ప్రకృతి దేవాయ నమ:


మన దేవతామూర్తులందరిలోకెల్లా అత్యధికంగా ప్రాకృతిక ఆరాధనా స్వభావాన్ని కలిగి వున్న దైవం గణపతి!
నలుగు పిండి, ఏనుగు తల, ధాన్యం, బియ్యం పిండి, 21 రకాల ఔషధ పత్రాలు, ఆఖరకు గరిక వంటి ప్రకృతి పదార్థాలతోనే అత్యధికంగా మమేకమయ్యే అరుదైన అర్చన గణేశునిది. ఆయన ప్రకృతి దైవం అని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ ఆధారాలు అక్కర్లేదు. స్థూలకాయులను చూసి నవ్వేవాళ్లకు అపవాదులు తప్పవని చెప్పే శక్తి స్వరూపం ఆయనది. తన పేరుతో ప్రజానాయకుల్ని అపహాస్యం చేసే దుర్జనుల దుమ్ము దులిపే విలక్షణ అధినాయకుడు. ఇంతేనా? ఆర్తులు, అభాగ్యులు, అమాయకులైన తన ప్రియభక్తుల మొరలను కేవలం ఒక్క గరిక పూజతోనే బేషరతుగా ఆలకించే ఆదిదేవుడు. పండుగలకే తొలి పండుగైన వినాయక చవితి వేళ మన జీవితాలలో అద్భుత విజయాల కోసం అందరం నిశ్చల భక్తి శ్రద్ధలతో విఘ్నరాజును మనసారా ఆరాధిద్దాం.

గణపతి పుట్టుపూర్వోత్తరాలు తెలిసిన వారికి ఆయన ప్రాకృతిక స్వభావం, ఆరాధనా పద్ధతులు తప్పక అర్థమవుతాయి. నలుగు పిండి, ఏనుగు తలతోపాటు బియ్యం పిండితో చేసే గణపతి ఆహారమైన ఉండ్రాళ్లు, కుడుములు వంటివన్నీ ప్రకృతికి ప్రతీకలే. మణులు- మాణిక్యాలు ఆయనకు అక్కర్లేదు. వైభవోపేతమైన అలంకరణలకు దూరం. వట్టి మట్టితో విగ్రహం చేసి, ఎర్రని కుంకుమను నుదుట దిద్దండి. తెల్లని కొత్త వస్ర్తాలు, యజ్ఙోపవీతం, పూలు, పళ్లు, గరిక పోచలు చాలు.

వినాయక చతుర్థి తొమ్మిది రోజుల పండుగ. కనీసం మూడు లేదా అయిదు రోజులైనా సరే. కృత్రిమ రసాయనాలతో చేసే విగ్రహాలు ప్రకృతికి విరుద్ధం కాబట్టి, ఇకనైనా వాటికి గుడ్‌బై చెబుదాం. సాలగ్రామ, మంత్ర, కలశ, లింగ వంటి రూపాలలో గణపతిని దేనిలోనైనా దర్శించవచ్చు. వరసిద్ధి వినాయక వ్రతంలో నల్లమట్టి (పుట్టమన్ను లేదా చెరువు మట్టి) ప్రతిమను పూజించడమే అనాదిగా వస్తున్న ఆచారం. మొత్తంగా గణపతి పూజలోనే ప్రకృతి ఆరాధన కొలువై ఉంది.

గణపతికి ప్రియమైన సంఖ్య 21. ప్రకృతిలో లభించే ఔషధగుణాలతో కూడిన 21 పత్రాలతో ఆయనకు ఏకవింశతి పత్రపూజ చేయడం విశేషం. మరే దేవుడూ ఈ పూజను అందుకోడు. ఆ పత్రాలు ఇవీ: ధవనం, వాకుడాకు, మారేడు, గరిక, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, గన్నేరు, విష్ణుక్రాంత, దానిమ్మ, దేవదారు, మరువం, వావిలాకు, జాజి, తెల్ల గరిక, జమ్మి, రావి, మద్ది, జిల్లేడు ఆకులు). గరికతో చేసే దూర్వాయుగ్మ పూజ కూడా అత్యంత విశిష్ఠమైంది. ఏకవింశతి పూజలో గరిక ఉన్నా, మళ్లీ ప్రత్యేకించి స్వామి దశనామాలతో ప్రత్యేక పూజ చేయాల్సిందే.

గరికకు ప్రకృతిలో ఉన్న ప్రాధాన్యం ఇంతా అంతా కాదు. వర్షాకాలం ప్రారంభమవడంతోనే చెరువు, బావులు, కాల్వల గట్లమీద, ఇంకా ఎక్కడంటే అక్కడ, కట్టలు కట్టలుగా పెరుగుతుంది. పౌరాణికంగానూ వంద యజ్ఞాలకు మించిన ఫలాన్ని ఒక్క గరిక పోచ పూజ ఇస్తుందని పండితులు అంటారు. అందుకే, గరిక లేని వినాయక పూజ వ్యర్థమని కూడా తేల్చారు.

గణపతి పుట్టుకే ఆసక్తికరం. పార్వతీదేవి స్వయంగా నలుగు పిండితో చేసిన బొమ్మకు ప్రాణం పోస్తే పుట్టిన బాలుడతను. తాను స్నానం చేసే వరకూ ఎవరినీ లోనికి రానివ్వ వద్దన్న తల్లి ఆదేశాన్ని అక్షరాలా పాటించాడు. ఇది తెలియని శంకరుడు వచ్చీ రావడంతోనే తన ఇంట్లోకి తననే రానివ్వకుండా అడ్డుకున్నాడన్న కోపంతో త్రిశూలంతో ఆ బాలుడి తలను ఖండించి, లోనికి వెళతాడు. తర్వాత సంగతి తెలిసి బాధపడతాడు శివుడు. అంత క్రితమే నంది కొమ్ములతో హతమైన గజరూప రాక్షసుని (గజాసురుని) తలను తెచ్చి బాలుని మొండేనికి అతికించి, తిరిగి ప్రాణం పోస్తాడు.

నంది, భృంగి, వీరభద్ర, చండేశ్వరులతో కూడిన ప్రమధ గణాలకు అధిపతి గణపతి. ఈ పదవి కోసం అన్నాతమ్ముల మధ్య జరిగిన పోటీలో ఆయన గెలుపొందిన వైనం మానవాళికి ఆదర్శప్రాయం. ముల్లోకాలలోని పుణ్యనదులలో స్నానమాడి ఎవరు తొలుత వస్తారో వారికే ప్రమధ గణాధిపత్యం అన్న తం డ్రి ఈశ్వరుని ప్రకటనలోని పరమార్థం గణపతికే అనుకూలం. కుమారస్వామి తన వాహనమైన నెమలిని అధిరోహించి నదీ స్నానానికి వెళ్లిన ప్రతీచోట.. గణపతి అప్పటికే స్నానం చేసి వెళ్లిపోయే దృశ్యం కనిపిస్తుంది. నారాయణ మంత్రం జపించి, తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడుమార్లు ప్రదక్షిణ చేయడం ద్వారానే గణపతి అంతటి అద్భుత శక్తిని పొందుతాడు. ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రుల ఆరాధనను మించిందేముంటుంది? మొత్తం మూడు లోకాలలోని మూడు కోట్ల యాభై లక్షల నదులలో స్నానం చేసిన పుణ్యం ఈ సందర్భంగా గణపతికి లభించినట్టు పురాణ కథనం.

ఏనుగు తల, పెద్ద బొజ్జ, కుబ్జరూపంతో కూడిన గణపతి వంటి వింత దేవుడు హైందవంలో చాలా అరుదు. ఈయనను అత్యంత ప్రాచీన దేవునిగానూ పురాణాలు చెబుతున్నాయి. భాద్రపద శుద్ధ చవితి (చతుర్థి) ఆయన పుట్టిన రోజు. ప్రతీ కుటుంబంలోని చిన్నా, పెద్దా, ఆడ, మగా తేడా లేకుండా అందరూ ఆ రోజు ఆయనకు విశేష పూజలు చేస్తారు. ఊరు, వాడ, ఇంటింటా ప్రతిమలను ప్రతిష్టించి నవర్రాతులూ షోడశోపచారాలతో పూజించి అనంతరం గంగాదేవి ఒడిలోకి చేరుస్తారు. గణపతిని ఆరాధిస్తే సర్వ విఘ్నాలూ తొలగుతాయన్నది భక్తుల పరిపూర్ణ విశ్వాసం. హైందవంలో ఏ పూజైనా, వ్రతమైనా, మరే శుభకార్యమైనా సరే, గణపతి పూజతోనే మొదలు కావాలి. పార్వతీ పరమేశ్వరులు సృష్టికే ఆదిదంపతులైతే, వారి పెద్ద కుమారుడు విఘ్నేశ్వరుడు దేవతారాధనల్లోనే తొలిపూజను అందుకుంటున్నాడు.

జీవికి తగ్గట్టు శరీరాకృతి ఉండడం సహజం. ఏనుగును చూసి చీమ అపహాస్యం ఆడితే, చీమకన్నా అనేక లక్షల రెట్లు చిన్నవైన సూక్ష్మజీవులు ఏమనుకోవాలి? ఎవరి దేహం వారిది. ఈ మౌలిక సూత్రం తెలియని చంద్రుడు అపహాస్యానికి పాల్పడిన ఫలితం యావత్ లోకానికి శాపమైంది. కడుపు నిండా ఉండ్రాళ్లు, కుడుములు తిని ఆనందంలో మునిగి వున్న గణపతిని చూసిన చంద్రుడు ఫక్కున నవ్వాడు. గణపతి ఊరుకుంటాడా? చవితి నాడు నిన్ను చూసిన వారెవరైనా నీలాప నిందల పాలవుతారని శపిస్తాడు. ఇది తట్టుకోలేక చంద్రుడు కాళ్లబేరానికి రాగా, గణపతి కనికరించి, తన పుట్టిన రోజు (వినాయక చవితి) తన వ్రతం చేసిన వారికి సదరు అపవాదులు తొలగుతాయన్న మినహాయింపు నిస్తాడు. ఆఖరకు శ్రీకృష్ణుడంతటి వాడికే నీలాపనిందలు తప్పలేదన్న సంగతి ఇక్కడ గమనార్హం.
 
శ్రీ కృష్ణునికే తప్పని నీలాప నిందలు!
చంద్రునికి గణపతి ఇచ్చిన శాపం సప్తఋషుల భార్యలకేకాదు, సాక్షాత్తు శ్రీ కృష్ణుడంతటి వాడిపైనే ప్రభావం చూపింది. క్షీరప్రియుడైన గోపాలుడు ఆ రోజు స్వయంగా పాలు పితుకుతూ పొరపాటున చంద్రుని వంక చూస్తాడు. అంతే! తర్వాత కొన్నాళ్లకు సత్రాజిత్తు వద్ద వున్న శమంతకమణిని కృష్ణుడు రాజుకోసం కోరడం, దానిని అతను ఇవ్వడానికి నిరాకరించడం, తర్వాత అతని తమ్ముడు ప్రసేనుడు దానిని ధరించి అడవికి వెళితే అతను సింహం బారిన పడడం, మృగరాజునే చంపిన భల్లూక రూపంలో ఉన్న జాంబవంతుడు తన కుమార్తెకు మణిని ఇయ్యడం.. చివరకు ఆ మణికోసమే కృష్ణుడు తన తమ్ముణ్ని చంపాడన్న నిందను సత్రాజిత్తు ప్రచారంలోకి తేవడం టకటకా జరిగిపోయాయి. పాపం, కృష్ణుడు ఈ అపవాదును తొలగించుకోవడానికి జాంబవంతుడితో పోరాడి, మణిని సాధిస్తాడు. అలా దానిని సత్రాజిత్తుకు అప్పజెప్పితే కానీ, వచ్చిన నింద తొలగలేదు. ఫలితంగానే శ్రీ కృష్ణుడు మరో ఇద్దరు భార్యల (జాంబవతి, సత్యభామ)ను పొందిన వైనం అందరికీ తెలిసిందే. కాబట్టి, చవితినాడు చంద్రుణ్ణి చూసినా పొయ్యేదేమీ లేదు, కాకపోతే గణపతి పూజ చేసి, ఈ కథ చదవడమో, వినడమో చేస్తే ఎలాంటి అపవాదుల బారిన పడరన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం. 


ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment