గోల్కొండ కోటకు అరుదైన ఘనత

వేడుకల నిర్వహణ పట్టని ప్రభుత్వ విభాగాలు
మాకు తెలియదంటున్న జీహెచ్‌ఎంసీ
చరిత్రకు ప్రాధాన్యం కరువు
చార్మినార్‌కు ముందే గోల్కొండ కోట
అప్పటి రాజులు నిర్మించిన అద్భుత కట్టడం
120 మీటర్ల ఎత్తున్న కోటలో ప్రతీదీ ప్రత్యేకమే
ధ్వని శాస్త్రం ఆధారంగా అత్యద్భుత నిర్మాణాలు

వంద కాదు... రెండు వందలు కాదు... ఏకంగా 500 ఏళ్ల ఘన చరిత్ర గోల్కొండ కోట సొంతం. హైదరాబాద్‌ మహానగర మూలాలు అక్కడి నుంచే మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం పంద్రాగస్టు, రిపబ్లిక్‌ డే వేడుకలు కోట వేదికగానే నిర్వహిస్తున్నారు. మరి ఇంతటి ప్రాశస్త్యం ఉన్న గోల్కొండ కోట 500 ఏళ్ల వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించకపోవడానికి కారణాలేంటి? లోపం ఎక్కడుంది? అసలు ఈ విషయం గుర్తుందా? కనీసం గుర్తు చేసుకున్న తర్వాతనైనా ఉత్సవాలు చేసే ఆలోచన ఏమైనా ఉందా? అని చరిత్రకారులు ప్రశ్నిస్తున్నారు.


హైదరాబాద్‌: మణి హారాల్లాంటి నందనవనాలు, శత్రుదుర్భేధ్య దర్వాజాలు, ఇటలీ, పార్శియన్‌ ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచే కట్టడాలు గోల్కొండ కోట సొంతం. అక్కడ అణువణువునా ఆశ్చర్యపరిచే నిర్మాణాలే. బాలాహిస్సార్‌, చప్పట్ల ప్రాంగణం, శవస్నానశాల, రక్షకభట నిలయం, అక్కన్న మాదన్న కార్యాలయం, రామదాసు బందిఖానా.. ఇలా 120 మీటర్ల ఎత్తున్న కోటలో ప్రతిదీ ప్రత్యేకమే. దేనికైనా ఏడాది గడిస్తేనే గొప్పగా సంబరాలు జరుపుకునే ఈ రోజుల్లో 500 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్న గోల్కొండ కోటను పాలకులు, అధికారులు విస్మరించారు. వేడుకల ఊసే లేదు.


ఇదీ గోల్కొండ చరిత్ర...
గోల్కొండ కోట... హైదరాబాద్‌ నగరానికి 11 కి.మీ దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని క్రీ.శ 1083 నుంచి 1323 వరకు కాకతీయులు పరిపాలించారు. దీని అసలు పేరు గొల్లకొండ. ఇక్కడ గొర్రెలు కాసుకునే కాపరికి ఆ కొండపై దేవతా విగ్రహం కనిపించిందట. ఈ విషయాన్ని కాకతీయుల రాజులకు చెప్పగా ఇక్కడ మట్టితో ఒక కట్టడం నిర్మించారట. కాలక్రమంలో గొల్లకొండ గోల్కొండగా రూపాంతరం చెందింది. చాలా కాలం వరకూ ఇది కాకతీయుల అధీనంలో ఉండేది. యుద్ధ సమయంలో సంధిలో భాగంగా 1371లో గోల్కొండ కోట అజీం హుమాయూన్‌ వశమైంది. దీంతో ఈ కోట మహ్మదీయుల చేతిలోకి వెళ్లింది. తర్వాతి కాలంలో అనేకమంది రాజుల చేతులు మారి 15వ శతాబ్దంలో కుతుబ్‌ షాహీ రాజుల చేతుల్లోకి వెళ్లగా వారు ఇక్కడ ఇప్పుడు మనకు కనిపించే నల్లరాతి కోటను కట్టించారు. కుతుబ్‌ షాహీ వంశస్థులను ఔరంగజేబు జయించి ఈ కోటను కొంత భాగం వరకూ నాశనం చేశాడట.

దీనితో ఇక్కడ పాలన కాలగర్భంలో కలిసిపోయింది. ఈ కోట ప్రస్తుతం ఎంతో చరిత్రను తనలో ఇముడ్చుకుని భావితరాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ కోటను 120 మీటర్ల ఎత్తు కలిగిన నల్లరాతి కొండపై నిర్మించారు. శత్రువుల నుంచి రక్షణ కోసం దీని చుట్టూ పెద్ద బురుజును నిర్మించారు. ఇది 87 అర్థ చంద్రాకార బురుజులతో 10 కిలో మీటర్లు కోట చుట్టూ కట్టబడి ఉంది. ఈ కోటలో నాలుగు ప్రధాన సింహద్వారాలు, అనేక రాజమందిరాలు, దేవాలయాలు, మసీదులు ఉన్నాయి. కోటలోకి శత్రువులు ప్రవేశించినప్పుడు పైవారికి సమాచారం చేరవేసేందుకు ధ్వని శాస్త్రం ఆధారంగా అద్భుతంగా నిర్మాణాలు చేశారు. ఇక్కడ చప్పట్లు కొడితే కి.మీ దూరంలోని కోట లోపల ఉండే బాలాహిస్సారు వద్ద ఆ శబ్దం వినపడుతుంది. ఇక్కడి నుంచి కోటలోనికి చేరుకోవడానికి 380 రాతి మెట్లు ఉన్నాయి. కోటలోని నీటిని అప్పట్లోనే ప్రత్యేక విధానం ద్వారా పైకి చేరవేసే వారట. ఈ కోటలోంచి చార్మినార్‌కు గుర్రంపై వెళ్లేంత సొరంగమార్గం ఉందని ప్రచారం ఉంది. కాకతీయుల కాలంలోనూ పలు నిర్మాణాలు ఇందులో ఉన్నాయని చరిత్ర కారులు చెబుతున్నారు.ఐదు శతాబ్దాలా.. మాకు తెలియదే..!?
చారిత్రక గోల్కొండ కోట ఐదు శతాబ్దాల వేడుకల నిర్వహణను ఏ ప్రభుత్వ విభాగమూ పట్టించుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం స్వాతంత్య్ర వేడుకలకు వేదికైన వారసత్వ కట్టడం నిర్లక్ష్యానికి గురవుతోంది. రాతికోట ప్రభుత్వ విభాగాల నిర్లక్ష్యంతో రాజసం కోల్పోతోంది. ప్రత్యేక రాష్ట్రంలో కోట ప్రాశస్త్యం మెరుగవుతుందనుకున్న హెరిటేజ్‌ లవర్స్‌ ఆశలు అడియాశలుగానే మారాయి. 500 ఏళ్లు పూర్తి చేసుకున్న కోట కనీస గుర్తింపునకు నోచుకోవడం లేదు. వేడుకల నిర్వహణ కోసం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ విభాగం కసరత్తు ప్రారంభించకపోవడం గమనార్హం. చార్‌ సౌ నగరి చరిత్రకు సాక్షిభూతంగా నిలిచే చార్మినార్‌ 425 యేళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించిన జీహెచ్‌ఎంసీ కూడా.. గోల్కొండకు 500 సంవత్సరాలా..? మాకు తెలియదే అని సమాధానమిస్తోంది. చార్మినార్‌ వేడుకల్లో భాగంగా విద్యుద్దీపాలంకరణ, భాగ్యనగర సంప్రదాయం, చరిత్రను ప్రతిబింబించేలా ఖవ్వాలి, గజల్స్‌ కార్యక్రమాలు నిర్వహించిన అధికారులు కోటను విస్మరించారు. కోటపై జాతీయ జెండా ఆవిష్కరిస్తోన్న ప్రభుత్వ పెద్దలైనా.. ఈ విషయాన్ని పట్టించుకోవాలని వారసత్వ ప్రేమికులు కోరుతున్నారు.


కాకతీయుల కోట.. కాలగమనంలో కుతుబ్‌షాహీల పరిపాలనా కేంద్రంగా మారింది. మొఘల్‌ పాలకులు, నిజాం రాజుల సామ్రాజ్యంలో చేరింది. శతాబ్దాల క్రితం నాటి గోల్కొండ కోట ఎన్నో ప్రత్యేకతలకు నిలయం. కుతుబ్‌షాహీలు, మొఘల్‌ పాలకులు, నిజాం నవాబుల హయాంలో తళుకులీనిన గోల్కొండకు 500 ఏళ్ల చరిత్ర ఉంది. అంతటి చారిత్రక కట్టడం ప్రాముఖ్యాన్ని అధికారులు, పాలకులు గుర్తించకపోవడంపై హెరిటేజ్‌ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక విప్లవంతో హైదరాబాద్‌ మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఐటీ పరిశ్రమలు నగరానికి రాక ముందు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లతో జంట నగరాలుగా పేరున్న హైదరాబాద్‌ నగరం సైబరాబాద్‌తో ముచ్చటగా మూడు నగరాల కేంద్రంగా మారింది. ఆకాశ హర్మ్యాల మధ్య చరిత్ర ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయే తప్ప, గత చరిత్రకు గుర్తింపు లేకుండా పోతోంది.

చర్రితకు లేదా ప్రాధాన్యం...?
మహానగరంలో అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. కానీ తరతరాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచే అత్యంత ప్రాచీన కట్టడాన్ని విస్మరిస్తున్నారు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న చార్మినార్‌ కంటే ముందుగా గోల్కొండ కోట ఉంది. చార్మినార్‌తో పాటు గోల్కొండకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వందల ఎకరాల్లో శత్రుదుర్బేధ్యంగా నిర్మించిన రాతి కట్టడాన్ని ఎప్పటికీ కాపాడుకోవాల్సిన అవసరం పాలకులపై ఉండాలనే చరిత్రకారులు సూచిస్తున్నారు.

జెండా వందనంతో సరి పెట్టారు....
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత 2014లో పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించారు. దీంతో కోటకు పునర్‌ వైభవం దక్కుతుందని అందరూ భావించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై నాలుగేళ్లు దాటి ఐదో ఏట అడుగు పెట్టినా కోటను మర్చిపోయినట్లు కనిపిస్తోంది. ఈ రాతికోట సందర్శనకు నిత్యం దేశ, విదేశాల నుంచి వేల సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. అత్యంత సందర్శనీయమైన ప్రదేశాల్లో ఒకటైన ఈ ప్రాంతాన్ని పాలకులు విస్మరిస్తున్నారని చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


గొప్పగా వేడుకలు నిర్వహించాలి
చార్‌ సౌ సాల్‌ కా షహర్‌ అంటూ నగరాన్ని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం. అంతకంటే వందేళ్ల ముందే గోల్కొండ కోట కేంద్రంగా పరిపాలన ప్రారంభమైందన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఇదే విషయాన్ని భావితరాలకు తెలియజెప్పాలి. దశల వారీగా నిర్మాణమైన ఈ కోట నుంచి ఎంతో మంది రాజులు పరిపాలన చేశారు. 13వ శతాబ్దం నుంచే కాకతీయులు గోల్కొండ కోట కేంద్రంగా పరిపాలన చేశారు. అలాంటి కోట గురించి భావితరాలకు తెలియజేసేలా ఎంతో గొప్పగా వేడుకలు నిర్వహించాలి.
- అనురాధా రెడ్డి, ఇన్‌టాక్‌ కన్వీన ర్‌ హైదరాబాద్‌


చరిత్రను గుర్తు చేసుకోవాలి
హైదరాబాద్‌లో ఒక నగరంగా ఉన్న సికింద్రాబాద్‌ ఏర్పాటై 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. ట్యాంక్‌ బండ్‌ దాటిన తర్వాత బుద్ద భవన్‌ సమీపంలో మెమోరియల్‌ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 500 ఏళ్లు పూర్తి చేసుకున్న గోల్కొండ కోట ప్రాచుర్యాన్ని భవిష్యత్‌ తరాలకు చాటి చెప్పేలా ఉత్సవాలు చేపట్టాలి. గత చరిత్రను గుర్తు చేసుకోవాలి.
- మల్లాది కృష్ణానంద్‌, పూర్వ ప్రజా సంబంధాల అధికారి
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment