అప్లికేషన్లు పెట్టుకున్నారా?
ఫోన్‌ ఒక్కటేనా.. దాంతో పాటు పీసీ, ల్యాపీలను వాడేస్తున్నాం.. అందుకే ఈ  ఉచిత అప్లికేషన్లు! ప్రయత్నిస్తే పోలా!సోషల్‌ లైఫ్‌లో వాడే ఎకౌంట్‌లు చాలానే.. మరి, ఏదైనా పోస్ట్‌ చేస్తే అన్నింటిలోనూ షేర్‌ అవ్వాలంటే?
పలు రకాల ఫార్మెట్‌ ఫైల్స్‌ సిస్టంలో యాక్సెస్‌ చేస్తుంటాం. వీడియో, ఆడియో, ఇమేజ్‌... ఏదైనా వాటి ఫార్మెట్‌ని మార్చాలంటే?
ఎన్నో సాఫ్ట్‌వేర్లను ఇన్‌స్టాల్‌ చేస్తుంటాం. మర్చిపోతాం. ఎప్పుడైనా ప్రక్షాళన చేద్దాం అనుకుంటే ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ టూల్స్‌ని అన్‌ఇన్‌స్టాల్‌ చేయాలంటే?
ఫోన్‌, ల్యాపీ... వాడేది ఏదైనా మేటర్‌ని టైప్‌ చేస్తుంటాం.  కొన్నిసార్లు మనం టైప్‌ చేయకుండా మట్లాడుతుంటే మేటర్‌ టైప్‌ అయిపోతే బాగుంటుంది అనుకుంటాం! అలా వాయిస్‌ని టెక్ట్స్‌లా మార్చాలంటే?
పర్సనల్‌ కంప్యూటర్‌ లేదా ల్యాపీ వాడుతున్నారు. సిస్టంతో ముడిపడి పని చేసే వాటికి డ్రైవర్స్‌ ఉంటాయి. వాటిని విధిగా అప్‌డేట్‌ చేయాలంటే?
పీసీలో ఎప్పటి నుంచో ముఖ్యమైన డేటా భద్రం చేస్తున్నారు. సిస్టం క్రాష్‌ అయినా కంగారు పడకుండా ఎప్పటికప్పుడు డేటాని బ్యాక్‌అప్‌ చేయాలంటే?
...ఇలా ఒకటా.. రెండా? ఇంట్లో, ఆఫీస్‌ల్లో సిస్టమ్‌ వాడకంలో ఎన్నో సందేహాలు. వాటిని సమాధానాలు ఇవే. వాడుకోవడమే ఆలస్యం.
ఫార్మెట్‌ ఏదైనా...
Format Factory
ఎన్నో రకాల ఫైల్‌ ఫార్మెట్‌లు. అవసరానికి ఒక ఫార్మెట్‌ ఫైల్‌ని మరో దాంట్లోకి మార్చాల్సివస్తుంది. అప్పుడెలా? నెట్టింట్లోకి వెళ్లకుండానే ఫార్మెట్‌ ఫ్యాక్టరీలోకి వెళ్తే చాలు. వీడియో, ఆడియో, పిక్చర్‌, డాక్యుమెంట్‌... ఇలా  విభాగాల వారీగా ఫైల్‌ ఫార్మెట్‌లను క్షణాల్లో మార్చేయొచ్చు. ఒకటి కంటే ఎక్కువ ఫైల్స్‌ని ఒకేసారి సెలెక్ట్‌ చేసి (బ్యాచ్‌ కన్వర్షన్‌) అన్నింటి ఫార్మెట్‌లను మార్చేయొచ్చు. అంతేకాదు... ముక్కలుగా ఉన్న వీడియో ఫైల్స్‌ని ఒకే ఫైల్‌గా మార్చేయొచ్చు. వీడియో ఫైల్‌ ఏదైనా మొబైల్‌ ఫార్మెట్‌కి సరిపడేలా క్షణాల్లో కన్వర్షన్‌ చేయొచ్చు.
https://goo.gl/iYjpzW
చిటికెలో అప్‌డేట్‌
Driver Booster
సిస్టం డిస్‌ప్లే, సౌండ్‌ కార్డ్‌, వెబ్‌ కెమెరా, ప్రింటర్‌.. ఇలా హార్డ్‌వేర్‌ పరికరం ఏదైనా ఇన్‌స్టాల్‌ చేసిన ఆపరేటింగ్‌ సిస్టంతో జతకట్టి పని చేయడంలో డ్రైవర్స్‌ కీలకపాత్ర పోషిస్తాయ్‌. వాటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం.. లేదంటే కొత్త డ్రైవర్స్‌ని ఇన్‌స్టాల్‌ చేయడం పీసీ యూజర్లకు నిత్య ప్రక్రియ. ఈ పనిని ‘డ్రైవర్‌ బూస్టర్‌’కి అప్పగించి మీరు రిలాక్స్‌ అవ్వొచ్చు. ఎందుకంటే.. సిస్టంతో జతకట్టి పని చేసే ఏ డ్రైవర్‌ సాఫ్ట్‌వేర్‌ని అయినా ఆటోమాటిక్‌గా గుర్తించి తగిన డ్రైవర్స్‌ని ఇన్‌స్టాల్‌ చేయడంలో ఈ టూల్‌ దిట్ట. విండోస్‌కు సంబంధించిన ప్రత్యేక రక్షణ వ్యవస్థతో డ్రైవర్‌ అప్‌డేట్స్‌ని పరీక్షించాకే సిస్టంలో ఇన్‌స్టాల్‌ చేస్తుంది.
https://goo.gl/Mds7vR
ఒక్కటే అడ్డా
 IFTTT
ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌... ఇలా సోషల్‌ నెట్‌వర్క్‌లే కాదు. నెట్టింట్లో వాడే చాలా సర్వీసుల్ని గ్రూపుగా చేసిన కలగలిపి యాక్సెస్‌ చేసేందుకు సరైన వేదిక. సుమారు 600పైనే యాప్‌లను ఒకేతాటిపైకి తేవొచ్చు. ఫోన్‌, పీసీలోనూ వాడుకునే వీలుంది. దీనికి చేయాల్సిందల్లా సర్వీసులో సైన్‌ఇన్‌ అవ్వడమే. తర్వాత ఏయే సర్వీసుల్ని జత చేసుకోవాలనేది ఎంపిక చేసుకోవచ్చు. ‘యాప్లెట్స్‌’ రూపంలో ఆండ్రాయిడ్‌, యాపిల్‌ ఓఎస్‌ల్లో అందుబాటులో ఉన్నవాటిని సెలెక్ట్‌ చేసుకుని వాడుకోవచ్చు. ఉదాహరణకు ఫేస్‌బుక్‌లో ట్యాగ్‌ చేసిన ఫొటోలన్నీ గూగుల్‌ ఫొటోస్‌లో సేవ్‌ అయ్యేలా చేయొచ్చు. ఇంటికి చేరుకోగానే వై-ఫై నెట్‌వర్క్‌ ఆటోమాటిక్‌గా ఎనేబుల్‌ అయ్యేలా చేయొచ్చు. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లోని ఫొటోలను ఆటోమాటిక్‌గా గూగుల్‌ డ్రైవ్‌లోకి బ్యాక్‌అప్‌ అయ్యేలా చేయొచ్చు. ఇలా విభాగాల వారీగా కావాల్సిన వాటిని ఎనేబుల్‌ చేసి నెట్టింటిని ఒకే అడ్డా నుంచి మేనేజ్‌ చేయవచ్చు.
https://ifttt.com/
ఒకేసారి ‘అన్‌ఇన్‌స్టాల్‌’
Bulk Crap Uninstaller
ఇన్‌స్టాల్‌ చేసిన సాఫ్ట్‌వేర్‌ల చిట్టా పెరిగిపోతే? పీసీ సామర్థ్యం కచ్చితంగా తగ్గుతుంది. అలా కాకూడదు అనుకుంటే అక్కర్లేని వాటిని తీసేయడమే. ఒక్కొక్కటిగా కాదు. ఒకేసారి అక్కర్లేని సాఫ్ట్‌వేర్‌లను సెలెక్ట్‌ చేసి అన్‌ఇన్‌స్టాల్‌ చేయొచ్చు. అందుకు తగినదే ఈ ‘బల్క్‌’ టూల్‌. ఇన్‌స్టాల్‌ చేసి రన్‌ చేయగానే పీసీలో నిక్షిప్తమై ఉన్న సాఫ్ట్‌వేర్‌ల చిట్టా చూపిస్తుంది. అక్కర్లేని వాటిని సెలెక్ట్‌ చేసుకుని క్లిక్‌ కొడితే చాలు. అన్ని ఒకేసారి వాటి మూలాలతో పాటు తొలగిపోతాయ్‌.
https://goo.gl/DNj8z7
మాటలు అక్షరాలవుతాయ్‌
Speechnotes, voicera
ఆఫీస్‌ మీటింగ్స్‌ లేదా క్లాస్‌ రూమ్‌ల్లో వింటూ నోట్స్‌ రాసుకుంటాం. ఈ క్రమంలో కొన్ని కొన్నింటిని మిస్‌ అవ్వొచ్చు. అందుకే వాయిస్‌ విని నోట్స్‌ రాసేందుకు ఓ అసిస్టెంట్‌ని పెట్టుకుంటే. అలాంటిదే voiceraయాప్‌. కృత్రిమ మేధస్సుతో పని చేసే ‘ఈవా’ వాయిస్‌ అసిస్టెంట్‌ సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడైనా మాట్లాడుతున్న విషయాన్ని రికార్డు చేసి టెక్స్ట్‌ మేటర్‌లా పొందాలనుకుంటే యాప్‌ని ఓపెన్‌ చేయక్కర్లేదు. ఈవా అని పిలస్తే చాలు. చిత్తం!! అంటూ పని ప్రారంభిస్తుంది.    ఎక్స్‌టెన్షన్‌ రూపంలో డెస్క్‌టాప్‌ బ్రౌజర్‌లో... యాప్‌లా ఫోన్‌లో ఒదిగిపోయి వాయస్‌ని టెక్స్ట్‌లా మార్చేస్తుంది ‘స్పీచ్‌నోట్స్‌’. ప్రాతీయ భాషల్ని సపోర్ట్‌ చేస్తుంది. తెలుగులో మీరేది చెప్పినా విని టైప్‌ చేసి చూపిస్తుంది. మేటర్‌ని ఇట్టే షేర్‌ చేయొచ్చు.
https://goo.gl/RZJaPk, www.voicera.com
డేటా భద్రం
PARAGON Backup & Recovery
కంప్యూటర్‌ నుంచి డేటాని బ్యాక్‌అప్‌ చేయడం పెద్ద పనే. ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌డ్రైవ్‌ కనెక్ట్‌ చేయడం.. కంట్రోల్‌ ఫ్యానల్‌కి వెళ్లడం.. ఒక్కొక్క ఆప్షన్‌ని చెక్‌ చేసుకుంటూ బ్యాక్‌అప్‌ చేస్తాం. ఈ మొత్తం ప్రక్రియని సులభంగా ముగించేందుకు దీన్ని ప్రయత్నించొచ్చు. సెట్‌అప్‌ని ఇన్‌స్టాల్‌ చేశాక ఎకౌంట్‌ క్రియేట్‌ చేసుకుని బ్యాక్‌అప్‌ సెట్‌ చేయొచ్చు. ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌డ్రైవ్‌ లేదా యూఎస్‌బీ డ్రైవ్‌లోకి ఆటోమాటిక్‌గా ఎప్పటికప్పుడు బ్యాక్‌అప్‌ సింక్రనైజ్‌ చేసుకోవచ్చు. సిస్టంలో ఓఎస్‌తో పాటు మొత్తం డేటాని తీసుకోవచ్చు. లేదంటే కావాల్సిన ఫైల్స్‌, ఫోల్డర్స్‌ మాత్రమే సెలెక్ట్‌ చేసి బ్యాక్‌అప్‌ చేయొచ్చు.
https://goo.gl/5UJ1Y7
అన్నీ సర్దేయండిలా
File Juggler
సిస్టం కొన్న నాటి నుంచి ఎన్నో రకాల ఫైల్స్‌ని సేవ్‌ చేస్తుంటాం. పాత వాటిని అలానే వదిలేస్తుంటాం. ఇక ‘న్యూ ఫోల్డర్‌’ పేరుతోనైతే చాలానే ఉంటాయ్‌. దేంట్లో ఏముందో తెలుసుకోవడమూ కష్టమే. మీ సిస్టం స్థితి ఇదే అయితే ఫైల్‌ జగ్లర్‌తో క్షణాల్లో సర్దేయొచ్చు. టూల్‌ ఇన్‌స్టాల్‌ చేశాక కొన్ని నియమాల్ని సెట్‌ చేయాలి. అంటే.. ఏయే ఫైల్స్‌, ఫోల్డర్స్‌పై ఎలాంటి యాక్షన్‌ తీసుకోవాలో నిర్దేశించడం అన్నమాట. ఉదాహరణకు డ్రైవ్‌ల్లో క్రియేట్‌ అయ్యున్న ఖాళీ ఫోల్డర్లు డిలీట్‌ చేయాలంటే అందుకు ఆప్షన్‌ ఉంటుంది. ఇదే మాదిరిగా ఎప్పుడో డౌన్‌లోడ్‌ చేసిన పాత ఫైల్స్‌ని తొలగించేందుకు మరో ఆప్షన్‌. ఇలా మీరు పెట్టాలనుకునే నియమాల్ని చెక్‌ చేస్తే ఫైల్‌ జగ్లర్‌ పని ప్రారంభిస్తుంది.
https://goo.gl/iySC6oస్మార్ట్‌ఫోన్‌తో ఆగమవుతోన్న ఆరోగ్యం!

మొదట్లో సమాచారం చేరవేతకోసం వినియోగించాం. తర్వాత విజ్ఞానం పెంచుకునేందుకు ఉపయోగించుకున్నాం.. ఇప్పుడు మాత్రం శరీరంలోనే ఓ భాగంగా చూసుకుంటున్నాం. క్షణం వెంట లేకున్నా గాభరా పడిపోతున్నాం. ఆధునిక టెక్నాలజీతో ఆగమవుతోన్న ఆరోగ్యంపై ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి స్పెషల్‌ ఫోకస్‌.


ఓ పేరున్న సంస్థ ఆన్‌లైన్‌ సర్వే చేపట్టింది. సెల్‌ఫోన్లతో జీవితం ఎలా గడిచిపోతోందో తెలుసుకుంది. పగలే కాదు.. రాత్రివేళ ఎలా మన జీవితాన్ని స్మార్ట్‌ఫోన్‌ హరిస్తుందో వివరాలు రాబట్టింది. అందులో హైదరాబాద్‌ జనం అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నారని తేల్చింది.


ఒకప్పుడు హాల్‌కే పరిమితమయ్యేది. కొన్నాళ్ల తర్వాత నట్టింట్లో మకాం వేసింది. ఇప్పుడు ఏకంగా బెడ్‌రూమ్‌లోకీ చొచ్చుకొచ్చింది. రాత్రంతా నిద్రకంటే అదే ముఖ్యమైపోయింది. టెక్నాలజీ అప్‌డేట్‌ అవుతున్న కొద్దీ... అవసరానికి మించి వాడకం మొదలైంది.

మొదట్లో విజ్ఞానం పెంచుకునేందుకు, సమాచారం ఇచ్చి పుచ్చుకునేందుకు అనుకున్న కమ్యూనికేషన్‌ పరికరాలు ఇప్పుడు తోటి మనిషికన్నా.. ఇంట్లో కుటుంబసభ్యుల కన్నా ప్రధానంగా మారాయి. వాటిలో స్మార్ట్‌ఫోన్‌ అగ్రస్థానంలో ఉంది.


కంప్యూటర్‌, ల్యాప్‌ట్యాప్‌ ఆతర్వాత టాబ్లెట్ పీసీ.. ఇలా.. అధునాతన పరికరాలు వచ్చిన కొద్దీ సంపన్నశ్రేణి నుంచి మధ్యతరగతి జనం దాకా దాదాపు ప్రతి ఇంట్లో అవి తిరగాడుతున్నాయి. మొదట టెలిఫోన్‌.. తర్వాత సెల్‌ఫోన్‌.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌.. మనుషులతో పెనవేసుకుపోయాయి. అయితే.. స్మార్ట్‌ఫోన్‌లు మాత్రం.. ఏకంగా జీవితంలోనే భాగమైపోయాయి. ఉదయం బెడ్‌మీద కళ్లుతెరిచినప్పటినుంచి.. రాత్రయ్యాక బెడ్‌పై వాలేదాకా స్మార్ట్‌ఫోన్‌ సర్వస్వం అయిపోయింది.


సెల్‌ఫోన్‌ అంటే.. మొదట్లో టెలిఫోన్‌కు ప్రత్యామ్నాయం అనుకున్నారు. అయితే.. మనం ఎక్కడికెళితే.. అక్కడికి వెంట తీసుకెళ్లొచ్చని, నిరంతరం సమాచార వాహిని వెంట ఉంటుందని భావించారు. కానీ.. క్రమంగా సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. దాని వినియోగం విస్తృతి పెరిగింది. ఎంతలా అంటే.. ఒక్క స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉంటే.. మిగతావేవీ అవసరం లేదన్నంతగా తయారయ్యాయి. స్మార్ట్‌ఫోన్లు వచ్చాక, సాఫ్ట్‌వేర్‌లు అప్‌డేట్‌ అవుతున్న కొద్దీ అవి హస్తభూషణాలుగా మారాయి. అవి లేకుంటే ఒక్క క్షణం కూడా జీవితం ముందుకు సాగదన్నంతగా రూపాంతరం చెందాయి.


అయితే.. స్మార్ట్‌ఫోన్లు మానవ సంబంధాలను దూరం చేస్తున్నాయి. కుటుంబ సంబంధాలకు ఎసరు తెస్తున్నాయి. అంతేకాదు.. అనారోగ్యాలకూ కారణమవుతున్నాయి. అసలే.. తీరిక లేకుండా సెల్‌లో మాట్లాడే వాళ్లు.. క్షణం విరామం లేకుండా సోషల్‌ మీడియా వ్యసనపరులుగా మారుతున్నారు.


ఇదేదో మామూలుగా చెబుతోన్న సంగతి కాదు. షరా మామూలుగానే నిపుణులు హెచ్చరిస్తోన్న విషయం అంతకన్నా కాదు.. ఎవరికి వారు తమ అలవాట్ల గురించి వెల్లడిస్తే తేలిన వాస్తవం. మనిషికి ఎలా దూరమవుతున్నామో, అనారోగ్యాలను ఎంతగా కొని తెచ్చుకుంటున్నామో చెప్పే భయంకర నిజం.


అంతేకాదు.. ఇందులోనూ ఓ ట్విస్టుంది. తెలుగువాళ్లందరూ జడుసుకునే పరిస్థితి ఉంది. దేశంలోనే మనం ఏ స్థాయిలో స్మార్ట్‌ఫోన్లకు బానిసయ్యామో తెలిపే నివేదిక ఉంది. అదేంటంటే.. అర్థరాత్రుల దాకా.. తెల్లవార్లూ కుటుంబాన్ని, పిల్లలను లెక్క చేయకుండా.. నిద్రను కూడా బలవంతంగా ఆపుకుంటూ... సెల్‌ఫోన్‌తో చేస్తున్న సహవాసంలో హైదరాబాద్‌ ఫస్ట్‌ప్లేస్‌లో ఉంది.


సోషల్‌మీడియా చాట్ రూమ్‌లుగా బెడ్‌రూమ్‌లు 

హైదరాబాద్‌ జనం అంతలా స్మార్ట్‌ఫోన్‌కు బానిసయ్యారా ? సర్వేలో తేలిన వివరాలేంటి ? వాటిలో వణికించే విషయాలేంటి ? వీటికి విరుగుడు లేదా ? నిపుణులేం చెబుతున్నారు‌?


స్మార్ట్‌ఫోన్ల కారణంగా సోషల్‌ మీడియా వ్యసనపరులుగా తయారైన చాలామంది తమకు తెలియకుండానే నిద్రకు దూరమవుతున్నారు. ఏకాంతంగా ఉండాల్సిన బెడ్‌రూమ్‌లలోకీ వాటిని తీసుకెళ్తున్నారు. కుటుంబసభ్యులు, పిల్లలు పక్కనే పడుకున్నా.. తమతో ముచ్చట్లు పెడుతున్నా సరే.. స్మార్ట్‌ఫోన్‌ మాయలో పడిపోతున్నారు. దీంతో.. బెడ్‌రూమ్‌లు సోషల్‌మీడియా చాట్‌రూమ్‌లుగా తయారయ్యాయని తాజా సర్వేలో తేలింది.


పరుపుల సంస్థ సెంచురీ మాట్రసెస్‌ ఇటీవల ఓ ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించింది. దేశ వ్యాప్తంగా పది ప్రధాన నగరాల్లో ఈ సర్వే చేపట్టింది. 'స్లీపింగ్‌ ట్రెండ్స్‌' అనే అంశంపై చేసిన ఈ సర్వేలో.. కొన్నేళ్లుగా అధికశాతం మంది ప్రజలు నిద్రలేమికి గురవుతున్నారని తేల్చింది. ఇందులో సుమారు పదివేల మంది నుంచి ఆన్‌లైన్‌లో అభిప్రాయాలు సేకరించి ఈ సర్వేకు తుదిరూపం ఇచ్చారు. ప్రధానంగా టీవీ, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, సహా.. స్మార్ట్‌ఫోన్లలో ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో నిరంతరాయంగా అప్‌డేట్‌ అవుతోన్న సమాచారం, వీడియోలు తిలకిస్తూ మెజార్టీ జనం కాలక్షేపం చేస్తున్నట్లు గుర్తించారు.


జనం అలవాట్లు, జీవనశైలిపై రూపొందించిన ప్రశ్నావళితో ఈ సర్వే నిర్వహించారు. అయితే.. సర్వేలో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా హైదరాబాద్‌ నగరం ఈ నిద్రలేమిలో మొదటి స్థానంలో ఉందని నిర్ధారణ అయ్యింది.


రాత్రివేళ స్మార్ట్‌ఫోన్ల ఉచ్చులో చిక్కి నిద్రకు దూరమై.. అనారోగ్యాలకు దగ్గరవుతున్న నగరాల జాబితాలో.. హైదరాబాద్‌ టాప్‌ప్లేస్‌ల ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరం రెండోస్థానం ఆక్రమించింది. వరుసగా మూడో స్థానంలో బెంగళూరు, నాలుగో స్థానంలో ఇండోర్‌, ఐదో స్థానంలో పుణె నిలిచాయి.


గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సుమారు 70 శాతం మంది స్మార్ట్‌ఫోన్లలో సోషల్‌ మీడియాలో భాగమైన ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లో గడుపుతున్నట్టు తేలింది. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ అప్‌డేట్స్‌ను తెలుసుకునేందుకు నిద్రలేని రాత్రులను గడుపుతున్నట్లు ఈ సర్వేలో గుర్తించారు. అంతేకాదు.. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లలో సినిమాలు, తమకు నచ్చిన షోలను వీక్షిస్తున్నట్లు స్పష్టమైంది. ఇక ఈ సర్వేలో విశాఖపట్నంలో 66 శాతం మంది ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు ప్రకటించారు. బెంగళూరులో 65 శాతం మంది, ఇండోర్‌లో 58 శాతం మంది, పుణేలో 56 శాతం మంది పడక గదుల్లో ఎలక్ట్రానిక్స్‌ వస్తువులతో కుస్తీ పడుతూ నిద్రకు దూరమవుతున్నట్లు సర్వేలో తేలింది.


మొత్తంగా పది నగరాల్లో సరాసరి 53 శాతం మంది రాత్రి సమయాల్లో స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌లతోనే గడుపుతూ కాలక్షేపం చేస్తూ నిద్రకు దూరం అవుతున్నట్లు తేలింది. ఇక మరో 54 శాతం మంది నిత్యం రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య నిద్రకు ఉపక్రమిస్తున్నట్లు చెప్పారు. ఉరుకుల పరుగుల జీవితంలో రాత్రి పొద్దుపోయాక నిద్రపోయినప్పటికీ ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య మేల్కొనాల్సి వస్తుందని పలువురు తెలిపినట్లు సర్వేలో పేర్కొన్నారు. ఇక అధిక పని ఒత్తిడి.. ఉద్యోగాలు చేసేందుకు సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండడంతో వారంలో మూడురోజుల పాటు పని ప్రదేశాలు.. జర్నీలో కునికిపాట్లు పడుతున్నట్లు 37 శాతం మంది అభిప్రాయపడినట్లు సర్వేలో తేలింది.


అయితే.. స్మార్ట్‌ఫోన్లతో ఇలా రాత్రిళ్లు కుస్తీ పట్టడం ప్రమాదకరమంటున్నారు నిపుణులు. గంటల తరబడి అదేపనిగా వాటితో కాలక్షేపం చేస్తే రేడియేషన్‌తో కంటిచూపు దెబ్బతింటుందని, కళ్లు, వాటిలోని సూక్ష్మ నరాలు అధిక ఒత్తిడికి గురవుతాయని హెచ్చరిస్తున్నారు. దీంతో మెడ, మెదడుపైనా దుష్ప్రభావం పడుతుందని చెబుతున్నారు.


స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో ఉండే లైటింగ్‌ మెదడుపై ప్రభావం చూపిస్తుందని, ఫలితంగా సమయానికి నిద్రరాకుండా.. సెల్‌ చూస్తున్నంతసేపూ నిద్రకు దూరమవుతామని అంటున్నారు.


అవసరం మేరకు, ఉద్యోగ బాధ్యతల రీత్యా రాత్రివేళ పనులు చేయడం ఓ ఎత్తయితే.. సోషల్‌ మీడియా మోజులో రాత్రిళ్లు మేల్కొని వాటితో సహవాసం చేయడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. సమయానుకూలంగా వైద్యపరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచిస్తున్నారు.


మొత్తానికి టెక్నాలజీలో, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ప్రపంచస్థాయిలో పేరు సంపాదిస్తుండగా.. ఇలా.. సోషల్‌ మీడియా మోజులో ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్న అంశంలోనూ టాప్‌ప్లేస్‌లో ఉండటం బాధాకరమంటున్నారు నిపుణులు. అతి అనర్థ దాయకం అన్న ఆర్యోక్తిని గుర్తించి.. అవసరం మేరకే దేన్నయినా వినియోగించుకోవాలని లేకుంటే అనర్థాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.


సెల్‌ఫోన్లు మనకు తెలియకుండానే.. మనవాళ్లను ఎలా దూరం చేస్తుందో, ఆరోగ్యాన్ని ఎలా హరిస్తోందో లెక్కలతో తేల్చిన వాస్తవం ఇది. సో.. ఇప్పటికైనా కాస్త జాగ్రత్తపడదాం. అది మనల్ని ఆడించకుండా.. స్మార్ట్‌ఫోన్‌నే మన అదుపాజ్ఞల్లో ఉంచుకుందాం.
సప్తగిరి.జి (ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి రెడ్‌అలర్ట్‌ డెస్క్‌ ఇంచార్జ్‌)
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment