------
online లో
కొనుగోలు చేయుటకు Devullu.Com
క్లిక్ చేయగలరు.

------

 మనసే మందిరం 
శరత్‌ చంద్రికలు

చందమామ వెన్నెలనే కాదు శుభాలనూ వర్షిస్తాడు 
కలువలనే కాదు మనసునూ వికసింపజేస్తాడు 
చీకటి రాత్రులనే కాదు తమస్సు నిండిన హృదయాలనూ తేజోమయం చేస్తాడు... 
అందుకే ఆయనను మనఃకారకుడంటారు... 
ఆధ్యాత్మిక జగతిలో శరత్కాలానిది ప్రత్యేక పాత్ర 
నిర్మలమైన శరత్‌చంద్రుడు సాధకులకు సహకరిస్తాడు, 
అద్భుతమైన సందేశాలనిస్తాడు...

ఏడాదిలో వచ్చే ఆరు రుతువుల్లోనూ వసంత, శరదృతువులు చాలా ప్రధానమైనవి. ఇవి ఆయా కాలాల్లో వచ్చే ప్రాకృతిక మార్పుల్ని సూచిస్తూ, అందుకు అనుగుణంగా మనిషి తన జీవనగమనాన్ని తీర్చిదిద్దుకునేందుకు అవసరమైన సంకేతాలను ఇస్తాయి. వీటిలో వసంత రుతువు సుమ వికాసం కలిగిస్తే, శరదృతువు సోమ వికాసం కలిగిస్తుంది. సోముడు అంటే చంద్రుడు. సంవత్సరకాలంలోని ఆరు రుతువుల్లో మొత్తం పన్నెండు పున్నములు వస్తాయి. వీటన్నిటిలో శరత్కాలంలో (ఆశ్వయుజ, కార్తికమాసాలు) వచ్చే పున్నమి రోజుల్లో చంద్రుడు అద్భుతమైన తేజస్సుతో ప్రకాశిస్తాడని దేవీభాగవతం చెబుతోంది. పదహారు కళలతో ప్రకాశించటం వల్ల శరత్కాల పున్నమి నాటి చంద్రుడిని పూర్ణచంద్రుడు అంటారు. స్వచ్ఛతకు, ప్రశాంతతకు శరత్కాలం నిలయంగా ఉంటుంది. ఈ భావాన్నే ప్రకటిస్తూ ఆంగ్లేయులు కూడా ‘హార్వెస్ట్‌ మూన్‌’ అంటూ చంద్రుడిలోని స్వచ్ఛతను ఆస్వాదిస్తారు.

* శరదృతువు మనసుకు అంతులేని ఆహ్లాదాన్నిస్తుంది. అది చంద్రుడి వల్లే సాధ్యమవుతుంది. వేదం ‘చంద్రమా మనసో జాతః’ - విరాట్‌ పురుషుడి మనస్సు నుంచి చంద్రుడు ఉద్భవించాడని చెబుతోంది. ఈ చంద్రుడి వల్ల సకల ప్రాణికోటికి మనస్సు ఏర్పడిందని నమ్ముతారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. మనస్సును ప్రభావితం చేస్తాడు. అన్ని రుతువుల కన్నా శరదృతువులో చంద్రుడి ప్రకాశం ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమయంలో ఆ ప్రభావం మనందరి మనస్సుల మీద మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్లనే జ్యోతిష విజ్ఞానవేత్తలు మనో సంబంధమైన సమస్యలు తొలగిపోవటానికి చంద్రగ్రహ ప్రీతి చెయ్యాలని చెబుతారు. చంద్రగ్రహ జపాలు, దానాలు, చంద్రగ్రహ సంబంధమైన రత్నాన్ని ధరించాలని సూచిస్తారు.

* శరత్కాలంలో ఆకాశం నిర్మలంగా ఉంటుంది. దీనివల్ల చంద్రకాంతిని పరిపూర్ణంగా ఆస్వాదించటానికి వీలుపడుతుంది. శుద్ధంగా, స్పష్టంగా, స్వచ్ఛంగా మనస్సు ఉండాలని చెప్పడమే శరత్కాల చంద్రుడు అందించే ఆధ్యాత్మిక ప్రబోధం. మనస్సు స్థిరంగా ఉండడం, ఏవిధమైన వికారాలు లేకుండా దృఢంగా ఉండటమే ఆధ్యాత్మిక సాధనకు పరమావధి. భౌతికంగా ఉండే సుఖాలు, దుఃఖాలు, మానాలు, అవమానాలు, కలిమిలేములు, కష్టాలు, నష్టాలు, బాధలు మొదలైనవన్నీ అంటని నిర్మలమైన మనస్సును సాధించటమే సాధకుడి అంతిమ లక్ష్యం అవుతుంది. గెలిచామా... ఓడామా అనేది కాకుండా గెలుపు ఓటములను పట్టించుకోని స్థితికి ఎదగాలి. నిరంతరం కర్తవ్యదీక్షతో ఉండాలి. ఇందుకు సంకేతం శరచ్చంద్రుడు.

* ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే రెండు పున్నములను శరత్పూర్ణిమలంటారు. ఈ రోజుల్లో చేసే ధ్యాన, అర్చనలు విశేషఫలితాలనిస్తాయి. ఆధ్యాత్మికంగా, యోగసాధన పరంగా ఈ రెండు పున్నములకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజుల్లో దీపాలు వెలిగించటం ప్రధానమైన అంశంగా ఉంటుంది. దీన్నే ‘దేవ దీపావళి’ అంటారు. ఈ రోజునే రాసలీలా మహోత్సవం జరిగింది. యోగశుద్ధులైన జీవులు గోపికలు. వారిని కృష్ణపరమాత్మ అనుగ్రహించి మోక్షాన్ని అనుగ్రహించిన ఘట్టమే రాసలీలా మహోత్సవం. ఇందుకు శరత్పూర్ణిమ వేదికగా నిలిచింది. ఈ పూర్ణిమ రోజున కొన్ని ప్రాంతాల్లో దేవీ ఆరాధన కూడా చేస్తారు. అమ్మవారిని ఉపాసన చేసే శ్రీవిద్యా సంప్రదాయంలో శరత్పూర్ణిమను ‘ముఖ్యరాకా’ అని పిలుస్తారు.

* కార్తీకమాసంలో పౌర్ణమి కృత్తిక నక్షత్రం రోజున వస్తుంది. ఈ నక్షత్రం అగ్ని సంబంధమైంది. ఇందుకు ప్రతీకగానే ఆ రోజున దీపారాధన చెయ్యడం ఆచారంగా వస్తోంది. అలాగే, కృత్తిక నక్షత్రంలో జన్మించిన కుమారస్వామి ఆరాధన కూడా ఈ మాసంలో చేస్తారు.ఈ రోజునే కుమారస్వామి తారకాసురుడిని వధించాడని నమ్ముతారు. ఇందుకు సంకేతంగా కొన్ని ప్రాంతాల్లో కార్తీకపూర్ణిమను ‘కుమారదర్శనం’ పేరుతో వ్యవహరిస్తారు. అలాగే, త్రిపురాసురులను పరమేశ్వరుడు వధించిన రోజుకు గుర్తుగా కార్తీక పూర్ణిమను ‘త్రిపుర పూర్ణిమ’గా కూడా పాటిస్తారు.


ఆదిశంకరాచార్యులు సౌందర్యలహరిలో అమ్మవారిని వర్ణిస్తూ 
శరజ్జ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం 
వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తక కరామ్‌ 
సకృన్నత్వా నత్వాకథమివ సతాం సన్నిదధతే 
మధుక్షీర ద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః 
శరత్కాలంలో కాసే స్వచ్ఛమైన, నిర్మలమైన పరిపూర్ణమైన వెన్నెల వలే అమ్మవారి ముఖం ఉందంటారు.

జైన సంప్రదాయం, పంజాబ్‌లలో కూడా శరత్కాలంలో వచ్చే పూర్ణిమకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ రోజుల్లో వారు గంగా మహోత్సవం నిర్వహిస్తారు. గురునానక్‌ జయంతి కార్తిక పూర్ణిమ. ఈ రోజున ‘గురుపూరబ్‌’తో ప్రత్యేక ఉత్సవం చేస్తారు. ఆదికావ్యం రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి కూడా ఆశ్వయుజ పూర్ణిమ రోజునే జన్మించారు. ఈ కారణంగా ఆశ్వయుజ పూర్ణిమను ఆంధ్రప్రాంతంలో వాల్మీకి జయంతిగా చేసుకునే ఆచారం కూడా ఉంది.

కాళిదాసుకు అక్షర లక్షలు 
భోజరాజు రాజ్యంలోని ఓ నలుగురు బ్రాహ్మణులు చాలా బీదవారు.మంచి కవిత్వం చెబితే రాజు ధనాన్ని ఇస్తాడన్న ఆశతో ఓ మంటపంలో కూర్చుని శ్లోకం రాయటం ప్రారంభిస్తారు. ఒక వ్యక్తి ‘భోజనం దేహి రాజేంద్ర’ అని,. రెండో వ్యక్తి ‘ఘృతసూప సమన్వితమ్‌’ అని రెండు పాదాలు రాశారు. ఓ రాజా! పప్పు, నెయ్యిలతో కూడిన భోజనాన్ని మాకు అనుగ్రహించు అని ఈ రెండు పాదాలకు అర్థం. మిగిలిన రెండు పాదాలను పూర్తిచెయ్యలేక వారు నానా తంటాలు పడుతుంటారు. ఇంతలో అటుగా వచ్చిన కాళిదాసు ‘మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దధీ’ అని మూడు, నాలుగు పాదాలు పూర్తిచేస్తాడు. శరత్కాలంలో వెలిగే చంద్రుడి వంటి పరిమాణంలో ఉన్న గారెలు, ఆ శరత్కాలపు చంద్రుడు కురిపించే వెన్నెల వర్ణంతో సమానమైన స్వచ్ఛమైన పెరుగుతో కలిసిన భోజనం కావాలి ఆ బ్రాహ్మణులు రాజాస్థానానికి వెళ్లి శ్లోకం వినిపిస్తారు. భోజరాజు ఆ బ్రాహ్మణుల జీవితానికి సరిపడినంత ధనం ఇవ్వమని మంత్రిని ఆదేశించి, మూడు నాలుగు పాదాలు రాసిన కవికి అక్షరలక్షల ముత్యాలు ఇవ్వమంటాడు. శరత్కాల చంద్రుడిని ఇంత అందంగా వర్ణించగల కవి కాళిదాసు తప్ప మరొకరు లేరంటాడు భోజరాజు.

16 కళల వెనక కథ ఇదీ... 
చంద్రుడికి ఈ కళలు రావటం వెనుక పురాణగాథ ఉంది. దక్షప్రజాపతి అశ్వని, భరణి మొదలైన తన 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు. అందరినీ అనురాగంగా చూసుకుంటున్నప్పటికీ రోహిణి అంటే చంద్రుడికి ఎక్కువ ఇష్టం ఉండేది. ఆమెపై ఎక్కువ అనురాగం, ఆప్యాయత కనబరచేవాడు. ఇది సహించలేని మిగిలిన అక్కాచెల్లెళ్లు తండ్రితో విషయాన్ని చెబుతారు. అతడు చంద్రుడిని పిలిచి కుమార్తెలందరినీ సమానంగా చూసుకోవాలని హితవు చెబుతాడు. అయినా, చంద్రుడు తన పద్ధతి మార్చుకోకపోవటంతో ఆగ్రహించిన దక్షుడు అల్లుడనే ఆలోచన లేకుండా చంద్రుడికి క్షయవ్యాధి కలగాలని శపిస్తాడు. శాపం కారణంగా చంద్రుడు నానాటికీ క్షీణించసాగాడు. దీంతో అతని నుంచే వచ్చే వెన్నెల ఆగిపోయింది. లతలు, వృక్షాలు వాడిపోయాయి. కలువలు వికసించలేదు. ఓషధుల్లో గుణం నశించింది. లోకానికి కలిగిన ఈ అకారణ దుఃఖాన్ని గమనించిన ఇంద్రాది దేవతలు చంద్రుడితో సహా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి, చంద్రుడికి శాపవిముక్తి కలిగించమని ప్రార్థిస్తారు. ప్రభాస క్షేత్రంలో శివుడిని గురించి తపస్సు చెయ్యమని బ్రహ్మదేవుడు చెబుతాడు. ఆవిధంగా తపస్సు చేసిన చంద్రుడికి శివుడు ప్రత్యక్షమై రోజుకు ఒక కళ నశించేలా, తిరిగి 15 రోజుల తర్వాత రోజుకు ఒక కళ పెరుగుతూ పూర్ణచంద్రుడిగా పూర్ణిమ రోజున ప్రకాశించేలా అనుగ్రహిస్తాడు. ఇలా చంద్రుడి కళల్లో తగ్గుదల, పెరుగుదల కారణంగా ఏర్పడినవే శుక్ల, కృష్ణ పక్షాలు. ఈ విధంగా చంద్రుడికి పదహారు కళలు ఏర్పడ్డాయి. 

శరత్కాలంలో వచ్చే తొలి పూర్ణిమ ఆశ్వయుజ పూర్ణిమ. ఈ రోజుకు అనేక పేర్లు, ఈ రోజున ‘కౌముద్యుత్సవం’, ‘కోజాగరీ’ వ్రతాలు చేస్తారు. వాలఖిల్య మహర్షి ద్వారా కోజాగరీ వ్రతం వ్యాప్తిలోకి వచ్చింది. ఆశ్వయుజ పూర్ణిమను ‘కౌమార పౌర్ణమాసి’ పేరుతో కొన్ని చోట్ల పాటిస్తారు. మరికొందరు ఈ రోజున లక్ష్మీంద్ర కుబేర పూజ చేస్తారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఆశ్వయుజ పూర్ణిమ రోజున ‘గొంతెమ్మ పండుగ’ జరుపుకుంటారు. గొంతెమ్మ అంటే ‘కుంతి’ అని అర్థం. పార్వతీదేవికి ఉన్న పేర్లలో ‘కుంతిపరమేశ్వరి’ ఒకటి. అందువల్ల గొంతెమ్మ పండుగ పార్వతీదేవికి సంబంధించిందిగా తెలుస్తోంది. . శరత్పూర్ణిమ రోజున ఆరుబయట వెన్నెలో పరమాన్నం వండి, దాని మీద చంద్రకిరణాలు పడేలా ఉంచి, ఆ ప్రసాదాన్ని స్వీకరించే ఆచారం కొన్నిప్రాంతాల్లో ఉంది.


ఎన్నో నోములు 
మరెన్నో పూజలు 
శరత్పూర్ణిమ వ్రతాన్ని కొన్ని ప్రాంతాల్లో ఆచరిస్తారు. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో ఒక సంపన్నకుటుంబానికి చెందిన దంపతులకు కలిగిన బిడ్డ ఏమాత్రం అంగసౌష్టవం లేకుండా ఉండేది. ఓ సిద్ధ పురుషుడి సూచనతో ఆ దంపతులు అప్పటికే కన్యగా ఎదిగిన తమ బిడ్డతో ‘శరత్పూర్ణిమ’ నోము నోయించారు.. శరత్కాలం ప్రారంభమైన తొలిరోజున ఆరుబయట చంద్రకాంతిలో ఉండేలా వెండితో చేసిన అమ్మవారి ప్రతిమను అర్చించి, వెండితో చేసిన చంద్రుడి ప్రతిమను దానం చేయిస్తారు. ఇలా చంద్రుడిలో ఉండే పదహారు కళలకు ప్రతీకగా శుక్లపక్షమంతా చేయిస్తారు. తిరిగి కార్తికమాసం శుక్ల పక్షంలో కూడా ఈ విధానంలో అర్చనలు చేయిస్తారు. ఇలా మూడేళ్లు చేయగానే ఆ కన్య సుందరిగా ప్రకాశించింది.
ఖగోళ విజ్ఞానపరంగా చూస్తే ఆశ్వయుజ మాస ప్రారంభంలో ఆకాశంలో అగస్త్య నక్షత్రం కనిపిస్తుంది. ఇది శరత్కాలానికి ప్రారంభ సూచిక. ఈ నక్షత్రం కనిపించగానే రాజులు దండయాత్రలకు బయల్దేరటానికి సిద్ధపడేవారని కాళిదాస మహాకవి రఘువంశ కావ్యంలో రాశాడు.
మనస్సును ఆహ్లాద పరిచే సౌందర్యం శరచ్చంద్రుడిలో ఉంది. ముఖచంద్రుడు అనడంలో అంతరార్థం ఇదే. తాను ప్రశాంతంగా ఉంటూ తన తోటి వారిని కూడా ప్రశాంతంగా ఉంచే వారే నిజమైన ఆధ్యాత్మిక సాధకులు అవుతారు. మనవల్ల సమాజం ఉద్వేగం పొందని స్థితిలో ఉన్నా, సమాజం వల్ల మనం ఉద్వేగానికి లోనుకాని స్థితిలో ఉన్నా.. మానవ జీవనం ఆత్మజీవనం అవుతుంది.
కార్తీక పూర్ణిమ రోజున ఆచరించే వ్రతాల్లో భక్తేశ్వర వ్రతం స్త్రీలకు సౌభాగ్యం కలిగించే వ్రతంగా చేసుకునే ఆచారం ఉంది.
చంద్రుడు పదహారు కళలతో ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. 
ఆ కళలు 
1.అమృత 
2.మానద 
3.పూష 
4.తుష్టి 
5.సృష్టి 
6.రతి 
7.ధృతి 
8.శశిని 
9.చంద్రిక 
10.కాంతి 
11.జ్యోత్స్న 
12.శ్రీ 
13.ప్రీతి 
14.అంగద 
15.పూర్ణ 
16.పూర్ణామృత
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment