స్మార్ట్‌ టీవీలో అంతకు మించి!

ఫోన్‌, ల్యాపీ, ట్యాబ్‌లను స్మార్ట్‌గా వాడేస్తాం మరి, ఇంట్లో ఉన్న స్మార్ట్‌ టీవీ సంగతేంటి? 
సాధారణ టెలివిజన్‌లానే వాడుతున్నారా? అయితే, ఈ చిట్కాలు మీకే! ప్రయత్నిస్తే ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ టీవీ అదుర్సే!!


మార్కెట్‌లో ఉన్న స్మార్ట్‌ టీవీల్లో చాలా వరకూ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ టీవీలే. నట్టింట్లో ఎంటర్‌టైన్మెంట్‌ని కొత్తగా పరిచయం చేస్తున్నాయి. ఫోన్‌లో ఉన్న మాదిరిగానే ప్రత్యేక ‘టీవీ ఓఎస్‌’లో యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేయడం.. నెట్టింట్లో బ్రౌజింగ్‌ చేయడం అందరూ చేసేవే. అంతకు మించి ఇంకా చాలానే చేయొచ్చు. స్టోర్‌లో ఉన్నవే కాకుండా కొత్తవి ప్రయత్నించొచ్చు... వైర్‌లెస్‌ పద్ధతిలో ఫైల్స్‌ని ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు.. డీవీడీ ప్లేయర్‌ లేకుండా సీడీ, డీవీడీలను ప్లే చేయొచ్చు.. ఇంకా చాలానే చేయొచ్చు.

యాప్‌ల్లో పరిధులుండవు 
గూగుల్‌ ప్లే స్టోర్‌ యాక్సెస్‌ ఉన్న స్మార్ట్‌ టీవీల్లో యాప్‌లను బ్రౌజ్‌ చేసి క్షణాల్లో ఇన్‌స్టాల్‌ చేసి వాడొచ్చు. కానీ, అన్ని టీవీల్లోనూ అధికారికంగా ఆండ్రాయిడ్‌ టీవీ ఓఎస్‌ అందుబాటులో ఉండదు. ఆండ్రాయిడ్‌ ఓపెన్‌సోర్స్‌ కమ్యూనిటీ ఓఎస్‌ కావడంతో టీవీ తయారీ కంపెనీలు పలు మార్పులు చేసి ఓఎస్‌ని నిక్షిప్తం చేస్తాయి. ఈ రకమైన టీవీల్లో గూగుల్‌ ప్లే స్టోర్‌ యాక్సెస్‌ ఉండదు. దీంతో అవసరానికి తగిన యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ‘ఏపీకే’ ఫైల్స్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుని యూఎస్‌బీ డ్రైవ్‌లోకి కాపీ చేసుకుని ‘సైడ్‌లోడింగ్‌’ పద్ధతిలో ఇన్‌స్టాల్‌ చేయడం. లేదంటే... థర్డ్‌పార్టీ యాప్‌ స్టోర్‌లను టీవీలోకి ఆహ్వానించడం. 
http://en.aptoide.com/ 
ఇదో థర్డ్‌పార్టీ యాప్‌ స్టోర్‌. టీవీ బ్రౌజర్‌లో వెబ్‌సైట్‌ని ఓపెన్‌ చేసి ‘యాప్టాయిడ్‌’ని డౌన్‌లోడ్‌ చేయాలి. ఇదో ఉచిత సర్వీసు. ఇన్‌స్టాల్‌ చేశాక కావాల్సిన యాప్‌లను స్టోర్‌లో బ్రౌజ్‌ చేసి చూడొచ్చు. కావాల్సిన వాటిని ఇన్‌స్టాల్‌ చేసుకుని వాడుకోవడమే. 
* https://www.apkmirror.com/ 
ఇదో ‘ఏపీకే’ ఫైళ్ల స్థావరం. స్టోర్‌తో సంబంధం లేకుండా అవసరానికి తగిన యాప్‌లను ‘ఏపీకే’ ఫైల్‌ ఫార్మెట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని యూఎస్‌బీ డ్రైవ్‌లో కాపీ చేసుకోవాలి. డ్రైవ్‌ని టీవీకి కనెక్ట్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఇలా థర్డ్‌పార్టీ అప్లికేషన్స్‌ని టీవీలో ఇన్‌స్టాల్‌ చేసేందుకు సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘అన్‌నోన్‌ సోర్స్‌’ ఆప్షన్‌ని ఎనేబుల్‌ చేయాలి. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... ఇలా ఇన్‌స్టాల్‌ చేసిన ఏపీకే ఫార్మెట్‌ ఫైల్స్‌ అన్నీ పూర్తిస్థాయిలో పని చేయకపోవచ్చు.

మల్టీ మీడియా స్ట్రీమింగ్‌ 
టీవీ సహా ఇంట్లో అన్నీ స్మార్ట్‌ పరికరాలే. అలాంటప్పుడు ఒకదాంట్లో ఉన్న కంటెంట్‌ని మరో పరికరంలో యాక్సెస్‌ చేయడం పెద్ద క్లిష్టమైన పనేం కాదు. స్మార్ట్‌ టీవీలో నిక్షిప్తమైన ఓఎస్‌ ఆండ్రాయిడ్‌ అధికారిక ‘టీవీ ఓఎస్‌’ అయితే చిటికెలో ఫోన్‌లోని డేటాని టీవీలో స్ట్రీమింగ్‌ చేసుకుని చూడొచ్చు. అంటే.. ఫోన్‌లో ఉన్న వీడియో క్లిప్‌ని సరాసరి టీవీలో చూడొచ్చు అన్నమాట. అందుకు టీవీలో బిల్ట్‌ఇన్‌గా గూగుల్‌ అందించే ‘క్రోమ్‌క్యాస్ట్‌’ సిద్ధంగా ఉంటుంది. ఒకవేళ మీరు వాడుతున్న టీవీలో అధికారిక ఓఎస్‌ లేకుంటే వై-ఫై నెట్‌వర్క్‌లను వాడుకుని ఫైల్‌ స్ట్రీమింగ్‌ చేయొచ్చు. అందుకు తగిన యాప్‌లు ఉన్నాయి. 
 https://www.plex.tv/ 
* https://kodi.tv/ 
వెబ్‌ లింక్‌ల్లోని ‘ప్లెక్స్‌, కోడీ’ యాప్‌లను సిస్టం, ఫోన్‌ల్లో ఇన్‌స్టాల్‌ చేయాలి. డిజిటిల్‌ మీడియా (సినిమాలు, టీవీ షోలు, ఇతర వీడియోలు, ఫొటోలు...) కంటెంట్ని ఒకేచోట మేనేజ్‌ చేయొచ్చు. సిస్టం, ఫోన్‌లను డేటా సర్వర్‌లుగా యాప్‌లో రిజిస్టర్‌ చేశాక టీవీలోనూ ‘ఏపీకే’ ఫైల్‌ ఫార్మెట్‌ యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుని సిస్టం, ఫోన్‌లోని మీడియా ఫైల్స్‌ని టీవీలో చూడొచ్చు.

వైర్‌లెస్‌లోనే డేటా ట్రాన్స్‌ఫర్‌ 
ఇంటర్నల్‌ మెమొరీ తక్కువ ఉండడంతో డేటాని టీవీల్లో స్టోర్‌ చేయడం కొంచెం కష్టమే. దీంతో ఎక్కువ మెమొరీ కలిగిన డేటాని యాక్సెస్‌ చేయాలంటే ఎక్స్‌టర్నల్‌ మెమొరీ డ్రైవ్‌లను వాడేస్తాం. కానీ, సిస్టమ్‌ లేదా ఫోన్‌లోని డేటాని అను నిత్యం టీవీలో యాక్సెస్‌ చేయాల్సివస్తే! అప్పుడెలా? పదే పదే యూఎస్‌బీ డ్రైవ్‌లకు గ్యాడ్జెట్‌లను అనుసంధానం చేయకుండా ఫైల్‌ మేనేజర్‌ని వాడితే సరి. 
*ES File Explorer File Manager 
ఇదో ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌. ఫోన్‌, సిస్టమ్‌, స్మార్ట్‌ టీవీల్లో యాప్‌ రూపంలో నిక్షిప్తమై పని చేస్తుంది. విండోస్‌ కంప్యూటర్‌లోని ఫైల్‌ని టీవీలో యాక్సెస్‌ చేయాల్సివస్తే సులువైన పద్ధతిలో ఫైల్‌ షేరింగ్‌ చేయవచ్చు. ఉదాహరణకు సిస్టంలో భద్రం చేసుకున్న సినిమాల్ని టీవీలో చూడాలనుకుంటే సినిమాల్ని టీవీలోకి కాపీ చేయాల్సిన అవసరం లేదు. సిస్టంలో సినిమాలున్న ఫోల్డర్‌ని సెలెక్ట్‌ చేసి ‘ప్రాపర్టీస్‌’ మెనూలోకి వెళ్లాలి. అక్కడ కనిపించే ఆప్షన్స్‌తో ఫైల్‌ షేరింగ్‌కి అనుమతివ్వొచ్చు. సిస్టమ్‌లో షేరింగ్‌ ప్రక్రియ ముగిశాక టీవీలోని ‘ఈఎస్‌ ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌’ యాప్‌ని ఓపెన్‌ చేసి డేటాని టీవీలో యాక్సెస్‌ చేయొచ్చు. కావాలంటే డేటాని సిస్టంలోకి కాపీ చేయడం సాధ్యమే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేంటంటే.. టీవీ, సిస్టం ఒకే వై-ఫై నెట్‌వర్క్‌లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యం.

డీవీడీ ప్లేయర్‌ అక్కర్లేదు 
డిస్క్‌ల్లో డేటా అంటే నిన్నటి మాటే. కానీ, ఎప్పుడైనా అనివార్యమైతే స్మార్ట్‌ టీవీల్లో డీవీడీలను ప్లే చేసి చూడాలంటే? ఎందుకంటే.. గత జ్ఞాపకాలు కొన్ని ఇప్పటికీ డీవీడీల్లోనే భద్రం చేసుకుని ఉంటాం. వాటిని టీవీలో వీక్షించాల్సి వస్తే డీవీడీ ప్లేయర్‌ని కొనాల్సిన పని లేదు. పోనీ డీవీడీని డిజిటల్‌ ఫైల్‌గా మార్చేద్దాం అనుకుంటే అది కాస్తా క్లిష్టమైన ప్రక్రియే. ఇవన్నీ లేకుండా సులువైన పద్ధతిలో డీవీడీలను టీవీలో ప్లే చూసి చూడాలంటే ‘పోర్టబుల్‌ డీవీడీ రైటర్స్‌’ని వాడొచ్చు. ఎందుకంటే వాటిని టీవీకి ఉన్న యూఎస్‌బీ పోర్టుకి కనెక్ట్‌ చేసి డిస్క్‌లను రీడ్‌ చేయొచ్చు. Lite-On External DVDD Writer

ఇదో బడ్జెట్‌ ఎక్స్‌టర్నల్‌ డీవీడీ ప్లేయర్‌. ‘లింక్‌టుటీవీ’ సదుపాయంతో చిటికెలో ప్లేయర్‌ని టీవీకి కనెక్ట్‌ చేయొచ్చు. అదనంగా ఎలాంటి యాప్‌లు, డ్రైవర్స్‌ సాఫ్ట్‌వేర్‌లతో పని లేదు.

బ్లూటూత్‌ని వాడండి 
మార్కెట్‌లో ఉన్న అన్ని స్మార్ట్‌ టీవీల్లోనూ వై-ఫై, బ్లూటూత్‌ నెట్‌వర్క్‌ల్ని సపోర్ట్‌ చేసేవే. అవసరానికి తగిన గ్యాడ్జెట్‌లను (హెడ్‌ఫోన్‌, కీబోర్డులు, మౌస్‌లు) వైర్‌లెస్‌ పద్ధతిలో టీవీకి అనుసంధానం చేసి వాడుకోవచ్చు. రాత్రి సమయంలో ఎక్కువ సౌండ్‌ పెట్టుకుని ఇష్టమైన సినిమా చూస్తున్నప్పుడు ఇతరులకు ఇబ్బందే. అలాంటప్పుడు బ్లూటూత్‌ సపోర్టుతో వైర్‌లెస్‌ హెడ్‌సెట్‌లను పెట్టుకుని హాయిగా సినిమా చూడొచ్చు. ఇదే మాదిరిగా టీవీలో బ్రౌజింగ్‌ చేయాల్సివచ్చినప్పుడు రిమోట్‌ కంటే... కీబోర్డు, మౌస్‌ని వైర్‌లెస్‌లో అనుసంధానం చేసి వాడొచ్చు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment