మీ భక్తి మూఢమా ? గాఢమా ? | Bhakthi | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu | Bhakthi Pustakalu | Bhaktipustakalu | Bhakti Pustakalu | BhakthiBooks | MohanBooks | Bhakthi | Bhakti | Telugu Books | Telugu Book
మీ భక్తి మూఢమా ? గాఢమా ?

భక్తి మనుషులకే పరిమితం కాదు.. సమస్త జీవజాలానికీ ఉంటుంది... 
కానీ మేధస్సు ఉన్న మనిషి ఎలా ఉండాలి? 
ఇతర జీవులతో పోలిస్తే చేసే ఆరాధనలో అవగాహన ఉండాలి... 
భక్తి మూఢంగా కాకుండా విచక్షణతో ఉండాలి... అందులోనే గాఢత ఉంటుంది. 
దీనికి కావాల్సింది వివేకం... 
ఆ వివేకాన్నిచ్చేది ప్రశ్న... 
ఎప్పుడు? ఎందుకు? ఎవరు? ఏమిటి? ఎలా?... 
ప్రతి ఆవిష్కరణకూ మూలం ప్రశ్నే. చివరకు భగవత్‌ సాక్షాత్కారానికి కూడా... 
సోక్రటీస్‌ తపస్సంతా ప్రశ్నించడమే. భారతీయ దర్శనాల్లోనూ తర్క, మీమాంసలకు పెద్దపీట వేశారు. 
అందుకే ఏ సందేహం వచ్చినా అడగండి... 
వచ్చే సమాధానం జ్ఞానాన్నివ్వడంతో పాటు సమాజంలోని అనేక రుగ్మతలను రూపు మాపుతుంది... 
అసలేంటీ ప్రశ్న?

గాఢత అవసరం... 
మీరు పూజించే దేవుడి విషయంలో కూడా ఎరుకగా ఉంటున్నారా? గాఢ భక్తి అంటే గుడ్డిగా ఆరాధించడం కాకుండా తర్కంతో, వివేకంతో పూజించడం. నిత్యాన్వేషణ, నిరంతర సమీక్ష గాఢ భక్తిలో ఉంటాయి. నమ్మి చెడ్డ వారు లేరంటారు. కానీ ఏమి నమ్మాలన్న విచక్షణే జ్ఞానానికి నిదర్శనం. దాన్ని పొందే ఏకైక మార్గం ప్రశ్న. ప్రశ్నించడం వల్ల ఆత్మరక్షణ ఉంటుంది. ధర్మానికీ రక్షణ ఉంటుంది. మొత్తం 108 ఉపనిషత్తుల్లో నాలుగోది ప్రశ్నోపనిషత్తు. పిప్పలాదుడనే బ్రహ్మజ్ఞాని దగ్గరకు వచ్చిన ఆరుగురు మహర్షులు ఆరు ప్రశ్నలు అడుగుతారు. వాటికి పిప్పలాదుడు సమాధానాలు ఇస్తాడు. ఆ ప్రశ్న, సమాధానాలే ప్రశ్నోపనిషత్తుగా మారాయి. ఆదిశంకరాచార్యులు ఈ ఉపనిషత్తుకు భాష్యం రాశారు. మనం గమనిస్తే భారతీయ సనాతన సంప్రదాయల్లో ఎక్కువ భాగం హేతుబద్ధత ఉన్నవే ఉంటాయి. తొలినుంచీ తర్కం అనేది మన సమాజంలో కీలక పాత్ర పోషించిందనడానికి ఇవన్నీ నిదర్శనాలు. పుట్టుక ఏమిటి? మరణం ఏమిటి? ఈ రెంటి మధ్య చేయాల్సిన కర్తవ్యం ఏమిటి?... అంటూ అర్జనుడు పరమాత్మను ప్రశ్నిస్తే, సమాధానంగా పుట్టిన అమృత భాండమే భగవద్గీత. గొప్ప వారు, సద్గురువులు కూడా ఈ అన్వేషణలోనే దొరుకుతారు. భగవంతుడెవరు? ఆయన ఏం చేస్తుంటాడు? అతడి వల్ల మనిషికి కలిగే ప్రయోజనం ఏమిటి?... ఇలాంటి ప్రశ్నలెన్నో కలవరపెడుతుంటే కలకత్తాకు చెందిన నరేంద్రనాథ్‌దత్తా ఆనాడు గురువులుగా, మేధావులుగా పేరుపొందిన ఎంతో మంది దగ్గరకు వెళ్లాడు. అడిగాడు. సరైన సమాధానం కోసం తపించాడు. ఈ క్రమంలోనే రామకృష్ణ పరమహంసను కూడా ఎన్నో రకాలుగా పరీక్షించాడు. ఎన్నో ప్రశ్నలను సంధించాడు. ఒక దశలో పిచ్చివాడుగా అనుమానించాడు కూడా...కానీ పరమహంస తనను అనుమానిస్తున్న, పరీక్షిస్తున్న నరేంద్రుడిని ఎక్కడా తప్పుబట్టలేదు. ఆ సందేహాలను ఎంతో ఓపిగ్గా నివృత్తి చేశాడు. చివరకు ఆత్మానుభూతిని కలిగించి శిష్యుడిని వివేకానందుడిగా మార్చాడు. గురుశిష్యులిద్దరూ భారతీయ ఆత్మను విశ్వవ్యాప్తం చేశారు.

పరిశోధనే... కఠోపనిషత్తు..! 
దేవుడి గురించి ఎలా తెలుసుకోవాలి? ఎవరు చెబుతారు? అనే ప్రశ్న ఉదయించినప్పుడే ఆలోచన, సాధన మొదలవుతాయి. అవే క్రమంగా పరిశోధనగా మారతాయి. 
నచికేతుడి తండ్రి వాజశ్రవుడు. అతడు విశ్వజిత్‌ అనే యాగం చేస్తూ అందులో భాగంగా అనేక దానాలు చేస్తున్నాడు. తండ్రి చేస్తున్న దానాల్ని గమనించిన నచికేతుడు నాన్నా! నన్ను ఎవరికి దానం చేస్తావు? అని అడిగాడు. యాగానికి సంబంధించిన పనులతో విసుగ్గా ఉన్న వాజశ్రవుడు నిన్ను యమునికి దానం ఇస్తానన్నాడు. వెంటనే నచికేతుడు తనను తాను సమర్పించుకునేందుకు యముడి వద్దకు వెళ్లాడు. యముడు పిల్లాడిని చూసి ముచ్చటపడి మూడు వరాలు ఇస్తానంటాడు. అందులో ఒక వరంగా బ్రహ్మజ్ఞానం గురించి చెప్పమంటాడు నచికేతుడు. పసిబాలుడు ఊహించని వరం కోరేసరికి ఆశ్చర్యపోతాడు యముడు. అనేక ఆశలు చూపించి అతడి దృష్టి మరల్చాలని చూస్తాడు. కానీ నచికేతుడు దేనికీ లొంగడు. తన ప్రశ్నకు సమాధానం కావాలని పట్టుబడతాడు. బాలుడి పట్టుదలకు సంతోషించిన యముడు అతడికి బ్రహ్మజ్ఞానం బోధిస్తాడు. అదే కఠోపనిషత్తుగా అవతరించి అందరికీ ఆత్మజ్ఞానాన్ని అందిస్తోంది. ఇలా తెలుసుకోవాలన్న తపన ప్రశ్నించిన భక్తుడితో పాటు భక్తుడినీ తరింపజేసింది.

హనుమ నేర్పిన నీతి... 
సాక్షాత్తు భగవంతుడిని కూడా ప్రశ్నించవచ్చా? ఎవరిని.. ఎలా అడగాలి? అన్న ప్రశ్నలకు హనుమంతుడు ఒక సమాధానంగా నిలుస్తాడు.

సీతాదేవిని రావణుడు అపహరించిన తర్వాత ఆమెను వెదుకుతూ రామలక్ష్మణులు రుష్యమూక పర్వత ప్రాంతానికి చేరుకుంటారు. సుగ్రీవుడి నివాస ప్రాంతం అది. తనను చంపడానికి తన అన్న వాలి వీరిని పంపించారా అని అనుమానించి, విషయం తెలుసుకునేందుకు తన మంత్రి అయిన హనుమంతుడిని పంపుతాడు. మారుతి మారు వేషంలో రామలక్ష్మణుల దగ్గరకు వచ్చి అనేక విధాలుగా ప్రశ్నిస్తాడు. ‘రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంశితవ్రతౌ! దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ!!’ మీరిద్దరూ మంచి తేజోవంతుల్లా, తీవ్రమైన తపోదీక్ష పట్టిన వారిలా ఉన్నారు. మీ రూపం తాపసుల్లా ఉన్నా మీ తేజం క్షత్రియత్వాన్ని సూచిస్తోంది. గొప్ప పని ఉంటే తప్ప మీవంటి యోధులు క్రూరమృగాలు సంచరించే ఇలాంటి చోటుకు రారు’ అని ప్రశ్నిస్తాడు హనుమ.

ప్రశ్న అంటే ఇలా ఉండాలి. ఒక్క అక్షరం ఎక్కువ తక్కువ కాకుండా ప్రశ్నలు వేశాడు హనుమ. ఇంత కాలం తాను ఎవరి గురించి ఎదురు చూస్తున్నాడో ఆ దైవం ఎదుట నిలబడినప్పుడు హనుమ తొందరపడలేదు. వచ్చింది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఎంత గొప్పగా ప్రశ్నించాడంటే రాముడే ముచ్చటపడ్డాడు. వ్యాకరణ పండితుడు తప్ప మరొకరు ఇలా మాట్లాడలేడన్నాడు. హనుమ ప్రశ్న స్వీకరించిన వ్యక్తి కూడా ఆనందపడేలా అడిగాడు.

ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా మన దేశాన్ని ‘భారతదేశం భగవదనుగ్రహం పొందిన దేశాల్లో ఒకటి’ అని వ్యాఖ్యానించింది. మన దేశ సాంస్కృతిక వారసత్వ స్వరూప వైశిష్ఠ్యం తాలూకు సమగ్ర అవగాహన అది. దీని వెనక ఒక అద్భుత తాత్త్విక నేపధ్యం కనిపిస్తుంది. అందుకే భారతీయ దర్శనాలు వేల సంవత్సరాలపాటు ప్రపంచ మానవాళికి మార్గదర్శకమయ్యాయి. భూమ్మీద అనేక నాగరికతలకు ఆలంబన అయ్యాయి. ప్రతి విషయంపై అద్భుతమైన పరిశోధన చేసి ఒక సమగ్ర అంచనాకు రావడం ఇక్కడి సంప్రదాయం. ఆ పరంపరను కొనసాగించాల్సిన అవసరం ప్రతి వ్యక్తిపై ఉంది.

ఏది మంచి ప్రశ్న..?


తెలియని విషయాన్ని తెలుసుకోవాలనే కోరికతో అడగటం ప్రశ్న అవుతుంది. అవతలి వ్యక్తిని పరీక్షించడం కోసం అడిగేది కూడా ప్రశ్నే. పరిప్రశ్న దీనికి భిన్నమైంది. మనకు కలిగిన సందేహం ఎవరి వద్ద తీరుతుందో, ఎవరు తన ప్రశ్నకు పూర్తి సమాధానం చెప్పగలరని సందేహం కలిగిన వ్యక్తి భావిస్తాడో, ఆ వ్యక్తి మీద నమ్మకం ఉంచి, అడిగే ప్రశ్న పరిప్రశ్న అవుతుంది. ఇక్కడ, సమాధానం చెప్పే వ్యక్తి సందేహం కలిగిన వ్యక్తికి తప్పనిసరిగా గురువు అయి ఉండాలనే నియమం లేదు. తన సందేహం తీర్చగలరన్న నమ్మకం ఉంటే చాలు అర్థపరంగా చూస్తే పరిప్రశ్న అనే పదానికి శ్రేష్ఠమైన ప్రశ్న అని అర్థం. వినయంతో కూడిన ప్రశ్న అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. అర్జునుడికి కలిగిన సందేహాలు తీర్చే క్రమంలో కృష్ణపరమాత్మ పరిప్రశ్న అనే అంశాన్ని చెబుతాడు. 

తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా । 
ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః ।। 

అర్జునా! నీ సందేహాలు తీరాలంటే తత్త్వాన్ని దర్శించిన జ్ఞానుల దగ్గరకు వెళ్లి, వారిని వినయంతో అడగమని చెబుతాడు. మనకు కలిగిన సందేహాన్ని తీర్చడం కోసం అవతలి వ్యక్తిని వినయంతో అర్థించాలి. చులకన భావంతో, అవతలి వ్యక్తిని పరీక్షించాలని ప్రశ్నించటం క్షమించరాని నేరం అవుతుంది.


దేవుణ్ణి ప్రశ్నిస్తే...?


భక్తి ఉన్నంత మాత్రాన ప్రశ్నించకూడదనేమీ లేదు. ప్రశ్నకు తగిన సమాధానం దొరికితే భక్తి మరింత పెరుగుతుంది. కార్యకారణ సంబంధాలను విశ్లేషించిన తరువాత ఏర్పడే భక్తిలో గాఢత ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సందేహం వచ్చిందనుకోండి... కొడుకు తండ్రిని ప్రశ్నిస్తాడు కదా! అనుమానం నివృత్తి చేసుకుంటాడు కదా! మరి దేవుడు జగత్తుకే తండ్రి అయిన దేవుడిని ప్రశ్నిస్తే మాత్రం తప్పేముంది. దేవుడు కూడా తనను నిలదీసే భక్తులను ఎక్కువ అనుగ్రహిస్తాడు. కత్తి పదునుతేలాలంటే సానబెట్టాలి. భక్తికీ అంతే. ఆటవికుడైన తిన్నడు పరమ శివుడిని అంత తేలిగ్గా నమ్మలేదు. అసలు నువ్వెవరని ప్రశ్నించాడు. నీ జాడ ఎక్కడని నిలదీశాడు. భగవంతుడి జాడను తాను తెలుసుకున్నాకే విశ్వసించాడు. పరమ భక్తుడిగా మారాడు. భాగవతం రాసిన పోతనామాత్యుడు పరమ భాగవతోత్తముడు. అయితేనేం. ఆయన దేవుడి గురించి బోలెడన్ని ప్రశ్నలు సంధించాడు. అంతెందుకు విదుషాం భాగవతే పరీక్ష అంటారు. పండితులకు భాగవతంలోనే పరీక్ష పెట్టాలి అని దీనర్థం. 

‘కలడందురు దీనులయెడ 
కలడందురు పరమయోగి గుణముల పొలం 
కలడందురన్ని దిశలను 
కలడు కలండనెడువాడు కలడోలేడో’ 

అని గజేంద్రుడు తన స్వామిని సందేహిస్తే.. లేదు తాను ఉన్నానని నిరూపించుకోవాల్సిన పరిస్థితి భగవంతుడికి వచ్చింది. పరుగుపరుగున వచ్చి అశక్తుడిగా ఉన్న తన భక్తుణ్ణి రక్షించాడు. ఇక్కడ గజేంద్రుడంటే ఏనుగు అనీ, మకరి అంటే మొసలి అని కాదు. ప్రతి మనిషీ గజేంద్రుడే. భవబంధాలన్నీ మొసళ్లే. వీటన్నిటీ సంహరించాలంటే దేవుడి దయ అవసరమే. భక్తుడి ప్రశ్నకు ఉన్న శక్తికి ఇదో నిదర్శనం.
-శంకర నారాయణ
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment