదరు నిపుణులు. 

చికాకు, ఆందోళన, నిరాశలతో బాధపడేవాళ్లకి ఆరు వారాలపాటు కుర్‌క్యుమిన్‌ను ట్యాబ్లెట్ల రూపంలో ఇవ్వడం వల్ల మెదడు చురుగ్గా మారిందనేది మరో పరిశోధన. మూత్రసంబంధ సమస్యలున్న వాళ్లకి పసుపు క్యాప్సూల్స్‌ను మూడు నెలలు వాడి చూస్తే అవన్నీ తగ్గుముఖం పట్టాయట. దీన్ని ఒమేగా-3-ఫ్యాటీ ఆమ్లాలతో కలిపి తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉందట. మోకాళ్లనొప్పులకీ కాళ్లనొప్పులకీ ఇది బ్రూఫిన్‌లానే పనిచేస్తుందనీ కొన్ని అధ్యయనాల్లో తేలింది. బైపాస్‌ సర్జరీ తరవాత నాలుగైదు రోజులపాటు కుర్‌క్యుమిన్‌ను ఇవ్వడం వల్ల ఇతరత్రా సమస్యలేవీ తలెత్తలేదట. 
టాక్సిన్లని బయటకు పంపించడం ద్వారా పసుపు కాలేయ పనితీరుని మెరుగుపరుస్తుందనీ, వృద్ధాప్యాన్ని అడ్డుకుంటుందనీ, శృంగారప్రేరితమనీ కూడా చెబుతున్నారు. క్యాన్సర్‌ కణాల పెరుగుదలనూ ఇది అడ్డుకుంటుంది. ముఖ్యంగా క్లోమ, ప్రొస్టేట్‌, చర్మ క్యాన్సర్లను నివారిస్తుందట. మంటను తగ్గిస్తుంది. హృద్రోగాలనీ నియంత్రిస్తుంది. ఆర్ద్రయిటిస్‌తో పోరాడుతుంది. జ్ఞాపకశక్తినీ పెంచుతుంది. ఆహారానికి రంగునీ రుచినీ ఇవ్వడంతోబాటు జీర్ణశక్తికీ తోడ్పడుతుంది. ఇంకా కీళ్లనొప్పులు, పొట్టనొప్పి, డయేరియా, తేన్పులు, ఆకలి లేకపోవడం, కామెర్లు, బ్రాంకైటిస్‌, తలనొప్పి, చర్మసంబంధ సమస్యలు, జలుబు, జ్వరాలూ... ఇలా ఒకటేమిటి, సకల వ్యాధులకూ కుర్‌క్యుమిన్‌ మందులా పనిచేస్తుందని అధ్యయనాలూ పరిశీలనలూ వెల్లువెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా పసుపు వాడకం పెరిగింది. దాంతో క్యాప్సూల్స్‌ రూపంలోనే కాకుండా ఆహార పదార్థాల రూపంలోనూ దీన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. 

కొత్తకొత్తగా..! 

సూపర్‌ ఫుడ్‌, మిరకిల్‌ స్పైస్‌ అంటూ ఆహారాన్ని పసుపుమయం చేసేస్తున్నాయి పాశ్చాత్య కంపెనీలు. గోల్డెన్‌ మిల్క్‌ పేరుతో పాలే కాదు, కాఫీ, టీ, స్మూతీ, ఐస్‌క్రీమ్‌, బన్‌, బ్రెడ్‌, కుకీస్‌, చాకొలెట్స్‌, నెయ్యి, తేనె.... ఇలా అన్నింటినీ పసుపు కలిపి తయారుచేస్తున్నారు. ఇంట్లో చేసుకునేవి సరేసరి. అన్నం, కూరల్లో మనలా ఓ చిటికెడు కాదు, స్పూన్లకొద్దీ పసుపు వేసుకుని తినేస్తున్నారు, తాగేస్తున్నారు. మొత్తమ్మీద పసుపు ఓ క్రేజీ సూపర్‌ఫుడ్‌గా మారిందక్కడ. దాంతో ప్రపంచవ్యాప్తంగా 80 శాతం దేశాల్లో పసుపుని సాగుచేయడం మొదలుపెట్టారు. అయితే ఉత్పత్తిలోనూ వాడుకలోనూ ఇప్పటికీ ప్రథమస్థానం మనదే. దీని స్వస్థలం దక్షిణ భారతావనే అయినప్పటికీ, దేశంలో అందరికన్నా కశ్మీరీ ముస్లింలు పసుపుని ఆహారం, ఆరోగ్యంకోసం ఎక్కువగా వాడటం విశేషం. అయితే ఫాస్ట్‌ఫుడ్స్‌ పుణ్యమా అని, మనదేశంలో పసుపు వాడకం తగ్గడంవల్లనే మధుమేహం బాగా పెరిగిందని భారతీయ శాస్త్రవేత్త ‘గార్గ్‌’ పరిశీలనలో తేలిందట. 200 మి.గ్రా. కుర్‌క్యుమిన్‌ను, ఒక గ్రాము ఒమేగా ఫ్యాట్స్‌తో కలిపి చేసిన క్యాప్సూల్స్‌ను తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని అడ్డుకోవచ్చని ఆయన వివరిస్తున్నారు. 

ఎవరు ఎంత మోతాదులో తీసుకున్నా అందులోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌ కుర్‌క్యుమినే కీలకం. ఇది పసుపులో మూడు శాతం మాత్రమే ఉంటుంది. అందులో 25వ వంతు మాత్రమే శరీరం పీల్చుకుంటుంది. అందుకే అంత మొత్తాన్ని పసుపు రూపంలో తీసుకోవడం కష్టం కాబట్టే, కుర్‌క్యుమిన్‌ను ప్రత్యేకంగా సేకరించి క్యాప్సూల్‌ రూపంలో తయారుచేస్తున్నారు. ఆహారంలో భాగంగా తీసుకునేటప్పుడు మిరియాలూ, ఫ్యాటీఆమ్లాలతో కలిపి తీసుకుంటే ఒంటికి బాగా పడుతుందట. టీ రూపంలో తీసుకున్నా మేలే. ముఖ్యంగా రోజుకి మూడుసార్లు పసుపు టీ లేదా కషాయం తాగితే ఆర్థ్రయిటిస్‌ నొప్పులు తగ్గుతాయి. అదేసమయంలో రోగనిరోధకశక్తీ పెరుగుతుంది. ఇన్ని లాభాలున్నందువల్లే ‘పసుపు తినండొహో...’ అంటూ శాస్త్ర ప్రపంచం ఎలుగెత్తుతోంది, ఆహారపదార్థాలన్నీ పసుపుపచ్చదనంతో నోరూరిస్తున్నాయి.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment