శ్రీ లక్ష్మీ సన్నిధి | Sri Lakshmi Sannidhi | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

శ్రీ లక్ష్మీ సన్నిధి 
 Sri Lakshmi Sannidhi
Rs 108/-

పద్మ ప్రశస్తి 


సృష్టిలో తొలి పుష్పంగా పద్మాన్ని భావిస్తారు. పద్మం నుంచి పుట్టిన బ్రహ్మ పద్మసంభవుడయ్యాడు. బ్రహ్మ ఆయుర్దాయంలో మొదటి సగాన్ని పద్మకల్పంగా పురాణాలు చెబుతున్నాయి. ‘పద్మం’ అనే పదానికి పారమార్థిక, యౌగిక, వాస్తుపరమైన అర్థాలున్నాయి. పద్మం దేహంలోని ఒక నాడీచక్రం. కుబేరుడి నవనిధుల్లో ఒకటి. వాస్తురీత్యా నాలుగు దిక్కుల్లోనూ ద్వారాలు ఉన్న ఇంటిని కూడా పద్మమంటారు.

పద్మం ముందు పుట్టి ఆ తరవాత సృష్టి పుట్టిందని పురాణోక్తి. శేషతల్పంపై మహావిష్ణువు శయనించి ఉన్న సమయాన స్వామి నాభి నుంచి బ్రహ్మదేవుడు అవతరించాడని పురాణ కథనం. పద్మం పేరున ఓ పురాణమే వెలసింది. అదే పద్మపురాణం. అష్టాదశ పురాణాల్లో అది రెండోది. 50వేల శ్లోకాలు కలిగి విస్తృతిలో స్కాందపురాణం తరవాత రెండో బృహత్‌ పురాణం. విష్ణువు మహత్వాన్ని తెలిపే పురాణం. పద్మాలు సరస్సులో, చెరువుల్లో, జలం సమృద్ధిగా ఉండేచోట వికసిస్తుంటాయి. తామర, కమలం, నలిని, పంకజం మొదలైన పేర్లతో వ్యవహరిస్తారు.

ఎందరో దేవతలకు పద్మం ఆసనం. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ పద్మంపై కూర్చుని హస్తాల్లో పద్మాన్ని ధరించి ఉంటుంది. ‘కమల’ శబ్దానికి లక్ష్మీదేవి అనికూడా అర్థం ఉంది. ఆ దేవిని ‘కమలాత్మిక’ అంటారు. కమలం ఆత్మగా కలిగిన దేవత అని అర్థం.

పంకమంటే బురద. అక్కడ పుట్టిన పద్మం పంకజమైంది. పంకంలో పుట్టినా స్వచ్ఛంగా అందంగా కనిపిస్తుంది. మనం కూడా బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అంతర్గతమైన పవిత్రత, సౌందర్యం చెదరకుండా చూసుకోవాలని, నిర్మలంగా ఉండటానికి ప్రయత్నించాలని గుర్తుచేస్తుంది పద్మం. ఎప్పుడూ నీళ్లలోనే ఉన్నా తామరాకుకు తడి అంటుకోదు. ‘తామరాకు మీది నీటిబొట్టులా’ ఉండాలంటారు. జ్ఞాని దుఃఖంలో, విపరీత పరిస్థితుల్లో సైతం చలించకుండా ఆత్మానందంలో లీనమై ఉంటాడనడానికి ప్రతీకగా ఈ విషయం నిలుస్తుంది. 
శుభసూచకమైన ‘స్వస్తిక్‌’ చిహ్నం తామర పువ్వు నుంచే ఉత్పన్నమైందని భావిస్తున్నారు. సూర్యుడు పద్మినీప్రియుడు. సూర్యభగవానుడికి ప్రీతికరమైన పద్మానికి సాహిత్యంలోనూ విశేషమైన స్థానం ఉంది.

యోగశాస్త్రం ప్రకారం మన దేహాలు శక్తి కేంద్రాలైన కొన్ని చక్రాలను కలిగిఉన్నాయి. ప్రతిచక్రం నియమిత దళాల పద్మాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ధ్యానానికి కూర్చోవడానికి పద్మాసనం ఆమోదయోగ్యమవుతుంది.

శరీరంలోని చైతన్య కేంద్రాల్ని చక్రాలంటారు. మూలాధార చక్రం భౌతిక చైతన్యానికి కేంద్రం. నాభివద్ద చైతన్యకేంద్రం నీలం వర్ణంలో, ఉదరం వద్ద చైతన్యకేంద్రం ఎరుపు వర్ణంలో పదిరేకుల పద్మంలా ఉంటాయి. దానికి పైన హృదయం వద్ద చైతన్యకేంద్రం గులాబి, బంగారు రంగులు కలిసిన ఛాయలో పన్నెండు రేకుల పద్మంలా ఉంటుంది. కంఠం వద్ద చైతన్యకేంద్రం బూడిద రంగులో పదహారు రేకుల పద్మంలా ఉంటుంది. కనుబొమల మధ్య చైతన్యకేంద్రం తెలుపు వర్ణంలో రెండు రేకుల పద్మంలా ఉంటుంది. తలపై భాగంలో చక్రం స్వర్ణకాంతుల మధ్య నీలిరంగులో వెయ్యిరేకుల పద్మంలా ఉంటుంది.

శుక్రవారం మహాలక్ష్మిని పద్మాలతో సేవిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం. తామరాకు, దుంప, కాడ, పువ్వు వైద్యానికి ఉపయోగం. పద్మకాష్ఠం ఔషధీ విశేషం. తామర తూళ్లు హంసలకు ఆహారం. పద్మకోశం నాట్యంలో ఒక అభినయ హస్తవిశేషం. మహాభారత యుద్ధంలో ‘పద్మవ్యూహం’ ఉంది. పద్మరాగం జాతిరత్నం. పద్మ నాయకులు మధ్యయుగాల్లో తెలుగుగడ్డపై కొన్ని ప్రాంతాలను పాలించిన ప్రభువులు. పద్మం జ్ఞానవికాసానికి, చైతన్యానికి ప్రతీక. పద్మం మన జాతీయ పుష్పం. - డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు


ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment