ఆయుర్వేద వైద్య గ్రంధాలు
CLIK IMAGE
-----------------------------------------------------------------

వైద్యో నారాయణో ధన్వంతరిః 
నవంబరు 5 ధన్వంతరి జయంతి
మంచి వైద్యుడిని ధన్వంతరితో పోల్చుతాం.. యుగయుగాలుగా మన వైద్యశాస్త్రానికి మూల పురుషుడిగా పిలుచుకునే ఆయన ఎవరు?

తరతరాలుగా సంపూర్ణ ఆరోగ్యానికి సరిపోలిన అర్థం ధన్వంతరి. ఆ పేరులోనే శారీరక, మానసిక ఆరోగ్యాలు ఇమిడి ఉన్నాయి. పురాణకాలం నుంచి నేటి దాకా వైద్యానికి అధిదేవతగా ధన్వంతరిని ప్రస్తావిస్తూ ఉంటారు. పురాణాలలో సాక్షాత్తు దైవస్వరూపుడుగా పేర్కొన్న ఈ స్వామి మానవాళి సంపూర్ణ ఆరోగ్యానికి కావలసిన వాటన్నిటినీ సమకూరుస్తాడన్న నమ్మకం ప్రబలంగా ఉంది.

ధన్వంతరి అనే పదానికి సంబంధించిన అర్థాన్ని పరిశీలిస్తే.. ఆ స్వామి ఆవిర్భావ లక్ష్యం స్పష్టమవుతుంది. ‘‘ధనుః శల్యం తస్య అంతం పారం ఇయర్తి గచ్ఛతీతి ధన్వంతరిః’’ అని పండితులు పేర్కొన్నారు. అంటే ధనుస్సు నుంచి వెలువడిన బాణపు ములుకుల్లాంటి శారీరక, మానసిక దోషాలు, రోగాలు, బాధలను నివారించేవాడని అర్థం. శరీరానికి తగిలే తీవ్రమైన గాయాలు, అనేక కారణాల వల్ల పుట్టుకొచ్చే వ్రణాలు, అలాగే మానసిక వ్యాధులన్నింటినీ తగ్గించేవాడని అర్థం. దీనిని అనుసరించి పూర్వకాలం నుంచి చికిత్సలు, శస్త్రచికిత్సలలో ఆరితేరిన వారిని ధాన్వంతరీయులు అని పిలుస్తూ గౌరవించడం కనిపిస్తుంది.

ఎలా ఉంటాడు? 
ధన్వంతరి సాక్షాత్తు దైవమే. శ్రీమహావిష్ణువు స్వరూపుడే. ఆ స్వామి ధర్మరక్షణ కోసం అవసరమైనప్పుడల్లా ప్రతి యుగంలో జన్మించినట్టే.. ధన్వంతరి కూడా మానవాళికి వైద్యాన్ని అందించేందుకు పలుజన్మలను ఎత్తినట్టు పురాణ కథలు పేర్కొంటున్నాయి. ధన్వంతరి స్వరూప వర్ణన కూడా పలు రకాలుగా కనిపిస్తుంది. వాల్మీకి రామాయణం బాలకాండలో ధన్వంతరి ఆవిర్భావ ప్రస్తావన ఉంది. దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు ఒక చేత కమండలం, మరోచేత దండాన్ని ధరించి ధన్వంతరి ఆవిర్భించినట్టు తెలుస్తోంది. భాగవతంలో.. క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించిన అమృతభాండాన్ని చేతపట్టుకొని ఉన్నట్టు కనిపిస్తుంది. బ్రహ్మవైవర్త పురాణం కృష్ణ జన్మఖండంలో సూర్యభగవానుడి దగ్గర ధన్వంతరి ఆయుర్వేదాన్ని నేర్చుకున్నట్టు, సూర్యుడికి ఉన్న పదహారు మంది శిష్యుల్లో ఈయన కూడా ఒకరని ప్రస్తావించారు,. విష్ణుధర్మోత్తర పురాణంలో ఒకచేత అమృత కలశం, మరోచేత వనమూలికలను పట్టుకొని ఉన్న ధన్వంతరి వర్ణన ఉంది. మరికొన్ని చోట్ల శ్రీమహావిష్ణువులా నాలుగు చేతులు, పీతాంబరాలు ధరించి పైరెండు చేతుల్లో శంఖచక్రాలు, కింది రెండు చేతుల్లో జలగ, అమృత కలశాన్ని పట్టుకొని ఉన్నట్టుగా పేర్కొన్నారు. జలగను పట్టుకోవడం శస్త్రచికిత్సకు సంబంధమైన సూచన అని పండితుల వివరణ.

హరివంశ కథ 
హరివంశ పురాణం 29వ అధ్యాయంలోని కథ ప్రకారం క్షీరసాగర మథనమప్పుడు సాగర గర్భం నుంచి ఒక దివ్యపురుషుడు పుట్టుకొచ్చాడు. చక్కటి రూపం, శంఖంలాంటి కంఠం, పద్మాల్లాంటి కళ్లు, సుతిమెత్తని సుందర కేశజాలంతో దృఢమైన నల్లని శరీరంతో పీతాంబరాలను ధరించి, మణికుండలాలు, పుష్పమాలలు అలంకరించుకొని, చేతిలో అమృతకలశంతో ఆవిర్భవించాడు. బ్రహ్మాది దేవతలు ఆయనకు ధన్వంతరి అని పేరు పెట్టారు. నీటిలో నుంచి పుట్టినవాడు కాబట్టి అబ్జ అనే పేరును శ్రీమహావిష్ణువు ఆయనకు పెట్టారు. మరో జన్మలో తల్లి గర్బంలో పుట్టి యజ్ఞభాగాన్ని స్వీకరించేలా అనుగ్రహించారు. మహావిష్ణువు చెప్పినట్టే ద్వాపరయుగంలో కాశీరాజు సుహోత్రుడికి పుత్రుడుగా జన్మించిన ధన్వంతరి. ఆయుర్వేదశాస్త్రాన్ని అష్టాంగాలతో రచించాడు. కాయచికిత్స, కౌమారభృత్య (బాల చికిత్స), భూతవైద్యం (గ్రహ చికిత్స), శలాక్యతంత్ర, శల్యతంత్ర (శస్త్ర చికిత్స), విషతంత్ర, రసాయన తంత్ర, వశీకరణ తంత్ర అనే అష్టాంగాలతో ఆయుర్వేద శాస్త్రాన్ని ధన్వంతరి మానవాళికి అందించాడు. అలాగే మహాభాగవతం నవమ స్కంధంలో పురూరవ వంశ క్రమంలో ధన్వంతరి మూడో తరానికి చెందిన దివోదాసుడుగా కనిపిస్తాడు. ఈయననే దివోదాస ధన్వంతరి అని కూడా పిలుస్తుంటారు.
వైద్యశాస్త్రానికి అధిపతి కనుకనే ఈ స్వామికి ఎన్నోచోట్ల ఆలయాలు వెలిశాయి. తమిళనాడులోని శ్రీరంగనాథస్వామి ఆలయం ఆవరణలో ధన్వంతరి మందిరం ఉంది. కేరళలోని నెల్లువాయతో పాటు చాలాచోట్ల ధన్వంతరి ఆలయాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ తూర్పుగోదావరి జిల్లా చింతబారులో ధన్వంతరి ఆలయం ఉంది. - డా।। యల్లాప్రగడ మల్లికార్జునరావు

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment