కోనేటి రాయుడి కొండంత వైభవం!
‘నారాయణ పర్వతంపై పుష్కరిణీ తీరంలో సూర్యుడు కన్యారాశిలో ఉండగా వచ్చిన భాద్రపద మాసంలో శ్రవణా నక్షత్రం సిద్ధయోగ సమయంలో శ్రీనివాసుడు వేంకటాద్రిపై అవతరించాడు’ అని పద్మ పురాణంలో ఉంది. స్వామిని వెదుకుతూ సృష్టికర్త అయిన బ్రహ్మ, ఇతర దేవతలు తిరుమల చేరుకున్నారు. శ్రీనివాసుడిని దర్శించి ఆనందించారు. ‘ఓ శ్రియఃపతీ! నీకు మహోత్సవం నిర్వహించాలని కోరుకుంటున్నాము. అనుగ్రహించాల’ని బ్రహ్మదేవుడు కోరాడట. అందుకు వేంకటనాథుడు అంగీకారం తెలిపాడు. స్వామి ఆమోదంతో బ్రహ్మదేవుడు తొలిసారి ఉత్సవాలను నిర్వహించారని పురాణ కథనం. నాటి నుంచి ఈ ఉత్సవాలను బ్రహ్మోత్సవాలుగా నిర్వహిస్తున్నారు. కాగా బ్రహ్మాండమంతా ఆనందించేలా జరిగే ఉత్సవాలు కనుక ‘బ్రహ్మోత్సవాలు’ అన్నారు.
బ్రహ్మ రథం అదే...
సృష్టికర్త బ్రహ్మ పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు జరుగుతాయని నమ్మకం. శ్రీనివాసుడికి జరిగే వాహన సేవల్లో ముందువైపు ఖాళీగా ఒక రథం వెళ్తూ ఉంటుంది. దీనికి ‘బ్రహ్మరథం’ అని పేరు. ఇందులో బ్రహ్మదేవుడు నిరాకార రూపంలో ఉండి.. ఉత్సవాలను పర్యవేక్షిస్తుంటాడట. అయితే రథోత్సవం నాడు మాత్రం బ్రహ్మరథం ఉండదు. ఎందుకంటే.. ఆనాడు బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీవారి రథాన్ని లాగుతుంటాడట.
ముగింపు లెక్క....
విష్వక్సేనుడు... భూమి పూజ!
బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు వచ్చే మంగళవారం ‘కోయిల్ ఆళ్వారు తిరుమంజనం’ అంటే ఆలయ శుద్ధి జరుగుతుంది. ఉత్సవాల ముందు రోజు ‘అంకురార్పణ’ జరుగుతుంది. సాయంత్రం స్వామివారి సేనాధిపతి అయిన విష్వక్సేనుడు ఊరేగింపుగా ‘వసంత మంటపాని’కి చేరుకుంటాడు. వేదమంత్రాలను అర్చకులు పఠిస్తూ ఉండగా.. సేనాధిపతి విష్వక్సేనుడు భూమిపూజ చేస్తాడు. అనంతరం పుట్టమట్టిని సేకరించి ప్రదక్షిణంగా వచ్చి ఆలయంలోకి ప్రవేశిస్తాడు. అంతేకాకుండా మాడవీధుల్లో ఊరేగుతూ ఉత్సవ ఏర్పాట్లు పరిశీలిస్తాడు. పుట్టమట్టిని సేకరించి విష్వక్సేనుడు ఆలయానికి చేరుకోగానే.. ఆ మట్టిని ఉపయోగించి యాగశాలలో కేత్తపాలికలలో (చిన్నకుండల వంటివి) నవధాన్యాలను పోసి అంకురార్పణ చేస్తారు. అంకురం అంటే విత్తనం నుంచి వచ్చే చిన్న మొలక. అంకురాలను మొలకెత్తించడమే అంకురార్పణ.
జెండా రెపరెపలు...
బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. ఆలయంలోని ధ్వజస్తంభంపై గరుడకేతాన్ని ఎగురవేయడమే ధ్వజారోహణం. శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తి అయిన శ్రీమలయప్పస్వామి.. తన దేవేరులు శ్రీదేవి, భూదేవి సమేతుడై.. పరివార దేవతలైన అనంత, గరుడ, విష్వక్సేన, సుగ్రీవ, హనుమంత, అంగదులను వెంటబెట్టకొని మాడవీధుల్లో ఊరేగి.. దేవతలను ఆహ్వానిస్తాడు. అనంతరం స్వామి ఆలయంలోని ధ్వజస్తంభం దగ్గరకు చేరుకుంటాడు. పరివార దేవతలు అంకురార్పణ మంటపానికి చేరుకుంటారు. ఈ సమయంలో గరుత్మంతుడి చిత్రం ఉన్న పసుపుపచ్చని వస్త్రం అంటే గరుడ కేతాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేస్తారు. ఈ సమయంలో ‘ముద్గలాన్నం’ అంటే పెసర పులగం నివేదిస్తారు. ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని విశ్వసిస్తారు. సాయంత్రం ధ్వజారోహణం నిర్వహించిన తర్వాత ఆ రాత్రి నుంచి వాహన సేవలు ప్రారంభమవుతాయి.
ఆయప్ప... మలయప్పే!
బ్రహ్మోత్సవాలతో పాటు దాదాపు అన్ని సేవల్లోనూ స్వామివారి ఉత్సవ మూర్తి మలయప్పస్వామే పాల్గొంటాడు. వాస్తవానికి వేంకటేశ్వరుడికి ఉత్సవమూర్తులు నలుగురు ఉన్నారు. భోగ శ్రీనివాసమూర్తి, కొలువు శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, మలయప్పస్వామి. 1339 సంవత్సరంలోని శాసనం ప్రకారం ఉత్సవమూర్తిగా శ్రీదేవి, భూదేవిలతో కూడిన ఉగ్ర శ్రీనివాసమూర్తి పాల్గొనేవాడు. అయితే 14వ శతాబ్దంలో ఒకానొక సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ఉగ్రశ్రీనివాసమూర్తి ఊరేగుతూ ఉన్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగి ఇళ్లన్నీ తగలబడ్డాయి. తర్వాత తిరుమల పర్వతాలలోని ‘మలయప్పకోన’లో లభించిన విగ్రహాలను స్వామివారి ఉత్సవమూర్తిగా ఉన్నారు వేంకటేశుడి ప్రతినిధిగా మలయప్పస్వామే అన్ని సేవల్లో పాల్గొంటున్నాడు.
వాహనాల్లో వైవిధ్యంగా...
శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి వాహనాలను అధిరోహించి తిరుమాడవీధుల్లో ఊరేగుతాడు. కాగా, వివిధ రూపాలను ధరించే స్వామి కొన్ని వాహనాల్లో ఒక్కడే తరలి వస్తాడు. మరికొన్నిటిలో ఇరు దేవేరులతో కలిసి అనుగ్రహిస్తాడు. చిన్నశేష వాహనం, హంస వాహనం, సింహ వాహనం, మోహినీ అవతారంలో పల్లకీలో, గరుడ, హనుమంత, గజ, సూర్యప్రభ, చంద్ర ప్రభ, అశ్వవాహనాలపై మలయప్పస్వామి ఒక్కరే వస్తారు. పెద్దశేష వాహనం, ముత్యాల పందిరి, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనంతో పాటు స్వర్ణ రథోత్సవం, పెద్ద రథోత్సవంలో దేవేరులతో కలిసి వేంచేస్తాడు. స్వామి హంస వాహనంపై సరస్వతీ రూపంలో తరలి వస్తారు.
ఆ రోజు.. ఇలా...
తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు అత్యంత ప్రధానమైనది. ఆ రోజు గరుడ సేవ జరగడమే అందుకు కారణం. గరుత్మంతుడు స్వామివారి నిత్యవాహనం. గరుడ సేవలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సేవల్లో నూతన గొడుగులు ఉపయోగిస్తారు. వీటిని ఆనాటికి తిరుమల చేరుకునేలా చెన్నై నుంచి కాలినడకన తీసుకువస్తారు. సాయంత్రం మాడవీధుల్లో ఊరేగించి, తర్వాత వాహన సేవలో వాడతారు. శ్రీవిల్లిపుత్తూరు (తమిళనాడు) క్షేత్రంలో గోదాదేవికి అలంకరించిన పుష్పమాలికలు తీసుకువచ్చి స్వామివారికి అలంకరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే పట్టువస్త్రాలు స్వామివారికి ధరింపజేస్తారు. అంతేకాకుండా.. ఆనంద నిలయంలో కొలువుదీరి ఉన్న శ్రీవారి మూలవిరాట్టుకు విశేషమైన నగలను అలంకరిస్తారు. ఐదోనాటి ఉదయం పల్లకీ ఉత్సవం జరుగుతుంది. మోహినీ అవతారాన్ని ధరించిన స్వామి పల్లకీలో ఊరేగుతాడు. పక్కనే మరో పల్లకీలో శ్రీకృష్ణుడు ఊరేగుతాడు. పల్లకీ ఉత్సవం ఆలయం నుంచి ప్రారంభం కావడం విశేషం.
చక్రాళ్వారు...
బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తిరుచ్చి వాహనంపై ఊరేగుతూ వరాహస్వామి ఆలయం చేరుకుంటారు. స్వామివారి ఆయుధమైన శ్రీచక్రాళ్వారు కూడా అనుసరిస్తారు. వరాహస్వామి ఆలయంలో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం చక్రాళ్వారును పుష్కరిణిలోకి తీసుకెళ్లి.. స్వామి పుష్కరిణిలో ముంచి పవిత్రస్నానం చేయిస్తారు. ఇదే చక్రస్నాం. ఇదే అవభృథము. బ్రహ్మోత్సవాల ప్రారంభంగా ఎగురవేసిన గరుడ కేతాన్ని అదే రోజున కిందికి దించుతారు.
అధికమాసం వచ్చిన ప్రతి సంవత్సరంలో బ్రహ్మోత్సవాలు రెండుపర్యాయాలు జరుగుతాయి. బాధ్రపదంలో వార్షిక లేదా సాలకట్ల బ్రహ్మోత్సవాలు... ఆశ్వయుజ మాసంలో దసరా సమయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈసారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 13 నుంచి 21 వరకు జరగనున్నాయి.
సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మాత్రమే అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు.
- ఐఎల్‌ఎన్ చంద్రశేఖరరావు
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
|
No comments:
Post a Comment