ప్రకృతి ఒడిలో కొలువైన ఉమామహేశ్వరుడు

   చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, ఆకట్టుకునే జలపాతాలు.. ఆహ్లాద భరితమైన వాతావరణం.. పకృతి ఒడిలో కొండపై 500 అడుగుల ఎత్తులో కొలువై కోరిన కోరికలు తీర్చే ఉమామహేశ్వరుడు. నల్లమల అటవీప్రాంతంలో వెలసిన ఉమామహేశ్వర క్షేత్రం ఆధ్యాత్మిక చింతనతో శ్రీశైలం ఉత్తర ద్వారంగా భాసిల్లుతున్నది. హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలంలోని 
రంగాపూర్ గ్రామానికి సమీపంలో ఉన్న ఈ దేవాలయ విశిష్టతే ఈ వారం దర్శనం. 
-మధుకర్ వైద్యుల, 

ఎక్కడ ఉన్నది? ఉమామహేశ్వర క్షేత్రం హైదరాబాద్ నుంచి 140 కి.మీ, మహబూబ్‌నగర్ నుంచి 91 కి.మీ, అచ్చంపేట నుంచి 12 కి.మీ దూరంలో కొండపైన ఆహ్లాద భరితమైన వాతావరణంలో ఉంది. అచ్చంపేట నుండి శ్రీశైలం వెళ్లే మార్గంలో రంగాపూర్ గ్రామానికి వెళ్లిన తరువాత ముఖద్వారం నుంచి కొండపైకి వెళితే ఉమామహేశ్వరం చేరుకోవచ్చు.

ఎలా వెళ్లాలి? సికింద్రాబాద్ నుంచి కల్వకుర్తి మీదుగా అచ్చంపేటకు చేరుకోవాలి. అక్కడి నుంచి ఉమామహేశ్వర క్షేత్రానికి చేరుకోవాలి.

ఆలయ విశిష్టత: ఉమామహేశ్వర ఆలయం కొలువై ఉన్న కొండ విల్లు ఆకారంలో ఒంపు తిరిగి ఉంటుంది. ఆలయ పరిసరాలలోని కొండలపై నుంచి జాలువారే జలపాతాలు ప్రకృతి ప్రియులకు కనువిందు చేస్తాయి. ప్రకృతి రమణీయ దృశ్యాలతో ఈ ప్రాంతం పేదల ఊటిగా గుర్తింపు పొందింది. ప్రముఖ సిద్ధక్షేత్రంగాను, ఉమాశక్తి పీఠంగాను వెలుగొందుతున్నది. రావణాసురుని హతమార్చిన అనంతరం శ్రీరాముడు ఉమామహేశ్వరం నుంచే శ్రీశైల క్షేత్ర ప్రదక్షిణను ప్రారంభించారని స్థల పురాణం వెల్లడిస్తున్నది. ఈ క్షేత్రంలో 11 తీర్థాలు ఉన్నాయి. వాటిలో రుద్రధార, భస్మధార, గౌరిధార, పాపనాశనం ముఖ్యమైనవి. ఇవన్నీ నిరంతరం పారే జలధారలు. కొండల్లో వివిధ పేర్లతో ఉన్న జలధారల కిందనే లింగాలు ప్రతిష్టితమై ఉండటం విశేషం. ఇక్కడి ప్రధాన ధార అయిన రుద్రధార కింద ఉమామహేశ్వరస్వామి కొలవుదీరి ఉన్నాడు. కొండ కింది భాగాన్ని మూడు గదులుగా చేసి మధ్యగదిలో ఉమామహేశ్వర స్వామిని, కుడివైపు పార్వతిదేవి, ఎడమవైపు వీరభద్రుని విగ్రహాలను ప్రతిష్ఠించారు. శ్రీశైలం వెళ్లిన ప్రతిభక్త్తుడు, యాత్రికులు ఇక్కడికి వచ్చి స్నానమాచరించి ఉమా మహేశ్వర స్వామిని దర్శించుకుంటే చేసిన పాపాలు హరించిపోతాయనేది భక్తుల విశ్వాసం.

స్థల పురాణం: కాకతీయుల కాలంలో ఈ ఆలయం ఎంతో వైభవంగా ఉన్నట్లు పండితారాధ్య చరిత్ర చెబుతుంది. పండితారాధ్యుని శిష్యుడు దోన్య ఈ దారిగుండానే శ్రీశైల క్షేత్రానికి వెళ్లినట్లు, అప్పటికీ ఉమామహేశ్వరం ఒక పురముగా ఉన్నట్లు ఆ కాలంనాటి శిలా శాసనాల ద్వారా తెలుస్తున్నది. క్రీ.శ.1235లో గణపతి దేవుడు రాజ్యాన్ని పాలిస్తున్నప్పుడు భీమచోలుడు పర్వతోత్తరం ద్వారా శ్రేష్ఠ శ్రీఉమామహేశ్వరస్వామి అంగరంగ భోగాలకై అంకమపల్లె గ్రామదానం చేసి శాసనం చెక్కించారు. గణపతి దేవుని కాలంలో అమ్రాబాద్ ప్రాంతాన్ని పెరక బోలరెడ్డి పాలించాడు. ఆయన ఉమామహేశ్వరునికి పెండ్లి మేడ కట్టించి ఒక తేరు కూడా చేయించినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా తెలస్తున్నది. ఇవన్నీ నేడు శిథిల దశకు చేరుకున్నాయి. రంగాపూర్ గ్రామ వాస్తవ్యులు కీ.శే. మర్యాద గోపాల్‌రెడ్డి ఈ దేవాలయాన్ని దివ్య సందర్శన క్షేత్రంగా తీర్చిదిద్దారు.

ఉత్సవాలు:నల్లమలలో ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రంలో ప్రతి ఏడాది మకర సంక్రాంతి సందర్భంగా జనవరి 15 నుంచి 22వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయి. మహాశివరాత్రి ఉత్సవాలూ వైభవంగా నిర్వహిస్తారు.



ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment