విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనం  | Vigneswara Pooja Punya Vachanam | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనం 
 Vigneswara Puja PunyaVachanam
Rs 30/-


మది నిండా...మహా గుణాధిపతి

గణపతి అందరి దైవం.. అందరికీ ఆనందాన్ని పంచే దైవం. విఘ్నాల్ని తొలగించి, విజయాల్ని అనుగ్రహించే దైవం. 
వినాయక చవితి నాడు పూజ చేసుకొని, వ్రతకల్పం చదువుకొని.. అక్షతలు వేసుకోవడం, వినాయకుడి దీవెనలు అందుకోవడం ఇంటింటా జరిగేదే! 
గణపతి నవరాత్రులంటే.. తొమ్మిది రోజుల పాటు కాలక్షేపం కోసం నిర్వహించే ఉత్సవాలు కాదు. హోరెత్తించే పాటలతో, విచిత్ర నృత్యవిన్యాసాలతో కొనసాగే తంతూకాదు. మనదైన ఘన వారసత్వాన్ని కొనసాగించడానికి ఉపకరించే సామాజిక, సామూహిక ఆధ్యాత్మిక సాధనా ప్రక్రియ. ‘తమసోమా జ్యోతిర్గమయ’.. అంటూ చీకటి నుంచి వెలుగు వాకిళ్ల వైపు సాగడానికి ఈ పండగను ఊతంగా చేసుకోవాలి.


తొలిపూజలందుకునే ఇలవేలుపుగా గణపతికి పేరు. ఈయనను దేవ, మానవ గణాలకు అధినాయకుడిగా భావిస్తారు. ఇతిహాసాలు ‘గణానాం త్వ గణపతిం హవా మహే’ అని పూజల్లో ఆయనకు అగ్రస్థానమిచ్చాయి. శివ, విష్ణు కల్యాణాల్లో సైతం తొలుత గణపతిని కొలవడం ఆనవాయితీ. ఇళ్లల్లో జరిగే సాధారణ నోముల నుంచి రాజుల అశ్వమేధయాగాల వరకు మొదటి పూజ ఆయనదే. రుగ్వేదంలోని ‘కవింకవీనామ్‌...’ అనే రుక్కు వినాయకుణ్ణి విఘ్నాధిపతిగానే కాకుండా చదువుల గురువుగా కూడా వర్ణించింది. ‘కోరిన విద్యలకెల్ల ఒజ్జయై యుండెడి పార్వతీతనయ, ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌’ అని ప్రార్ధించింది.

గణపతి అంటూ ఆ అధినాయకుడిని అందరూ ఆహ్వానిస్తారు. అలా స్వాగతించకుండా ఎవరూ ఏ శుభకార్యానికీ శ్రీకారం చుట్టరు. నిజానికి గణపతితో భక్తులకు ఇంత సాన్నిహిత్యం ఏర్పడడానికి గణాలే కారణం. ఇక్కడ గణం అంటే ఇంద్రియం అని అర్థం. శరీరం, కర్మ, జ్ఞానేంద్రియాలు, మనసు మనిషి మనుగడకు మూలాలు. పంచభూతాల ఏకత్వం వల్ల శరీరం ఏర్పడింది. తమో గుణం వల్ల స్థూల శరీరం, రజో గుణం వల్ల కర్మేంద్రియాలు, సత్వ గుణం వల్ల జ్ఞానేంద్రియాలు ఉద్భవించాయని చెబుతారు. నోరు, చేతులు, కాళ్లు వంటివి కర్మేంద్రియాలు. అవి మాట, పని వంటి వాటికి ఉపయోగపడతాయి. చెవులు, చర్మం, నాలుక, నాసికల... జ్ఞానేంద్రియాలు... వినడానికి, తెలుసుకోడానికి, చూడడానికి, రుచి, వాసన గ్రహించడానికి అవసరమవుతాయి. శరీరం రథం. ఇంద్రియాలు గుర్రాలు. బుద్ధి సారథి. కోరికల నిలయమైన మనసు విషయ సుఖాల కోసం జీవన రథాన్ని పెడదోవ పట్టిస్తుంది. అప్పుడు బుద్ధి చురుగ్గా ఉండాలి. ఆ రథాన్ని రహదారిపైకి మళ్లించాలి. ఇలా జరగాలని ...ఇంద్రియాలపై విజయం సాధించాలని చేసే పూజలే వినాయకుడి ఆరాధనలు. నవరాత్రులూ ప్రార్థించడం వల్ల గణపతి కటాక్షం కలుగుతుంది. మనసు శుద్ధమవుతుంది. నిర్మల జీవనం సాధ్యమవుతుంది. వినాయక చవితినాడు ఈశ్వరతత్వాన్ని విఘ్ననాశక స్వరూపంగా ఆరాధిస్తాం. విఘ్నాలు అంటే అవరోధాలు. విద్యలో, కార్యంలో, అభ్యుదయంలో ఆధ్యాత్మికతలో ఏర్పడే అడ్డంకులు. కాలాన్ని, ప్రకృతిని, జీవుల్ని నియంత్రించే ఈశ్వరుని అనుగ్రహంతో ఈ అవరోధాలను అధిగమించడానికే విఘ్నేశ్వరారాధన.శ్రద్ధగా వినండి... 
గణేశుడు ప్రణవ స్వరూపుడు. వినాయకుడి రూపం సంస్కృత లేదా దేవనాగరి లిపిలో ఉన్న ఓంకారంతో సరిపోలుతుంది. ఏకదంతుడిని ఏకాగ్రతతో గమనిస్తే ఈ విషయం అవగతమవుతుంది. ప్రణవాక్షరంలో గుండ్రంగా ఉండే కింది భాగం వినాయకుడి పొట్టకు పోలిక. లంబోదరుడు అనడానికి ఉదాహరణ. కుడివైపు తిరిగి ఉండే ప్రణవాక్షరపు కొమ్ము గణేశుడి తొండానికి, అర్ధ చంద్రాకారం, అందులోని బిందువులు ఫాలనేత్రానికి గుర్తులు. వక్రతుండం, అర్ధచంద్రుడు, ఫాల నేత్రం ఇలా వీటన్నిటినీ కలిపి చూస్తే ఓంకారం రూపు దిద్దుకుంటుంది. ప్రణవం మనసుకు ఏకాగ్రతనిస్తుంది. ఇది సాధకులకు, విద్యార్థులకు ఎంతో అవసరం. ఆధ్యాత్మికంగా ఇదెంతో ముఖ్యమైన విషయం. సాధకులుగానీ, విద్యార్థులుగానీ ముందు గురువు చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలి. ఏకాగ్రతతో వినాలని చెప్పడానికి పెద్ద చెవులు, కండబలంతో పాటు బుద్ధిబలం కావాలని చెప్పడానికి వక్రతుండం సూచికలు. ఏనుగు తన తొండంతో ఎంతో బరువైన వస్తువులతో పాటు నేలపై పడ్డ సూదిని కూడా తీయగలదు. స్థూల, సూక్ష్మ అంశాలన్నిటినీ గ్రహిస్తేనే విద్యాబుద్ధులు బాగా అబ్బుతాయని చెప్పడానికి వినాయకుడి రూపం ఓ గొప్ప చిహ్నం.


గీతాచార్యుడుగా మారిన వేళ... 
నారాయణుడు నరుడికి చేసిన కర్తవ్య బోధ భగవద్గీత. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం నేపథ్యంగా ఉద్భవించిన అమృతభాండమనే విషయం అందరికీ తెలిసిందే. గణేశుడు తన భక్తుడైన వరేణ్యుడికి గీతను ఉపదేశించిన ఘట్టం గణేశపురాణంలో ఉంది. భగవద్గీతలాగానే కర్మ,జ్ఞాన,ఉపాసనా మార్గాలను బోధిస్తున్న ఈ గీత మన ధార్మికతలో ఉన్న గొప్పతనాన్ని, ఏకత్వాన్ని చాటుతుంది. పదకొండు అధ్యాయాల్లో విశ్వజనీన జ్ఞానాంశాలను ఒక ఆచార్యుడిగా గణపతి బోధించిన తీరు అద్భుతం. అందులోని ముఖ్యాంశాలు...

* యోగం అంటే లౌకిక సుఖాలను, భోగాలను, సంపదలను సాధించడం కాదు. అలాగే పరలోక సుఖాలను అనుభవించడం కూడా కాదు. దేని వల్ల లౌకిక విషయ లాలస దూరమవుతుందో, సంసార తాపత్రయం దూరమవుతుందో అదే యోగం. ఇంద్రియాలను జయించి, దయ కలిగిన హృదయంతో జగతిని పవిత్రం చేసేవారు యోగులు.

* శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు, నేను (గణపతి)... ఒక్కటే అని గ్రహించడాన్నే అభేద బుద్ధి అంటారు. అలాంటి బుద్ధి కలిగి ఉండడమే యోగం. సర్వ దేవతలు, లోకాలు నా స్వరూపాలే. మంచి కర్మల వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. దీనివల్ల అభేద జ్ఞానం ఉదయిస్తుంది.

* మనిషి తప్పనిసరిగా సత్సాంగత్యం కోసం ప్రయత్నించాలి. దానివల్ల సుగుణ సంపద పెంపొందుతుంది. ఆపదలు దూరమవుతాయి.

* జ్ఞానంకన్నా పవిత్ర వస్తువు లేదు. ఇంద్రియ నిగ్రహం, భక్తి, శ్రద్ధ ఉన్నవాడు మాత్రమే జ్ఞానాన్ని పొందుతాడు. దీనివల్ల ముక్తి కలుగుతుంది. భక్తి, శ్రద్ధ లేని సందిగ్ధ చిత్తుడు శుభాలను పొందలేడు.

* మనసు నిలకడకు, పాపాలు పటాపంచలు కావడానికి అద్భుతమార్గం ప్రాణాయామం. ఉపాసన, అభ్యాసాలతో కూడా నన్ను పొందడం సులభం.

* నిర్మలమైన భక్తి ఉన్నవాడు ఏ జాతివాడైనా సర్వాధికుడే.

* భాద్రపద శుక్ల చతుర్థినాడు నాలుగు చేతులున్న నా రూపాన్ని కొలిచే వారిని అనుగ్రహిస్తాను.


ఎలుక ఎందుకు? 
విఘేశ్నరుని రూపంలో మరో విశేషం ఎలుక వాహనం. ఇంత భారీకాయుడు ఎలుకపై స్వారీ చేయడం కూడా ఆధ్యాత్మిక రహస్యంలో భాగంగానే చెబుతారు. ఎలుకను మూషికం అంటారు. ముష-స్తయే అనే ధాతువులోంచి పుట్టిన పదమిది. ఇది దొంగ అనే అర్థాన్నిస్తుంది. మానవుడిలోని దొంగ బుద్ధికి ఎలుక ప్రతీక. వినాయకుడు అధిరోహించిన ఎలుక పేరు అనింద్యుడు. అంటే నింద పడని వాడని అర్థం. తస్కరణ బుద్ధి నుంచి బయటపడిన అనింద్యుడు భగవంతుడి వాహనమయ్యాడు. సంస్కరించబడిన జీవి ఏదైనా భగవంతుడికి చేరువ అవుతుందనడానికి ఇదో నిదర్శనం.

పూర్ణత్వమే... ప్రసాదం 
గణపతి ఆనంద స్వరూపుడు. మోదక ప్రియడు. ఒక కార్యం ప్రారంభించేటప్పుడు భయం, సంకోచం, సంశయం, ఉద్వేగం వంటివి లేకుండా ఉత్సాహంగా సకారాత్మక భావనతో కూడిన ఆనందాన్ని ఆమోదం అనవచ్చు. సిద్ధి కలిగాక లభించే సంతోషాన్ని ప్రమోదం అని భావించవచ్చు. ఈ రెండు ఆనంద భావనలే గణపతి శక్తులు. ఉండ్రాళ్లు, లడ్లు, వంటివి గణపతికి నైవద్యాలుగా ఆ తర్వాత మనకు ప్రసాదాలుగా లభిస్తాయి. ఇవి పూర్ణత్వానికి సంకేతాలు. ఇక్కడ వినాయకుడు పరిపూర్ణమైన ఆనందాన్ని మనకు ప్రసాదంగా ఇస్తున్నాడని అర్థం.
- వేదప్రియ, డాక్టర్‌ కావూరి రాజేశ్‌పటేల్‌, డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు

32 మూర్తులా...

గణనాయకుడు బహురూపధారి. శివ, స్కాంద, ముద్గల పురాణాల్లో ఆయన రూపురేఖలకు, ప్రసాదించే ఫలితాలకు అనుగుణంగా అనేక పేర్లున్నాయి. వాటిలో 32 పేర్లను స్థిరీకరించారు. అనేక బీజాక్షరాల సమ్మేళనంతో, మూల మంత్రాలతో వివరించిన గణపతి తంత్రం ఈ గణపతుల పైనే ఆధారపడి ఉంది.


బాల గణపతి ఎర్రటి రంగులో శోభిల్లుతుంటాడు. బుద్ధి, వివేకం, జ్ఞానం, చురుకుదనం ప్రసాదిస్తాడు. ఈ స్వామిని కొలిస్తే పిల్లలకు ఉత్సాహం, చదువుపై ఆసక్తి పెరుగుతాయి.

తరుణ గణపతి మధ్యాహ్నకాలపు సూర్యుడి వర్ణంలో మెరిసిపోతుంటాడు భక్తులకు పట్టుదలను, దీక్షను ప్రసాదిస్తాడు.

భక్త గణపతి తెల్లని వర్ణంలో చల్లని వెన్నెల వెలుగులను కురిపిస్తుంటాడు. భÅ¡క్తజనావళి హృదయాలలో భక్తి ప్రపత్తులను ద్విగుణీకృతం చేస్తాడు.

వీర గణపతి కుంకుమ వర్ణంలో ప్రకాశిస్తుంటాడు. భక్తులకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు.

శక్తి గణపతి సాయం వేళలో సూర్యుడిలా దర్శనమిస్తాడు. భక్తులను సర్వశక్తి సంపన్నులను చేస్తాడు.


ధ్వజ గణపతి తెల్లని వర్ణంలో శోభిల్లుతుంటాడు. ఈ గణపతిని పూజిస్తే.. తెలివితేటలు వృద్ధి చెందుతాయి.

సిద్ధి (పింగళ) గణపతి బంగారు పసిమి వర్ణంలో మెరిసిపోతుంటాడు. సకల కార్యసిద్ధిని ఈయన అనుగ్రహిస్తాడు.

ఉచ్చిష్ట గణపతి ఇది సర్వోత్తమమైన గణపతి స్వరూపం. నల్లని వర్ణంలో ఉంటాడు. ఉచ్చిష్ట గణపతిని అర్చించడం వల్ల ధనధాన్యవృద్ధి, ఆరోగ్యం, సుఖశాంతులు లభిస్తాయి.

విఘ్న గణపతి ఎనిమిది భుజాలతో దర్శనమిస్తాడు. త్రిమూర్తి స్వరూపుడీయన. విఘ్నాలను దాటిస్తాడు. ప్రమాదాలు, అవరోధాలు ఎదురుకాకుండా చూసి విజయం కలిగిస్తాడు.

క్షిప్ర గణపతి ఈయన భోళా వినాయకుడు. అతి శీఘ్రంగా స్పందించి భక్త కోటిని కరుణిస్తాడు. ఈ గణపతి చాలాకాలంగా నెరవేరక బాధ పెడుతున్న కోరికలను తీర్చి సంతోషం కలిగిస్తాడు.

హేరంబ గణపతి విలక్షణమైన మంత్రమూర్తి. పంచముఖుడు. నాలుగు తలలు.. నాలుగు దిక్కులు చూస్తుండగా.. వాటిపై ఐదో తల ఉంటుంది. దీనులను కాపాడుతుంటాడు.


లక్ష్మీ గణపతి ఇరుతొడలపైనా ఉభయ దేవేరులు కుర్చొని ఉంటారు. ప్రార్థించే భక్తులకు ధనసంపదలనిస్తాడు.

మహా గణపతి ఈయన సమగ్రమూర్తి. ఈ గణపతి.. కీర్తిప్రతిష్టలను, సంఘంలో పలుకుబడిని అనుగ్రహిస్తాడని నమ్మకం..

విజయ గణపతి కుంకుమ వర్ణంలో ప్రకాశిస్తుంటాడు. సర్వకార్యాల్లోనూ సాఫల్యతనిస్తాడు.

నృత్య గణపతి ఈ గణపతిని తాండవ గణపతి అని కూడా పిలుస్తారు. పసిబాలుడి రూపంలో.. ఆనంద తాండవం చేస్తుంటాడు. కొలిచిన వారికి సంతృప్తినీ, మనశ్శాంతిని ఇస్తాడు. 
ఊర్ధ్వ గణపతి పసుపు పచ్చని శరీరచ్ఛాయ కలిగి ఉంటాడు ఎడమ తొడపై లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకొని ఉంటాడు. తనను నమ్ముకున్న భక్తులకు పాప విమోచనం చేస్తాడు.


ఏకాక్షర గణపతి ఏకాక్షర గణపతి భక్తుల చింత, శోకం, అజ్ఞానం పోగొడతాడు. ప్రశాంతతను, సంతోషాన్ని కలిగిస్తాడు.

త్య్రక్షర గణపతి విఘ్నాలు తొలగించి, సర్వసిద్ధిత్వం కలిగించి అజ్ఞాన విముక్తులను చేస్తాడు త్య్రక్షర గణపతి.

వర గణపతి ఈయన సులభ ప్రసన్నుడు, కోరిన వరాలన్నీ తక్షణమే ప్రసాదిస్తాడు.

క్షిప్ర ప్రసాద గణపతి ఈ గణపతిని పూజిస్తే కీర్తి ప్రతిష్టలు, పదవులు కలుగుతాయి.

హరిద్రా గణపతి పసుపు రంగులో దర్శనమిస్తాడు. వివాహాది శుభకార్యాలలో తొలుత ఈయన్నే పూజిస్తారు. ఈ దైవం విఘ్న నివారకుడు.

సృష్టి గణపతి దైనందిన కార్యక్రమాలు, సృష్టి కార్యాలు నిరాటంకంగా జరిగేలా అనుగ్రహించే దేవుడు సృష్టి గణపతి.

ఏకదంత గణపతి మహా భారతం రాస్తుండగా గంటం విరిగిపోతే.. దంతం పెరికి దానితో రాత కొనసాగించాడట గణపతి. అందుకే ఏకదంతుడయ్యాడని పురాణ కథనం. రాక్షస ప్రవృత్తుల్ని, భయాల్ని తొలగిస్తాడు.


ఉద్దండ గణపతి దుష్ట శక్తులను, శత్రువులను ఎదుర్కొనే సామర్థ్యాన్నిస్తాడీయన.

రుణ విమోచన గణపతి సకల రుణాల నుంచి విముక్తిని ప్రసాదిస్తాడీ స్వామి.

ద్విముఖ గణపతి రెండు ముఖాలు కుడి ఎడమలకు తిరిగి ఉన్న ఈ గణపతి విశేషమైన సంపదలను ప్రసాదిస్తాడు.

డుండి గణపతి కాశీ విశ్వనాథుడి సన్నిధిలో ఉండే ఈ గణనాథుడు భక్తులకు శుభాలను, సౌఖ్యాలను అనుగ్రహిస్తాడు.

త్రిముఖ గణపతి అకార, ఉకార, మకారాల స్వరూపంగా త్రిముఖ గణపతి కనిపిస్తాడు. దీనులను, నిస్సహాయులను ఆదుకుంటాడీ స్వామి.

సింహ గణపతి భక్తులను ధైర్యవంతులుగా చేసి, ఆత్మవిశ్వాసంతో వారిని ప్రగతి పథంవైపు నడిపిస్తాడు సింహ గణపతి.

దుర్గ గణపతి సకల పాపాలను దూరం చేసి, ఉపాసకులను కంటికి రెప్పలా కాపాడతాడు.


యోగ గణపతి ఈ గణపతి యోగమూర్తి. మూలాధార స్థితుడైన జప, తప, ధ్యాన తత్పరుడు. బ్రహ్మజ్ఞానానికి యోగ గణపతి ప్రతీక. ఆయురారోగ్య ప్రదాత.

సంకటహర గణపతి భక్తుల సంకటాలన్నీ హరించే కరుణమూర్తి. ఆనందోత్పాహాలతో జీవితాలలో వెలుగులు నింపే వాత్సల్యమూర్తి.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment