శ్రీ శివ ఆరాధన | Siva Aradhana | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
శ్రీ శివ ఆరాధన
 Sri Siva Aradhana 
-Adipudi Sairam
Rs 108/-
ఓంకారం! సృష్టికి మూలం 
 ఈశ్వర ప్రియం

    మన ఋషులు, మునులు ఓం అనే అక్షరాన్ని మిగతా అన్ని అక్షరాల మాదిరిగా చూడలేదు. దాన్ని శబ్ద బ్రహ్మం అన్నారు. అంటే మనం దేవుడు, అంతర్యామి అని ఎవర్నైతే భావిస్తున్నామో.. ఆ సృష్టికి మూలమైన విశ్వనాథుడు, విష్ణువు అన్నీ ఓంకారమే! అందుకే సన్యాసం స్వీకరించినవారు కూడా వదిలిపెట్టకూడని మహామంత్రం ఓం. మోక్షం కోరుకునే వారెవరైనా ఓం అనే ఏకాక్షర మంత్రాన్ని నిరంతరం జపిస్తూనే ఉండాలి. వేదాలు, శాస్ర్తాలు ఇలా నియమం పెట్టడానికి కారణం ఓం లో ఎన్నెన్నో అద్భుత, రహస్యాలు, మార్మిక లాభాలు దాగివుండడమే. హిందూమతం గురించి, సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలంటే ముందు ఈ ఓంకారాన్ని అర్థం చేసుకోవాలి. ఓం అనే అక్షరానికి లేదా శబ్దానికి కేవలం హిందూ మతంతోనే సంబంధం లేదు. అది సార్వజనీనం. మతాలు, ప్రాంతాలు, దేశాలు, ఆ మాటకొస్తే గ్రహాలు, నక్షత్ర మండలాలకు కూడా అతీతమైంది ఓం. అన్నింటినీ తనలో కలుపుకోగలది. అన్నింట్లోనూ తానే ఉన్నది. సాక్షాత్తూ పరమాత్మ స్వరూపమైనది.. ఓం. om

    ఓం.. అకార, ఉకార, మకారాలతో ఉత్పన్నం అవుతుంది. ఇవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి ప్రతీకలు. ఓం శబ్దంలో ఋగ్, యజుర్, సామవేదాలు కూడా నిక్షిప్తమై ఉన్నాయి. ఓంతో జత చేయనిదే అది ఎంత పవిత్రమైన పదమైనా మంత్రం అవ్వదు. యోగశాస్త్రంలో కూడా ఓంకార ఉచ్ఛారణతో ప్రాణాయామం చేయడం అత్యంత కీలకం. ఓం మంత్రాన్ని ఏకాగ్రతతో దీర్ఘంగా ఉచ్ఛరిస్తే అనేక ఆరోగ్య సమస్యలు తీరుతాయి. మనసు నియంత్రింపబడుతుంది. అంతిమంగా మనిషి తురీయ స్థితిలో సమాధి అనుభవం పొందడానికి ఓంకార సాధన ఉపకరిస్తుంది. ఓం గురించి అనేక ఉపనిషత్తులు చర్చించాయి. ముఖ్యంగా మాండూ క్య ఉపనిషత్తులో ఓంకారాన్ని ధనస్సుగా అభివర్ణించారు. దాని విల్లులో సంధించిన బాణమే ఆత్మ. అటువంటి ఆత్మ నేరుగా వెళ్లి ఏ లక్ష్యంలో దిగబడుతుందో.. అదే బ్రహ్మం. అంటే మోక్ష స్థితి. ఓంకారం లేకుండా ముక్తి లేదని దీనివల్ల అర్థమవుతుంది. నామ, రూపాలకతీతమైన సకల జగత్తులోని శాశ్వత సారం ఈ ఓంకారమే!

ఓం సంకేతార్థం..
3 అంటూ దేవనాగరి లిపిలో రాయబడే సంకేతంలోనే ఎన్నో రహస్యాలున్నాయి. ముఖ్యంగా మూడు అర్ధచంద్రాకారాలుగా ఓంను ఎందుకు రాస్తారనే దానిపై ఎన్నో గ్రంథాలు విపులంగా విశదీకరించాయి. ఓం అక్షరంలోని ఒక అర్ధచంద్రాకారం మన జాగ్రదవస్థకి సంకేతం. అంటే ఈ ప్రపంచం మొత్తం మనం భావిస్తున్నట్టుగా భౌతికంగా కళ్లకు కనిపించే స్థితి. ఇక ఓం లోని రెండో నెలవంక సుషుప్తి. అంటే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మైమరిచి మనలో మనం లీనం కావడం. ఈ జాగ్రత్, సుషుప్తి అవస్థల మధ్యే స్వాప్నావస్థ ఉంటుంది. అందుకు సంకేతమే ఓంకారం నడి మధ్యలోని వక్రరేఖ. ఇంగ్లీషు అంకె 3 లాగా ఉన్న ఆకారంలోంచి ఈ స్వాప్నావస్థను సూచించే వంకి బయటకు చొచ్చుకొస్తుంది. అంటే మనిషి లేచిఉండే స్థితి, గాఢనిద్రలో మునిగే స్థితులకు మధ్యలో స్వప్నం వస్తుందన్నమాట. ఇక సంస్కృత 3లో ఉండే నాలుగో వక్రరేఖ.. పైన ఉంటుంది. ఇది శివుని శిరస్సున నెలవంకలా ఉంటుంది. దీనిపైన కనిపించే బిందువు తురీయ స్థితిలోని ఆత్మ. తురీయావస్థ అంటే చైతన్య స్థితి కాదు, గాఢ నిద్ర కాదు, స్వప్నమూ కాదు. మరేంటి? మన ఋషులు అనుభవం చెందిన ఆత్మ. భౌతికమైన శరీరం, మనసు, ప్రకృతి, యావత్ సృష్టి ఈ తురీయావస్థలో మాయమైపోతాయి. కేవల నిరామయ ఆత్మ మాయను దాటుకుని వెళ్లి ఒంటరిగా వెలిగిపోతుంది. దానికి సంకేతమే బిందువు. బిందువు కిందనున్న చంద్రవంక లాంటి నాలుగో వక్రరేఖ..

మాయ. మాయ కిందకు వస్తే జాగ్రత్, స్వప్న, సుషుప్తి దశలు. దానిపైకి వెళితే తురీయావస్థలోని బిందుస్వరూపమైన ఆత్మ. ఇదే ఒకే అక్షర రూపమైన మన ఓంకారంలోని రహస్య సంకేత జ్ఞానం. ఓంకారం అజ్ఞానమనే చీకటిని ఛేదిస్తుంది. శాశ్వత జ్ఞానమనే దివ్యమైన వెలుగుల సత్యలోకాన్ని చేరుస్తుంది. ఎలాంటి మాయకు, భ్రమకు లోబడని ఆ సత్యమే.. మోక్షమార్గం. మోక్షసాధనకి ఏకాక్షర రహస్యమే.. ఓం! -జైసింహా చతుర్వేది

భారతీయ సనాతన సంప్రదాయంలోనూ, పురాణ విజ్ఞానాది విశేషాలలోనూ ఓంకారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఓంకార సహితమైన మంత్రం అత్యంత శక్తివంతమైనదని చెబుతారు. ఏ మంత్రమూ తెలియకపోయినా, జపించలేకపోయినా ఒక్క ఓంకారాన్ని జపిస్తే జన్మ తరిస్తుందన్నది పెద్దల మాట. ఓంకారాన్ని ఎందరెందరో మహర్షులు, మునులు విశ్లేషించి చెప్పారు. ఓంకారంలో మాత్రా ఛందస్సు ఇమిడి ఉంటుంది. ఓంకార శక్తి విశేషాల గురించి వాయు పురాణం 20వ అధ్యాయం కొంత విశేషంగా విపులీకరిస్తోంది. వాయు దేవుడే ఈ వివరాలనివ్వడం మరీ విశేషం. మాత్రా ఛందస్సు పరంగా చూస్తే ఓంకారంలో మూడు మాత్రలుంటాయి. దీనిలోని హల్లులు కూడా స్వరంగానే భావిస్తారు. మొదటి మాత్రను వైద్యుతి అని అంటారు. ఇది విద్యుత్తు సంబంధమైనది. రెండో మాత్రను తామసి అని, మూడో మాత్రను నిర్గుణి అని అంటారు. మాత్ర అనంటే ఛందస్సు లక్షణం ప్రకారం కనురెప్పపాటులో ఉచ్చరించగలిగేది అని అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే నాశనం లేనిదే ఓంకారం.

బ్రహ్మపదానికి మార్గం..
యోగ సాధన చేసే యోగికి ఓంకారం ఒక గొప్ప ధనుస్సు లాంటిది. ఈ ధనుస్సు అనే ఓంకారానికి ఆత్మ అనే బాణాన్ని తొడిగి ఆ బాణాన్ని బ్రహ్మపదానికి గురి చేసి వదలాలి యోగి. అలా చేస్తే బ్రహ్మపదాన్ని సులువుగా చేరవచ్చని వాయుదేవుడు వివరించాడు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని అనడం వల్ల ఓం అనే అక్షరమే బ్రహ్మ అని తెలుస్తున్నది. ఈ ఓంకారం మూడు లోకాలకు, మూడు అగ్నులకు ప్రతీక. వామనావతారంలో శ్రీమహావిష్ణువు మోపిన మూడు పాదాలు భూమి, ఆకాశం, పాతాళం అనేవి. ఈ మూడు ఓంకార స్వరూపాలని పురాణాలు పేర్కొంటున్నాయి. ఓంకారంలో అకారం అక్షరంగానూ, ఉకారం స్వరితంగానూ, మకారం ప్లుతంగానూ ఉంటాయి. అలాగే అకారాన్ని భూర్లోకంగానూ, ఉకారాన్ని భువర్లోకంగానూ, హల్లుతో కూడిన మకారాన్ని స్వర్లోకంగానూ చెబుతారు. అలాగే ఓంకారంలోని అగ్రభాగాన్ని స్వర్గమని, అది బ్రహ్మకు సంబంధించినదని అంటారు. ఓంకారంతో ధ్యానం చేసిన వ్యక్తి కఠోర నియమాలతో తపస్సు చేసిన వ్యక్తి పొందే ఫలితాన్నే పొందుతాడు. అలాగే గొప్ప గొప్ప దాన ధర్మాలు చేసినంత ఫలితాన్ని ఈ ఓంకారాన్ని జపించడం ద్వారా పొందవచ్చు.

శక్తికి చిహ్నం
సర్వ జగతికి మూలమని చెప్పే ఈ ఓంకారం ప్రణవనాదంగా ఉండి, పరమేశ్వరుడికి మహా ప్రీతిని కలిగిస్తుంటుంది. సృష్టి, స్థితి, లయ కారకులు ముగ్గురూ ఈ ఓంకారాన్ని ఆశ్రయించి ఉంటారు. అందుకే ఈ ఓంకార జపం వల్ల ఉత్తమ ఫలితం కలుగుతుంటుంది. దీనిలోని అకార, ఉకార, మకారాల సంయోగంలో అద్భుత యోగశక్తి ఉందని ఋషులు నిరూపించారు. ప్రస్తుత కాలంలో కూడా శారీరక, మానసిక ఆరోగ్యాల పరిరక్షణకు చేస్తున్న ప్రాణాయామంలాంటి యోగాభ్యాసాలలో ఈ ఓంకారాన్ని జపిస్తూ ఉండటాన్ని గమనిస్తే ఓంకార విశిష్టత స్పష్టమవుతుంది. ఓంకారంలో బిందునాదాత్మకంగా అర్ధమాత్ర ఉంటుంది. ఇది శక్తికి చిహ్నమని పలువురు నిర్ధారించి చెప్పారు. ఇంతటి మహిమాన్వితమైనది కనుకనే ఓంకారాన్ని గురించి దత్తాత్రేయుడు కూడా వివరించి చెప్పాడు. యోగి పరమాత్మను సాక్షాత్కరింప చేసుకోవడానికి ఓంకారమే గొప్ప సాధనమని ఆ స్వామి వివరించాడు. -డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు

విశ్వానికి మూలం
ఓం నుంచే విశ్వం ఆవిర్భవించిందని కూడా మన పెద్దలు చెప్పారు. మహర్షులు తాము సమాధి స్థితిలో దర్శించిన రహస్యాలనే వేద, పురాణ, ఇతిహాస, శాస్ర్తాల రూపంలో బయటపెట్టారు. వారి అభిప్రాయం ప్రకారం.. యావత్ సృష్టి ఓంకార నాదం నుంచే ఉత్పన్నం అయింది. మొదట ఈ భౌతిక విశ్వమేదీ లేనప్పుడు ఓంకారం మొదలై క్రమక్రమంగా విస్తరించి, వ్యాపించి తరువాతి కాలంలో పంచభూతాలకు అస్తిత్వాన్నిచ్చింది. మళ్లీ ప్రళయ కాలంలో ఓంకార నాదంలోనే లీనమవుతుంది. కాలక్రమంలో సైన్స్ విస్తరించే కొద్దీ, సాంకేతికత పెరిగే కొద్దీ ఆధునిక మానవజాతికి కూడా మన పూర్వులు చెప్పిన ఓంకార రహస్యం అవగతం అవ్వొచ్చు. ఓం శబ్దంగానే కాదు.. ఆకృతిగానూ ఎంతో విశిష్టత కలిగి ఉంది. హిమాలయాల్లోని ఓ సమున్నత శిఖరాన్ని ఓం పర్వతంగా పిలుస్తారు. దీనిపై మంచు తనకు తానుగా సంస్కృత ఓంకారం g రూపంలో ఆవిష్కరించుకుంటుంది. ఇది ప్రకృతి చేసే మార్మికమైన అద్భుతం.

      ఉదయం, సాయంత్రం దైవ సన్నిధిలో మూడుసార్లో, పదకొండు సార్లో ఓంకారాన్ని దీర్ఘశ్వాసతో ఉచ్ఛరించడం ఆచరించదగింది. మన ఇష్టదైవాన్నే ఓంకార స్వరూపంగా భావించి ప్రార్థన చేసుకోవచ్చు. ఓం ఉచ్ఛరించే సమయంలో మన నోటిలో మూడు ప్రధాన స్థానాలు కదలికకు లోనవుతాయి. అకారం ఉచ్ఛరిస్తోంటే గొంతు దగ్గరి భాగం, ఉకారం పలుకుతుంటే నోటి మధ్య భాగం, మకారం పూర్తి అవుతోంటే పెదవులు మూతపడడం జరుగుతుంది. అంటే అన్ని అక్షరాలకు మూలమైన నోటిలోని అన్ని స్థానాలు ఒక్క ఓంకార ఉచ్ఛారణ వల్ల ప్రేరితం అవుతాయన్నమాట. అందుకే ఓంకారం ప్రణవమైంది. మహామంత్రమైంది. సర్వమంత్ర సారమూ అయింది. ఇది ఒక్కటి సక్రమంగా ఉచ్ఛరిస్తే అన్ని మంత్రాలు చదివిన ఫలితం దక్కుతుంది.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment