vastuguna deepika 
వస్తుగుణదీపిక
-------------------------------------
ధన్వంతరి త్రయోదశి 


ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ సౌభాగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే! శారీరక మానసిక ఉల్లాస భావనే ఆరోగ్యం. సకల సంపదలు, సమస్త సంతోషాలు ఆరోగ్యంతోనే మిళితమై ఉంటాయి. మానవాళికి ఆరోగ్యసిద్ధిని చేకూర్చడానికి ఉపయుక్తమైన ఆయుర్వేద వైద్య విధానాన్ని అందించిన నారాయణ స్వరూపుడు- ధన్వంతరి. వైద్య ప్రక్రియకు, ఔషధ శాస్త్రానికి ఆద్యుడు- ధన్వంతరి. దేవదానవులు అమృతం కోసం క్షీరసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం, శ్రీమహాలక్ష్మి వంటి దైవికాంశాలు ఆవిష్కారమయ్యాయి. ఆ సంవిధానంలోనే పాలకడలి నుంచి సాకారమైన దివ్య తేజోమూర్తి ధన్వంతరి అని పురాణాలు విశ్లేషించాయి.

దశావతారాలే కాకుండా విష్ణుఅంశతో అనేక అవతార మూర్తిమత్వాలు ప్రకటితమయ్యాయి. ఆ సమాహారంలోనిదే ధన్వంతరి స్వరూపం. చతుర్భుజుడిగా శ్రీహరి రూపగుణ యశోవైభవంతో ఆయన వ్యక్తమయ్యాడు. కుడిభాగంలోని కింది చేతిలో అమృతకలశం, పైచేతిలో ఔషధపాత్ర, ఎడమవైపున ఓ చేతిలో సుదర్శనచక్రం, మరో చేతిలో వన మూలికల్ని ధరించి, ధన్వంతరి గోచరమవుతాడు. ఆయనకు ‘జలుడు’ అని నామకరణం చేసి వైద్యశాస్త్రానికి, ఆయుర్వేద విద]్యకు అధిపతిగా విష్ణువు నియమించాడంటారు.

పలుగ్రంథాలు ధన్వంతరి అవతార విశేషాంశాల్ని వెల్లడించాయి. వాల్మీకి శ్రీమద్రామాయణం బాలకాండలో ధన్వంతరి ప్రస్తావన ఉంది. శ్రీమద్భాగవతం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, విష్ణుధర్మోత్తర పురాణం, హరివంశాల్లో ధన్వంతరి ప్రస్తావన కనిపిస్తుంది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం సూర్యుడి ప్రధాన శిష్యుల్లో ఒకడైన ధన్వంతరి వైద్యశిఖామణిగా వర్ధిల్లాడు. భాస్కరుడి కిరణ పుంజాల్లో వ్యాధినివారక శక్తుల్ని ప్రవేశపెట్టి ధన్వంతరి సమస్త జీవరాశికి మేలు చేకూరుస్తున్నాడని ఈ పురాణం విశ్లేషించింది. ధన్వంతరి హస్తభూషణంగా అమృత కలశం వెలుగొందుతుంది. ఈ అమృతభాండం కోసమే దేవదానవులు క్షీరసముద్రాన్ని మధనం చేశారు. ధన్వంతరి ద్వారా వారి లక్ష్యం నెరవేరింది.

కార్తిక బహుళ త్రయోదశిని మృత్యుంజయ త్రయోదశి, ధన్వంతరి త్రయోదశి, ఆరోగ్యప్రద త్రయోదశి, ప్రదోష త్రయోదశి, సువర్ణ త్రయోదశి అని వివిధ పేర్లతో వ్యవహరిస్తారు. కార్తికమాస శివరాత్రితో కూడిన ఈ త్రయోదశినాడు గరళాన్ని తన కంఠంలో లోక కల్యాణం కోసం నిక్షిప్తం చేసుకున్న మృత్యుంజయుణ్ని ఆరాధిస్తారు. నీలకంఠుడైన మహాదేవుడు, ధన్వంతరికి అపమృత్యు దోషాల్ని తొలగించుకునే మార్గాల్ని ఈ త్రయోదశినాడు వివరించాడంటారు. వైద్యనాథేశ్వరుడి అనుగ్రహంతో ధన్వంతరి శారీరక, మానసికపరమైన రోగాలకు చికిత్సావిధానాల్ని ఈ త్రయోదశినాడు లోకానికి వెల్లడించాడంటారు. సప్తధాతువుల్లో బంగారానికి వైద్యవిధానంలో శ్రేష్టత అధికంగా ఉందని, స్వర్ణభస్మ సేవనం వల్ల మనిషి ఆయుర్దాయం పెంపొందించుకోవచ్చని ధన్వంతరి పేర్కొన్నాడంటారు. అందుకే దీన్ని స్వర్ణత్రయోదశి అన్నారు. ధన్వంతరి మానవాళికిచ్చిన ఆయుర్వేదాన్ని అధర్వణ వేదానికి ఉపవేదంగా చెబుతారు. సుశ్రుత మహర్షికి ధన్వంతరి ఆయుర్వేదాన్ని బోధించాడు. సుశ్రుతుడు, చరకుడు, చ్యవనుడు వంటి మహర్షులు ధన్వంతరి వైద్యాన్ని విస్తృతంగా అమలుచేశారు.

ధన్వంతరి త్రయోదశినాడు వైద్యనారాయణమూర్తిగా ధన్వంతరిని ఆరాధిస్తారు. ఆయుర్వేద పితామహుడిగా, ఆరోగ్య ప్రదాతగా సంకల్పపూర్వకంగా ద్వాదశపత్రాలతో ధన్వంతరిని పూజింస్తారు. బిల్వ, మాచి, ఉత్తరేణి, తులసి, గన్నేరు, ఉమ్మెత్త, విష్ణుక్రాంత, జిల్లేడు, రేగి, జమ్మి, జాజి, ఉసిరి అనే పత్రాలతో విష్ణు అష్టోత్తర సమన్వితంగా పత్రపూజ నిర్వహిస్తారు. జాజికాయ, జాపత్రి, లవంగాలు, ఏలకుల చూర్ణం కలిపిన సుగంధ జలాన్ని, మిరియాలు, శొంఠి, సైంధవ లవణం, ఆవునెయ్యితో తయారుచేసిన ‘సిరి పొంగలి’ని ధన్వంతరికి నివేదన చేస్తారు.
- డాక్టర్‌ కావూరి రాజేశ్‌పటేల్‌
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

1 comment: