రాతి నుంచి రాగాలు నర్సింహులపల్లిలో ఉన్న మల్లికార్జున స్వామి | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu | Bhakthi Pustakalu | Bhaktipustakalu | Bhakti Pustakalu | BhakthiBooks | MohanBooks | Bhakthi | Bhakti | Lord Shiva | Siva | Mallikarjuna Swamy | Karimnagar



కాక‘తీయని రాగం’ 
రాతి నుంచి రాగాలు


     కరీంనగర్‌ జిల్లా కోట్లనర్సింహులపల్లిలో అద్భుతం విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీలోని ఆలయ మండప స్తంభాలను మీటితే స్వప్త స్వరాలు వినిపిస్తాయి. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలోని కోట్ల నర్సింహులపల్లిలో ఉన్న మల్లికార్జున స్వామి ఆలయంలో పానవట్టం నుంచి అటువంటి స్వరాలు వస్తుంటాయి. ఇంతటి అద్భుత విషయం ఆ ప్రాంతీయల్లో.. అదీ అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఏదైనా ఒక నాణేన్ని తీసుకొని శివలింగం కింద ఉండే పాన వట్టం చుట్టూ మీటితే ఒక్కో చోట ఒక్కో రకం శబ్ధం వినిపిస్తుంటుంది. లయబద్దంగా ఉన్న ఆ స్వరాలు ఎలా వస్తున్నాయనేది ప్రశ్నార్థకంగా ఉంది. శివలింగాన్ని, పానవట్టాన్ని నల్లటి గ్రానైట్‌ రాయితో రూపొందించారు. పానవట్టం అరలుగా ఉండటాన్ని బట్టి దాన్ని తయారు చేసేటప్పుడు లోపల రంధ్రాలను చేసి వాటి నుంచి రకరకాల శబ్ధాలు వచ్చేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారని భావిస్తున్నారు. ఆలయ నిర్మాణ శైలి కాకతీయుల నాటిదిగా అనిపిస్తున్నప్పటికీ అక్కడి స్తంభాలపై గల నాగ సర్పాల గుర్తులు, మరికొన్ని ఆధారాలను బట్టి అది కాకతీయుల కంటే ముందు వేములవాడ చాళుక్యుల నాటిదని అభిప్రాయపడేవారూ ఉన్నారు. శివలింగం తూర్పు దిక్కున ఉంటుంది. ప్రతిరోజూ ప్రభాత కిరణాలు శివలింగంపై ప్రసరిస్తూ భక్తులకు కనువిందు చేస్తాయి.


మైమరపించే చారిత్రక సంపద : అసలు కోట్ల నర్సింహులపల్లి గ్రామంలో అడుగు పెడితేనే ఒక అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. అక్కడ ఎన్నెన్నో విశిష్టతలు ఉన్నాయి. చెంతనే గల కొండపై క్రీ.శ. 750-973 సంవత్సరాల మధ్య పరిపాలించిన రాష్ట్రకూటుల కాలం నాటి నర్సింహస్వామి ఆలయం, కొండపైన ఇంకా 150 మీటర్ల ఎగువకు సాహసం చేసి వెళ్లగలిగితే.. నాటి శిథిలమైన కోట గోడలు కనిపిస్తాయి. రాష్ట్ర కూటులు తొలుత జైన మతాన్ని ప్రోత్సహించారనటానికి నిదర్శనంగా.. ఇటీవల ఇక్కడ భూమిని దున్నుతున్నప్పుడు 23వ తీర్ధంకరుడైన పార్వ్శనాథుడి అందమైన విగ్రహం బయటపడింది. రాష్ట్రకూటుల సామంతులైన వేములవాడ చాళుక్యులు, ఆ తర్వాత కాకతీయలు ఇక్కడ అనేక హిందూ దేవాలయాలు నిర్మించారు. గ్రామంలోని ఏ ఇంటి వద్ద చూసినా శిధిల ఆలయాల్లోని విరిగిపోయిన శిల్పాలు గుట్టలుగా పొసినట్టు కనిపిస్తుంటాయి. కేంద్ర పురావస్తు సర్వే శాఖ.. ఈ ప్రాంతాన్ని తమకు అప్పగిస్తే అద్భుత చర్రితను తవ్వితీస్తామని అంటోంది. లక్ష్మీనర్సింహ స్వామి ఆలయం గల 79 ఎకరాల ‘దేవునిగుట్ట’.. మేలురకం గ్రానైట్‌ను కలిగి ఉండటంతో దాన్ని ముక్కలు చేసేందుకు రాష్ట్ర గనుల శాఖ కొద్ది నెలల క్రితం చకచకా దస్త్రాలను సైతం నడిపి విమర్శలు రావటంతో ప్రస్తుతానికి నెమ్మదించింది.
-పిళ్లా సాయికుమార్‌
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment