సినిమా థియేటర్లలో | Cinema | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu | BhakthiBooks | MohanBooks |


సినిమా థియేటర్లలో ధర పెంచితే జైలుకే!
తినుబండారాల అధిక రేట్లకు కళ్లెం

హైదరాబాద్‌: ప్రజలకు వినోదాన్ని పంచే సినిమా థియేటర్లలో అడ్డూఅదుపూ లేకుండా కొనసాగుతున్న తినుబండారాల అధిక ధరల దందాకు త్వరలోనే ముకుతాడుపడనుంది. ఇప్పటికే పార్కింగ్‌ రుసుముల వసూళ్లపై కొరఢా ఝుళిపించిన రాష్ట్ర ప్రభుత్వం అధిక ధరల వసూళ్లనూ కట్టడి చేయనుంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల్లోని సినిమా థియేటర్లతో పాటు సాధారణ థియేటర్లలోనూ తినుబండారాలు, మంచినీటి బాటిళ్లు, శీతలపానీయాలను నిర్ణీత ధరలకే విక్రయించాలని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విక్రేతలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారికి భారీ అపరాధ రుసుం విధింపుతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల్లోని సినిమా థియేటర్లల్లో తినుబండారాల ధరలు చుక్కలు అంటుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. మంచినీటి సీసా రూ.20 ఉంటే, మల్టీప్లెక్స్‌ల్లో రూ.50 నుంచి రూ.వంద వరకూ విక్రయిస్తున్నారు. ఇక పాప్‌కార్న్‌, శీతల పానీయాల ధరలకు హద్దే లేదు. మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల నిర్వాహకులతో తూనికలు-కొలతల శాఖ కంట్రోలర్‌ డాక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ సమావేశం నిర్వహించి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించనున్నట్లు స్పష్టం చేశారు.

తూకం వివరాలుండాలి
విడిగా విక్రయించే(అన్‌ప్యాక్డ్‌) ఉత్పత్తుల విషయంలోనూ వాటి పరిమాణాన్ని విధిగా నమోదు చేయాలని స్పష్టం ఉత్తర్వులో తూనికలు-కొలతల శాఖ స్పష్టం చేసింది. స్టిక్కర్ల రూపంలో ఆయా తినుబండారాలు/పానీయాలకు వసూలు చేస్తున్న ధర, పరిమాణం(బరువు/కొలత) వివరాలను వెల్లడించింది పేర్కొంది.

రూ.లక్ష వరకూ జరిమానా
* తూనికలు-కొలతల శాఖ ఉత్తర్వుల ప్రకారం...ప్యాకెట్లలో నిర్ధారిత పరిమాణంలో ఆయా తినుబండారులు లేకపోతే రూ.25 వేల వరకు అపరాధ రుసుము విధించే అవకాశం ఉంది. అదే తప్పిదం రెండోదఫా కూడా చేస్తే అపరాధ రుసుంతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
* నిర్ధారిత ప్రమాణాలు లేని(నాన్‌ స్టాండర్డు ప్యాకేజేస్‌) ఉత్పత్తుల విషయంలో రూ.25 వేల వరకు అపరాధ రుసుం విధిస్తారు. రెండోదఫా అదే తప్పిదానికి రూ.50 వేల వరకు జరిమానా విధించవచ్చు. కొన్ని సందర్భాల్లో రూ.లక్ష వరకూ పెంచే అవకాశం ఉంది. కొన్ని కేసుల్లో అపరాధ రుసుముతో పాటు ఏడాది కాలం జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
* విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న తినుబండాల విషయంలో నమోదు చేసిన పరిమాణంలో తూకం లేకుంటే అపరాధ రుసుముతో పాటు ఏడాది వరకు జైలు శిక్ష.
* అదనపు సౌకర్యాలు కల్పించామంటూ సేవా పన్నును ఇష్టారాజ్యం వసూలు చేస్తే వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం పరిధిలో నేరంగా పరిగణించాల్సి వస్తుంది.
* ఒక ఉత్పత్తి ఒకే ధర విధానం ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమలులోకి వస్తుంది. ధరలు, పరిమాణాల వివరాలను బోర్డుల రూపంలో సెప్టెంబరు నుంచి ప్రదర్శించాలి. ఫిర్యాదులు చేసేందుకు వీలుగా టోల్‌ఫ్రీ నంబరు 180042500333తోపాటు వాట్సాప్‌ నంబరు 7330774444 కూడా ప్రదర్శించాలని తూనికలు-కొలతల శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment