శ్రీ అయ్యప్ప నిత్యనియమావళి  | Sri Ayyappa Nitya Niyamavali | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

శ్రీ అయ్యప్ప నిత్యనియమావళి  
 Sri Ayyappa Nitya Niyamavali
Rs 12/-

సన్నిధానం చేరే దారిదీ!

శబరిమల... నియమాల మాల వేసిన ప్రతి భక్తుడి గమ్యం. ఇటీవల వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళలోని ఈ దివ్యక్షేత్రం ఇప్పుడెలా ఉంది? అక్కడకు చేరుకునే మార్గాలేంటి? మండల పూజ కోసం భక్తులు ఇప్పుడు బయల్దేరవచ్చా? అక్కడకు చేరుకున్న వాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అక్కడి వాస్తవ పరిస్థితులపై ఈనాడు కథనమిది..


శబరిమల అయ్యప్ప ఆలయాన్ని దాదాపు ప్రతినెలలోనూ కొన్ని రోజుల పాటు దర్శించుకునే వీలుంది. కానీ భారీ వర్షాలు, వరదల వల్ల చింగం మాస పూజ (ఆగస్టు 16-21 తేదీలు), ఓనం పండగ (ఆగస్టు 23-27) తేదీల్లో అయ్యప్పను దర్శించుకోవడం కష్టసాధ్యమైంది. అక్కడి పరిస్థితులపై సరైన సమాచారం లేక, ఈనెలలో ప్రయాణానికి రిజర్వేషన్‌ చేయించుకున్న భక్తుల్లో చాలామంది రద్దు చేసుకున్నారు కూడా. అయితే ఇబ్బందులు తగ్గడంతో, కన్ని మాస పూజ (ఈనెల 16-21) సందర్భంగా వెళ్లిన భక్తులు అయ్యప్పను దర్శించుకోగలుగుతున్నారు. తులా మాస పూజ (అక్టోబరు 16-21), శ్రీచిత్ర అట్ట తిరుణాల్‌ (నవంబరు 5-6), మండల మహోత్సవం (నవంబరు 16- డిసెంబరు 27 తేదీలు) సందర్భంగా శబరి ప్రయాణానికి రిజర్వేషన్‌ చేయించుకుంటున్న భక్తులు కొద్దిపాటి జాగ్రత్తలతో యాత్ర పూర్తి చేయొచ్చు.

ఓనం పండగ సమయంలో భారీ వర్షాలు, వరదల వల్ల, రహదారులు ధ్వంసమయ్యాయని, శబరిమలకు వచ్చే భక్తులు తమ పర్యటనను వాయిదా వేసుకోవాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వమే విజ్ఞప్తి చేసింది. ఆ పరిస్థితుల నుంచి క్రమంగా ఆ రాష్ట్రం తేరుకుంటోంది. విమానాశ్రయాలు, ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి శబరిమల (పంబ)కు దారితీసే మార్గాలు రాకపోకలకు అనువుగా మారాయి. పంబ నుంచి సన్నిధానం వరకు కూడా భక్తులు పెద్దగా ఇబ్బందులు పడకుండానే చేరేలా చక్కబడుతున్నాయి.

నీలక్కల్‌ నుంచి పంబకు... 
తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే అయ్యప్ప భక్తులు కొట్టాయం, ఎర్నాకుళం, చెంగన్నూర్‌ రైల్వేస్టేషన్ల నుంచి, కొచ్చి-తిరువనంతపురం విమానాశ్రయాల నుంచి పంబకు వాహనాల్లో బయలుదేరతారు. ఈ కేంద్రాల నుంచి పంబ సమీపంలోని నీలక్కల్‌కు రోడ్డుమార్గం బాగానే ఉన్నందున, ఆర్‌టీసీ బస్సులు నడుస్తున్నాయి. ప్రైవేటు వాహనాలు, ట్యాక్సీలలో వెళ్లినవారు, కూడా తమ వాహనాలు నీలక్కల్‌లో నిలపాల్సిందే. అక్కడ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న పంబకు కేరళ ఆర్‌టీసీ బస్సుల్లో చేరాలి. నీలక్కల్‌ నుంచి పంబ మధ్య ఒకటి, రెండు చోట్ల రోడ్డుకు మరమ్మతులు చేస్తుండటం, పంబ వద్ద కొన్ని ప్రాంతాల్లో రోడ్డు, పార్కింగు స్థలాలు ఇటీవలి వరదలకు కోసుకుపోవడంతో ప్రైవేటు వాహనాలను పంబ వరకు అనుమతించడం లేదు. నీలక్కల్‌-పంబ మధ్య ఆర్టీసీ బస్సులు భక్తుల అవసరాలకు అనుగుణంగా నడుస్తున్నాయి. గతేడాది మండల దీక్ష సమయంలో నిర్ణయించిన ట్యాక్సీ ఛార్జీల బోర్డులను మార్చలేదు. అయితే నీలక్కల్‌ వరకే నడుస్తున్నందున, ఆమేరకు తగ్గించే రుసుమును ట్యాక్సీల నిర్వాహకులు తీసుకుంటున్నారు.


పంబ వద్ద.. 
పంబ బస్టాండ్‌ వరకు మాత్రమే ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగుతున్నాయి. అక్కడనుంచి 1-2 కిలోమీటర్లు నడిస్తేనే పంబా నదికి చేరవచ్చు. అందువల్ల సాధ్యమైనంత తక్కువ సామగ్రితో వెళ్తేనే సౌకర్యంగా ఉంటుంది. నది ఒడ్డున త్రివేణిబ్రిడ్జి, అయ్యప్ప వారధి మీదుగా ఆవలి ఒడ్డుకు చేరాలి. ప్రవాహ ఉద్ధృతి తగ్గినా, ఇసుక, మట్టి పేరుకున్నందున, ఈ వంతెన సమీపంలోనే పంబా నదిలో పుణ్యస్నానం ఆచరించే వీలుంది. భద్రతా సిబ్బంది సూచించిన చోటే స్నానమాచరించాలి. కొండనుంచి తిరిగి వచ్చాక, మళ్లీ బస్టాండు వరకు నడిచి వచ్చి, నీలక్కల్‌ బస్‌ ఎక్కాల్సిందే.

తినుబండారాలకు లోటు లేదు 
తినుబండారాలు కొనుగోలు చేసుకోడానికి నడక మార్గం పొడవునా దుకాణాలున్నాయి. ప్రారంభంలో కొబ్బరి బొండాలతో ప్రారంభించి, దారిపొడవునా ఉండే దుకాణాల్లో చాలావరకు తెరచి ఉంచారు. సోడాలు, చిరుతిళ్లు, శీతల పానీయాలు వీటిల్లో అందుబాటులో ఉన్నాయి. సన్నిధానం సమీపంలోనూ ఆర్యన్‌ హోటల్‌ తెరచినందున, అల్పాహారం ఇబ్బంది లేదు.

నెట్‌వర్క్‌ సమస్య లేనట్లే... 
పంబ, సన్నిధానం, నీలక్కల్‌ ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌ బాగా పనిచేస్తోంది. భారతీ ఎయిర్‌టెల్‌, ఐడియా కొంతవరకు పనిచేస్తున్నాయని, జియో నెట్‌వర్క్‌ సరిగా లేదని భక్తులు చెబుతున్నారు. టెలికాం సంస్థలు నెట్‌వర్క్‌ల పునరుద్ధరణ యత్నాల్లో ఉన్నాయి. వచ్చే నెలకు అన్నీ సరికావచ్చు.

అందుబాటులో గదులు 
దేవస్థానానికి భక్తుల సంఖ్య తక్కువగా ఉన్నందున, కొండపైన గదులు కూడా అద్దెకు లభిస్తున్నాయి. దేవస్థానం అద్దెకు ఇచ్చే గదులు, ప్రైవేటు గెస్ట్‌హౌస్‌లు కూడా తెరచినందున, విశ్రమించేందుకు అవకాశం లభిస్తోంది. ప్రసాదాలు కూడా సాధారణంగానే విక్రయిస్తున్నారు.

రక్షిత నీరూ లభిస్తోంది 
రక్షిత నీటి కోసం గత రెండేళ్లుగా చేసిన ఏర్పాట్లు కొంత దెబ్బతిన్నా, పునరుద్ధరించారు. దారి పొడవునా, సన్నిధానం సమీపంలోనూ ఆర్‌ఓతో శుద్ధిచేసిన తాగునీరూ లభిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్లాస్టిక్‌ కవర్లు, సీసాలను అనుమతించేది లేదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అందువల్ల మరీ అవసరమైతే తాగునీటి కోసం ప్రత్యేక బాటిల్‌ను భక్తులు వెంటతీసుకెళ్లడం మంచిది. నీటిని పొదుపుగా వాడుకోవాలని దేవస్థానం సూచిస్తోంది.


తక్కువ సామగ్రితో... 
వరద ఉద్ధృతికి పంబ వద్ద షెడ్డులోని దుకాణాలన్నీ కొట్టుకుపోయాయి. ప్రస్తుతానికి క్లోక్‌రూమ్‌లు కూడా తెరవలేదు. అందువల్ల సూట్‌కేసులు, బ్యాగులు పంబ వద్ద ఉంచుకోవడం వీలుకాదు. సాధ్యమైనంత తక్కువ సామగ్రితో వెళ్తేనే సౌకర్యంగా ఉంటుంది. దుకాణాల షెడ్డు వెనుకగా ఉన్న మార్గం ద్వారా, కన్నిమూల గణపతి ఆలయం చేరుకోవాలి. అక్కడనుంచి పోలీస్‌ చెక్‌పోస్టు మీదుగా నడకమార్గానికి చేరే దారి సాధారణంగానే ఉంది. మెటల్‌ డిటెక్టర్లు సహా అన్నీ యథావిథిగానే ఉన్నాయి.

నడకకు ఆటంకాలు లేవు 
నడకమార్గంలో వీధిదీపాలు పనిచేస్తున్నాయి. చెట్ల కొమ్మలు, ఆకుల వంటివి మాత్రమే దారిపొడవునా ఉన్నాయి కానీ, నడకకు ఆటంకం కలిగించేలా లేవు. బురద కూడా లేదు. వర్షాల నేపథ్యంలో విషపురుగులు, పాములు సంచరిస్తాయని అధికారులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. కానీ భయపడాల్సిన పరిస్థితేమీ లేవని వెళ్లొచ్చిన భక్తులంటున్నారు. లైట్ల వెలుతురు బాగానే ఉన్నందున, రాత్రిళ్లు కూడా భక్తుల నడక గతంలో మాదిరే సాగుతోంది. - కాకుమాను అమర్‌కుమార్‌
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment