తిరుప్పావై (ధనుర్మాస వ్రతం) | Tiruppavai (Dhanurmasa Vratham) | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

తిరుప్పావై (ధనుర్మాస వ్రతం) 
 Tiruppavai (Dhanurmasa Vratham)

Rs 36/-  Rs20/-



మనదే పాశురాస్త్రం 
ఈ నెల 16 నుంచి ధనుర్మాసం ప్రారంభం

 తల్లయినా... తండ్రయినా... గురువైనా... స్నేహితుడైనా... చివరకు భగవంతుడైనా సరే శరణాగతితోనే చేరువవుతారు. నీ ఆత్మను సంపూర్ణంగా అర్పించగలిగితే ప్రతి మనిషీ కన్నయ్యే, ప్రతి హృదయమూ మమతల కోవెలే. పాశురాలు ఇదే విషయాన్ని చెబుతాయి.


శ్రీకృష్ణా! నాకు తల్లి, తండ్రి, స్నేహితులు, బంధువులు.. ఒకటేమిటి? అన్నీ నువ్వే. 
బంధుత్వాలన్నీ నీతోనే. ఈ ఒక్క జన్మలోనే కాదు... అన్ని జన్మల్లోనూ నీ చెలిమే కావాలి.

తనువు, మాట, మనసు... అన్నిట్లోనూ నువ్వే నిండిపోవాలి. నన్ను నేను మర్చిపోవాలి. చివరకు నీలో ఐక్యం చెందాలి. ఇంతకన్నా నాకు మరే కోరికా లేదు స్వామీ... అంటూ పరిపూర్ణమైన భక్తిని ప్రకటిస్తుంది గోదాదేవి తన తిరుప్పావై పాశురాల్లో.

దేవుడు ఎక్కడో పైలోకాల్లో ఉండడు. మన ఇంట్లోనే, మన చుట్టూనే, మనకు దగ్గరగానే ఉంటాడు. మనం పిలిస్తే పలుకుతాడు. మనకు ఆత్మబంధువుగా ఉంటాడు. మనం ఆత్మీయతతో పిలిస్తే తక్షణమే పలుకుతాడు. మనం చేయవలసిందల్లా మనసునీ, మాటనీ ఒకటిగా చేసి కన్నయ్యను పిలవటమే అంటూ పరమాత్మను చేరుకునేందుకు పారమార్థిక చింతనను అందిస్తాయి పాశురాలు.

* భగవంతుడిని చేరుకోవటానికి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనే తొమ్మిదిమార్గాలు (వీటినే నవవిధ భక్తి మార్గాలు అంటారు) ఉన్నాయని చెబుతుంది భాగవతం. తిరుప్పావై పాశురాల్లో కీర్తనం, స్మరణం, ఆత్మనివేదన స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా కీర్తన మార్గం విశిష్ఠత స్పష్టమవుతుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే మిగిలిన భక్తి మార్గాలు వాటిని అనుసరించిన భక్తుడిని మాత్రమే తరింపజేస్తే, కీర్తన మార్గం ఇందుకు భిన్నంగా భగవంతుడిని కీర్తించిన భక్తుడితో పాటు వాటిని విన్న, గానం చేసిన భక్తులందరినీ తరింపజేస్తుంది. తిరుప్పావై సరిగ్గా ఇదే మార్గంలో సాగి, పాశురాల్ని గానం చేసిన ప్రతి ఒక్కరినీ పరమాత్మకు ప్రియమైన భక్తులను చేస్తుంది.


* భగవద్గీతలో పరమాత్మ కూడా ‘భక్తుడైనవాడు శరణాగత బుద్ధి కలిగి ఉండాల’ని చెబుతాడు. వ్యక్తి తన ఆత్మను అర్పణ చేసుకోవాలి. భగవంతుడి చరణాల మీద వాలిపోవాలి. నారదుడు కూడా తన భక్తిసూత్రాల్లో ‘అధాతో భక్తిం వ్యాఖ్యాస్యామః ’ అంటూ భక్తితోనే తన ఉపదేశాన్ని ప్రారంభిస్తాడు. ఈ భావనలన్నీ తిరుప్పావై పాశురాల్లో అత్యంత స్పష్టంగా కనిపిస్తాయి.

* ‘ఓంగి యులగళన్ద ఉత్తమన్‌ పేర్పాడి నాంగళ్‌ నమ్బావైక్చుచ్చాట్రి నీరాడినాల్‌...’ అనే పాశురం భౌతికమైనవన్నీ భగవంతుడి ప్రసాదాలే. మనిషి తనకు కావాల్సినవి పొందాలంటే ఆయనను ప్రార్థించాలని వివరిస్తుంది. ఏడాదికి మూడు పంటలు పండాలి. గోవులు సమృద్ధిగా పాలు ఇవ్వాలి. సరిపడినంత వాన కురవాలి... అసలు ఎక్కడా, ఎందులోనూ ‘లేదు’ అనే పదం వినిపించకూడదు స్వామీ! ఈ లోకాన్ని చల్లగా చూడు అంటూ సాగుతుందీ పాశురం.

ఒకసారి మత్స్యమూర్తిగా, మరొకసారి కూర్మరూపంలో, ఇంకోమారు ఆదివరాహమూర్తిగా, నరసింహుడిగా, చివరగా పరిపూర్ణ మానవుడిగా స్వామి అవతారాల పరమార్థం కూడా ఈ పాశురం ప్రకటిస్తుంది. ‘ఇందుగలడు అందులేడని సందేహం లేదు. భగవంతుడు అన్ని చోట్లా ఉన్నా’డనే భాగవత భక్తిని ఈ పాశురం ప్రకటిస్తుంది.

* ‘నోట్రుచ్చువర్కమ్‌ పుహిగిన్నవమ్మనాయ్‌ మాట్రముమ్‌ తారారో వాశల్‌ తిరవాఆర్‌...’ అనే పాశురం నీలాదేవిని నిద్రలేపే సన్నివేశంతో సాగుతుంది. ‘నిద్రపోవడంలో కుంభకర్ణుడు నీతో ఓడిపోయి, అందుకు ప్రతిగా తన సొత్తు అయిన నిద్రను నీకు శుల్కంగా ఇచ్చాడా ఏంటి? ఇక నిద్రలేవమ్మా నీలాదేవీ!’ అంటూ పరాచికాలడడం ఇందులో ప్రధానాంశంగా కనిపిస్తుంది. ఇదంతా బయటకు కనిపించే అంశం.. తరచిచూస్తే... నీలాదేవి పేరుతో అజ్ఞానమనే మాయకు లోబడి ఉన్న మన మనసుల్ని ఈ పాశురం నిద్రలేపుతుంది. మనసుల్ని కమ్మిన మాయను తొలగించుకుంటేనే కానీ భగవంతుడిని చేరుకోలేమన్న అంతరార్థం బోధపడుతుంది.

* మితిమీరిన సంపద మనిషిని భగవంతుడి నుంచి దూరం చేస్తుంది. కాబట్టి, ఎంత సంపద ఉన్నా భగవంతుడి సేవను వదలకూడదు. ఇందుకు స్వీయజాగృతే మార్గం అంటూ గోదాదేవి మనందరికీ జ్ఞానబోధ చేస్తుంది. ‘కనెత్తిళం కట్రెరుమై కన్రుక్కిరంగి నినైత్తుములై వళియే నిన్రుపాల్‌ శోర... ’ అనే పాశురం ఇందుకు నిదర్శనం. భక్త రామదాసుగా ప్రసిద్ధి పొందిన కంచెర్ల గోపన్న కూడా తన దాశరథీ శతకంలో సంపద మాయలో మునిగి, భగవదారాధన మర్చిపోవద్దని హెచ్చరిస్తాడు. పాశురాల్లోనూ ఇదే దార్శనికత కనిపిస్తుంది.

* పాశురాల్లో గోదాదేవి ఎక్కడా మెట్ట వేదాంతాన్ని వల్లించలేదు. ఏది మంచో? ఏది చెడో? వివేచన చేసుకోమని హెచ్చరిస్తుంది. మహర్షులైన వారి మార్గదర్శనం తీసుకోమని సూచిస్తుంది. ‘కీళ్‌ వానమ్‌ వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు మేయ్‌ వాన్‌ పరన్దనకాణ్‌ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్‌...’ అనే పాశురంలో ఈ సందేశం కనిపిస్తుంది. భగవత్‌ సేవకు తొందరపడాలి. క్షణం వృథా చేసినా మన సాధ]నలో లోపం ఏర్పడుతుంది. మనకు మనంగా భగవంతుని పాదాల మీద వాలితే... ఆయనే స్వయంగా మనల్ని ఆదరిస్తాడు. అంతిమంగా తనలో చేర్చుకుంటాడని ఈ పాశురం చెబుతుంది.

* ‘కీశు కీశున్రెజ్ఞుమానై చాత్తకలన్దు పేశిన పేచ్చరవమ్‌ కేట్టిలైయో పేయ్‌ ప్పెణ్ణే ....’ అనే పాశురంలో ప్రకృతిశోభ అనంతంగా కనిపిస్తుంది. భరద్వాజ పక్షులు చేసే శబ్దాలు, గొల్లభామ చేతి కంకణాల ధ్వనులు, మంగళసూత్రాల మంగళధ్వనులు, మంచుదుప్పట్లు కప్పున్నట్లు కనిపించే పంటభూములు .. ఇంతటి సుందరమైన గ్రామంలో నివసించే గోపికను పరమాత్మ సేవకు మేల్కొలుపుతుంది గోదాదేవి ఈ పాశురం పల్లెల్లో నివసించినా, పట్టుపరుపుల మీద పడుకున్నా పరమాత్మసేవలో తరిస్తేనే జన్మకు సార్థకత అని వివరిస్తుంది.

మొత్తంగా తిరుప్పావై పాశురాలు ఆత్మను పరమాత్మ సన్నిధికి చేర్చే వాహకాలు. సగుణోపాసన ద్వారా నిర్గుణోపాసనకు మార్గం చూపే దారిదీపాలు. దైవచింతన కోసం, కర్తవ్య నిర్వహణ కోసం మనల్ని నిద్రలేపే చైతన్యదీపాలు.
ఆండాళ్‌ (గోదాదేవి) భూదేవి అంశగా భావిస్తారు. ఆమె రచించిన దివ్యప్రబంధమే ‘తిరుప్పావై’. ద్రావిడభాషలో ‘తిరు’ అంటే పవిత్రం, ‘పావె’ౖ అంటే వ్రతం అనే అర్థాలు ఉన్నాయి. వీటిప్రకారం తిరుప్పావై అంటే పవిత్రమైన వ్రతం అని అర్థం. అలాగే, పాశురం అంటే ఛందోబద్ధమైన పద్యాలు లేదా పాటలు అని అర్థం. పవిత్రమైన వ్రత నిర్వహణకు వినియోగించే పాశురాలు కాబట్టి ఇవి తిరుప్పావై పాశురాలుగా ప్రసిద్ధి పొందాయి.కన్యలు తిరుప్పావై వ్రతం చేస్తే వెంట‌నే వివాహం అవుతుందనే ప్రగాఢ నమ్మకం తెలుగు, తమిళ ప్రాంతాల్లో ఇప్పటికీ ఉంది.
తిరుప్పావైలో ఉన్న మొత్తం పాశురాలు 30. వీటిలో మొదటి అయిదు ఉపోద్ఘాతంగా ఉంటాయి. తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి. భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని, చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాలు చెబుతాయి. భగవంతుడిని ఆరాధించటం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు నిండుగా పండుతాయని, దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంది.
తర్వాతి పది పాశురాల్లో చెలులతో కలిసి శ్రీరంగనాథుడిని సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి. పదిహేను నుంచి ఇరవయ్యో పాశురం వరకు గోదాదేవి చెలులతో కలిసి దేవాలయానికి వెళ్లిన విషయాలు, అక్కడి శిల్పసౌందర్యాల వర్ణనలు, రంగనాథుడికి సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి. కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాశురాల్లోనే ఉంటుంది. చివరి తొమ్మిది పాశురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాశురంలో ఫలశృతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది.    - డా.కప్పగంతు రామకృష్ణ

-------------------------


లక్ష్మీనారాయణుల ఆవాసం... మార్గశిరం

     మంచుతెరలు దాటి వీనులవిందుచేసే విష్ణుసహస్రనామ పారాయణలూ, మోక్షానికి దారిచూపే ఉత్తరద్వార దర్శనాలూ, ఆస్తికుల లోగిళ్లకు పండగవాతావరణాన్ని తీసుకొచ్చే నోములూ వ్రతాలూ, కర్మయోగాన్ని వివరించే గీతాప్రవచనాలూ... ఇలా మార్గశిర మాసంలో కనిపించే ప్రతి దృశ్యమూ మనోహరమైందే. ఆధ్యాత్మిక శోభను నలుచెరగులా ఇనుమడింపజేసేదే.

    చాంద్రమానం ప్రకారం మృగశిర నక్షత్రంలో పౌర్ణమి వస్తుండడంతో ఈ మాసాన్ని మార్గశిరమాసం అంటారు. ‘మాసానాం మార్గశీర్షోహం...‘అర్జునా! మాసాల్లో మార్గశిరం నేను’’ అని స్వయంగా గీతాచార్యుడు ప్రకటించుకున్నాడు. అందుకే ఈ మాసాన్ని విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రమైందని చెబుతారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాల్లో శ్రేష్ఠమైందీ తలమానికమైందీ మార్గశిరమే. ఈ మాసంలో వచ్చే ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించినా, లక్ష్మీనారాయణులను అర్చించినా, గీతాపారాయణ చేసినా, కాలభైరవుడిని పూజించినా... మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రవచనం. 
రోజూ ప్రత్యేకమే... 
మనిషిని భగవంతుడికి దగ్గరగా చేర్చేవీ, మంచి ఆలోచనలను ప్రేరేపించేవీ వ్రతాలూ పూజలూ. ఆ ప్రకారం... లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతి ఘడియా శుభప్రదమైందే. ప్రతిరోజూ విశేషమైందే. శుక్లపక్ష పాడ్యమి రోజు నదీ స్నానం చేసి దీపాలు వదలడం శ్రేష్ఠమని చెబుతారు. 
తదియనాడు ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు. అందుకే మార్గశిరం మాధవుడికేకాదు మహేశ్వరుడికీ ప్రీతికరమైనదంటారు. శుద్ధ పంచమిని నాగపంచమిగా వ్యవహరిస్తారు. పగలనకా రాత్రనకా చేట్టూచేమల్లో తిరిగే తమ పిల్లలను కాపాడమంటూ నాగేంద్రుడిని పూజిస్తారు. మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యస్వామి జన్మదినం. లోకకంటకుడిగా మారిన తారకాసురుడిని స్కందుడు అంతమొందించింది కూడా ఈ రోజే. రోజంతా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరాధించినవారికి ఉత్తమమైన సంతానం లభిస్తుందని చెబుతారు. మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవాష్టమి. కాలభైరవుడు అవతరించిన రోజు. ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం కాలభైరవ అవతారం. కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తూ విశ్వేశ్వరుడి దర్శనానికి వచ్చిన భక్తుల పాపపుణ్యాలను స్వయంగా లెక్కచూస్తుంటాడంటారు. కాలభైరవ స్వరూపమైన శునకాన్ని ఈ రోజు పూజించి, గారెలు దండగుచ్చి వేస్తారు.


ముక్కోటి ఏకాదశి 

శుక్లపక్ష ఏకాదశినే మోక్షదా ఏకాదశీ, సౌఖ్యదా ఏకాదశీ అని కూడా అంటారు. ఆ రోజు వైకుంఠం ద్వారాలు తెరుచుకోవడంతో ముక్కోటి దేవతలూ శ్రీహరి దర్శనానికి వైకుంఠం చేరుకుంటారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అనికూడా అంటారు. ఏకాదశి రోజున ఉపవాసం చేయడం పరిపాటి. సంవత్సరం పొడవునా ప్రతి ఏకాదశికీ ఉపవాసం ఉండలేని వాళ్లు ముక్కోటి ఏకాదశి ఒక్కరోజైనా ఉపవాసం ఉంటే చాలు మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు అన్ని దేవాలయాల్లో జరిపే ఉత్తరద్వార దర్శనాలు అత్యంత శుభప్రదమైనవి. శ్రీకృష్ణపరమాత్మే స్వయంగా గీతామకరందాన్ని మానవాళికి అందించింది కూడా ఈ రోజే. సులభమైన పద్ధతిలో ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గాన్ని ఇందులో వివరించాడు కృష్ణుడు. కర్మయోగం, భక్తియోగాలను తెలిపి జగత్తును జాగృతం చేశాడు.ఆ రోజు గీతాపారాయణ చేయడానికి అవకాశంలేనివాళ్లు భగవద్గీతలోని కనీసం పద్దెనిమిది శ్లోకాలనైనా పఠించాలని చెబుతారు. శుద్ధ నవమి రోజున త్రిరాత్రి వ్రతం చేస్తారు. మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశి అంటారు. ఆ రోజు దశావతారాల్లో మొదటిదైన మత్స్యావతారంలో స్వామిని ఆరాధిస్తారు. 
శుద్ధ త్రయోదశిరోజున హనుమద్‌ వ్రతం చేయాలని చెబుతారు పండితులు. సీతాన్వేషణలో ఉన్న శ్రీరాముడు హనుమద్‌ వ్రతాన్ని ఆచరించిన తర్వాతే హనుమంతుడి సహాయాన్ని పొందాడన్న కథనం ప్రచారంలో ఉంది. మార్గశిర శుద్ధ పూర్ణిమ దత్తజయంతి. దీన్నే కోరల పూర్ణిమ, నరక పూర్ణిమ అని కూడా అంటారు. ఆ రోజు అగ్ని పురాణాన్ని దానం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయంటారు. త్రిమూర్తుల్లో విష్ణుమూర్తి అంశగా జన్మించిన దత్తుడు మౌనముద్రతోనే లోకానికి ఉపదేశంచేసి జగద్గురువయ్యాడు. అందుకే ఆ రోజు దత్తచరిత్రను పారాయణచేసి ఆయన్ను స్మరించుకుంటారు. వీటితోపాటు కృష్ణపక్షంలో అనఘాష్టమి, రూపనవమి, సఫల ఏకాదశి, మల్లి ద్వాదశి, యమత్రయోదశి... మొదలైన పర్వదినాలు వస్తాయి.


గురువార వ్రతం 
మార్గశిర మాసం శివకేశవులకే కాదు లక్ష్మీదేవికీ అత్యంత ఇష్టమైన మాసంగా చెబుతారు. ఈ నెలలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని అర్చించి, వ్రతకథను చదువుకుని, అందులో సూచించిన విధంగా మొదటి గురువారం పులగం; రెండో వారం అట్లూతిమ్మనం; మూడోవారం అప్పాలు, పరమాన్నం; నాలుగోవారం చిత్రాన్నం, గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల ధనానికి లోటు ఉండదని భక్తుల నమ్మకం. నోములైనా వ్రతాలైనా పూజలైనా అభిషేకాలైనా మనలోని బద్ధకాన్ని వదిలించి, మన మనసులను ధర్మబద్ధం చేయడానికి పెద్దలు మార్గశిర మాసం రూపంలో ఏర్పాటు చేసిన విధివిధానాలే.!

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment