మానస సరోవర్‌లో మనోళ్లకు కష్టం | Manasa Sarovar | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu | Bhakthi Pustakalu | Bhaktipustakalu | Bhakti Pustakalu | BhakthiBooks | MohanBooks | Bhakthi | Bhakti


మానస సరోవర్‌లో మనోళ్లకు కష్టం 
తీవ్రమైన మంచు వర్షంతో అంతరాయం 
బేస్‌క్యాంపులో వసతులు లేక ఇబ్బందులు 
అందని ఆహారంతో దుర్భర పరిస్థితులు 
పలువురికి అనారోగ్య సమస్యలు 
100 మంది వరకు తెలుగు యాత్రికులు 
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశంతో రంగంలోకి ఏపీ భవన్‌ అధికారులు 

      ఈనాడు-అమరావతి, దిల్లీ, విజయవాడ, న్యూస్‌టుడే-పాలకొల్లు: తీవ్రమైన మంచు వర్షం ప్రభావంతో వాతావరణం అనుకూలించకపోవడంతో మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన వేలాది మంది యాత్రికులు నేపాల్‌-చైనా సరిహద్దుల్లో చిక్కుకుపోయారు. ఈ ప్రాంతంలో గత మూడు రోజులుగా హెలీకాప్టర్లు తిరగడం లేదు. రవాణాకు అంతరాయం కలగడంతో వీరంతా చైనా సరిహద్దు సమీపంలో నేపాల్‌కు చెందిన హిస్సా సరిహద్దు శిబిరంలో ఉండిపోవాల్సి వచ్చింది. అక్కడి బేస్‌క్యాంపులో సరైన ఆహారం, వసతులు లేక వారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిలో మహిళలు కూడా ఎక్కువ మందే ఉన్నారు. బేస్‌ క్యాంపులో కేవలం వెయ్యి మందికి మాత్రమే వసతులు ఉన్నాయి. మూడు వేల మంది వరకూ ఆశ్రయం పొందడంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. బేస్‌క్యాంపు చేరి ఆశ్రయం పొందిన వారికి ఆహారం కూడా అందడం లేదు. ఇదే పరిస్థితి మరో రెండు రోజులు గడిస్తే ఆకలితో అలమటించే దుర్భర పరిస్థితి నెలకొంటోంది. ఈ సమాచారం అందిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశంతో దిల్లీలోని ఏపీ భవన్‌ అధికారులు రంగంలోకి దిగారు. సహాయ చర్యలపై నేపాల్‌లోని రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. తమను రక్షించాలని విజయవాడ, పాలకొల్లుకు చెందిన కొందరు ‘ఈనాడు’కు ఫోన్‌ చేసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. జగ్గయ్యపేట, చింతలపూడి, తిరువూరు, విజయవాడ పట్టణంలోని చిట్టినగర్‌, ఒకటో పట్టణం, కృష్ణలంక, పటమట, పోరంకి, కంకిపాడు తదితర ప్రాంతాల నుంచి పలువురు యాత్రికులు జూన్‌ 23న బయలుదేరారు. స్థానికంగా కుమార్‌ ట్రావెల్స్‌ ద్వారా వీరు నేపాల్‌కు చెందిన సత్యం టూర్స్‌తో ఒప్పందం చేసుకున్నారు. జూలై 3న తిరిగి లక్నోకు చేరుకోవాల్సి ఉంది. ఈనెల 3న విమాన ప్రయాణానికి టిక్కెట్లు బుక్‌ చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.1.60లక్షలు చొప్పున వసూలు చేశారు. ముందుగానే యాత్రీకులవద్ద అంగీకార పత్రం రాయించుకున్నారు. అవాంతరాలు ఏర్పడి యాత్ర నిలిచిపోతే తమకు సంబంధం లేదని, ఎవరి ఖర్చులు వారే భరించాలని ఆ ఒప్పందంలో ఉంది. యాత్రకు వెళుతున్న సమయంలోనే హిల్సా వద్ద ఆగిపోయారు. విజయవాడలోని చిట్టినగర్‌కు చెందిన వ్యాపారి మురళీకృష్ణను సోమవారం రాత్రి 7గంటల సమయంలో ‘ఈనాడు’ చరవాణిలో సంప్రదించింది. ప్రస్తుతం తమలో కొందరి వద్ద డబ్బులు అయిపోయాయని, ఇతరులు ఏవైనా కొనుగోలు చేయాలనుకున్నా హిల్సా ప్రాంతం వద్ద ఏమీ లేవని వివరించారు. ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయని, చలికి తట్టుకోలేకపోతున్నామని విజయవాడకు చెందిన స్వరూపారాణి ఆవేదనవ్యక్తం చేశారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నామని, కనీసం ఆరోగ్య శిబిరం కూడా లేదని చెప్పారు. కృష్ణా జిల్లాకలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం మాట్లాడుతూ దిల్లీలోని ఆంధ్రాభవన్‌ ఓఎస్‌డీ శ్రీకాంత్‌ దృష్టికి తీసుకెళ్లామని, హెలీకాప్టర్‌లు ఏర్పాటుచేసి తిరుగు ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారని తెలిపారు.

సురక్షిత ప్రాంతానికి తరలించండి 
నేపాల్‌లోని హిల్సాలో చిక్కుకున్న తెలుగు యాత్రికులను హెలికాప్టర్‌లో సిమిల్‌కోట్‌కు తరలించేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. దిల్లీలోని ఏపీ భవన్‌ అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌ అర్జా శ్రీకాంత్‌తో సోమవారం రాత్రి ఆయన మాట్లాడారు. హిల్సాలోని తెలుగు యాత్రికుల యోగ క్షేమాలపై ఆరా తీశారు. పరిమిత సదుపాయాలు ఉన్న బేస్‌ క్యాంప్‌లో దాదాపు 3 వేల మంది భారతీయులు చిక్కుకున్నారని, వారిలో 100 మంది వరకు తెలుగు యాత్రికులున్నారని శ్రీకాంత్‌ వివరించారు. వెంటనే ఎయిర్‌లైన్స్‌ ప్రతినిధులతో మాట్లాడాలని, తెలుగు యాత్రికులను హెలికాప్టర్‌లో సిమిల్‌కోట్‌కు, అక్కడి నుంచి విమానంలో నేపాల్‌గంజ్‌కు తరలించే అంశాన్ని పరిశీలించాలన్నారు. నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులను సంప్రదించాలని సూచించారు. యాత్రికులకు పూర్తి సహకారం అందించాలని, రవాణా, వైద్య సదుపాయాలు సమకూర్చాలని సీఎం ఆదేశించారు. వారు క్షేమంగా స్వస్థలాలకు చేరేలా తోడ్పాటునందించాలని తెలిపారు.

నేపాల్‌ అధికారులతో మాట్లాడిన ఏపీ భవన్‌ అధికారులు 
మానస సరోవర్‌ యాత్రలో చిక్కుకుపోయిన భారతీయ యాత్రికులను క్షేమంగా రప్పించడానికి నేపాల్‌లోని భారతీయ రాయబార కార్యాలయం ప్రయత్నాలు మొదలుపెట్టింది. చిక్కుకుపోయిన సుమారు మూడు వేల మంది భారతీయుల్లో వంద మంది దాకా తెలుగువారు ఉన్నారని, వారందరినీ క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలని ఏపీ భవన్‌ అదనపు రెసిడెంట్‌ కమిషనర్‌ అర్జా శ్రీకాంత్‌ సోమవారం నేపాల్‌ భారతీయ రాయబార కార్యాలయ సిబ్బందిని కోరారు. పలువురు శ్వాసకోస, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, వారిని సాధ్యమైనంత త్వరగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వాతావరణం అనుకూలించిన వెంటనే యాత్రికులను హిల్సా బేస్‌ క్యాంప్‌ నుంచి హెలీక్యాప్టర్‌లు, ఛార్టెడ్‌ విమానాలు ఉపయోగించి సిమిల్‌కోట్‌, నేపాల్‌గంజ్‌ తరలిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ రెండు చోట్లకు యాత్రికులు చేరుకోగానే అవసరమైన సహాయ చర్యలు చేపట్టేందుకు సిబ్బందిని సిద్ధంగా ఉంచామని, వృద్ధులకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు ఏర్పాట్లు చేశామని రాయబార కార్యాలయం అధికారి గణేశ్‌ బదులిచ్చారు.

ఒకే వీసాపై 29 మంది వెళ్లాం 
నాతో పాటు విజయవాడ, జగ్గయ్యపేట, చింతలపూడి, తిరువూరు ప్రాంతాలకు చెందిన 29 మంది మానససరోవర్‌ యాత్రకు బృందంగా వెళ్లాం. వాతావరణం అనుకూలించక, హెలీకాప్టర్లు వెళ్లే పరిస్థితి లేక మాలో 13 మంది నేపాల్‌గంజ్‌ ప్రాంతంలో అతిథిగృహాంలో ఉండిపోయాం. మిగిలిన 16 మంది సిమ్మికోట్‌ వరకు వెళ్లారు. మా బృందంలోని అందరికి ఒకే వీసా ఉండటంతో మేము వెళ్లే వరకు వారు అక్కడే ఉండాలి. ప్రస్తుతం అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. యాత్ర పూర్తి చేసుకున్న కొందరు కూడా ఉన్నారు. అలా వెయ్యి మంది వరకు ఉండిపోవడంతో ఆహార సమస్య ఎదురైందని అక్కడున్న మా బృంద సభ్యులు ఆవేదన చెందుతున్నారు. హెలీకాప్టర్‌లో 14 మంది మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది. రవాణా సమస్య తీవ్రంగా ఉంది. ప్రభుత్వం సహాయక చర్యలు తీసుకోవాలి. యాత్రికులకు అన్ని వసతులు కల్పించాలి.
- నూలి మాధురి, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment