బోనాలు

ఆషాఢం రాక తెలంగాణకు పండుగ. ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చిన సంబురానికి, బోనాల జాతర తోడవుతుంది. తెలంగాణలో అంబారాన్నంటేలా జరుపుకునే ఈ సంబురం తెలంగాణ సంస్కృతికి ప్రతీక. ఎదుర్కోలు ఉత్సవాలతో ఆరంభమయ్యే ఈ వేడుక వీడ్కోలు వేడుకతో ముగుస్తుంది. మిన్నంటే డప్పు దరువులు, పోతురాజుల వీరంగాలు, శివసత్తుల పూనకాలు, ఆడబిడ్డల మొక్కులు, ఫలహారబండ్ల ఊరేగింపుతో సాగే ఈ జాతర సబ్బండ వర్గాల ఐక్యతకు సూచిక. కుమ్మరులు కొత్త కుండలో తెచ్చిన తొలి బోనం అందుకున్న గ్రామ దేవతకు ఊరి ఆడబిడ్డలంతా మొక్కులు చెల్లించుకునే ఈ సంబురం గ్రామీణ సాంస్కృతిక వారసత్వం. 15న గోల్కొండలో బోనాలు మొదలవుతున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం..


    దైవారాధన ప్రాచీనమైన విశ్వాసం. మైసమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ మొదలైన గ్రామదేవతలను ఎప్పటి నుంచో మనవాళ్లు ఆరాధిస్తున్నారు. ఇప్పటికీ వాటిని ఆచరిస్తున్నారు. ఆ గ్రామ దేవతలను ఆషాఢ మాసంలో సంప్రదాయబద్దంగా కొలిచే జాతర బోనాలు. ఈ గ్రామీణ సంస్కృతి మహా పట్టణాలలోనూ, మహా నగరాలుగా ఎదిగిన జంటనగరాల్లోనూ కొన్ని శతాబ్దాల నుంచి జరుపుకుంటున్నారు. ఎన్నో సంప్రదాయాలు కనుమరుగైనా ఈ బోనాల జాతర ఏటేటా జనాదరణపొందుతూ తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటుతోంది. వైదిక సంప్రదాయబద్దంగా పూజా కార్యక్రమాలు నిర్వహించే ఆలయాల్లోనూ బోనాల జాతర నిర్వహిస్తున్నారు. మహంకాళి, జగదాంబిక, భాగ్యలక్ష్మి మొదలైన పేర్లతో ఉన్న హిందూ దేవతా ఆలయాల్లోనూ బోనాల జాతర జోరుగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ ప్రభావంతో బోనాల జాతరకు ఆదరణ పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈ జాతర మరింత ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. బోనాల జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడమే కాకుండా ధూప,దీప, నైవేద్యాల కోసం ప్రభుత్వం ఆలయాలకు ఆర్థిక సహాయం చేయడం, జాతరను ఘనంగా జరిపే ఆలయాల వద్ద భారీ ఏర్పాట్లు చేయడంతో తెలంగాణ జాతర ఇప్పుడు వెలిగిపోతోంది.


         ఆషాఢ జాతరఆషాఢంలో ఆరంభమయ్యే జాతర బోనాలు. గోల్కొండ కోటలో ఆషాఢంలో తొలి ఆదివారం లేదా తొలి గురువారం మొదలై చివరి గురువారం లేదా చివరి ఆదివారం నాడు గోల్కొండ కోటలోనే ముగుస్తుందీ జాతర. అందుకే దీనిని ఆషాఢ జాతరని పిలుస్తారు. గోల్కొండ కోటలో బోనాల జాతర మొదలైన తర్వాతనే తెలంగాణ ప్రాంతంలో బోనాల జాతర మొదలవుతుంది. వచ్చే ఆదివారం ఈ కోటలో బోనాల జాతర షురూ అవుతుంది. గోల్కొండ కోటలోని ఎల్లమ్మ (శ్రీజగదాంబిక) గుడిలో జాతరలో కొన్ని ప్రత్యేకతలున్నాయి. వంశపారంపర్యంగా ఒకే కుటుంబీకులు పూజారిగా ఉంటున్నారు. ఆ పూజారి ఇంటి వద్ద ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఊరేగింపుగా కోటకు బయలుదేరతారు. గోల్కొండ కోట ప్రాంగణంలో పోతరాజుల వీరంగాలు, శివసత్తుల పూనకాలతో ఊగిపోతూ చేసే ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ వేడుక చూసేందుకు పర్యాటకులు కూడా అధిక సంఖ్యలో గోల్కొండకు వస్తారు.

   కొత్తగా పెండ్లయిన ఆడబిడ్డలు పుట్టింటికి చేరిన వేళ జరుపుకునే ఈ జాతరలో బోనమెత్తే ఆడబిడ్డలు ఆ బోనానికి ముందు నడిచే సోదరుడు పోతరాజుని అనుసరిస్తుంటారు. పోతరాజు దేహమంతా పసుపు పులుముకుని నోటిలో నిమ్మకాయలు బంధించి ముఖాకృతిని గంభీరంగా మార్చుకుంటాడు. కొరడాని ఝుళిపిస్తూ డప్పు దరువులకు తగినట్లుగా భీతిగొలిపేలా పోతరాజులు వీధుల్లో వీరంగాలాడతారు. డప్పు దరువులతో పోటీపడుతూ పోతరాజులు ఆవేశంతో ఊగిపోతుంటారు. జాతర మొదలైనప్పటి నుంచి తల్లికి బోనం సమర్పించే వరకూ వీరావేశంతో ఊగిపోతూ పోతరాజులు జాతరలో అగ్రభాగాన నిలుస్తారు.

ఊరుమ్మడి జాతరగ్రామ దేవతకు మొక్కులు చెల్లించడం (బోనం సమర్పించడం) కొన్ని కుటుంబాలకు సంప్రదాయం. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కాపాడుకునేందుకు ఆ కుటుంబంలోని ఎవరో ఒకరు బోనం సమర్పించే బాధ్యతను స్వీకరిస్తారు. మిగతా కుటుంబ సభ్యులందరూ ఆ బోనం సమర్పించే జాతరలో తప్పక పాల్గొంటారు. సున్నం, పసుసు, కుంకుమ బొట్లతో కొత్త కుండను అలంకరిస్తారు. వేపాకులను చూడతారు. ఈ కుండలో బోనం (భోజనం) అమ్మవారికి సమర్పించేందుకు తీసుకుపోతారు. బెల్లంతో వండిన అన్నం కానీ పెరుగన్నం కానీ తీసుకుపోతారు. ఈ కుండపై మట్టి మూతను ఉంచి దానిపై దీపాన్ని వెలిగిస్తారు. రాగి లేదా ఇత్తడి చెంబులో ఇంటి నుంచి నీళ్లు తీసుకుపోతారు. ఊరేగింపుగా గుడికి చేరుకున్న తర్వాత ద్వారాన్ని చెంబులోని నీళ్లతో కడిగి, పసుపు, కుంకుమరాసి, వేపాకుల తోరణాలతో అలంకరిస్తారు.

ఆ తర్వాత తల్లికిపూజ చేసి బోనాలు సమర్పిస్తారు. ఈ బోనాల సమర్పణలో కొత్త కుండనే వాడటం ఆనవాయితీ. బోనాల సమర్పణలో కుమ్మరులే తొలిబోనం సమర్పించే ఆచారం చాలా ఆలయాలలో ఉన్నది. ఇప్పటికీ ఆ ఆచారం కొనసాగుతోంది. బోనాల జాతర సందర్భంలో మొక్కులున్న కుటుంబాల వాళ్లు ఒడిబియ్యం, చీర, పసుపు, కుంకుమ, గాజులు దేవతకు చెల్లిస్తారు. మొక్కులు చెల్లించే బాధ్యత ఉన్న కుటుంబ సభ్యులు తెల్లవారగానే నిద్రలేచి, స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. తల్లికి బోనం సిద్ధం చేసి, ఇంట్లో పూజ చేసిన తర్వాత గుడికి బయలెల్లుతారు.

జీవితమంతా శివదీక్షకే అంకితమైన శివసత్తులు కూడా ఇదే తరహాలో బోనాన్ని సిద్ధం చేసుకుని బయలెల్లుతారు. శివసత్తులు గుడికి వస్తుంటే ఎక్కువ మంది వారిని అనుసరిస్తూ ఉంటారు. ఏడాది కాలమంతా వీరి సహకారంతో పూజా కార్యక్రమాలు జరుపుకునే వారంతా ఈ బృందంలో చేరతారు. శివసత్తులు బోనాన్ని తలపై నిలుపుకొంటూ, దీపాన్ని కాపాడుకుంటూనే పూనకాలతో ఊరేగుతూ గుడికి చేరుకుంటారు. డప్పుల మోతకు అడుగులేసుకుంటూ, కొరడా ఝుళిపిస్తూ, ఆయుధాలు ప్రదర్శిస్తూ శివసత్తుల పూనకాలు, పోతరాజుల వీరంగాలతో బోనాల జాతర ఆలయం బయట ఉత్సాహవంతంగా సాగుతుంది. ఒగ్గుడోలు, డప్పు దరువులతో సాగే ఈ జాతర ఇతర పండుగలన్నింటికీ భిన్నంగా ఉంటుంది. అమ్మా బైలెల్లినాదో.. తల్లీ బైలెల్లినాదో పాట ప్రతి ఊరిలోనూ ఈ ఆషాఢంలో వినిపిస్తుంది. అనేక జానపదాలు ఆయా గ్రామ దేవతల విశేషాలు చెబుతూ భక్తులను జాతరకు ఆహ్వానిస్తుంటాయి. ఈ పాటల ఉత్సాహం, పోతరాజుల ప్రదర్శనలు అందరికీ పరవశం కలిగిస్తుంటాయీ మాసంలో. వైదిక సంప్రదాయాలకు భిన్నంగా జరిగే బోనాల జాతర తెలంగాణ సంస్కృతికే సొంతమైన ఓ విశిష్టత.


    లష్కర్ బోనాలుగోల్కొండ బోనాల తర్వాత అత్యంత వైభవంగా బోనాల జాతర జరిపే ఆలయం శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం. సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్‌లో ఉన్న మహంకాళి ఆలయంలో బోనాల జాతరను రెండు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. ఈ బోనాల జాతరకు భక్తుల సంఖ్య ఏటా లక్షకుపైగా పెరుగుతోంది. బోనాల జాతర నిర్వహణలో ఈ ఆలయ సంప్రదాయానికి ఉండే ప్రత్యేకత వల్ల నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు భక్తులు తరలివస్తున్నారు. ఆలయంలోని అమ్మ వారిని కర్బల మైదానం (పుట్టినిల్లు)గా భావిస్తూ అక్కడి నుంచి ఊరేగిస్తూ సికింద్రాబాద్‌లోని అన్ని వీధుల్లో ఊరేగిస్తారు. వెదురుతో రూపొందించిన ఘటంలో ఉత్సవ ప్రతిమకు పట్టు వస్ర్తాలు, పూలతో అలకంరణ చేసి చిన్న రాగి పాత్రపై అమ్మవారిని కొలువుదీర్చి ఘనంగా ఊరేగిస్తారు. అమ్మవారికి సోదరుడిగా భావించే పోతరాజు ఆమెను తలపై ధరించి, ఊరేగిస్తాడు.

రోజుకో తీరు అలంకరణతో ఘటోత్సవంలో పూజలందుకున్న అమ్మవారు పదిహేను రోజుల తర్వాత ప్రధాన ఆలయానికి చేరుకుని భక్తుల పూజలందుకుంటుంది. ఈ ఆలయంలో నిర్వహించే జాతరలో ఘటాల ఎదుర్కోలు, బోనాల సమర్పణ, రంగం (భవిష్యవాణి), వీడ్కోలు (ఊరేగింపు) మొదలైన కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. సికింద్రాబాద్ వీధుల్లో జరిగే ఫలహార బండ్ల ఊరేగింపు కార్యక్రమం ఉదయం బోనాల ఊరేగింపు అంత ఘనంగా నిర్వహిస్తారు. జూలై 29, 30 తేదీల్లో నిర్వహించే లష్కర్ బోనాల్లో అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తున్నారు. ఇప్పటి వరకు భక్తులు సమర్పించిన బంగారంతో ఈ బోనాన్ని తయారు చేయిస్తున్నారు.

గర్భ గుడిని వెండి తొడుగుతో అలంకరిస్తున్నారు. సికింద్రాబాద్ బోనాలు ముగిసిన తర్వాత వచ్చే ఆదివారం నాడు బోనాల జాతర నిర్వహించడం పాతబస్తీ సంప్రదాయం. ఈ ఏడాది ఆగస్టు 5న పాతబస్తీ బోనాలు నిర్వహిస్తారు. సాంస్కృతికంగా ప్రత్యేకంగా ఉండే పాతబస్తీలో బోనాల నిర్వహణ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటుంది. అతి ప్రాచీన ఆలయాల్లో నిర్వహించే ఈ బోనాల జాతరను పాతబస్తీలోని హిందువులందరూ ఉమ్మడిగా జరుపుకుంటారు. పాతబస్తీలో బోనాలకు ప్రసిద్ధిగాంచిన లాల్ దర్వాజలోని శ్రీసింహవాహిని మహంకాళి, హరిబౌలిలోని శ్రీఅక్కన్న మాద న్న మహంకాళి ఆలయం, మీరాలంమండి, గౌలిపురా, ఉప్పుగూడలోని మహంకాళి ఆలయాలు, అలియాబాద్‌లోని దర్బార్ మైసమ్మ ఆలయం, చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాల్లో బోనాల జాతరను ఘనంగా నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలోనూ బోనాల జాతర నిర్వహిస్తారు. ఆ జాతరలో కొలుపు విధానం ఇదే. వాటిని శ్రావణ మాస బోనాలుగా పిలుస్తారు.


ఎదుర్కోలు వేడుకలుఅమ్మవారిని ఘటం రూపంలో ఊరేగిస్తూ ఆలయానికి తీసుకువస్తారు. దీనిని ఎదుర్కోలు అంటారు. ఈ ఎదుర్కోలు ఉత్సవం ఆలయానికి చేరిన తర్వాత తొలిపూజతో బోనాల జాతర ఆరంభమవుతుంది. ఈ వేడుక నిర్వహణలో ప్రతి ఆలయానికీ ఒక సంప్రదాయం ఉంటుంది. గోల్కొండ ఎల్లమ్మ ఆలయ పూజారి ఇంటి నుంచి ఉత్సవ విగ్రహాలను ఉరేగింపుగా గోల్కొండ కోటపైకి తీసుకుపోతారు. ఈ ఊరేగింపునకు ముందు పూజారి కుటుంబ సభ్యులు సంప్రదాయబద్దంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సికింద్రాబాద్ బోనాల నిర్వహణలో ఉజ్జయిని మహంకాళి ఉత్సవ ప్రతిమను రోజుకో ప్రాంతంలో ఎదుర్కోలు ఉత్సవం పేరుతో ఊరేగిస్తారు. ఈ ఎదుర్కోలు గోల్కొండ బోనాలు ప్రారంభమైన రోజు ప్రారంభమవుతుంది.

   రంగంఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహించే కార్యక్రమాల్లో రంగం (భవిష్యవాణి) ప్రత్యేకమైనది. రంగంలో మాతంగి చెప్పే భవిష్యవాణి వినడానికి వేల సంఖ్యలో భక్తులు ఎదురుచూస్తారు. పూనకంతో మాతంగి చెప్పే మాటలు దేవతా పలుకులుగానే భక్తులు భావిస్తారు. భవిష్యవాణి నిజమవుతుందని భక్తుల నమ్మకం. రంగం పూర్తయిన తర్వాత బలిపూజ ద్వారా అమ్మవారు ఆవహించినట్లుగా భావించే మాతంగిని శాంతింపజేస్తారు. అనంతరం గావు పట్టి ఆలయ సంప్రదాయ కార్యక్రమాలను కొనసాగిస్తారు. గావు పట్టడం పూర్తయిన తర్వాత నగర వీధుల్లో అమ్మవారి గజారోహణ వేడుక నిర్వహిస్తారు. -నాగవర్ధన్ రాయల
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment