కూర్మం | శ్రీకూర్మనాథుడు! | Kurmanathaswamy temple, Srikurmam | Sri Kurmam | Srikurmanatha | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu | Bhakthi Pustakalu | Bhaktipustakalu | Bhakti Pustakalu | BhakthiBooks | MohanBooks | Bhakthi | Bhakti

భక్త సులభుడు శ్రీకూర్మనాథుడు!

శ్రీ మహా విష్ణువు తన రెండో అవతారమైన కూర్మ రూపంలో వెలసిన అరుదైన దివ్య క్షేత్రం శ్రీకూర్మం. రెండు ధ్వజ స్తంభాలతో, నిత్యాభిషేకాలతో, అపురూపమైన శిల్ప సంపదతో అలరారే ఇక్కడి ఆలయం అనేక విశిష్టతల సమాహారం.


‘కుదురుకు  ’ అనేది నానుడి. శ్రీకూర్మ క్షేత్రాన్ని దర్శించుకుంటే మానసిక స్వస్థత, ప్రశాంతత లభిస్తాయనీ పెద్దలు చెబుతారు. కూర్మ రూపంలో మహా విష్ణువు కొలువైన ప్రాచీన ఆలయం దేశంలో ఇదొక్కటే. ఇక్కడ శ్రీకూర్మనాథుడు భక్త సులభుడిగా పూజలందుకుంటున్నాడు. పద్మ, బ్రహ్మాండ పురాణాల్లో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. ఈ ఆలయం క్రీస్తు శకం రెండవ శతాబ్దం నాటిదని చరిత్రకారుల అంచనా. త్రిమతాచార్యులు ఈ ఆలయాన్ని సందర్శించినట్టు కథనాలు ఉన్నాయి. ఆది శంకరుల అద్వైత పరంపరకు చిహ్నంగా అర్చామూర్తి అయిన సుదర్శన సాలగ్రామం స్వామి వెనుక భాగంలో ఉండడం ఒక విశేషం. కాగా, అంతకుముందు పాతాళ సిద్ధేశ్వర క్షేత్రంగా ఉన్న ఈ ఆలయాన్ని శ్రీ రామానుజాచార్యులు తన కళింగ దేశ తీర్థయాత్ర సందర్భంగా- శ్రీ వైష్ణవ క్షేత్రంగా మార్చారన్న ప్రచారం ఉంది. ఇక, మధ్యాచార్యుల శిష్యులు నరహరితీర్థులు శ్రీకూర్మంలో నారసింహ పీఠం స్థాపించారు.


ఒకటి తూర్పున... మరొకటి పశ్చిమాన!
ఏ దేవాలయంలోనైనా ఒక్క ధ్వజ స్తంభం మాత్రమే ఉంటుంది. అయితే శ్రీకూర్మనాథుడి ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు దర్శనమిస్తాయి. ఆలయ ముఖద్వారం తూర్పున ఉండడంతో అటువైపు ఒకటీ, స్వామికి ముఖం పశ్చిమం వైపు తిరిగి ఉండడం వల్ల అటువైపు మరొకటి... ఇలా రెండు ధ్వజ స్తంభాలు ఇక్కడ కనిపిస్తాయి.

అద్భుత శిల్ప సౌందర్యం
చోళ, తూర్పు కళింగ, గంగ, ఉత్కళ, విజయనగర గజపతుల పాలనలో ఎంతో వైభవాన్ని చవిచూసిన శ్రీకూర్మ క్షేత్రం అద్భుతమైన శిల్ప సౌందర్యానికి నెలవు. నూట ఎనిమిది నల్లరాతి ఏకశిలా స్థంభాలు వేటికవే ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఆలయ ముఖ మండప ద్వారాల మీద చెక్కిన శిల్పాలు చూపరులను కళ్ళు తిప్పుకోనివ్వవు.

అపూర్వం నిత్యాభిషేకం
వైష్ణవ ఆలయాల్లో నిత్యాభిషేకాలు నిర్వహించడం అరుదు. అయితే శ్రీకూర్మనాథ

    స్వామికి ప్రతిరోజూ ఉదయం పంచామృతాభిషేకం జరుగుతుంది. ఈ క్షేత్రానికి ఎనిమిది దిక్కులలో నారద, సుధా, చక్రతీర్థ, మాధవ గుండం, కౌటిల్యతీర్ధం, వక్రతీర్ధం, నరసింహా పాతాళం, మహోదధి (దక్షిణ సముద్రం) అనే పుణ్య తీర్థాలు ఉన్నాయి. ఆలయం తూర్పున శ్వేతగుండం ఉంది. అందులో భక్తులు స్నానాలుచేసి స్వామిని దర్శించుకుంటారు. అలాగే పితృ కర్మలకు కూడా శ్రీకూర్మం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే మరణించిన పెద్దలకు సద్గతులు ప్రాప్తిస్తాయన్న నమ్మకం ఉంది. శ్రీకూర్మానికి పశ్చిమ దిశలో పిప్పల గ్రామం దగ్గర సుందరేశ్వరాలయం, వంశధార నది సముద్రంలో కలిసేచోట, తూర్పుభాగంలో కర్పూరేశ్వర ఆలయం, నాగావళి (లాంగుల్యా) నదికి పశ్చిమ దిశలో కోటీశ్వర ఆలయం ఉన్నాయి.


ఇవీ ఉత్సవాలు:

శ్రీ కూర్మనాథుని ఆలయంలో నిత్యోత్సవ, మాసోత్సవాలతో పాటు వివిధ వార్షిక ఉత్సవాలు నిర్వహిస్తారు.
ప్రతి ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కల్యాణం, జ్యేష్ఠ బహుళ ద్వాదశి నాడు శ్రీకూర్మ జయంతి, ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిన ాడు డోలోత్సవం జరుగుతాయి.
శ్రీకూర్మ జయంతి (జ్యేష్ఠ బహుళ ద్వాదశి)ని ఈ నెల 10వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆ రోజు ఉదయం స్వామివారికి నిత్యాభిషేకం, సుప్రభాతసేవ, తిరుమంజనసేవ నిర్వహిస్తారు.
అనంతరం ఆస్థాన మండపంలో స్వామి ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామి విగ్రహాలను ప్రత్యేక వేదికపై నిలిపి అలంకరిస్తారు.
ప్రత్యేకపూజల తరువాత స్వామి అవతార ఘట్టాన్ని అర్చకస్వాములు విన్నపం చేస్తారు.
నీరాజనం, మంత్రపుష్పంతో కార్యక్రమాలు ముగుస్తాయి.

ఎలా వెళ్ళాలి?: శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి సుమారు 15 కి.మీ. దూరంలో శ్రీకూర్మం ఉంది. శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌లో దిగి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

వసతి: భక్తులు విడిది చెయ్యడానికి శ్రీకూర్మంలో సత్రాలున్నాయి. శ్రీకాకుళంలో అన్ని స్థాయిల్లో వసతి సౌకర్యాలుంటాయి.
     
కూర్మజయంతి

     దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు లోకంలో అవతరించే శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్లి, బ్రహ్మతో కలిసి ఇంద్రాది దేవతలంతా రాక్షసుల వేధింపులకు, హింసలకు తాళలేకపోతున్నామని, తమను కాపాడే పరమాత్మవు నీవేనని మొరపెట్టుకున్నారు. కరుణాపయోనిధి శ్రీహరి ‘సకల నిధులకు, ఓషధులకు నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి’ అని తరుణోపాయం చెప్పాడు.

దేవతలు ఆ బృహత్కార్యం కోసం దానవులతో సంధి కుదుర్చుకుని, వారి సహకారంతో మందర పర్వతం కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకుని క్షీరసాగర మథనం మొదలెట్టారు. వాసుకి పాముకు తలభాగంలో విషం ఉంటుంది. అది మృత్యు స్వరూపం. అందువల్ల రాక్షసుల్ని వాసుకు ముఖం దగ్గర నిలుచోబెట్టారు శ్రీహరి. సాగరమథన సందర్భంలో కొంతకాలానికి మందర పర్వతం కింద ఆధారం లేకపోవడంతో సాగరంలో మునిగిపోసాగింది. కార్యం నిష్ఫలమయ్యే సూచనలు కనిపించాయి దేవతలకు. అలాంటి విపత్కర పరిస్థితిలో శ్రీమహావిష్ణువు కూర్మావతారం ధరించి, పర్వతాన్ని తన వీపుపై ధరించి పైకెత్తిపట్టి కార్యసాఫల్యానికి తోడ్పడ్డాడు.
మొట్టమొదట అందులోంచి హాలాహలం ఉద్భవించింది. కరుణించిన పరమ శివుడు లోక కల్యాణార్థం విషాన్ని మింగాడు. అప్సరసలు, కౌస్తుభం, ఉచ్చైశ్రవం, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం శ్రీమహాలక్ష్మి ఆ సాగరం నుంచి ఆవిర్భవించాయి. లక్ష్మీని విష్ణువు వరించి వివాహం చేసుకున్నాడు. ఆయనే మోహిని రూపంలో దేవతలకు అమృతం అందేలా చేశాడు. దేవతలు ఊపిరి పీల్చుకున్నారు.

భారతదేశంలో ప్రసిద్ధ కూర్మావతార ఆలయం శ్రీకాకుళం జిల్లా ‘శ్రీకూర్మం’ గ్రామంలో ఉంది. ఈ గుడిలో స్వామి పశ్చిమాభిముఖుడై ఉంటాడు. ఈ ఆలయంలో రెండు ధ్వజ స్తంభాలు కనిపిస్తాయి.

దక్షిణ సముద్ర తీరాన శ్వేతపురానికి ఏలిక శ్రేత చక్రవర్తి. ఆయన భార్య విష్ణుప్రియ భక్తురాలు. ఒకనాడు ఏకాదశీ వ్రతదీక్షలో ఉన్న తనవద్దకు భర్త కామమోహితుడై రాగా, ఆమె శ్రీహరిని ‘కూర్మ రూపం ధరించి లోకాల్ని
ఉద్ధరించినవాడవు నన్నీ సంకటస్థితి నుంచి కాపాడలేవా?’ అని వేడుకుంది. స్వామి కరుణించి అక్కడ గంగను సృష్టించగా రాజు భయంతో ఓ పర్వతం మీదికి చేరాడు. తన తప్పును తెలుసుకొని, పశ్చాత్తప్తుడై శ్రీమహావిష్ణువును ధ్యానించాడు. అటుగా వచ్చిన నారదుడు ‘శ్రీకూర్మమంత్రం’ రాజుకు ఉపదేశించాడు. గంగాప్రవాహం తన వేగాన్ని ఉపసంహరించుకుని వంశధార పేరుతో సాగరసంగమమైంది. అందులో పవిత్ర స్నానం ఆచరించిన రాజుకు చక్రతీర్థగుండం నుంచి వెలువడి కూర్మావతార రూపంలో స్వామి దర్శనమిచ్చాడు. రాజు పరమానందభరితుడై కోరిన కోరిక మేరకు స్వామి సమీపంలోని ఒక వట వృక్షం మీద చక్ర ప్రయోగం చేశాడు. అక్కడ క్షీరసమానమైన ఉదకం జనించింది. ఈ గుండాన్నే కూర్మగుండం లేక శ్వేతగుండం అని పిలుస్తారు.

కూర్మశైల క్షేత్రానికి దక్షిణాన ప్రేతశిల పర్వత సమీపాన కౌటిల్య తీర్థం ఉంది. ఇక్కడ పితృతర్పణం చేసి కూర్మనాథుణ్ని దర్శించడం అనాదిగా వస్తున్న ఆచారం. శ్రీకృష్ణుడు గోపికలతో వచ్చి ఇక్కడి పుష్కరిణిలో జలక్రీడలాడేవాడట. అందువల్ల నీటి అడుగుభాగం మట్టి తెల్లగా మెరుస్తుంటుందని చెబుతారు. దీన్ని ‘గోపిచందనం’ అని పిలుస్తారు.
కూర్మ, విష్ణు, పద్మ, బ్రహ్మాండ పురాణాల్లో కూర్మావతార గాథలు ఇలాంటివి అనేకం ఉన్నాయి.
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment