
మహావిష్ణువు దాల్చిన అయిదోది వామనావతారం. స్వామి భాద్రపద శుద్ధ ద్వాదశినాడు అదితి, కశ్యపుల కుమారుడిగా అవతరించాడు. వామన జయంతిని విజయద్వాదశి, శుక్ర ద్వాదశి, వామన ద్వాదశి, శ్రవణ ద్వాదశి, మహాద్వాదశి అన్న పేర్లతోనూ వ్యవహరిస్తారు.
విరోచనుడు అనే దైత్యుడి కొడుకు బలి. రాక్షస కులంలో పుట్టినా గొప్ప విష్ణుభక్తుడు. ఇంద్రుణ్ని జయించి బలి స్వర్గాధిపతి అయ్యాడు. ఆ గర్వంతో దేవతల్ని, మునుల్ని బాధించసాగాడు. దేవతలు శ్రీమన్నారాయణుడితో మొరపెట్టుకున్నారు. శ్రీహరి వాళ్ల విన్నపాన్ని అంగీకరించి, లోక కల్యాణార్థం వామనుడిగా అవతరించాడు. బ్రహ్మతేజస్సుతో విరాజిల్లుతూ దండం, గొడుగు, కమండలం ధరించి యాచకుడి వేషంలో బలిచక్రవర్తి దగ్గరకు వెళ్లాడు.
దానశీలి అయిన బలి ఆ సమయంలో యజ్ఞశాలలో యాగం చేస్తున్నాడు. వామన మూర్తిని సత్కరించి, అంజలిబద్ధుడై ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. ‘కేవలం మూడు అడుగుల నేల నాకు దానం చేస్తే చాలు’ అన్నాడు వామనుడు. ఇంతే కదా అని బలి అంగీకరిస్తాడు. గురువైన శుక్రాచార్యుడికి కబురు పంపుతాడు. శుక్రాచార్యుడు వచ్చి వామనుడి ఆంతర్యం గ్రహించి, దానం ఇవ్వడంతోనే వామనుడి రూపంలో వచ్చిన విష్ణువు నిన్ను పాతాళానికి తొక్కివేస్తాడని హెచ్చరిస్తాడు. అయినా బలి ఆడిన మాట తప్పనన్నాడు. దానం చేసేముందు నీరు వదలడానికి కమండలం అందుకున్నాడు. శుక్రుడు సూక్ష్మరూపం ధరించి కమండలం కొమ్ముకు అడ్డంపడి నీరు కారకుండా చేశాడు. బలి ఒక పుల్లతో కొమ్ములోకి పొడిచాడు. ఫలితంగా శుక్రాచార్యుడి కన్ను పోయింది. శుక్రాచార్యుడు బయటికొచ్చేశాడు. దానకర్మ ప్రారంభించాడు బలి. వామనుడు త్రివిక్రముడిగా విరాట్ రూపం ధరించి, ఒక పాదంతో భూమిని, ఒక పాదంతో ఆకాశాన్ని ఆక్రమించి, మూడో (పాదం) అడుగు కోసం బలి నెత్తిమీద ఉంచి పాతాళానికి తొక్కేశాడు. అతడి సర్వ సమర్పణ భావానికి ప్రసన్నుడైన వామనమూర్తి సుతల లోకరాజ్యానికి అధిపతిగా అనుగ్రహిస్తాడు.
బలి విష్ణుభక్తికి సంతోషించిన శ్రీహరి, బలి భవనానికి ద్వారపాలకుడిగా ఉండి, నిత్యం వామన దర్శనభాగ్యం ప్రసాదించాడు.
వామన పురాణంలో ఈ సందర్భానికి చెందినదే మరోగాథ ఉంది. ‘దుంధుడు’ అనే దానవుడు దేవతల్ని ఓడించేందుకు, తగిన బలం కోసం దేవికా నదీతీరాన అశ్వమేధయాగం ప్రారంభిస్తాడు. శ్రీహరి వామన రూపంలో నదీ ప్రవాహంలో ఓ దుంగలా తేలుతూ కొట్టుకుపోతుంటే దుంధుడు బాలుణ్ని కాపాడతాడు. తన పేరు గతిభానుడని, ఆస్తి వివాదాలవల్ల దాయాదులు తనను నదిలో పడేశారని వామనుడు చెబుతాడు. దుంధుడు అది నమ్మి ఏం కావాలో కోరుకొమ్మంటాడు. వామనుడు మూడు అడుగుల నేలకోరి, అతణ్ని భూమి లోపలికి తొక్కివేశాడని ఆ పురాణ కథనం.
ఆత్మతత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది వామనావతారం. దేహంలోని ఆత్మ, విశ్వాంతరాళమంతా పరివ్యాప్తమైఉన్న పరమాత్మ ఒక్కటేనన్న ఆత్మజ్ఞాన రహస్యానికి దర్పణం బలి దానగుణం. ‘నేను ప్రభువును, నేను దాతను’ అని గర్విస్తే ఫలితమిదేనని భగవద్గీతా మనకు చెబుతుంది.
వామన ద్వాదశి ముందురోజు ఏకాదశినాడు ఉపవసించి జాగారం చేసి, వామన విగ్రహాన్ని పూజిస్తారు. విగ్రహానికి శిఖ, సూత్రం, యజ్ఞోపవీతం, ఛత్రం, కమండలం అలంకరణోపకరణాలు. ఈ శ్రవణద్వాదశి పర్వదినాన వంజులీ, దుగ్ధ, అవియోగ ద్వాదశి, అనంతద్వాదశి, కల్కి ద్వాదశి పేర్లతో వ్రతాలు చేయాలని నీల పురాణం చెబుతోంది. శుక్రద్వాదశి పేరుతో ఈ రోజున ఇంద్ర ధ్వజోత్థాపన పూజ చేస్తారు. దీని ఫలితంగా సస్యానుకూల వర్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఎదుటివారిని చులకనగా చూసే అహంకారపూరితులకు తగిన గుణపాఠం నేర్పి, వారికి సక్రమ మార్గ నిర్దేశనం చేయడమే వామనావతార రహస్యం! - చిమ్మపూడి శ్రీరామమూర్తి
వామన జయంతి

శ్రీ మహావిష్ణువు త్రివిక్రముడిగా అవతరించిన అవతారం వామనావతారం. భాద్రపద శుక్లపక్షంలో ద్వాదశి రోజున వైకుంఠనాథుడు ఆదితి గర్భాన వామనుడిగా జన్మించాడు. ఈ అవతారం విశిష్టతను గురించి విష్ణుపురాణంలో వివరించారు. రాక్షసరాజైన బలి చక్రవర్తి దేవతలతో యుద్దంలో పరాజయం పాలవుతాడు. అనంతరం గురువు శుక్రాచార్యుని సూచనలతో యజ్ఞాలు చేసి అనేక విజయాలు సాధిస్తాడు. అనంతరం మరింత శక్తిని సంపాదించాలన్న తలంపుతో యాగాలను నిర్వహిస్తాడు. దీన్ని గమనించిన దేవేంద్రుడు వైకుంఠానికి వెళ్లి విష్ణుమూర్తితో మొరపెట్టుకుంటాడు. మరో వైపు బలి చక్రవర్తి యజ్ఞాలు పూర్తవుతున్నాయి. వందో యజ్ఞం ప్రారంభమవుతుంది. ఆదితికి తనయుడిగా జన్మించిన మహావిష్ణువు బ్రాహ్మణ బాలుడిగా యజ్ఞప్రదేశానికి వెళుతాడు. సూర్యభగవానుడిచ్చిన గొడుగు, కుబేరుడు ప్రసాదించిన భిక్షపాత్రతో యజ్ఞప్రాంగణంలోకి అడుగుపెట్టిన వామనమూర్తి తేజస్సుకు బలిచక్రవర్తి ఆశ్చర్యం చెందుతాడు. దానాల్లో భాగంగా ఏం కావాలో కోరుకోమనగా తనకు కేవలం మూడు అడుగులు చాలని బలిచక్రవర్తిని ఆయన కోరుతాడు. దీనికి అంగీకరించిన బలి అతనికి మూడుఅడుగులను దానంగా ఇస్తాడు. దీంతో వామనుడు తన ఆకారాన్ని పెంచి ఒక్క అడుగు భూమిని, మరో అడుగు ఆకాశంపై పెడుతాడు. మూడు అడుగు ఎక్కడ పెట్టాలని బలిని అడగ్గా స్వామి విరాట్ స్వరూపాన్ని వీక్షించి అతను ఆనందభరితుడై మూడో అడుగును తన తలపై పెట్టమని సూచిస్తాడు. దీంతో మూడో అడుగును బలిచక్రవర్తిపై పెట్టిన త్రివిక్రముడు అతన్ని పాతాళానికి పంపించివేస్తాడు. అయితే బలి దాన గుణానికి సంతోషం చెందిన మహావిష్ణువు ఏటా అతను కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేట్టు వరమిస్తాడు. ఇప్పటికీ కేరళలో ఓనం పండగను బలి రాక కోసం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
|
No comments:
Post a Comment