గరుడ గమన తవ | GARUDA GAMANA TAVA..TELUGU LYRICS & MEANING -JAGADGURU SRI BHARATI TEERTHA |
.

గరుడ గమన తవ’ కృతి ఘనత
భక్తి పాటకు కోటి వ్యూలు!

శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థ స్వామి విరచిత 
‘గరుడ గమన తవ’ కృతి ఘనత

సినిమా పాటలకు యూట్యూబ్‌లో లక్షల వ్యూలు రావడం సహజమే. సాధారణమే. కానీ.. ఒక భక్తి పాటకు దాదాపు కోటి వ్యూలు వస్తే? అది కచ్చితంగా అసాధారణమే. శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి విరచిత ‘గరుడ గమన తవ చరణ కమలమిహ’ అనే కృతి ఆ అద్భుతాన్ని సాధించింది. శృంగేరీ సిస్టర్స్‌, శ్రుతిరంజని తదితర గాయనులు పాడిన విభిన్న వెర్షన్‌లు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ కాగా.. అన్నీ కలిపి కోటికి పైగా వ్యూలు సాధించాయి. ‘‘ఓ గరుడ వాహనా, నీ పాదపద్మాలు నా మనస్సునందు నిత్యమూ ఉద్దీపనం చేయి. నన్ను తాపాలు, పాపాల నుంచి విముక్తుడిని చేయి.

ఓ పద్మ నేత్రా.. బ్రహ్మేంద్రాది విబుధ గణాలచే వినతులు పొందు పాదపద్మాలు కలవాడా నన్ను తాపాలు, పాపాల నుంచి విముక్తుడిని చేయి.

ఓ ఆదిశేష తల్పశయనా.. మన్మథుడి తండ్రీ.. నా జనన, మరణ భయాల్ని తీర్చేవాడా.. నన్ను తాపాలు, పాపాల నుంచి విముక్తుడిని చేయి.

ఓ శంఖ చక్రధరా.. దుష్టరాక్షసులను దునుమాడి సర్వలోకాలనూ రక్షించేవాడా.. నన్ను తాపాలు, పాపాల నుంచి విముక్తుడిని చేయి.

లెక్కించలేనన్ని సుగుణాలు కలవాడా.. దీనులకు దిక్కైనవాడా.. దేవతల శత్రువులను దునుమాడేవాడా.. నన్ను తాపాలు, పాపాల నుంచి విముక్తుడిని చేయి. నీ భక్తుడైన ఈ భారతీ తీర్థుని మహాకరుణతో రక్షించు.. నన్ను తాపాలు, పాపాల నుంచి విముక్తుడిని చేయి’’ అనే అర్థం గల పాట ఇది.

----------------------

గరుడ గమన తవ చరణ కమలమిహ 
గరుడగమన తవ చరణకమలమిహ
మనసి లసతు మమ నిత్యమ్ 
మనసి లసతు మమ నిత్యమ్ ॥ 
మమ తాపమపాకురు దేవ
మమ పాపమపాకురు దేవ ॥


1. జలజనయన విధినముచిహరణముఖ-
విబుధవినుత-పదపద్మ -2
మమ తాపమపాకురు దేవ 
మమ పాపమపాకురు దేవ ॥


2. భుజగశయన భవ మదనజనక మమ
జననమరణ-భయహారీ -2
మమ తాపమపాకురు దేవ 
మమ పాపమపాకురు దేవ ॥


3. శఙ్ఖచక్రధర దుష్టదైత్యహర
సర్వలోక-శరణ -2
మమ తాపమపాకురు దేవ 
మమ పాపమపాకురు దేవ ॥


4. అగణిత-గుణగణ అశరణశరణద-
విదలిత-సురరిపుజాల -2
మమ తాపమపాకురు దేవ 
మమ పాపమపాకురు దేవ ॥


5. భక్తవర్యమిహ భూరికరుణయా
పాహి భారతీతీర్థమ్-2
మమ తాపమపాకురు దేవ 
మమ పాపమపాకురు దేవ ॥
-------------------------
ఈ పాటలో ముఖ్యంగా ఉన్నది - రెండు విషయాలు- మొదటి పంక్లిలో భగవంతుని గుణవిశేషణాలతో సంబోధన. 
రెండవ అంశం- అటువంటి గుణవిశేషాలు కలిగిన తండ్రికి ప్రార్థన.. ఇది పునరావృతమవుతుంటుంది.
-------------- 
గరుడగమన, తవ చరణకమలమ్ ఇహ మనసి లసతు మమ నిత్యమ్ ॥
గరుడగమన, తవ చరణకమలమ్ ఇహ మనసి మమ నిత్యమ్ లసతు ॥
గరుడ-గమన, = ఓ గరుడుని వాహనంగా కలిగినవాడా, గరుడునిపై విహరించేవాడా
తవ చరణకమలమ్ = నీ పాదాలనే కమలాలు
ఇహ మమ మనసి = ఇక్కడ నా మనసులో
నిత్యం లసతు = ఎల్లప్పుడూ విలసిల్లుగాక
మమ తాపమ్ అపాకురు దేవ =నా పాపాన్ని హరించు. 
మమ పాపమ్ అపాకురు దేవ = నా తాపాన్ని హరించు.
(ఇదే పంక్తి ప్రతి చరణంలో పునరావృతమవుతుంది.) 
ఇక చరణాలు-


1. జలజ-నయన, విధి-నముచి-హరణ-ముఖ-విబుధ-వినుత-పద-పద్మ
జలజ-నయన = ఓ కమలముల వంటి కన్నులు కలిగినవాడా
విధి-నముచి-హరణ-ముఖ-విబుధ-వినుత-పద-పద్మ ==
విధి- = బ్రహ్మ
నముచి-హరణ- = ఇంద్ర (నముచి అనే రాక్షసుని సంహరించినవాడు)
ముఖ- = ముఖ్యంగా కలిగిన
విబుధ-వినుత- = విబుధజనులచేత స్తుతింపబడే
పద-పద్మ = పాదపద్మాలు కలిగినవాడా
అంటే ఎవరి చరణాలనే పద్మాలను బ్రహ్మాదులు స్మరిస్తారో, (స్తుతిస్తారో) అటువంటివాడు.
నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు. 

2. భుజగ-శయన, భవ-మదన-జనక, మమ జనన-మరణ-భయ-హారీ ॥
భుజగ-శయన = పాము శయ్యపై పడుకుని ఉండేవాడా
భవ-మదన-జనక = సంసారానికి, మన్మథుడికి తండ్రి అయినవాడా
మమ జనన-మరణ-భయ-హారీ = నా జన్మ, మరణం అనే భయాన్ని పోగొట్టేవాడా
నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు. .

3. శఙ్ఖ-చక్ర-ధర దుష్ట-దైత్య-హర సర్వ-లోక-శరణ ॥
శఙ్ఖ-చక్ర-ధర = శంఖాన్ని చక్రాన్ని ధరించినవాడా
దుష్ట-దైత్య-హర = దుష్టులైన రాక్షసులను సంహరించేవాడా
సర్వ-లోక-శరణ = అన్ని లోకాలకు శరణు అయినవాడా
నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు. 

4. అగణిత-గుణగణ అశరణ-శరణద విదలిత-సుర-రిపు-జాల ॥
అగణిత-గుణగణ = లెక్కపెట్టలేనన్ని గుణాల గణాలు (గుంపులు) కలిగినవాడా
అశరణ-శరణద = శరణులేనివారికి శరణు ఇచ్చేవాడా
విదలిత-సుర-రిపు-జాల == 
విదలిత- = చీల్చినవాడా
సుర- = సురులు అంటే దేవతల యొక్క
రిపు- = రిపులు అంటే రాక్షసులను
జాల = జాలాలను, (దళాలను)
నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు.
5. భక్తవర్యమ్ ఇహ భూరి కరుణయా పాహి భారతీ-తీర్థమ్ ॥
ఇహ భక్తవర్యమ్ భారతీ-తీర్థమ్ భూరి కరుణయా పాహి ॥
భక్తవర్యమ్ = భక్తులలో అగ్రగణ్యుడిని
భారతీ-తీర్థమ్ = భారతీ-తీర్థుని (రచయిత మహాస్వామి) 
ఇహ = ఇక, ఇక్కడ
భూరి కరుణయా = చాలా కరుణతో
పాహి = రక్షించు
నా పాపాన్ని హరించు, నా తాపాన్ని హరించు.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment