అమ్మమ్మ ‘కంటె’ అమ్మాయి మెడలో!

భూమి సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో రాత్రీపగలూ ఒకదాని వెనక ఒకటి వస్తుంటాయి. పోతుంటాయి. కాలచక్ర భ్రమణంలో ఫ్యాషన్లూ అంతే. కొత్తవి పాతబడతాయి. పాతవి కొత్తగా వస్తాయి. ఈ సూత్రం దుస్తులూ యాక్సెసరీలకే కాదు. నగలకీ వర్తిసుంది. అందుకే, నాడు బామ్మల కంఠాన్ని అలంకరించిన ‘కంటె’, నేటి అమ్మాయిల మెడలో కొత్తకొత్తగా మెరుస్తోంది

ప్రపంచంలో ఉన్న బంగారునగల్లో అత్యధిక శాతం భారతీయుల నగలపెట్టెల్లోనే ఉన్నాయి. ‘ఒకటా రెండా... ఏకంగా పాతిక టన్నుల బంగారం- అంటే సుమారు 55 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం నగల రూపంలో ఉంది’ అంటోంది వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌. దీన్నిబట్టి నగలంటే మనవారికెంత మోజో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన దేశాల్లో మాదిరిగా మెడలో ఓ గొలుసు, చేతులకో బ్రేస్‌లెట్టు పెట్టుకుంటే చాలదు మనకి. పండగకీ పుట్టినరోజుకీ పెళ్లికీ పేరంటానికీ- ఇలా సందర్భానుసారం రకరకాల నగలను అలంకరించుకోవడం మనకి అనాదిగా ఉన్న అలవాటు.


ఓ ఇరవై ముప్ఫైయేళ్లు వెనక్కి వెళితే... బామ్మలూ తాతమ్మల మెడ చుట్టూ చేతులు పెనవేసుకుని ఆడుకున్న మనవరాళ్లందరికీ ఓ నగ జ్ఞాపకమే. కంఠానికి అతుక్కున్నట్లుగా ఉండే ఆ గుండ్రని నగ, దాదాపుగా కాళ్లకు పెట్టుకునే కడియాల్లానే ఉండేది. ఏడువారాల నగలు పెట్టె నిండా ఉన్నా బయటకు తీసేది అపురూపమే. ఒక్క కంటె మాత్రం ఎప్పుడూ మెడలోనే ఉండేది. అందులో ఊడిపోవడానికి రాళ్లూ రత్నాలూ ఉండవు, తెగిపోయేంత సున్నితంగానూ ఉండదు. మేలిమి బంగారంతో మందంగా మెరిసే శరీరంలో ఒక భాగమన్నట్లుగానే ఉండేది. బంగారు కంటె పెట్టుకోలేనివాళ్లు వెండి కంటె అయినా ధరించేవారు. అదొక్కటీ మెడలో ఉంటే మెడనిండా నగలు ఉన్నట్లు నిండుగా ఉండేది. కానీ తరవాతి తరాలవారు అందులో సొగసేముంది, పాతకాలం మోటు నగ అనుకున్నట్లున్నారు... దాన్ని మార్చి నాజూకైన చంద్రహారాలూ పలకసేర్లూ చేయించుకోసాగారు.


వేసవికాలం, వానాకాలం, శీతాకాలం తరవాత మళ్లీ వేసవి రాకుండా ఉండదుగా... అదే తీరులో ఆనాటి కంటె ఇప్పుడు మళ్లీ తెరమీదికొచ్చింది. అయితే ఈసారి సరికొత్త సొగసులద్దుకుని మరింత వైభోగంగా అమ్మాయిల కంఠాన్ని అలంకరించసాగింది. ఒకప్పుడు కొద్దిపాటి చెక్కుడుతో నున్నగా చేయించుకునే కంటెమీద ఇప్పుడు అనేక డిజైన్లు చెక్కుతున్నారు ఆధునిక డిజైనర్లు. సీతారామలక్ష్మణులు, లక్ష్మీదేవి, వినాయకుడు... ఇలా రకరకాల టెంపుల్‌ డిజైన్లలో దానికి ఓ భారీ పెండెంట్‌నూ జోడిస్తున్నారు. ఒక్క లాకెట్టు ఏం సరిపోతుంది, అనుకునేవాళ్లకోసం నెక్లెసులూ హారాల్లో మాదిరిగానే చిన్న చిన్న పెండెంట్లూ బిళ్లల్నీ అతికించి భారీగానూ తయారుచేస్తున్నారు. నక్షీ డిజైన్లతోబాటు యాంటిక్‌ ఫినిషింగ్‌తోనూ కంటె మెరుస్తోంది. ఈ హంగులకి తోడు వజ్రాలూ అన్‌కట్‌ వజ్రాలూ కెంపులూ పచ్చలూ ముత్యాల మేళవింపుతో ఒకప్పటి సాదాసీదా కంటె కాస్తా ఘనమైన కంఠహారంగా మారిపోయింది.


 నిజానికి కంటె అనేది అత్యంత ప్రాచీన నగ. కంటెను ఆభరణంగా ధరించడం అనేది అనేక ఆటవిక తెగల్లో ఎప్పటి నుంచో ఉంది. వాళ్లకు అందుబాటులో ఉన్న వనరులను బట్టి వెండి, రాగి, ఇత్తడి, కంచు... వంటి రకరకాల లోహాలతో కంటెను చేయించుకునేవారు. ఏనుగు దంతాలతో చేసిన కంటెలు కూడా కొన్ని తెగల్లో పెట్టుకుంటుంటారు. ఆటవికుల నుంచి నాగరికులుగా మారిన తరవాత కూడా కంఠాభరణం అంటే కంటె అన్నట్లే ఉండేది. అందుకే ప్రాంతాలతో సంబంధం లేకుండా, దక్షిణాది, ఉత్తరాది అన్న తేడా లేకుండా అన్నిచోట్లా ఇది వాడుకలో ఉంది. రాజస్థానీ నగల్లో దీని హవా తిరుగులేనిది. హాస్లి పేరుతో మీనాకారి, పోల్కీ డిజైన్లలోనూ కంటెను చేయించుకుని ధరిస్తారక్కడ. మనదగ్గర మాత్రం ఇటీవలే మళ్లీ తెరమీదికొచ్చింది. అబ్బాయిలకి పులిగోరు పతకాల్లానే అమ్మాయిలకి కంటెల మీద మహా మోజు పెరిగింది. మహానటిలోని మాయాశశిరేఖ మెడలోనూ కంటె మెరవడం తెలిసిందే. ప్రస్తుతం నడుస్తోన్న చోకర్‌ నెక్లెస్‌లతో పోటీపడుతూ పెళ్లినగల్లోనూ మెరుస్తున్న ‘కంటె’ లేటెస్ట్‌ ట్రెండ్‌గా ఫ్యాషన్‌ ప్రపంచంలో సందడి చేస్తోంది.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment