పెట్రోల్‌, డీజిల్‌ ధరల భారం తగ్గించుకోవచ్చిలా | Saving Petrol & Deisel | Petrol | Deisel | Cards | Co Branded Cards | Cashback | Cashback Offers | Reward Points | Rewards | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu | Bhakthi Pustakalu | Bhaktipustakalu | Bhakti Pustakalu | BhakthiBooks | MohanBooks | Bhakthi | Bhakti

ఇంధన ధరల భారం
 తగ్గించుకోవచ్చిలా...

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. వీటి ధర ఎంత పెరిగినా కొనుగోలు చేయకతప్పని పరిస్థితి. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్లాలన్నా బైకు లేదా కారు తప్పదు. అందుకే ఇంధనాల వినియోగం పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర పెరిగిన కొద్దీ దేశీయంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగభగమండిపోతున్నాయి. అయితే వినియోగదారులు పెట్రో భారాన్ని తగ్గించుకోవడానికి మార్గాలున్నాయి. వీటిలో ముఖ్యమైనవి కో-బ్రాండెడ్‌ కార్డులు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో కలిసి బ్యాంకులు ఈ కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను ఆఫర్‌ చేస్తున్నాయి. ఇంధనాల కోసం ఖర్చు చేసే మొత్తాన్ని బట్టి వినియోగదారులకు ప్రయోజనాలు లభిస్తాయి.

ఇవీ కార్డులు
సిటీ బ్యాంక్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా (ఎస్‌బిఐ) వంటి బ్యాంకులు కో-బ్రాండెడ్‌ ఇంధన కార్డులను అందిస్తున్నాయి. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ భాగస్వామ్యంతో ఇండియన్‌ ఆయిల్‌ సిటీ ప్లాటినమ్‌, టైటానియం కార్డులను అందజేస్తోంది. ఐసిఐసిఐ బ్యాంకు మూడు హెచ్‌పిసిఎల్‌ కో-బ్రాండెడ్‌ కార్డులను జారీ చేస్తోంది. అవి: ఐసిఐసిఐ బ్యాంక్‌ హెచ్‌పిసిఎల్‌ కోరల్‌ క్రెడిట్‌ కార్డు, హెచ్‌పిసిఎల్‌ కోరల్‌ అమెరియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డు, ఐసిఐసిఐ బ్యాంక్‌ హెచ్‌పిసిఎల్‌ ప్లాటినం క్రెడిట్‌ కార్డు. బిపిసిఎల్‌ భాగస్వామ్యంతో ఎస్‌బిఐ... బిపిసిఎల్‌ ఎస్‌బిఐ కార్డును ఆఫర్‌ చేస్తోంది.

ప్రయోజనాలు
ఈ కో-బ్రాండెడ్‌ కార్డుల వినియోగం ద్వారా కస్టమర్లకు క్యాష్‌ బ్యాక్‌ లేదా రివార్డు పాయింట్లు లభిస్తుంటాయి. వీటిని ఇంధనాల కొనుగోలు సమయంలో వినియోగించుకోవచ్చు. సిటీ బ్యాంక్‌కు చెందిన ఇండియన్‌ ఆయిల్‌ కార్డు ద్వారా ఇండియన్‌ ఆయిల్‌ రిటైల్‌ ఔట్‌లెట్లలో ఇంధనాల కోసం ఖర్చు చేసే ప్రతి 150 రూపాయలపై నాలుగు టర్బో పాయింట్లు లభిస్తున్నాయి. ఒక టర్బో పాయింట్‌ ఒక రూపాయికి సమానం. ఇక ఐసిఐసిఐ బ్యాంక్‌ తన కో-బ్రాండెడ్‌ ఫ్యూయల్‌ కార్డులపై 2.5 శాతం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ చేస్తోంది. అయితే నెలలో గరిష్ఠంగా వంద రూపాయల క్యాష్‌బ్యాక్‌ మాత్రమే లభిస్తుంది. ఇంధనేతర ఖర్చులు చేసిన సందర్భంలో కూడా ఐసిఐసిఐ బ్యాంకు కార్డులపై పేబ్యాక్‌ పాయింట్లు లభిస్తున్నాయి. ప్రతి వంద రూపాయల ఖర్చుపై రెండు ప్లే బ్యాక్‌ పాయింట్లను కస్టమర్లు పొందే అవకాశం ఉంటుంది. హెచ్‌పిసిఎల్‌ కోరల్‌ అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్డును వినియోగించి ఇంధనాల కోసం 100 రూపాయలు ఖర్చు చేస్తే క్యాష్‌బ్యాక్‌తోపాటు ఆరు పాయింట్లు లభిస్తాయి. నాలుగు పాయింట్లు రూపాయికి సమానంగా ఉంటాయి. ఈ పాయింట్లను ఇంధనం రీఫిల్‌ చేసుకునే సందర్భంలో వినియోగించుకోవచ్చు.

బిపిసిఎల్‌ ఎస్‌బిఐ కార్డుతో 100 రూపాయల ఇంధనాన్ని కొనుగోలు చేస్తే 13 రివార్డు పాయింట్లు లభిస్తాయి. నాలుగు రివార్డు పాయింట్ల విలువ రూపాయి. కో బ్రాండెడ్‌ ఫ్యూయల్‌ కార్డులు ఒక శాతం ఇంధన సర్‌చార్జీని ఎత్తివేస్తున్నాయి. అయితే దీనిపై పరిమితులు కూడా ఉన్నాయి.

ఇవి గమనించాలి...
కో-బ్రాండెడ్‌ కార్డులతో ఇంధనాలను కొనుగోలు చేస్తే వచ్చే రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు ఆకర్షణీయంగా ఉండటంతో వీటి పట్ల చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈ ప్రయోజనాలను పూర్తిగా పొందడానికి ఆయా సంస్థలు విధించే షరతులపై కూడా కాస్త దృష్టిసారించాలి. కో-బ్రాండెడ్‌ కార్డులు ఆఫర్‌ చేస్తున్న బ్యాంకులు ఇచ్చే పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పిఔస్‌) మిషన్లలో మీ దగ్గర ఉన్న కార్డును స్వైప్‌ చేస్తేనే పూర్తి ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఎలాగంటే.. సిటీ ఇండియన్‌ ఆయిల్‌ కార్డును ఈ బ్యాంకుకు చెందిన ఎలక్ర్టానిక్‌ డేటా క్యాప్చర్‌ (ఇడిసి) మిషన్‌లో స్వైప్‌ చేయాల్సి ఉంటుంది. లేకపోతే దాన్ని సాదారణ లావాదేవీగా పరిగణిస్తారు. అంటే 150 రూపాయల ఇంధన కొనుగోలుపై నాలుగు టర్బో పాయింట్లకు బదులుగా ఒక టర్బో పాయింట్‌ మాత్రమే లభిస్తుంది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్‌ కార్డులను ఐసిఐసిఐ బ్యాంక్‌ మర్చంట్‌ సర్వీసెస్‌ స్వైప్‌ మిషన్‌లోనే స్వైప్‌ చేయాలి. అప్పుడే 2.5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది.

ఇక స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌ సూపర్‌ వాల్యూ టైటానియం కార్డును ఆఫర్‌ చేస్తోంది. దీని ద్వారా ఏ పెట్రోల్‌ పంపులోనైనా ఇంధనాన్ని కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. అయితే ఇంధనం కోసం కనీసం 750 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. క్యాష్‌ బ్యాక్‌పై పరిమితులు ఉన్న విషయాన్ని గమనించాలి. కో బ్రాండెడ్‌ కార్డులపై కొన్ని బ్యాంకులు వార్షిక ఫీజులు విధిస్తున్నాయి. అయితే ఆయా బ్యాంకులు పేర్కొన్న మేరకు ఇంధనాల కోసం ఖర్చులు చేస్తే ఈ ఫీజు మినహాయింపులు కూడా లభిస్తాయి. కో-బ్రాండెడ్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసే ముందే ఆయా సంస్థలు ఆఫర్‌ చేస్తున్న ప్రయోజనాలు, వార్షిక ఫీజులు తదితరాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం మంచిది.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment