శ్రీ గణేశ దీక్ష | Sri Ganesha Deeksha | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


 శ్రీ గణేశ దీక్ష 
Sri Ganesha Deeksha 
Rs 30/-

శ్రేయస్కరం... శుభస్కరం

గణపతి దీక్ష

   సాధారణంగా లోకంలో ఎన్నో దీక్షలున్నాయి. కాని అన్నింటిలోనూ గణపతి దీక్ష అత్యంత సులభసాధ్యమైనది, అన్నివేళల్లో అందరూ సులభంగా ఆచరించదగినది. ఎక్కువ నియమ నిబంధనలు లేకుండా, ఏ ఇబ్బందులూ కష్టాలూ లేకుండా బాలల నుంచి వృద్ధుల వరకూ, స్త్రీ, పురుషులందరూ చేయగలిగినది. వ్యాసభగవానుడు ముద్గల పురాణంలో తెలిపిన ఈ గణపతి దీక్షను ఆచరించి, కోరిన కోరికలను నెరవేర్చుకోగలిగేందుకు ఈ వారం మీకోసం... ఈ గణపతి దీక్షను వినాయకుడి ఆలయంలో ఒక శుభముహూర్తాన స్వీకరించాలి. దీక్ష తీసుకునే రోజు అభ్యంగ స్నానమాచరించి గణపతి ముందు రెండు చేతులు జోడించి, ‘ఓ గణేశా! ఈ రోజు నుంచి నీ దీక్షావ్రతాన్ని అవలంబించి యథాశక్తి నిన్ను సేవిస్తాను. దీక్షా సమయంలో ఏ విధమైన విఘ్నాలూ కలగకుండా నా కోరికను నెరవేర్చి నీ అనుగ్రహాన్ని ప్రసాదించ’మని ప్రార్థించుకోవాలి. ఏ రంగు వస్త్రాలంటే..? బంగారు రంగుతో మెరుస్తూ ఉన్న కొత్త వస్త్రాలను లేదా లేత ఎరుపురంగు వస్త్రాలు, గణపతి చిహ్నంతో ఉన్న ఒక మాల, కంకణ ం ధరించాలి.దీక్షను స్వీకరించే ముందు

 ఆదిదేవ గణాధ్యక్ష! త్వదనుగ్రహకారకం!
దీక్షాం స్వీకృత్యత్వతేవాం కరోమీప్సిత సిద్ధయే! 

   అనే దీక్షా మంత్రాన్ని పఠిస్తూ మాలను మెడలో ధరించాలి. చేతికి కంకణాన్ని ధరించాలి. మన కోరికను అనుసరించి 3, 5, 11, 21, 41 రోజులు లేదా శుద్ధ చవితి నుంచి బహుళ చవితి వరకు లేదా బహుళ చవితి నుంచి శుద్ధ చవితి వరకు లేదా వినాయక చవితి నాటికి 11, 5, లేదా 3 రోజులు పూర్తయే విధంగా సులభమైన తిథిని ఎంచుకుని మనకు అనుకూలంగా దీక్షను స్వీకరించాలి. ప్రతిరోజు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని గణపతిని యథాశక్తి ఆరాధించి, అల్పాహారం చేసి, సాయంత్రం ప్రదోష పూజ చేసుకుని, స్వామికి నివేదించిన భోజనాన్ని స్వీకరించాలి. మధ్యలో పండ్లు లేదా పాలు వంటివి తీసుకోవచ్చు. రోగగ్రస్థులు, పిల్లలు, గర్భిణులు, వృద్ధులు తమకు అనుకూలంగా ఆహారాలను స్వీకరించవచ్చు. తూర్పు ముఖంగా కూర్చొని, గణపతి ప్రతిమను లేదా విగ్రహాన్ని లేదా పటాన్ని ముందుంచుకొని పూజించాలి. అవకాశముంటే దీక్షరోజు పళ్లెంలో బియ్యం పోసి, పసుపుతో ముగ్గువేసి, ఒక కలశాన్ని పెట్టి దానిలో నీరుపోసి, అందులో మామిడి మండలు ఉంచి పైన నిండు కొబ్బరికాయను మూతగా ఉంచి, రవికెల గుడ్డను చుట్టి, ఆవాహన చేసి పూజించవచ్చు. ఈ కలశాన్ని దీక్ష ముగిసే వరకు పూజించి ఉద్వాసన చేయవచ్చు. 

  ఎక్కడ ఉన్నా రెండుపూటలా పూజించుకోవడమే ప్రధానం. పూజ ఎక్కువ సమయం చేయలేనివారు మానసిక పూజ చేయవచ్చును. ప్రయాణాలలో ఇది బాగా ఉపకరిస్తుంది. ‘ఓం గం గణపతయే నమః’ అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉంటే గణపతి అనుగ్రహం కలుగుతుంది. ఇరుముడికి ప్రత్యామ్నాయంగా గణపతికి ప్రీతికరమైన కొబ్బరి, చెరకు, బెల్లం, అటుకులు, పేలాలు, తేనె, అరటిపండ్లు, ఖర్జూరాలు, తెల్లనువ్వులు, ఉండ్రాళ్ళు సమర్పించడం శుభప్రదం. దీక్షా నియమాలుపూజలో పసుపు, కుంకుమ, అక్షతలు, ఎర్రని పూలు, అగరువత్తులు, హారతి కర్పూరం, దీపం, నైవేద్యం ముందే సిద్ధం చేసుకోవాలి. గరిక (గడ్డిపరకలు), ఎర్రని లేదా తెల్లని పూలు విధిగా ఉంచాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మద్యమాంసాలను విసర్జించి, అందరితోనూ సాత్వికంగా మెలగాలి. దీక్షలో ఉన్నప్పుడు అవకాశాన్ని బట్టి గణపతిని ఆయా దేవాలయాల్లో దర్శించుకోవడం మంచిది. నుదుట విభూతి, గంధం, కుంకుమ ధరించాలి. తినే ప్రతి ఆహార పదార్థాన్ని ‘గణేశార్పణమస్తు’ అని స్వీకరించాలి. దీక్షలో ఉన్నప్పుడు ప్రతి ప్రాణిని గణపతి స్వరూపంగా చూడగలగాలి. దీక్షా ఫలితం ఈ దీక్షను సక్రమంగా పూర్తి చేసిన విద్యార్థులకు సద్బుద్ధి, అఖండ విద్యాప్రాప్తి కలుగుతాయి. సంతానార్థులకు సంతానం, ఉద్యోగార్థులకు మంచి ఉద్యోగం ప్రాప్తిస్తుందని విశ్వాసం. వరంగల్‌కు చేరువలోని కాజీపేటలో శ్వేతార్క గణపతి దీక్షలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment