నిద్రాణం కాదది ఉత్థానం 

నిద్ర బడలిక తీర్చి ఉత్తేజాన్నిస్తుంది. 
అదే నిద్ర ఎక్కువైతే.. బద్ధకాన్ని కలిగిస్తుంది, ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. 
తనను తాను తెలుసుకునే నిద్ర కూడా ఒకటుంది. అదే యోగనిద్ర. మహా సంకల్పానికి, దృఢ చిత్తానికి నిదర్శనమిది. తొలి ఏకాదశి సందర్భంగా మహావిష్ణువు కూడా యోగనిద్రకు ఉపక్రమిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. నాలుగు నెలల పాటు శ్రీహరి తదేకమైన దీక్షలో ఉంటాడంటారు. ఆ సమయంలోనే సృష్టిపాలన చేస్తాడని విశ్వసిస్తారు. మహావిష్ణు యోగనిద్ర విశేషాలివే.. 

   
    ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా చేసుకుంటారు. దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు. సంప్రదాయబద్ధంగా చేసుకునే గొప్ప పర్వదినం ఇది. ఈ రోజునే శ్రీమహావిష్ణువు శయనిస్తాడు. మళ్లీ కార్తీక శుద్ధ ఏకాదశి (ప్రబోధిని ఏకాదశి) నాడు నిద్ర నుంచి మేల్కొంటాడని అంటారు. ఈ నాలుగు మాసాలు మహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడు. 
దేవాదిదేవుడు, స్థితికారుడు అయిన మహావిష్ణువు నిద్రపోతాడా? లోకపాలకుడే నిద్రపోతే మరి లోకాల పరిస్థితి ఏమిటన్న సందేహం కలగక మానదు. అయితే శయన ఏకాదశి నుంచి ప్రబోధిని ఏకాదశి వరకు అంటే నాలుగు మాసాలు శ్రీహరి పడుకుంటాడు అంటే.. అది బడలిక తీర్చుకునే నిద్ర కాదని గ్రహించాలి. ఆయనది యోగనిద్ర. మామూలు నిద్రకు.. యోగనిద్రకు చాలా తేడా ఉంది. యోగ పరంగా చెప్పుకొంటే సమాధి స్థితికి సంబంధించినది. సమాధి స్థితికి చేరిన సాధకుడు ప్రజ్ఞానాన్ని పొందుతాడు. ఆ సమయంలో బ్రహ్మజ్ఞానం, బ్రహ్మానంద స్థితి కలుగుతాయి. ప్రజ్ఞానం సొంతమైన వారు అంతర్ముఖులై.. తమలోకి తాము చూసుకుంటూ పరమాత్మలో ఐక్యాన్ని పొందగలుగుతారు. ఈ ప్రజ్ఞానానికి సంబంధించిన విషయాలను, యోగనిద్రాస్థితి ఆనవాళ్లను మాండూక్యోపనిషత్తు వివరంగా చెబుతుంది. అలాగే ధ్యానానికి సంబంధించిన ప్రణవ నాదమైన ఓంకార విశేషాలను ప్రస్తావించింది.

23న తొలి ఏకాదశి

సాధారణ ధ్యానానికి, యోగనిద్రకు తేడా ఉంది. ఈ రెండింటి సమ్మేళనంతో సమాధిస్థితికి చేరవచ్చు. ఈ స్థితిలో ఉన్నప్పుడే శ్రీమహావిష్ణువు తాను చేసిన సృష్టి సంరక్షణ విషయాలన్నిటినీ తనలో తాను సమీక్షిస్తాడు.

ఉపవాస దీక్ష

ప్రతి నెలలో రెండు ఏకాదశులు. ఏడాదికి ఇరవై నాలుగు. అధిక మాసం వచ్చిన సంవత్సరం మరో రెండు ఏకాదశులు అదనం. ప్రతి ఏకాదశీ ప్రత్యేకమైనదే! ఒక్కోదానికీ ఒక్కోపేరు. తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, భీష్మ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి ఇలా రకరకాల పేర్లు. ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి.. తొలి ఏకాదశి. మహావిష్ణువు అనుగ్రహం కోరుతూ ఈ రోజున ఉపవాస దీక్ష పాటిస్తారు. జాగరణ చేసే ఆచారం కూడా ఉంది. మరునాడు అంటే ద్వాదశి రోజున ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత దీక్షాపరులు భుజించి వ్రతాన్ని విరమిస్తారు.

సాధారణ ధ్యానానికి, యోగనిద్రకు తేడా ఉంది. ఈ రెండింటి సమ్మేళనంతో సమాధిస్థితికి చేరవచ్చు. ఈ స్థితిలో ఉన్నప్పుడే శ్రీమహావిష్ణువు తాను చేసిన సృష్టి సంరక్షణ విషయాలన్నిటినీ తనలో తాను సమీక్షిస్తాడు. ఈ సమీక్షణం ఆయనకు అలా ఉంటే.. యోగనిద్ర సాధకులకు కూడా ఓ సమీక్షణానందాన్ని కలిగిస్తుంది. ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసి తానెవరో తెలుసుకోగలిగిన స్థితి సాధకుడికి చేకూరుతుంది. తానెవరో తెలిసినప్పుడు.. తన కర్తవ్యం ఏంటో తెలుస్తుంది. తన లక్ష్యం ఏంటో అవగతం అవుతుంది. ఇది తెలుసుకోగలిగితే అంతా శాంతమే. యోగనిద్ర సాధకులు పొందే అనిర్వచనీయమైన అనుభూతి ఇది. దీనిని సాధించడం వల్ల మానసిక ఆందోళనలు, వాటివల్ల కలిగే తీవ్రమైన శారీరక బాధలు దూరమవుతాయి. పూర్వం యుద్ధ సమయాల్లో యోధులు యోగనిద్రను అవలంబిస్తూ శరీరానికైన తీవ్రమైన గాయాల నొప్పులను, మానసిక ఉద్వేగాన్ని అధిగమిస్తూ ఉండేవారట. 

సాధించడమెలా? 
యోగనిద్ర అంటే అటు నిద్రాకాదు, ఇటు మెలకువా కాదు. అసలేంటిది? దీన్ని సాధించడం సాధ్యమేనా? అనంటే అదేమంత కష్టమైన పని కాదంటారు సమర్థులైన యోగాచార్యులు. యోగాసనాల్లో శవాసనం కూడా ఒకటి. ఈ ఆసనం వేసేవారు నేలమీద వెల్లకిలా శవంలా పడుకొంటారు. ఆ సమయంలో చర్మం, కళ్లు, నాలుక, ముక్కు ఈ నాలుగింటినీ అంతర్ముఖీనం చేయాలి. కేవలం చెవులు మాత్రమే పని చేస్తూ ఉండాలి. ఈ స్థితిలోకి వచ్చి గురువు చెప్పిన మాటలను వింటూ అటు నిద్ర, ఇటు మెలకువ కాని స్థితికి చేరుకోవాలి. ఇదే యోగనిద్ర. ఈ స్థితికి చేరినప్పుడు ఆనందం సొంతమవుతుంది. అనారోగ్యం దూరమవుతుంది. వైదిక కాలం నాటి మహర్షులే కాక, ఆధునిక కాలంలోని యోగ గురువులు పలువురు కూడా శారీరక, మానసిక ఆరోగ్యాల పరిరక్షణకు ఈ యోగనిద్రను తమ శిష్యులతో సాధన చేయిస్తున్నారు. అలసట, బద్ధకం, అనారోగ్యం అన్నీ పోయి చెయ్యవలసిన పనిని హుషారుగా చేసే ఓ ఉత్తమ శక్తి యోగనిద్ర. ఆ శక్తిని అందరూ అందిపుచ్చుకోవాలని ప్రబోధించడమే మహావిష్ణువు యోగనిద్రాస్థితి పరమార్థం. - యల్లాప్రగడ మల్లికార్జునరావు 

ఆరోగ్యసాధనే అసలు లక్ష్యం

తొలి ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉన్న నాలుగు మాసాల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. ఈ కాలానికి సనాతన సంప్రదాయంలో ఓ విశిష్టమైన స్థానం ఉంది. సాధకులు, యోగులు, పీఠాధిపతులు చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తారు. ‘ఈ సాధనంతా దేనికి?’ అన్న సందేహం రావొచ్చు. దీనికి సమాధానం ఆరోగ్య సాధనే! ఈ వ్రతం గురించి స్కాంద, భవిష్యోత్తర, బ్రహ్మవైవర్త తదితర పురాణాల్లో వివరంగా ప్రస్తావించారు. 
చాతుర్మాస్య వ్రతం ఆచరించడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక బలం కూడా సమకూరుతుంది. మనసుకు ప్రశాంతమైన స్థితి కలుగుతుంది. అందుకే ఈ వ్రతం కాలగమనంలో బౌద్ధులకు, జైనులకు కూడా ఆచరణ యోగ్యమైంది. బౌద్ధులు చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించిన తీరు జాతక కథల్లో చాలా చోట్ల కనిపిస్తుంటుంది. ఈ నాలుగు నెలలు క్రమశిక్షణతో కూడిన ఆహార వ్యవహారాలను పాటిస్తారు. జీవితాన్ని నియంత్రించుకుంటూ సమాజానికి ఆదర్శంగా నిలవడమే వ్రత సారంగా కనిపిస్తుంది. 

చాతుర్మాస్య వ్రతంలో ఆహార నియమాలను పరిశీలిస్తే నాలుగు మాసాల్లోనూ కొన్ని కొన్ని కాయగూరలను, ఆహార పదార్థాలను విడిచిపెడతారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెద్దలు చేసిన నియమం ఇది. శ్రావణంలో కొన్ని కూరలు, బాధ్రపదమాసంలో పెరుగు, ఆశ్వయుజంలో పాలు, కార్తీక మాసంలో పప్పుపదార్థాలు తినకూడదన్నది నియమం. అలాగే నిమ్మ, ముల్లంగి, గుమ్మడి, చెరకు జోలికి వెళ్లరు. ఇలాంటి నియమాలు పాటించడం ద్వారా ఆరోగ్యం మెరుగవుతుందని చెబుతారు. అంతేకాదు ఈ వ్రతాన్ని స్త్రీపురుషులందరూ ఆచరించవచ్చని పురాణాలు పేర్కొంటున్నాయి. కాలక్రమంలో ఇది సన్యాసులకు, యోగులకు మాత్రమే పరిమితమైంది. యతులు ఈ వ్రతాన్ని విధిగా పాటిస్తారు. ఒకే ప్రదేశంలో ఉండి నాలుగు మాసాల పాటు సామాజిక చైతన్యానికి ఉపకరించే విషయాలను ప్రబోధిస్తుంటారు.
-----------------

మోక్షాన్నిచ్చే ఏకాదశి వ్రతం



ఆషాడస్య శుక్లైదశ్యాం యద్విధానం శృణుష్య తత్‌
ఉపోష్య తస్మిన్‌ దివసే విధివన్‌ మండపే శుభే
స్థాపయేత్ప్రతిమాం విష్ణోః శంఖచక్ర గదాంబుజైః
తతఃపంచామృతైస్నాప్య మంత్రైశుద్ధ జలేనచ

నారద పురాణం ఆషాఢశుద్ధ ఏకాదశిని గురించి చెప్పిన శ్లోకమిది. దీన్నే మనం తొలి ఏకాదశి అంటాం. సాధారణంగా మనకున్న పన్నెండు నెలల్లో నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు, అధిక మాసంలో రెండు కలుపుకొని మొత్తం ఇరవై ఆరు ఏకాదశులుంటాయి. ఏకాదశుల ఔన్నత్యాన్ని గురించి ఆరోజు మనం పాటించాల్సిన విధివిధానాలను గురించి నారద పురాణమే గాక బ్రహ్మవైవర్త పురాణం, పద్మ పురాణం, వామన పురాణం వంటివేగాక, స్మృతికౌస్తుభం కూడా విపులంగా చెప్పాయి. ఈ ఇరువై ఆరు ఏకాదశుల్లో దేని ప్రత్యేకత దానికే ఉంది. ఆ ప్రత్యేకతను బట్టే పురాణాల్లో ఒక్కోదానికీ ఒక్కో పేరు పేర్కొనబడింది. మనకు తెలిసిన తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఉత్థాన ఏకాదశి వంటివి మాత్రమేగాక కామ్యైకాదశి, రమైకాదశి, నిర్జలైకాదశి మొదలైనవి ఉన్నాయి.

ఆషాఢ శుద్ధ ఏకాదశిగా పిలువబడే ఈ పవిత్రమైన రోజున ఏం చేయాలి? ఏలా ఉండాలన్న చర్చను పురాణేతిహాసాలు విపులంగా చెప్పాయి. ఆ రోజు ఉపవాసదీక్ష చేసి మహావిష్ణువును సకలోపచారాలతో పూజించాలన్నది నియమం. దశమి రోజు రాత్రి నిరాహారులై, ఏకాదశినాడు సంపూర్ణంగా ఉపవసించి ద్వాదశినాటి ఉదయాన్నే స్వామిని పూజించి పారణ చెయ్యాలన్నది శాస్త్రం. నిష్ఠాపరులు నియమాలు సడలనివ్వకుండా స్వామిని ఆరాధించడాన్ని ఒక వ్రతంగా పెద్దలు పేర్కొన్నారు. ఉపవసించడమే కాక నేలపై పడుకోవడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, అహింస, ధ్యానం వంటివాటిని వ్రతనియమాలుగా చెప్పారు. పూర్వం మాంధాత, రుక్మాంగదుడు, అంబరీషుడు మొదలైనవారు ఈ పవిత్ర ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మోక్షం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి.

గోపద్మవ్రతంగా ఆచరించే ఈ రోజున భూరిదానాలు చేయడం మిక్కిలి శ్రేష్టకార్యం. అలాగే, ఈ రోజు నుంచి చాతుర్మాస్య దీక్ష ప్రారంభమవుతుంది. ఆషాఢ, శ్రావణ, భాద్రపద, కార్తీక మాసాల్లో యతులు, సన్యాసులు చాతుర్మాస్య దీక్ష చేస్తూ సంచారాన్ని ఆపి ఏదైనా పుణక్షేత్రంలో ఉంటూ ఈ నాలుగు నెలలూ ఆధ్యాత్మిక బోధలు చేస్తుంటారు. కార్తీకశుద్ధ ఏకాదశి దాకా ఈ దీక్ష సాగుతుంది. తొలి ఏకాదశినాడు వైకుంఠవాసుడు యోగ నిద్రా ముద్రితుడై తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు గనుక దీన్ని శయనైకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని అంటారు.

ఇతిహాసాల్లో, పురాణల్లో అనేక కథలతో ముడిపడి ఉన్న ఈ శయనైకాదశికి పకృతిపరంగా కూడా ప్రాశస్త్యం ఉంది. చాతుర్మాస్య దీక్షా ప్రారంభదినం కనుక ఇది తొలి ఏకాదశి. ఎండాకాలం ముగిసి వర్షాకాలం రావడంతో ప్రకృతి పలు మార్పులకు లోనై మానవాళికి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కనుక ఆహార నియమాల్లోనూ మార్పులు అవసరం. వాటిని సూచించేదే చాతుర్మాస్య దీక్ష. ఈ నియమాలు సన్యాసులకు, యతులకే కాదు. మానవులందరికీ కూడా వర్తించేవే. సత్యనిష్ఠ, ఉపవాస దీక్ష, వ్రతాచరణ మొదలైన పుణ్యకార్యాలను ప్రారంభించేది ఈ రోజే. పరమ పతివ్రతా తిలకంగా వెలుగొందిన సతీసక్కుబాయి పరమపదం చేరిన రోజు. అందుకే ఈ పర్వదినాన్ని పండరిపురంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు.- గన్నమరాజు గిరిజామనోహరబాబు
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment