మహోన్నత ఆలయ సీమ - రాయలసీమ



 ఏడుకొండల శ్రీనివాసుడు శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు కాణిపాకం వినాయకుడుఏకశిలానగరం .. ఒంటిమిట్టతిరుమలేశుని తొలిగడపరామబాణం మలచిన మారుతికదిరీ నరసింహుడా...కసాపురం హనుమంతుడుసత్యసాయిధామం పుట్టపర్తిజ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంజ్వాలా నరసింహుడు కొలువు అహోబిలంయాగంటి ఉమాహేశ్వరుడురాఘవేంద్రుడి బృందావనంనిరంతర జలధార మహానంది


సాక్షాత్తూ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి నిలయం తిరుమల, మహాశివుడు వాయులింగం రూపంలో కొలువైన శ్రీకాళహస్తి ... ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం... నవ్యాంధ్ర శ్రీరాముని కొలువు ఒంటిమిట్ట... ప్రహ్లాద సమేత నారసింహుని నెలవు కదిరి... ఇలా నలు దిక్కులా విశిష్టమైన భక్తి ధామాలతో అలరారుతున్న ఆధ్యాత్మిక సీమ రాయలసీమ.

చిత్తూరు జిల్లాలో...

ఏడుకొండల శ్రీనివాసుడు


చిత్తూరు జిల్లా పేరు వినగానే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం గుర్తుకు వస్తుంది. భక్త జనకోటితో, గోవింద నామస్మరణతో తిరుమల గిరులు నిత్యం ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల నుంచీ తిరుపతికి రైలు, విమాన సౌకర్యాలున్నాయి. తిరుమల నుంచి ఆర్టీసీ బస్సుల్లో, పైవ్రేటు వాహనాల్లో తిరుమల చేరుకోవచ్చు. తిరుపతిలో, తిరుమలలో వసతి సౌకర్యాలు విస్తృతంగా ఉన్నాయి.

శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు


దక్షిణ కాశీగా పేరుపొందిన శ్రీకాళహస్తిలో మహాశివుడు వాయులింగేశ్వరుడిగా వెలిశాడు. రాహు-కేతు దోష నివారణ పూజలకు ఈ ఆలయం ఖ్యాతి పొందింది. శివపురాణం ప్రకారం, ఈ క్ష్షేత్రంలో సాలెపురుగు, పాము, ఏనుగు శివుడిని సేవించి ముక్తిని పొందాయి. వాటి పేరిట ఇది శ్రీకాళహస్తిగా ప్రాచుర్యం పొందింది. కన్నప్పను కరుణించిన కాళహస్తీశ్వరుడ్ని అభయప్రదాతగా భక్తులు కొలుస్తారు.
ఎలా వెళ్ళాలంటే...

తిరుపతి నుంచి 37 కి.మీ. దూరంలో శ్రీకాళహస్తి ఆలయం ఉంది. కాళహస్తిలో రైల్వే స్టేషన్‌ ఉంది. రోడ్డు మార్గంలో కూడా చేరుకోవచ్చు.

కాణిపాకం వినాయకుడు


సత్యప్రమాణాల దేవుడుగా కాణిపాక వినాయకుడు ప్రసిద్ధి. బహుదా నది తీరంలో ఉన్న ఈ క్షేత్రంలో విఘ్నేశ్వరుడు బావిలో ఉద్భవించినట్టు స్థలపురాణం చెబుతోంది. వరసిద్ధి వినాయకునిగా పూజలందుకుంటున్న ఇక్కడి స్వామివారి విగ్రహం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందనీ, అందుకు సాక్ష్యం స్వామివారికి గతంలో అలంకరించిన కవచాలు ఇప్పుడు చాలకపోవడమేననీ ఆలయ వర్గాలు చెబుతున్నాయి.
ఎలా వెళ్ళాలంటే...

తిరుపతి నుంచి సుమారు 68 కి.మీ. దూరంలో కాణిపాకం ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

చిత్తూరు జిల్లాలో సందర్శనీయమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, కోదండరామస్వామి ఆలయం, కపిలేశ్వరస్వామి ఆలయం, ఇస్కాన్‌ మందిరం, తిరుచానూరు పద్మావతి అమ్మివారు, అగస్తీశ్వర స్వామి ఆలయం (తొండవాడ) కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం (శ్రీనివాస మంగాపురం), రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయం ( కార్వేటినగరం), అప్పలాయగుంట వేంకటేశ్వర ఆలయం, సదాశివ కోన శివాలయం, కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం (నారాయణవనం), మత్స్యావతార వేంకటేశ్వర స్వామి ఆలయం (నాగలాపురం), కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయం (బుగ్గ), కరిమాణిక్య స్వామి ఆలయం (నగరి), పల్లికొండేశ్వరస్వామి (సురుటుపల్లె), సిద్ధేశ్వరస్వామి ఆలయం ( తలకోన) వీటిలో కొన్ని.
కడప జిల్లాలో...

ఏకశిలానగరం .. ఒంటిమిట్ట


కడప జిల్లా ఒంటి మిట్టలోని కోదండ రామస్వామి ఆలయం రాష్ట్రంలోని పురాతనమైన రామాలయాల్లో ఒకటి. మరెక్కడా కనిపించని విధంగా- శ్రీరాముడు, సీతాదేవి, లక్షణుడు ఒకే శిలపై ఈ ఆలయంలో కొలువై ఉంటారు. అందుకే దీన్ని ‘ఏకశిలానగరం’ అని పిలుస్తారు. అంతేకాదు, హనుమంతుడు లేని శ్రీరామాలయం కూడా ఇదే. పోతన తన భాగవతాన్ని ఒంటిమిట్ట కోదండ రాముడికి అంకితం ఇచ్చినట్టు చెబుతారు. నవ్యాంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తరువాత, సీతారామ కల్యాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒంటిమిట్టలో అధికారికంగా నిర్వహిస్తోంది.
ఎలా వెళ్ళాలంటే...

కడప నుంచి ఒంటిమిట్ట 65 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

తిరుమలేశుని తొలిగడప


దేవునికడపను (లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం) తిరుమల వెంకటేశునికి తొలి గడపగా వ్యవహరిస్తారు. దక్షిణాది రాష్ట్రాల భక్తులు తిరుమలకు కడప మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఇది తిరుమలకు దక్షిణ ద్వారమైంది. ఉగాది పర్వదినాన ముస్లిం మహిళలు లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సారె సమర్పించడం విశేషం.
ఎలా వెళ్ళాలంటే...

కడప పట్టణానికి రెండు కి.మీ. దూరంలో దేవుని కడప ఉంది.

రామబాణం మలచిన మారుతి


కడప జిల్లా వేంపల్లె సమీపంలోని గండి గ్రామం మహిమాన్వితమైన ఆంజనేయ క్షేత్రం. ఇక్కడి హనుమాన్‌ విగ్రహాన్ని శ్రీరామచంద్రుడు తన బాణం మొనతో స్వయంగా మలిచాడని చెబుతారు. రెండు కొండల మధ్య ఉన్న గండిలోంచీ ప్రవహిస్తున్న పాపఘ్ని నది సమీపంలో ఈ ఆలయం ఉంది.
ఎలా వెళ్ళాలంటే...

వేంపల్లి గ్రామానికి సుమారు 7 కి.మీ. దూరంలో ఈ ఆలయం ఉంది. కడప, రాయచోటి తదితర ప్రాంతాలనుంచి వేంపల్లికి బస్సులున్నాయి.
అనంతపురం జిల్లాలో...

కదిరీ నరసింహుడా...


అనంతపురం శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పురాణ ప్రసిద్ది చెందిన వైష్ణవ క్షేత్రం. రాష్ట్రంలో అత్యంతి ప్రసిద్ధి చెందిన నవ నరసింహాలయాలలో ఇది ఒకటి. ప్రహ్లాద సమేతంగా నరసింహస్వామి ఆలయం మరెక్కడా లేదు. ఈ స్వామి స్వయంభువుడు అనీ, భక్త ప్రహ్లాదుని ప్రార్థన మన్నించి శ్రీ మహావిష్ణువు నరసింహరూపంలో వెలసిన క్షేత్రమనీ ఆలయ చరిత్ర చెబుతోంది.
ఎలా వెళ్ళాలంటే...

ధర్మవరం నుంచి 74కి.మీ. దూరంలో కదిరి ఉంది. తిరుపతి, ధర్మవరం, అనంతపురం, బెంగుళూరు, విజయవాడ ప్రాంతాలకు బస్సు సదుపాయం ఉంది.

కసాపురం హనుమంతుడు

జిల్లాలోని కసాపురంలో క్రీస్తుశకం పదిహేనవ శతాబ్దంలో విజయనగర పాలకుడు శ్రీవ్యాసరాయలు ప్రతిష్ఠించిన హనుమంతుడిని నెట్టికంటి ఆంజనేయస్వామి అంటారు. పూర్వం ఇక్కడ నెట్టికంటి అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం కాలగర్భంలో కలిసిపోయినా, ఆంజనేయస్వామి ఆలయం మాత్రం నిలిచి ఉంది. హిందువులేగాక ఇతర మతస్థులు కూడా ఈ స్వామిని కొలుస్తారు.
ఎలా వెళ్ళాలంటే...

గుంతకల్లు పట్టణానికి నాలుగు కి.మీ. దూరంలో కసాపురం ఉంది. గుంతకల్లులో రైల్వే స్టేషన్‌ ఉంది. జిల్లాలోని ప్రధాన ప్రాంతాలనుంచి రోడ్డు మార్గంలో కూడా కసాపురం చేరుకోవచ్చు.
వసతి

యాత్రికులు బస చేయడానికి నూట ఇరవై గదులు, పది కాటేజీలు ఉన్నాయి.

సత్యసాయిధామం పుట్టపర్తి


కులమతాలకు అతీతమైన ప్రదేశం అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి. శ్రీ సత్యసాయిబాబా ఆధ్యాత్మిక కార్య క్షేత్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయాన్ని సుమారు నూట ఇరవై దేశాలకు చెందిన భక్తులు వస్తూ ఉంటారు.
ఎలా వెళ్ళాలంటే...

అనంతపురం జిల్లా కేంద్రానికి సుమారు 88 కి.మీ. దూరంలో పుట్టపర్తి ఉంది. పుట్టపర్తిలో రైల్వే స్టేషన్‌ కూడా ఉంది.
మరికొన్ని

అనంతపురం నగర శివారులోని ఇస్కాన్‌ మందిరం, చింతల వెంకటరమణ స్వామి దేవాలయం (తాడిపత్రి), బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయం (తాడిపత్రి), పెన్నహోబిలం నరసింహస్వామి దేవాలయం, కంబదూరు మల్లేశ్వరాలయం, హేమావతి సిద్ధేశ్వరాలయం కూడా ఈ జిల్లాలో చూడదగిన మరికొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలు.
కర్నూలు జిల్లాలో...

జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం


నల్లమల అడవుల్లోని శ్రీశైల మల్లికార్జున స్వామి క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా బాసిల్లుతోంది. అంతేకాదు దేశంలోని అష్టాదశ శక్తి పీఠాల్లో ఇక్కడి భ్రమరాంబికా దేవి ఆలయం ఒకటి. శ్రీశైలం చుట్టుపక్కల దర్శించాల్సిన ప్రదేశాలెన్నో ఉన్నాయి. త్రిఫలేశ్వరి వృక్షం, పాతాళగంగ, శిఖరేశ్వరం, హటకేశ్వరం, పాలధార, పంచదార, ఇష్ట కామేశ్వరి ఆలయం, ఆది శంకరులు తపస్సు చేసిన ప్రదేశం, సాక్షి గణపతి ఆలయం, అక్కమహాదేవి గుహలు, పంచమఠాలే వీటిలో కొన్ని.
ఎలా వెళ్ళాలంటే...

కర్నూలు నుంచి ఆత్మకూరు, దోర్నాల మీదుగా 175 కి.మీ., హైదరాబాద్‌ నుంచి దిండి, దోమలపెంట మీదుగా 20 కి.మీ., అమరావతి, విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చే పర్యాటకులు దోర్నాల చేరుకొని అక్కడి నుంచి 47 కి.మీ. ప్రయాణించి శ్రీశైలం చేరుకొవచ్చు.

జ్వాలా నరసింహుడు కొలువు అహోబిలం


ప్రకృతి సంపదకు నిలయమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న అహోబిలం శ్రీ జ్వాలా నరసింహస్వామి సన్నిధానం సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం. పదహారవ శతాబ్దంలో ప్రతాపరుద్రుడి కాలంలో నిర్మించిన దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరద నరసింహ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలున్నాయి. ఈ ఆలయాల దర్శనానంతరం నల్లమల అడవిలో సుమారు ఎనిమిది కి.మీ. ప్రయాణం చేస్తే ఎగువ అహోబిలం చేరుకోవచ్చు. కొండపై వెలసిన జ్వాలా నరసింహ స్వామిని దర్శించుకోవచ్చు.
ఎలా వెళ్ళాలంటే...

నంద్యాల నుంచి ఆళ్లగడ్డ మీదుగా 65 కి.మీ. దూరంలో అహోబిలం ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

యాగంటి ఉమాహేశ్వరుడు


యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య స్థాపకులు హరిహరరాయలు, బుక్కరాయలు కాలంలో నిర్మించారు. ఆలయానికి ముందు అగస్త్య మహాముని కొలను దర్శనమిస్తుంది. ఆలయానికి సమీపంలోని శంకర గుహలో వీర బ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసి కాలజ్ఞానంలో కొన్ని భాగాలు రచించారని ప్రతీతి. ఈ ఆలయం పక్కనే గుహలో శ్రీ వేంకటేశ్వరస్వామి గుడి ఉంది.
ఎలా వెళ్ళాలంటే...

నంద్యాలకు సుమారు 48 కి.మీ. దూరంలో యాగంటి ఉంది.

రాఘవేంద్రుడి బృందావనం


ద్వైత సిద్ధాంతాన్ని ప్రవచించిన మధ్వాచార్య పరంపరలో సుప్రసిద్ధుడు రాఘవేంద్రస్వామి. ఆయన 1671లో తుంగభద్ర నదీ తీరాన మంచాలమ్మ దేవత సన్నిధిలోని బృందావనంలో జీవ సమాది అయ్యారు. ఆనాటి నుంచి మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ప్రాచుర్యం పొందింది.
ఎలా వెళ్ళాలంటే...

కర్నూలుకు 90 కి.మీ. దూరంలో మంత్రాలయం ఉంది. మంత్రాలయం రోడ్డు రైల్వే స్టేషన్‌ అక్కడికి 18 కి.మీ. దూరంలో ఉంది.

నిరంతర జలధార మహానంది


వర్షాకాలమైనా... మండు వేసవి అయినా.. ఒకే పరిమాణంలో నిరంతర ప్రవాహ ప్రవహించే కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి ఆలయం నంద్యాలకు సమీపంలో ఉంది. మహానంది గర్భాలయం దిగువ భాగం నుంచి రుద్రగుండంలోకి ఈ నీటిధార చేరుతోంది. మహానందీశ్వరునితో పాటు సమీపంలోని గరుడ నంది, వినాయక నందిలను కూడా దర్శించుకోవచ్చు.
ఎలా వెళ్ళాలంటే...

నంద్యాల నుంచి 18 కి.మీ. దూరంలో మహానంది ఉంది.

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment