శ్రీ తులసి నిత్య పూజ | Sri Tulasi Nitya Pooja | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
శ్రీ తులసి నిత్య పూజ 
Sri Tulasi Nitya Pooja
Sri Adipudi SaiRam
Rs.15/-

శ్రీతులసి మహిమ

-తులసిచెట్టు-

తులసి,బృంద,బృందారిణి,విశ్వపూజిత,విశ్వపావని,పుష్పసార,నందినీతులసి,కృష్ణసేవిత అను 8 నామములతో తులసిని పూజించినవారికి అశ్వమేధయాగమును చేసినట్టి ఫలితము కలుగును.

శ్రీతులసికి నిత్యము భక్తితో ప్రదక్షిణముచేసి నమస్కరించుటవలన అశుభములన్నియు తొలగి సర్వపాప ప్రక్షాళణ జరిగి అనంతమైన పుణ్యఫలము కలుగును.సర్వాభీష్టములు నెరవేరును.

ॐ ఆంజనేయస్వామిని తులసిదళములతో పూజించుట 

సర్వాభీష్టసిద్ధి.

ॐ ప్రతి ద్వాదశియందును తులసివన మధ్యమున శ్రీమహావిష్ణు సహస్రనామ పఠనము చేయువారికి సర్వాభీష్టములు సిద్ధించును.
ॐ ఒకసారికోసిన తులసిదళములు ఆరు రోజులవరకు పూజార్చనలకు ఉపయోగించవచ్చును.
ॐ ద్వాదశి రోజులలోనూ,శ్రవణా నక్షత్రమందును,అమావాస్య,పూర్ణిమ తిధులయందును,శుక్ర,మంగళ వారములలోనూ,మధ్యాహ్నము, సాయంసంధ్యలయందును,రాత్రులయందునూ తులసిదళములనుకోయుట మహాపాపము.

ॐ కృష్ణతులసి పూజకు అత్యంతయోగ్యమైనది.

తులసిమాల:—

ॐ దీనిని ధరించుటవలన సర్వపాపములు నశించును.

ॐ ఆరోగ్యరీత్యా రక్తపోటును రానీయదు

ॐ విష్ణుసంబంధములగు మంత్రజపములకు అత్యంత ప్రశస్తమైనది.కోరినకోర్కెలు నెరవేరును.

-------------------

శ్రావణ మాసం సందర్భంగా తులసీ వైభవం గూర్చి 
      శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

ఇంద్రాది దేవతలు చేత భగవతి అయిన తులసి నిరంతరం సేవించదగినది. ఆ విధంగా సేవించినచో చతుర్వర్గ ఫలమును ప్రసాదించును. స్వర్గలోకమున, మర్త్య లోకమున, పాతాళ లోకమున కూడా తులసి దుర్లభమైనది. తులసి యందు భక్తి కలవారికి ధర్మార్థ కామ మోక్షములు లభించునని పద్మపురాణం ఉత్తరకాండం, ఉత్తరార్ధంలో క్రియాయోగ సారకాండంలో తులసి వైభవంలో వివరించబడినది.

యత్రైక: తులసీ వృక్ష: తిష్టత్యపిచ సత్తమ
తత్రైవ త్రిదశా: సర్వే బ్రహ్మ విష్ణు శివాదయ:
కేశవ: పత్ర మధ్యేచ పత్రాగ్రేచ ప్రజాపతి:
పత్రవృంతే శివస్తిష్ఠేత్‌ తులస్యా: సర్వదైవహి

ఎక్కడైతే తులసీ వృక్షమున్నదో అక్కడే బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఇతర దేవతలందరూ కొలువై యుందురు. తులసీ పత్ర మధ్యమున శ్రీమహావిష్ణువు, అగ్రభాగమున ప్రజాపతి, పత్రము యొక్క కాడలో శివుడు సర్వదా నివసింతురు. ఈ విధంగా తులసి ఎక్కడున్నా అక్కడ సకల దేవతలు కొలువై ఉందురు. -శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
,------------------

దేవతగా తులసి

తులసి ఇంటి ప్రాంగణములో ఉండటం ఆ ఇంట్లో నివసించే హిందూ కుటుంబము యొక్క సాంప్రదాయ నిష్టను సూచిస్తుంది. వైష్ణవం వంటి అనేక సంప్రదాయాలలో తులసి మొక్క ఇంట్లో లేనిదే ఆ ఇళ్ళు అంసపూర్ణమని భావిస్తారు. ఇటువంటి కుటుంబాలలో తులసి ఒక ప్రత్యేకమైన స్థానములో తులసికోట కట్టించి అందులో నాటతారు. తులసికోటకు నలువైపులా దేవతాచిత్రాలు ఉండి నాలుగు వైపులా ప్రమిదలు లేదా దీపం పెట్టడానికి చిన్న గూళ్ళు ఉంటాయి. కొన్ని ఇళ్ళలో వరండాలో ఒక డజను దాకా తులసి మొక్కలు పెంచుతారు. ఒక చిన్నపాటి పొదలాగా పెరిగిన దీన్ని తులసీవనం లేదా తులసీ బృందావనం అని పిలుస్తారు.

గంధర్వతంత్రము ప్రకారం ఏకాగ్రత మరియు నిష్టతో ధాన్యము చేసుకోవటానికి మరియు పూజలు చేసుకోవటానికి అనుకూలమైన స్థలాల్లో, తులసి మొక్కలు గుబురుగా పెరిగిన ప్రదేశాలు కూడా ఉన్నవి. అటువంటి ఆలయాలలో ఒకటైన వారణాసిలోని తులసీ మానస్ మందిర్ లో ఇతర హిందూ దేవతలతో పాటు తులసి కూడా పూజలందుకొంటున్నది. వైష్ణవులు, విష్ణువుకు తులసి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా గౌరవించి నైవేద్యములో భాగముగా తులసి ఆకులను స్వీకరిస్తారు. వీళ్లు తులసి కాండముతో చేసిన పూసల దండలను ధరిస్తారు. తులసి దండల తయారీ, అనేక తీర్ధయాత్రా స్థలాల్లో కుటీర పరిశ్రమగా కొనసాగుతున్నది. గౌడియ వైష్ణవ సాంప్రదాయంలో తులసికి, బృందావన దేవత, బృందాదేవి లేదా వృందాదేవి అని కూడా మరోపేరు కలదు. అమృతం మాదిరిగానే తులసి కూడా క్షీరసాగరాన్ని మధించే సందర్భంలో ఉద్భవించినదని మన పురాణాలు చెబుతాయి. అందుకే భారతీయ సంస్కృతిలో తులసికి పవిత్ర స్థానం, ప్రధాన స్థానం ఉంది. * తులసిని ప్రత్యక్ష దైవంగా హిందువులు పూజిస్తారు. మనుషులకు అకాల మరణం కలగకుండా తులసి చెట్టు కాపాడుతుందనే నమ్మకం ఉంది.
----------------------


క్షీరాబ్ధి కన్యకకు... శ్రీమహా విష్ణువుకు... నీరాజనం!
భౌతికంగా ఆచారాన్నీ, సమాజపరంగా సదాచారాన్నీ, ఆధ్యాత్మికంగా జ్ఞానాన్నీ ప్రసాదిస్తూ, అందరూ మోక్షాన్ని పొందే మార్గాన్ని నిర్దేశించే గొప్ప పర్వదినం క్షీరాబ్ధి ద్వాదశి. దానాలకూ, ధ్యానాలకూ, శివకేశవుల అనుగ్రహానికీ నెలవైన మాసం కార్తికం కాగా, అందులో శ్రీలక్ష్మిని శ్రీహరి పరిణయమాడిన రోజు క్షీరాబ్ధి ద్వాదశి.


కార్తిక మాస శుక్ల ద్వాదశి శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైనది. ఇది క్షీరాబ్ధి ద్వాదశిగా ప్రసిద్ధి పొందింది. మందర పర్వతం కవ్వంగా, వాసుకి తాడుగా క్షీర సముద్రాన్ని దేవదానవులు మథించిన రోజు ఇది. అందుకే దీన్ని ‘క్షీరాబ్ధి’ ద్వాదశి అన్నారు. మథించడం అంటే చిలకడం. కాబట్టి ‘చిలుక ద్వాదశి’గా కూడా వ్యవహరిస్తారు. దీనికి ముందురోజు ‘ఉత్థాన ఏకాదశి’. ఆషాఢమాసంలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు ఈ ఏకాదశినాడు మేలుకొంటాడని నమ్మకం. దీన్ని ‘ప్రబోధన ఏకాదశి’ అని కూడా అంటారు. యోగనిద్ర నుంచి మేలుకొన్న విష్ణుమూర్తి నేరుగా బృందా వనంలో ప్రవేశిస్తాడు. అందుకని ‘ఉత్థాన ఏకా దశి’ నాడు తులసీ బృందావనం వద్ద పూజలు చేస్తారు. అందరికీ బృందావనానికి వెళ్ళడం సాధ్యం కాదు. కాబట్టి ఇంట్లో ఉన్న తులసికోట దగ్గర మహిళలు పూజ నిర్వహిస్తారు.


లక్ష్మీదేవి పుట్టినరోజు!
క్షీరాబ్ధి ద్వాదశి నాడు పాల సముద్రంలో మహాలక్ష్మి ఆవిర్భవించిందనీ, ఆ రోజునే లక్ష్మీ నారాయణుల కల్యాణం జరిగిందనీ ‘చతుర్వర్గ చింతామణి’ అనే గ్రంథం చెబుతోంది. అందుకే ఈ రోజు లక్ష్మీనారాయణ కల్యాణం నిర్వహించే సంప్రదాయం ఏర్పడింది. వివాహానంతరం లక్ష్మీ సమేతుడై మహావిష్ణువు బృందావనానికి వెళ్ళాడని కథలు ఉన్నాయి. పరమ పవిత్రమైన ఈ రోజును పావన ద్వాదశిగా, విభూతి ద్వాదశిగా, గోవత్స ద్వాదశిగా, నీరాజన ద్వాదశిగా వ్యవహరిస్తూ... అందుకు సంబంధించిన వ్రతాలు చేస్తుంటారు. విష్ణుమూర్తినీ, మహాలక్ష్మినీ బృందావనానికి బ్రహ్మ తీసుకొని వెళ్ళి, అక్కడ తులసితో విష్ణువుకు వివాహం జరిపించాడని క్షీరాబ్ధి వ్రత కథ చెబుతోంది. తులసి సాక్షాత్తూ లక్ష్మీదేవి అంశే! ముఖ్యంగా, మథురలోని బృందావనంలో, మహారాష్ట్రలో క్షీరాబ్ధి ద్వాదశి నాడు తులసీ కల్యాణం నిర్వహిస్తారు.


తులసీ కల్యాణం
తెలుగు లోగిళ్ళలో క్షీరాబ్ది ద్వాదశి రోజు సాయంత్రం తులసికోట దగ్గర అలికి, ముగ్గులు పెడతారు. తులసికోటనే బృందావనంగా భావించి, ఉసిరిక కొమ్మను విష్ణుమూర్తికి ప్రతీకగా సంభావించి... తులసీ కల్యాణం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని గృహిణి లేదా దంపతులు నిర్వహిస్తారు. రామతులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి... ఇలా ఎన్నో రకాల తులసి చెట్లు ఉన్నాయి. నల్లని కాండం ఉన్న మొక్కను ‘కృష్ణ తులసి’ అనీ, తెల్లని కాండం ఉండే మొక్కను ‘లక్ష్మీ తులసి’ అనీ అంటారు. ఈ రెండు వర్ణాల తులసి వృక్షాలను తులసికోటలో నాటి, పరిణయం జరిపిస్తారు.


దశావతారాల్లో ఎనిమిదవది శ్రీకృష్ణావతారం. తులసి సన్నిధిలో ఉండడం తనకెంతో ఇష్టమని సాక్షాత్తూ కృష్ణుడే తన సహపాఠి ఉద్ధవునితో చెప్పినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. తులసితో కృష్ణునికి ఉన్న అనుబంధమే తులసీ కల్యాణం నిర్వహించడానికి ముఖ్య కారణం. ఈ కల్యాణం సందర్భంగా తులసిని షోడశోప చారాలతో పూజించి, వివిధ రకాల పండ్లు, చెరుకు ముక్కలు, చలిమిడి, వడపప్పు నివేదించి, హారతి ఇస్తారు. ముత్తైదువను శ్రీమహాలక్ష్మిగా సంభావించి, పసుపు కుంకుమలు, ఫల పుష్ప తాంబూలాదులతో సత్కరించి, దీవెనలు పొందుతారు. అలా చేస్తే మాంగల్యాభివృద్ధి కలుగుతుందని నమ్మకం. రోజంతా ఉపవసించిన గృహిణులు పూజానంతరం తులసికి నివేదించిన వాటిని ప్రసాదంగా తీసుకొని, ఉపవాసాన్ని విరమిస్తారు.


360 దీపాలు
ప్రతిరోజూ ఉభయ సంధ్యలలో దేవుని ముందు దీపాలు వెలిగించడం మన సంస్కృతిలో భాగం. అలా పెట్టలేనివారు కార్తిక మాసంలోనైనా పెట్టాలని శాస్త్రాలు అంటున్నాయి. అది కూడా చేయలేనివారు ద్వాదశినాడు 360 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తే, సంవత్సరమంతా దీపం వెలిగించినట్టవు తుందని శాస్త్ర వచనం. కార్తికమాసం అంతా దీపాలు పెట్టలేనివారు ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమల నాడు తప్పకుండా పెట్టాలనీ, అందునా ద్వాదశి నాటి దీపం వైకుంఠ ప్రాప్తి కలిగిస్తుందనీ ‘కార్తిక పురాణం’ చెబుతోంది.ఈ రోజుకు ఎన్నో విశేషాలు!

స్వాయంభువ మన్వాది సంవత్సరాలను క్షీరాబ్ధి ద్వాదశి రోజు నుంచి లెక్కిస్తారు.
‘గోవత్స ద్వాదశి’గా పిలిచే ఈ రోజున వత్సంతో అంటే దూడతో కూడిన ఆవును దానం ఇస్తే విశేష ఫలం లభిస్తుందని ఆస్తికుల విశ్వాసం.
ఏకాదశి నుంచి పూర్ణిమ వరకూ ‘భీష్మ పంచక వ్రతం’ అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరణశయ్యపై ఉన్న పితామహుడు భీష్ముని దాహార్తి తీర్చడానికి అర్జునుడు తన బాణంతో పాతాళగంగను పైకి రప్పించినది ఈ రోజునేనని ఇతిహాసాలు పేర్కొంటున్నాయి.

తులసిపూజ సంప్రదాయం
హిందూ సంస్కృతిలో తులసి అతి పవిత్రం. తులసీ కృష్ణుల అనుబంధం కూడా అటువంటిదే. తులసికోట లేని ఇల్లంటూ ఉండదు. మహిళలు తులసిని ప్రతిరోజూ పూజిస్తారు. తులసికి నీరు పోసి, దీపం పెట్టి, తులసీ స్తోత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణ చేసి, చివరగా తులసికోటలోని తీర్థాన్నీ, తులసీ దళాన్నీ స్వీకరిస్తారు. తులసిని పూజించడం అంటే లక్ష్మిని ఆరాధించడమే. క్షీరాబ్ధి ద్వాదశి రోజున తులసి పూజ... లక్ష్మీ నారాయణులకు చేసే పూజ. ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ ఆరాధన ప్రేమకూ, భక్తికీ, ప్రతీక. తులసి తీర్థం, తులసీ దళం మీదుగా వచ్చే గాలి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. తులసిలో రోగనివారక శక్తి ఉందని ఆయుర్వేదం నిరూపించింది.


-ఎ. సీతారామారావు

తులసి వివాహం
లౌకికంగా తులసి ఆరోగ్య ప్రదాయిని. ఆధ్యాత్మికంగా శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రియమైంది. కార్తిక శుద్ధ ద్వాదశి రోజు తులసికి, శ్రీకృష్ణుడితో వివాహం జరిపించడం ద్వాపరయుగం నుంచీ ఆచారంగా వస్తోందన్నది ఐతిహ్యం. లక్ష్మీదేవి అవతారమైన రుక్మిణికి తులసి పట్ల వల్లమాలిన ప్రేమ. గోపికా మానస చోరుడైన మాధవుడిని తులసిలో ఆవాహన చేసుకొని తానే తులసి మొక్కననుకొని రుక్మిణి పరవశించి పోయేదని పద్మపురాణం చెబుతోంది. అందుకే గోపాలుడికి సైతం తులసి అంటే ఎనలేని ఇష్టం. ఇందువల్లే తులసిని విష్ణుప్రియ అని సంబోధిస్తారు. 
ఆషాఢ శుద్ధ ఏకాదశి (శయన ఏకాదశి) నుంచి కార్తిక శుద్ధ ఏకాదశి (ఉత్థాన ఏకాదశి) వరకు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. ఈ నాలుగు నెలలు సన్యాసులు, యతీంద్రులు ఏదైనా ఒక పవిత్ర క్షేత్రంలో చాతుర్మాస్య వ్రతం ఆచరిస్తారు. ఆ తరవాత ద్వాదశి రోజు తులసి వివాహం జరుపుతారు. 
సముద్ర మథనం సందర్భంగా జలధి నుంచి ఉద్భవించిన శ్రీలక్ష్మిని శ్రీహరి పెళ్లి చేసుకొన్నాడు. తరవాత ఉద్భవించిన తులసి సైతం శ్రీహరినే పెళ్లాడాలని భావించి ప్రార్థించింది. అప్పటికే లక్ష్మీదేవి విష్ణువుకు భార్య అయ్యుండటాన లక్ష్మి ఆమెకు సహ సతి (సవతి)గా ఉండేందుకు నిరాకరించింది. అప్పుడు విష్ణువు చిన్నబుచ్చుకొన్న తులసిని గమనించి కాలక్రమంలో శాలిగ్రామ రూపంలో ఆమెను వివాహం చేసుకొంటానని వాగ్దానం చేస్తాడు. అప్పుడు ఆమె బృంద అనే పేరుతో విష్ణు నామాన్నే స్మరిస్తూ క్షేత్ర యాత్రలు చేస్తూ ఉంటుంది. జలంధరుడనే రాక్షసుడు బృందను రాక్షస వివాహం చేసుకొంటాడు. కాని ఆమె ఆ అసురుడికి లొంగక అసాధ్యవతిగా ఉండిపోతుంది. నారాయణ మంత్రం జపిస్తూ నన్ను తాకినప్పుడు మాత్రమే నీవల్ల నా కన్యత్వానికి భంగం కలుగుతుందని బృంద జలంధరుడికి చెబుతుంది. అసురుడిగా పుట్టి అసుర జాతికే శత్రువు అయిన నారాయణుణ్ని స్మరించలేనని జలంధరుడు అంటాడు. రాక్షస దుశ్చర్యలు చేస్తూనే ఉంటాడు. కాని జలంధరుడికి మరణం రాకుండా ఆమె కన్యత్వమే అసురుణ్ని కాపాడుతూ ఉంటుంది. రాక్షసుణ్ని సంహరించాలని శివకేశవులిద్దరూ ఎన్నో ప్రయత్నాలు చేసినా బృంద కన్యత్వం అతణ్ని రక్షిస్తూ ఉంటుంది. అప్పుడు విష్ణువు జలంధరుడి రూపం ధరించి నారాయణ మంత్రం జపిస్తూ బృంద కన్యత్వాన్ని దోచుకొంటాడు. విష్ణువును పెళ్లాడాలనుకొన్న తాను సచ్ఛీలత కోల్పోయానని భ్రమించి ఆమె గండకీ నదిలో పడి ప్రాణత్యాగం చేస్తుంది. దీనితో జలంధరుడిలోని బలం హీనమై శివుడి త్రిశూలం వల్ల మరణిస్తాడు. విష్ణువు నిజం తెలిపేందుకు ఆమెను వెంబడించి తాను సైతం గండకీ నదిలోకి ప్రవేశించగానే శాలిగ్రామంగా మారిపోతాడు. బృంద సచ్ఛీలత, పాతివ్రత్యం కారణంగా పవిత్ర గండకీ నదిలో బృంద దూకగానే తులసి మొక్కగా మారిపోతుంది. అప్పుడు విరించి స్వయాన భూమిపైకి దిగి యాజ్ఞీకుడై శాలిగ్రామానికి అమలిక (ఉసిరి) రూపం కల్పించి ఆ రెండు మొక్కలకూ కార్తిక శుద్ధ ద్వాదశి రోజు వివాహం జరుపుతాడు. ఈ పవిత్ర దైవిక సంఘటన జ్ఞాపకార్థం అప్పట్నుంచీ ఇదే రోజు తులసి వివాహం జరపడం సంప్రదాయమైంది. తులసిని మాతగా, ఉసిరి మొక్కను దామోదరుడిగా పూజించడం ఆనవాయితీ. 
వైష్ణవ ఆలయాల్లో తులసి మాలను శ్రీకృష్ణుడికి,   శ్రీరాముడికి, విష్ణుమూర్తికి ధరింపజేస్తారు. బిహార్‌ రాష్ట్రంలో సౌంజ గ్రామంలోని ప్రభుధామంలో తులసి కల్యాణం ఘనంగా జరుపుతారు. ఈ కల్యాణోత్సవాలు అక్కడ మూడు రోజులు నిర్వహిస్తారు. తులసి కల్యాణం చూసిన కన్యకు ఏడాది లోపలే విష్ణువు లాంటి వరుడితో పెళ్లవుతుందని పలువురు నమ్ముతారు.
- అప్పరుసు రమాకాంతరావు


ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment