దీర్ఘాయుష్‌ ఫలం!

స్ట్రాబెర్రీస్‌ రంగు, రుచి కారణంగా వాటిని ఎన్నో పానియాల్లో, ఎనర్జీ డ్రింక్స్‌లో ఉపయోగిస్తుంటారు. అవి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.. ఆరోగ్యానికీ అంతగానే మేలు చేస్తాయి. వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని.

స్ట్రాబెర్రీస్‌లోని గుండెకు మేలు చేసే ఎలాజిక్‌ యాసిడ్, యాంథోసయనిన్, క్యాటెచిన్, క్వార్సెటిన్‌ వంటి ఫ్లేవనాయిడ్స్‌ కారణంగా అవి గుండె ఆరోగ్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తాయి. రక్తనాళాలు బాగా విప్పారేలా చేయడంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌)ను తగ్గించి గుండెజబ్బులు (కార్డియోవాస్క్యులార్‌ డిసీజెన్‌) రాకుండా చూస్తాయి. స్ట్రాబెర్రీస్‌లోని శాల్సిలిక్‌ యాసిడ్, అల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, ఎలాజిక్‌ యాసిడ్‌లు చర్మంపై మృతకణాలను తొలగించడంతో పాటు, మొటిమలు రావడాన్ని నివారిస్తాయి. అంతే కాదు.. దీర్ఘకాలం మేనిని మిలమిల మెరిసేలా చూస్తాయి. 

వీటిలో విటమిన్‌–సి చాలా ఎక్కువ. అది చర్మాన్ని బిగుతుగా ఉంచే కొలాజెన్‌ను ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అందుకే స్ట్రాబెర్రీస్‌ తినేవాళ్లలో చర్మం ఆరోగ్యకరంగా, యౌవనంగా ఉంటుంది. స్ట్రాబెర్రీస్‌ తినడం వల్ల చర్మానికి అల్ట్రావయొలెట్‌ కిరణాల నుంచి రక్షణ కూడా దొరుకుతుంది. స్ట్రాబెర్రీస్‌ తినేవారిలో కంటినరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు మాక్యులార్‌ డీజనరేషన్‌ వంటి కంటి వ్యాధులు నివారితమవుతాయి. కంట్లోని ఆక్యులార్‌ ప్రెషర్‌లో హెచ్చుతగ్గులు లేకుండా చూడటం ద్వారా గ్లకోమా వంటి కంటి వ్యాధులను నివారిస్తుంది. ఇందులో పొటాషియమ్‌ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల అది రక్తపోటును అదుపులో ఉంచి హైబీపీని నివారిస్తుంది. స్ట్రాబెర్రీస్‌లో ఉండే విటమిన్‌–సి, శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్‌ కారణంగా అది అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ఆర్థరైటిస్, గౌట్‌ వంటి ఎముకల వ్యాధుల్లో ఉండే నొప్పిని గణనీయంగా తగ్గిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని పటిష్టంగా ఉంచుతుంది. కీళ్లలో కందెన బాగా ఉత్పత్తి అయ్యేలా చూసి, అవి దీర్ఘకాలం పనిచేసేలా తోడ్పడుతుంది. 

స్ట్రాబెర్రీస్‌లోని ఫైటోకెమికల్స్‌ కారణంగా అవి మెదడును చురుగ్గా ఉంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. స్ట్రాబెర్రీస్‌లోని పోషకాలు మనలో అడిపోనెక్టిన్, లెప్టిన్‌ అనే హార్మోన్లను ఎక్కువగా స్రవించేలా చేస్తాయి. ఈ హార్మోన్లు కొవ్వును కరిగేలా చూస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలనుకున్న వారికి స్ట్రాబెర్రీలు తినడం ఒక రుచికరమైన మార్గం. స్ట్రాబెర్రీలలోని పోషకాలన్నీ మన రోగనిరోధక శక్తిని బాగా పెంచేవే. అందుకే స్ట్రాబెర్రీలు తినేవారు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment