వృక్ష దేవతలు | Vruksha Devathalu | Devata Vrukshalu Vaidya Rahasyalu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhakti pustakalu
వృక్ష దేవతలు 
 Vruksha Devatalu
Rs 45/-

పవిత్ర వృక్షాలు
రచన: జే.వేణీమాధవి.

సనాతన హిందూ సాంప్రదాయాలు, ఆచారాలు ఒక ఉత్తమ జీవన విధానాన్ని ప్రతిభింబిస్తాయి. మన పండుగలు మన ఋతువులు, వాతావరణ మార్పులు మరియు పరిసర ప్రకృతితో ముడిపడి వున్నాయి అనటం మనందరి ప్రత్యక్షానుభవం. రామాయణ భారత పురాణాల్లోని వనాల వర్ణనలు అప్పటి పుష్కలమైన వన సంపదను గురించి తెలుపుతున్నాయి. ఇప్పుడవి క్రమంగా కనుమరుగై పోతున్నాయి. ఒకప్పటి మన దేవాలయాలు పుణ్య క్షేత్రాలు కూడా అడవులు, పర్వత శిఖరాలు, నదీ తీరాలు మరియు సంఘమ తీర్ధాల వంటి విశిష్టమైన ప్రదేశాల్లో నిర్మించేవారు. అక్కడ పరిసర భౌగోళిక స్థితిగతుల ననుసరించి అయస్కాంత శక్తి కేంద్రీకృతమై వున్నట్లు అధ్యయనాల్లో కనుగొనటం జరిగింది.

ఇక మానవ నిర్మిత దేవాలయంలోని విశిష్టత, దాని యొక్క స్థల విశేషము, మంత్ర శక్తి, తంత్ర శక్తి, యంత్ర శక్తుల వల్ల చైతన్యవంతమవటం జరుగుతుంది. ఇవే కాక అక్కడి స్థల వృక్షాలు మరియు ఆయా దేవతలకు సంబంధించిన దివ్య వృక్షాల వల్ల కూడా అక్కడి చైతన్యం ఉత్తేజితమౌతుంది. ప్రతి దేవతకూ ప్రీతి పాత్రమైన పత్రాలు, పుష్పాలు, ప్రసాదాలు, వర్ణాలు, పూజా విధులు మొదలగునవి వుండటం మనకు తెలిసిన విషయమే. వారికి ఇష్టమైన పత్ర మరియు పుష్ప జాతుల వృక్షాలు ఆ దేవాలయ పరిసర ప్రాంతాల్లో విరివిగా వున్నప్పుడు ఆ చుట్టు ప్రక్కల ప్రదేశ మంతా శక్తిమయమైపోతుంది. ఆ క్షేత్రంలో అడుగిడినంత మాత్రాన్నే భక్తులకు దివ్యానుభూతులు కలుగుతుంటాయి. ఇది మన ప్రాంతాల్లోని తిరుమల, శ్రీశైల, యాదగిరిగుట్ట, శ్రీకాళహస్తి, అన్నవరం, భద్రాచలం వంటి విశిష్ట క్షేత్రాల్లో ప్రత్యక్షంగా చూస్తుంటాము. దేవతలు ఏ వృక్షాలలో నివాసముంటారో పురాణాల్లోని వివిధ సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. వీటన్నింటినీ సమగ్రంగా ఒక దగ్గర కూర్చి బెంగుళూరుకు చెందిన డా||ఎల్లప్పా రెడ్డి గారు ఒక పుస్తక రూపంలో మనకందించారు. దానినే ‘పవిత్ర వృక్షాలు’ అన్న పేరిట టి.టి.డి. వారు అనువదించి ప్రచురించడం జరిగింది. నేను వాటికి మరిన్ని విషయాలను, వివరాలనూ మొక్కల చిత్రాలతో జతపరచి మరింత మందికి అందేలా వాటిని www.vedicvanas.com అన్న పేరిట వెబ్ సైట్ లో పొందుపరచి అందరికీ అందుబాటులోకి తీసుకు రావటం జరిగింది.

నవగ్రహాల దగ్గరనుంచి సప్తర్షులు, వివిధ దేవతలకు సంబంధించిన పత్రాలు పుష్పాలు వున్నాయి. వీటిని ఆయా దేవాలయాల్లో నాటటం సర్వ శ్రేయోదాయకం. మనము అడవుల్లోని దివ్యత్వాన్ని మన వూరిలోకి తీసుకు రాలేకపోయినా కనీసం ఆయా దేవతలకు సంబంధించిన పర్వ దినాలకు సరిపడినన్ని నాటగలిగినా విశేషమే. ఉదాహరణకు: వినాయకుడి ఆలయానికి అనుబంధంగా వినాయక నవరాత్రులలో సరిపడినన్ని ఏక వింశతి (21) పత్రాలు, శివునికి లక్ష బిల్వార్చనకు సరిపడినన్ని బిల్వ వృక్షాలు, విష్ణువుకి నిత్యం తులసి మాల, తామర పుష్పాలు, అమ్మవారికి పరిమళ భరిత పుష్పాలు, హనుమంతునికి తొమలపాకులు, అరటి నిమ్మ పళ్ళు ఇలా ఒక్కొక్కరికి ఇష్టమైన పువ్వులు ఆకులను ఆ పరిసరాలలో అంటే దేవాలయ భూముల్లో స్వయంగా పెంచి తాజాగా సేకరించి ఇవ్వ గలిగిన రోజు అక్కడి దైవం మరింత ప్రసన్నుడై భక్తులను కోర్కెలను తీరుస్తాడనడంలో ఎటు వంటి సందేహమూ లేదు. ఒక దేవాలయాన్ని నిర్మించ దలచి నప్పుడు తోటలు వనాలకు కూడా సరైన ప్రాధాన్యతను ఇవ్వడం అత్యవసరం.

ఈ విశ్వంలో మనం ఏకాకులం కాదు, ఈ భూమిపై నున్న ప్రతి వ్యక్తి ఖనిజ, జంతు, వృక్ష సామ్రాజ్యాలతోనే కాకుండా మన సౌర కుటుంబం ఇంకా నక్షత్ర సమూహాలతో అనుసంధానం చెంది వుంటామని వాస్తు, జాతక శాస్త్రాలలో చూస్తున్నాము. మరి దేవతలకి సూచించి నట్లే మనకి సంబంధించిన వృక్షాలు కూడా వుండటం విశేషం. అవే నక్షత్ర వనం మరియు రాశి వనం. 27 నక్షాత్రాల్లో ఒక్కోదానికి ఒక్కో వృక్షం మరియు ప్రతి రాశికి ఒక్కో వృక్షం అంటే 12 వృక్షాలు సూచించబడ్డాయి. వీటిని మనకి అనువైన చోటుల్లో వేసుకొని ఆరాధించటం వల్ల భౌతిక మానసిక ఆధ్యాత్మికోన్నతికి తోడ్పడుతుందని చెప్పబడింది. ఇవన్నీ కూడా సవివరంగా అంతర్జాలంలో పొందు పరచటం జరిగింది.

ఒక్కో వృక్షం యొక్క మరిన్ని విశిష్టతల గురించి ధారావాహికంగా దేవాదాయ ధర్మాదాయ వారి ఆధ్వర్యంలో వచ్చే ‘ఆరాధన’ అన్న మాస పత్రికలో గత నాలుగు సంవత్సరాలుగా వ్రాస్తున్నాను. అవన్నీ కూడా వేదిక్ వనాస్ లో లభ్యమౌతున్నాయి. నేను వేదిక్ ఎకాలజీ మీద గత దశాబ్ద కాలంగా అధ్యయనం చేస్తున్నాను.

కేవలం మన పురాణాలు దేశానికే కాక ఇతర దేశాల్లో వారి వారి గ్రంధాల్లో పొందుపరచిన దివ్య వృక్షాల గురించిన వివరాలు వున్నాయి. మనకి నక్షత్ర వనం వున్నట్లుగానే పాశ్చాత్యులకు కూడా వారు పుట్టిన తారీకు ననుసరించి పువ్వులు, చెట్లు సూచించడమైనది. బైబిలు, ఖురాన్లలోనూ వారి వారి ప్రాంతాలకి సంబంధించిన దివ్య వృక్షాలను ప్రస్తావించడం విశేషం. వారు వాటిని సంరక్షించి వాటిని ఎంతో పవిత్రతతో ఆరాధించడం గమనార్హం. నమ్మక మేదైనా ప్రకృతి, పరిసరాల విషయంలో మన పుర్వీకులందరూ దాని విశిష్టతను గుర్తించి మానవ మరియు భూ శ్రేయస్సును కోరి, వారికనువైన పదతుల్లో రక్షించిన వైనం హర్షించి అనుసరించదగినది.

ఇలా దివ్య వనాలే కాకుండా విద్యాలయాల్లో సరస్వతీ వనం, బటర్ ఫ్లై పార్కులు, ఆరోగ్య శాలల్లో ఆయా వైద్యానికి సంబంధిత మొక్కలు, ఆఫీసుల్లో వొత్తిడిని తగ్గించే రకాలు, ఉద్యానవనాలు తోటలు మొదలగు ఆవరణల్లో పక్షులు కీటకాలకు ఆసరానిచ్చే మొక్కలు అంటే ఎకో – ఫ్రెండ్లీగా తోటలను మలచే విధానాల గురించి సలహాలు, సూచనలు ఇవ్వడం చేస్తుంటాను. బెంగుళూరు హైదరాబాదు నగరాల్లోని పలు చోట్ల ఇటువంటి వనాలను అబివృద్ది చేయటం జరిగింది.

ఈ విషయాలపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు దిన పత్రికల్లో వ్యాసాలను ఇవ్వడం జరిగింది. పాఠశాలలు, కళాశాలల్లో కార్యక్రమాలు నిర్వహించడం చేస్తుంటాను.

కొద్దిగా అవగాహనతో మన పరిసరాలను అర్ధవంతంగా తీర్చి దిద్దుకోవటం మన చేతుల్లోనే వుంది. సమస్త జీవులకు శ్రేయస్కరమైన ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలనేదే నా ఈ చిరు ప్రయత్నం. వృక్షం నా దైవం – ప్రకృతి నా మతం – భూమి యొక్క శ్రేయస్సే నా ధ్యేయం!
----------------------------
దేవతా వృక్షాలు వైద్య రహస్యాలు
Devata Vrukshalu 
Vaidya Rahasyalu
Lolla Ramji
Rs 300/-
వృక్ష దేవతలు

హిందువులు అన్ని జీవుల్లోను దేవుణ్ని చూశారు. అందువల్లనే ఆవులు వంటివి పూజనీయ జంతవులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ని చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు.

నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో బాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. కాగా చెట్లకు మనుషుల మాదిరి ఆనందం, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. అది ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమయింది. భారతీయ రుషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు. హిందువులు పవిత్ర మైన వృక్ష జాతులుగా పేర్కొనే వాటిలో తులసి, రావి (అశ్వత్థం), వేప, మారేడు, మర్రి, అశోక, ఉసిరి మరి కొన్ని ఉన్నాయి. దేవతా వృక్షాలుగా పేర్కొనే వాటిలో కొన్నిటికి అద్భుతమైన ఔషధ శక్తులు ఉండడం విశేషం. కొన్ని దేవతా వృక్షాల విశేషాలు తెలుసుకుందాం.

తులసి
తులసి పవిత్రమైనదని అందరికీ తెలుసు. ప్రతి ఇంటిలో తులసి ఉండాల్సిన అవసరముంది. తులసి కథ అందరికీ తెలిసిందే. విష్ణుమూర్తికి తులసి ప్రీతికరమని,దానితోఆయనకు పూజ పుణ్యప్రదమనేది అందరికీ తెలిసిందే. తులసిని పవి త్రంగా ఉన్నప్పుడే ముట్టుకోవచ్చని, అనవసరంగా తుంచరాదనే నియమాలు కూడా ఉన్నాయి. తులసి పవిత్రతని చెప్పే ఒక శ్లోకం ఉంది. అది

యన్మూలే సర్వ తీర్థాని, యన్మధ్యే సర్వ దేవతా:
యదగ్రే సర్వ వేదాశ్చ, తులసీం త్వాం నమామ్యహం

మూలంలో సర్వ తీర్థాలు, మధ్య భాగంలో సర్వ దేవతలు, అగ్రభాగంలో సర్వ వేదాలు గల తులసి కి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. తులసికి ఎన్నో ఔషధ గుణాలున్నాయన్నవిషయం తెలిసిందే. తులసికి మనస్సును ఉద్వేగాలను, శరీరాన్ని పరిశుద్ధం చేసే శక్తి ఉందని చెబుతారు. అందువల్లనే యోగులు, సాధువులు వంటి వారు తులసి మాలను మెడలో ధరిస్తుంటారు. ఇతరుల చెడు భావాలను ఎదుర్కొని దూరం చేసే శక్తి తులసికి ఉంది. అంత ఎందుకు తులసిని స్పృశించడమే మనలను శుద్ధి చేస్తుందని చెబుతారు.

రావి
దేవతా వృక్షాల్లో రావి(అశ్వత్థం)ఒకటి. అశ్వత్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. రావి చెట్టులో త్రిమూర్తులు ఉన్నారని చెప్పే శ్లోకం కూడా ఉంది. అది

మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి
అగ్రత: శివ రూపాయ, వృక్ష రాజాయతే నమ:

ఈ వృక్షం మూలం వద్ద్ద బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రంలో శివుడు ఉన్నారని దీని అర్థం. ఇక రావి చెట్టు విష్ణువు రూపమని చెబుతారు. అందువల్లనే అశ్వత్థ నారాయణుడు అనే పేరు కూడా ఆయనకు ఉంది. మొహంజొదారో లో దొరికిన ఒక ముద్రలో సింధులోయ నాగరికతకు చెందిన ప్రజలు అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తున్న దృశ్యం బయటపడింది. దేవదానవ యుద్ధంలో దేవతలు ఓడిపోయిన ఒక సందర్భంలో విష్ణువు అశ్వత్థ వృక్షంగా మారాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన ఆ చెట్టు రూపం దాల్చినందున దానికి పవిత్రత వచ్చిందని చెబుతారు. కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని కొందరు చెబుతారు. స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలుకు గాని దాని కొమ్మలకు గాని ఎర్ర వస్త్రం గాని, ఎర్ర దారం గాని కట్టే ఆచారం ఉంది. ఏ చెట్టును నరకడమైనా పాపమే కాగా అశ్వత్థ వృక్షాన్ని నరకడం మహాపాపమని ఒక పురాణ వచనం. బుద్ధునికి ఈ చెట్టు కిందే జ్ఞానోదయం అయిందని చెబుతారు. అందువల్ల వారు దానిని బోధి వృక్షమని, జ్ఞాన వృక్షమని వ్యవహరిస్తారు.

వేప
వేపచెట్టు లక్ష్మీ దేవి స్వరూపమని చెబుతారు. అందువల్లనే విష్ణు రూపమైన రావి చెట్టుకు, లక్ష్మీ రూపమైన వేప చెట్టును ఒకే చోట పాతి వాటికి వివాహం చేసే ఆచారం కూడా ఉంది. ఉత్తర హిందూస్థానంలో వేప చెట్టును నీమారి దేవిగా వ్యవహరిస్తారు. కొన్ని శుద్ధి కార్యక్రమాల్లో వేప రెమ్మలను ఉపయోగిస్తారు. వేపలో ఉన్న ఔషధ గుణాలు తెలిసినవే. వేప‌ చెట్టు గాలే శరీరానికి మంచిదని అంటారు. దాని ఆకులు క్రిమి సంహారిణిగా ఉపయోగిస్తాయి. దాని బెరడు కొన్ని రకా ల చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది.

మారేడు
మారేడు పత్రాలనే సంస్కృతంలో బిల్వ పత్రాలంటారు. మారేడు శివునికి ప్రీతికరం. అందుకే ఆయనకు లక్ష పత్రి పూజలో కూడా బిల్వాలనే వాడతారు. అది దేవతా వృక్షమై నందునే దానిని కొన్ని రోజులలో, తిథులలో కోయరాదనే నిబంధన కూడా ఉంది. కోసేటప్పుడు కూడా ఒక శ్లోకం చదివి నమస్కరించి కోయాలంటారు.
ఆ శ్లోకం
అమృతోద్భవ శీవృక్ష మహాదేవ ప్రియ: సదా
గృహ్ణామి తవ పత్రాణి శివపూజార్థమాదరాత్‌

మారేడుకు అమృతం నుంచి ఉద్భవించిందని, శ్రీ వృక్షమని పేర్లు. అలాగే ఎప్పుడూ శివునికి ఇష్టమైనది. అటువంటి నీ పత్రాలను శివ పూజ నిమిత్తం కోస్తున్నాను అని దీని అర్థం. మారేడు లక్ష్మీ దేవికి ప్రీతికరం. మూడుగా కలసి ఉన్న బిల్వ దళాలను శివుని పూజకు వాడుతారు. ఈ మూడు పత్రాల దళం శివుని మూడు కనులకు ప్రతీక అని భావిస్తారు. జైనులకు కూడా ఇది పవిత్ర వృక్షం. వారి గురువుల్లో ఒకరైన 23వ తీర్థంకరుడు భగవాన్‌ పరస్‌నాథ్‌జీ మారేడు వృక్షం కిందే నిర్వాణం (జ్ఞానోదయం పొందారని) భావిస్తారు. మారేడులో ఔషధ గుణాలు అధికం. కడుపులో మంటకు కారణమయ్యే ఎసిడిటీ వంటి సమస్యలకు, కొన్ని ఉదర సంబంధ వ్యాధులకు మారేడు చూర్ణం, మారేడు ఆకుల కషాయం పనికొస్తుంది.

జమ్మి
జమ్మి చెట్టు దేవతా వృక్షాల్లో ఒకటి. సంస్కృతంలో దీనిని శమీ వృక్షంగా పేర్కొంటారు. జమ్మి చెట్టును తాకడం కూడా పుణ్యప్రదమని చెబుతారు. జమ్మి చెట్టు గొప్పతనాన్ని వివరించే ఒక శ్లోకం కూడా ఉంది. అది

శమి శమయతే పాపం, శమి శత్రు వినాశిని
అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియ దర్శిని

శమి శత్రువులను నశింపజేస్తుందని, పాండవుల ఆయుధాలను మోసినదని, రామునికి ప్రియమైనదని దీని అర్థం. ఈ వృక్షం పైనే అజ్ఞాతవాసంలో పాండవులు తమ ఆయుధాలు దాచారు. అలాగే రాముడు లంకపై యుద్ధానికి వెళుతున్నపుడు ఈ వృక్ష అధిష్ఠాన దేవతే ఆయనకు విజయం సిద్ధిస్తుందని చెప్పినట్లు ఒక కథ అలాగే అగ్ని దేవుడు ఒక పర్యాయం భృగు మహర్షి కోపం నుంచి తప్పించుకోవడానికి ఈ చెట్టులోదాగి ఉన్నాడని కథ. ఈ చెట్టు బెరడనును కుష్ఠు రోగం, గాయాలు, శరీరంపై వచ్చే వ్రణాలు వంటి వాటి చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ చెట్టు బెరడు పొడి గొంతు నొప్పి, ఆస్త్మా మరెన్నో రోగాల చికిత్సలో ఉపయోగపడుతుంది. గింజలు, రెమ్మలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించేందుకు, శ్వాసకోశ సంబంధ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తుంది.

ఉసిరి
ఉసిరిని శ్రీమహా విష్ణువు రూపంగా భావిస్తా రు. అందరికీ తెలిసిన వన భోజనాలు ఉసిరి చెట్టు వనంలో లేదా ఉసిరి చెట్టు ఉన్న వనంలో చేయాలంటారు. కార్తీక మాసంలో ఈ చెట్టు ను శ్రీమహా విష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తుంటారు. ఉసిరి కాయల మీద వత్తులు పెట్టి వెలిగించే సంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదం లో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం.

మేడి
మేడి చెట్టుకింద దత్తాత్రేయుల వారు కూర్చుని ఉంటారు. త్రిమూర్త్యాత్మకుడు ఎప్పుడూ ఏ చెట్టు నీడనుంటాడో అది పవిత్రమైనది కాక మరేమవుతుంది. అది దేవతా వృక్షమే. ఎండిన మేడి పళ్లను ఆరోగ్యం కోసం కూడా వాడతారు.

మర్రి
మర్రి చెట్టును కూడా త్రిమూర్త్యాత్మక స్వరూపంగా భావిస్తారు. ఈ చెట్టును చాలా సంస్కృతుల్లో జీవానికి, సంతాన సాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు. అందువల్లనే సంతానం లేనివారు మర్రి చెట్టును పూజించే ఆచారం ఉంది. అలాగే దీనిని ఏ సమయంలోనూ నరికి వేయరాదన్నది పురాణాలలో పేర్కొన్నారు. సర్వ లోకాలకూ గురువుగా భావించే జ్ఞాన స్వరూపుడైన మేధా దక్షిణామూర్తి మర్రి వృక్ష ఛాయలోనే ఉంటాడు. పశ్చిమ బెంగాల్‌ హౌరాలోని ఇండియన్‌ బొటాని కల్‌ గార్డెన్‌లో ఉన్న మర్రి చెట్టు ప్రపంచంలోనే అతి పెద్దది.

అశోక
ఈ చెట్టును కామ దేవునికి ప్రతీకగా భావిస్తారు. ఈ పువ్వులను ఆలయ అలంకరణలో ఉపయోగిస్తారు. బుద్ధుడు అశోక వృక్షం కిందే జన్మించాడని చెబుతారు. అందువల్ల వీటిని బౌద్ధారామాల్లో ఎక్కువగా నాటుతుంటారు. అశోక వృక్షం కూడా పవిత్ర వృక్షం ఒకటి. పుష్పాల నుంచి తీసే ఎసెన్స లో ఈ పుష్పాలకు ప్రత్యేక స్థానం ఉంది.ఇది దట్టమైనాకులతో నిటారుగానిలబడే చిన్నది. ఇది పువాసన కల ఎరుపు రంగు పుష్పాలతో ఉంటుంది. ఏప్రిల్‌, మే నెల్లో ఈ చెట్టు పుష్పిస్తుంది. హిమాలయాల తూర్పు, మధ్య ప్రదేశ్‌ లోను, ముంబై పశ్చిమ తీర ప్రంతంలోనూ ఇది కనిపిస్తుం ది.అశోక అంటే సంస్కృతంలో శోకంలేనిది లేదా శోకాన్ని దూరం చేసేది అనేఅర్థాలు చెప్పుకోవచ్చు. దీనికి ప్రాంతీయ భాషల్లో పలు పేర్లు ఉన్నాయి.

మామిడి
మామిడి చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే. రామాయణం, మహాభారతం, ఇతర పురాణాల్లో దీని ప్రస్తావన ఉంది. ఈ మామిడిపండు పండుగా ప్రేమకు, సంతానసాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు. ఏ శుభ కార్యమైనా మామిడి ఆకు తోరణాలు కట్టకుండా ప్రారంభం కాదు. ఈ ఆకులకు ఎక్కువ మంది చేరిన చోట ఏర్పడే కాలుష్యాన్ని తొలగించే గుణం ఉందని కూడా చెబుతారు.

కొబ్బరి
కొబ్బరి చెట్టును కల్ప వృక్షంగా వ్యవహరిస్తారు. అన్ని దైవసంబందమైన కార్యాలనూ కొబ్బరికాయను కొట్టి ప్రారంభిస్తారు. పూర్ణ కుంభంలో పై నుంచేది కొబ్బరికాయనే. ఇక కొబ్బరికాయను శివ స్వరూపంగా దానిపై ఉన్నమూడు నల్ల మచ్చలను ఆయన త్రినేత్రాలుగా పేర్కొంటుంటారు. కొబ్బరికాయ నీరు మనుషులు తాకని స్వచ్చమైన జలమని నమ్ముతారు. అటువంటిది మరే పండు విషయంలోనూ లేదు, దేవతలకు కొబ్బరి నీటితో అభిషేకం చేయడం కూడా చేస్తుంటారు.

అరటి
అరటి చెట్టులోని ప్రతి భాగం ఏదో విధంగా మానవునికి ఉపయోగపడేదే. అరటి చెట్టును శుభ కార్యాసమయంలో ద్వారాలకు కడతారు. ఇక ప్రసాద వితరణకు ఈ ఆకులను ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల భోజనాలకు వీటిని ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లోకదలీ వ్రతం పేరుతో అరటి చెట్టుకు పూజచేస్తారు.

చందనం
చందనం చెక్క ఆరగదీయడం వల్ల వచ్చే చందనం నిత్య పూజలో ఒక భాగం కనుక దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందులో దానిని ఇచ్చే చందన వృక్షాన్ని దేవతా వృక్షంగా భావిస్తారు.

వెదురు
దేవునికి చెందిదేదైనా పవిత్రమైనదనే భావంతో కృష్ణుని వేణువు తయారైన వెదురును కూడా దేవతా వృక్షంగా భావిస్తుంటారు. హిందీలో బన్సూరి అంటే వేణువు. కృష్ణుడు చేతిలో వేణువు కలిగి ఉంటాడు కనుక ఆయనను బన్సీలాల్‌ అని కూడా పిలుస్తుంటారు.
--------------------
MVN. TULASIRAV.:
*జన్మనక్షత్రాన్ని అనుసరంచి పెంచాల్సిన వృక్షాలు - ఫలితాలు*

అశ్వని నక్షత్రము
అశ్వని నక్షత్ర జాతకులు విషముష్టి లేదా జీడి మామిడిని పెంచాలి, పూజించడం మంచిది. దీని వలన జననేంద్రియాల, చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ చెట్లని పెంచి పూజించడం ద్వారా సంతాన అబివృద్ది కూడా కలుగుతుంది.

భరణి నక్షత్రము
భరణి నక్షత్ర జాతకులు ఉసిరి చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ , ఉదర సంబంధిత, పైత్యం, పైల్స్ వంటి బాధల నుంచి ఉపశమనం పొందగలరు. అలాగే వీరికి క్రియేటివిటి ఎక్కువగా ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకొని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది

కృత్తిక నక్షత్రము
కృత్తిక నక్షత్రము అత్తి / మేడి చెట్టును పెంచాలి, పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షింపబడతారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యము కూడా చేకూరుతుంది. అలాగే చక్కటి వాక్చాతుర్యం, ఏదైనా చేయాలనీ సంకల్పిస్తే ఎటువంటి విమర్శలనైన తట్టుకొని నిలబడే శక్తి కలుగుతాయి.

రోహిణి నక్షత్రము
రోహిణి నక్షత్ర జాతకులు నేరేడు చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల చక్కెర వ్యాధి, నేత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడగలరు. అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం, సత్ప్రవర్తన వంటి లక్షనాలు కలుగుతాయి. వ్యవసాయం, వాటికి సంబందించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది.

మృగశిర నక్షత్రము
మృగశిర నక్షత్ర జాతకులు మారేడు, చండ్ర చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల ద్వారా గొంతు, స్వరపేటిక, థైరాయిడ్, అజీర్త.. వంటి సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది. ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్దికపరమైన చిక్కుల నుండి బయటపడగలరు.

ఆరుద్ర నక్షత్రము
ఆరుద్ర నక్షత్ర జాతకులు చింత చెట్టుని పెంచాలి. పూజించాలి. దీంతో గొంతు, స్వరపేటిక సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. అంతే కాకుండా విష జంతువుల నుంచి సమస్యలు ఎదురుకావు. వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది.

పునర్వసు నక్షత్రము
పునర్వసు నక్షత్ర జాతకులు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచాలి, పూజించాలి. దీంతో ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు క్షయ, ఉబ్బసం శ్వాసకోస బాధల నుంచి, రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడతారు. బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యంగా పాలకి లోటు ఉండదని చెప్పవచ్చు. జఠిల సమస్యలు వచ్చినా , చాకచక్యంతో మెలిగి బయటపడడానికి ఉపయోగపడుతుంది.

పుష్యమి నక్షత్రము
పుష్యమి నక్షత్ర జాతకులు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల నరాల సంబంధిత బాధలు నుంచి బయటపడతారు. శత్రువుల బారి నుంచి కూడా బయటపడతారు. రోగ, రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. స్త్రీలు సంతానవతులవుతారు.

ఆశ్లేష నక్షత్రము
ఆశ్లేష నక్షత్ర జాతకులు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచాలి, పూజించాలి. దీనివలన శ్వేత కుష్ఠు, చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. విపత్కార పరిస్థితుల్లో చాకచక్యంతో బయట పడటానికి కూడా ఉపయోగపడుతుంది.

మఖ నక్షత్రము
మఖ నక్షత్ర జాతకులు మర్రి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల ఎముకల సంబంధిత వ్యాధుల నుంచి, అనుకోని వ్యాధుల నుంచి బయటపడతారు. అలాగే భార్యభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండడానికి, తల్లిదండ్రులకు, సంతానానికి కూడా మేలు కలుగుతుంది. జీవితంలో వీరు తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి

పుబ్బ నక్షత్రము
పుబ్బ నక్షత్ర జాతకులు మోదుగ చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివలన సంతానలేమి సమస్య తీరుతుందని శాస్త్రం చెబుతోంది. అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు. ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడడానికి ఎటువంటి వ్యవహారాలలోనైన తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తర నక్షత్రము
ఉత్తర నక్షత్ర జాతకులు జువ్వి చెట్టుని పెంచి పూజించాలి. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడతారు. ఇతరులకు సహాయ సహకారాలను చేతనైనంతగా అందించడానికి. మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది

హస్త నక్షత్రము
హస్త నక్షత్ర జాతకులు సన్నజాజి, కుంకుడు చెట్లను పెంచాలి, పూజించాలి. దీని వలన ఉదర సంబంధిత బాధల నుంచి ఉపశమనం పొందుతారు. పరిస్థితులను తట్టుకొని అన్నిటికీ ఎదురీది విజయం సాధించడానికి, దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది.

చిత్త నక్షత్రము
చిత్త నక్షత్ర జాతకులు మారేడు లేదా తాళ చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వలన పేగులు, అల్సర్, జననాంగ సమస్యల నుంచి బయటపడతారు. ఎవరిని నొప్పించకుండా తెలివి తేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన చాకచక్యం కలగడానికి ఉపయోగపడుతుంది.

స్వాతి నక్షత్రము
స్వాతి నక్షత్ర జాతకులు మద్ది చెట్టును పెంచాలి, పూజించాలి. దీనివల్ల స్త్రీలు గర్భసంచి సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దూరంగానే వుంటాయి. రకరకాల విద్యలలోను రాణిస్తారు. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది.

విశాఖ నక్షత్రము
విశాఖ నక్షత్ర జాతకులు వెలగ, మొగలి చెట్లను పెంచాలి, పూజించాలి. దీని వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ప

రిష్కారమవుతాయి. ఎటువంటి పరిస్థితులనైన తట్టుకొని నిలబడడానికి, ముందు చూపు తో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి, వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది.

అనురాధ నక్షత్రము
అనురాధ నక్షత్ర జాతకులు పొగడ చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి, పరోపకారం చేయడానికి, విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా, పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి, ఆలోచనా శక్తి అబివృద్ది చెందడానికి ఉపయోగపడుతుంది.

జ్యేష్ఠ నక్షత్రము
జ్యేష్ఠ నక్షత్ర జాతకులు విష్టి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల కాళ్ళు, చేతుల సమస్యలు, వాతపు నొప్పుల బాధ తగ్గుతుంది. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయడానికి ఉపయోగపడుతుంది.

మూల నక్షత్రము
మూల నక్షత్ర జాతకులు వేగి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల పళ్ళకి సంబంధించిన, మధుమేహం, కొలస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణలో ఉంటుంది.

పూర్వాషాడ నక్షత్రము
పూర్వాషాడ నక్షత్ర జాతకులు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచాలి, పూజించాలి. దీనివల్ల కీళ్ళు, సెగ గడ్డలు, వాతపు నొప్పులు, జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.

ఉత్తరాషాడ నక్షత్రము
ఉత్తరాషాడ నక్షత్ర జాతకులు పనస చెట్టుని పెంచాలి, పూజించాలి. దీని వల్ల చర్మ సంబంధిత వ్యాధులు ఏర్పడవు. ఆర్దికపరమైన సమస్యలు తలెత్తవు. భూములకి సంబంధించిన వ్యవహారాలు బాగా కలసి వస్తాయి. సంతానపరమైన సమస్యలు ఉన్న వారికి అవి తొలగి వారు మంచి అభివృద్దిలోకి రావడానికి ఉపయోగపడుతుంది.

శ్రవణం నక్షత్రము
శ్రవణ నక్షత్ర జాతకులు జిల్లేడు చెట్టును పెంచాలి, పూజించాలి. దీని వల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయి. న్యాయం, ధర్మం పాటించేడానికి. కార్యజయం సిద్దించడానికి ఉపయోగపడుతుంది.

ధనిష్ఠ నక్షత్రము
ధనిష్ఠ నక్షత్ర జాతకులు జమ్మి చెట్టును పెంచాలి. పూజించాలి. దీనివల్ల మెదడుకి సంబంధించిన సమస్యలు ఏర్పడవు. అలాగే వీరికి తెలివి తేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది.

శతభిషం నక్షత్రము
శతభిషం నక్షత్ర జాతకులు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచాలి. పూజించాలి. దీనివల్ల శరీర పెరుగుదలకి సంబంధించిన, మోకాళ్ళ సమస్యల నుంచి బయటపడతారు. మంచి శరీర సౌష్టవం, చక్కటి ఉద్యోగం కొరకు, జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది.

పూర్వాభాద్ర నక్షత్రము
పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు మామిడి చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల కండరాలు, పిక్కలకి సంబంధించిన సమస్యలు తలెత్తవు. వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని పొందడానికి. కళలు, సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి, విదేశాలలో తిరిగే అవకాశం కొరకు, ఆర్ధిక స్థిరత్వం కొరకు, రాజకీయాలలో రాణించడానికి ఉపయోగపడుతుంది.

ఉత్తరాభాద్ర నక్షత్రము
ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వేప చెట్టుని పెంచాలి. పూజించాలి. దీనివల్ల శ్వాస కోశ బాధలు, కాలేయ సంబంధిత బాధల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి, ఉన్నత పదవులు, సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్ఠలు కొరకు, వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండడం కొరకు ఉపయోగపడుతుంది.

రేవతి నక్షత్రము
రేవతి నక్షత్ర జాతకులు విప్ప చెట్టుని పెంచాలి, పూజించాలి. దీనివల్ల థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. మంచి విజ్ఞానం, విన్నూతమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు, కీలక పదవులు, సంతాన ప్రేమ , గౌరవం అప్యాయతలు వృద్ది చెందడానికి, జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది.

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

1 comment: