సంధ్యావందనం  | Sandhyavandanam | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

సంధ్యావందనం  
Sandhyavandanam
Rs 27/-

వేదమంత్రాలన్నింటికీ 
తల్లి.. గాయత్రి

    వేదమంత్రాలన్నింటికీ తల్లి.. గాయత్రి. ఒక్కో పాదంలో ఎనిమిది అక్షరాలు చొప్పున మూడు పాదాల్లో ఇరవై నాలుగు అక్షరాలు ఉండే మంత్రం ఇది. అందుకే దీనిని ‘త్రిపదగాయత్రి’ అంటారు. ఒక్కొక్క పాదం ఒక్కొక్క వేదం తాలూకూ సారం. అధర్వణ వేదానికి వేరే గాయత్రి ఉన్నది. ఆ గాయత్రిని పొందడానికి ప్రత్యేకంగా ఉపనయనము చేసుకోవలసి ఉంటుంది. త్రిపద గాయత్రి ఋగ్యజస్సామ వేదాల సారం. ఎంతటి కష్టకాలంలోనైనా సరే గాయత్రీ మంత్రాన్ని కనీసం పదిసార్లయినా జపించాలి. నిత్యం ముమ్మారు సంధ్యావందనం చేయాలి. ఉదయ సంధ్యలో జీవులన్నీ నిద్రలేచి మనసు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రతకు అనువుగా ఉంటుంది. పగలంతా శ్రమ పడిన జీవులు సాయంకాలం ఇల్లు చేరి ప్రశాంతతను పొందుతాయి. సూర్యుడు నడినెత్తిన చేరిన సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ సమయాలలో వరుసగా గాయత్రి, సావిత్రి, సరస్వతీ దేవతలను ధ్యానించాలి. ఉదయం విష్ణుప్రధానమైనది. మధ్యాహ్నం బ్రహ్మస్వరూపిణిగానూ, సాయంత్రం శివస్వరూపిణిగానూ గాయత్రిని ధ్యానించాలి.

ఈ మూడు కలిసి సమిష్టి గాయత్రి. గాయత్రి అన్ని వైదిక మంత్రాల శక్తులనూ కలిగి ఉన్నది. ఇది మిగతా మంత్రములకు శక్తినిస్తుంది. గాయత్రి అనుష్ఠానం చేయకుండా మరి ఏ ఇతర మంత్రాన్ని జపించినా అవి ఫలితాన్నీయవు. సంధ్యావందనంలో గాయత్రీ జపం, అర్ఘ్యత్రయ ప్రదానం ముఖ్యమైనవి. మిగతావన్నీ అంగాలు. లేవలేని స్థితిలో కూడా కనీసం అర్ఘ్యత్రయ ప్రదానం, కనీసం పదిసార్లయినా గాయత్రీ జపం చేయాలి. ఈ రెండే ముఖ్యమైనవి కాబట్టి, మిగతావి వదిలేస్తే కాలక్రమంలో ఈ రెండూ కూడా వదిలేస్తాము. అందుకే సంధ్యావందనం విడువకుండా సకాలంలో చేయాలి. మహాభారత యుద్ధంలో సంధ్యాకాలంలో యుద్ధంలో ఉండవలసి వచ్చిన వీరులు, సకాలంలో మన్నుతో అర్ఘ్యమిచ్చారు. ఎవరికైనా విపరీతమైన జ్వరం వచ్చి సంధ్యావందనం చేయలేకపోతే.. వారికి పరిచర్య చేసేవారు వారి తరఫున సంధ్యావందనం చేసి ఆ జలాన్ని తీర్థంగా ఇవ్వాలి. జనన మరణ చక్రం నుంచి దాటించే శక్తిమంతమైన సాధనం.. గాయత్రీ మంత్రం.

------


తిలక, భస్మ ధారణతో 
       మంచి ఆలోచనలు 

‘లలాట లిఖితారేఖా పరిమార్తుం నశక్యతే’ ..చతుర్ముఖ బ్రహ్మ మన నుదుటి మీద రాసిన రాత ప్రకారం మనం పనులు చేసేస్తుంటాం, బ్రహ్మ రాసిన రాత మారదు అని ఒక వెలితి మాట అంటుంటాం. అది తప్పు. తిలకధారణ చేసి విభూతి పెట్టుకోగానే, మన ఆలోచనాసరళిలో మార్పు వస్తుంది. ఆజ్ఞా చక్రంమీది బొట్టు అమ్మవారి అనుగ్రహం. అమ్మవారి అనుగ్రహం ఆజ్ఞా చక్రం మీద ప్రసరించడం మొదలవగానే మన ఆలోచన మారిపోతుంది. మనం చేసే తప్పుడు పనులను మానివేయాలనే భావన కలుగుతుంది. పెద్దలు ఇటువంటి ఆచారములను ఏదో హాస్యాస్పదంగా పెట్టలేదు. తిలకధారణ చేయడం ప్రారంభిస్తే దుఃఖమును స్వీకరించి దుఃఖము నుండి బయటపడతారు. ఇది చిత్రంగా ఉంటుంది. ఈ లోకంలో సత్వ్తము రజస్సు తమస్సు అను మూడు గుణాలున్నాయి.

ఈ మూడూ మన మనస్సును సుఖాలను అనుభవించమని ప్రోత్సహిస్తూ ఉంటాయి. భగవత్సంబంధమైన పురాణప్రవచనాలను వినడానికి బదులు, లౌకికమయిన కార్యక్రమములు మున్నగువాటిని చూడమని చెబుతుంటాయి. అవి మనం ఉన్నతిని పొందకుండా బాధిస్తుంటాయి. ఉన్నతిని పొందకుండా బాధించే త్రిగుణముల బాధ నుండి బయటపడటానికి సంసారమనే కొత్త బాధను ఎంచుకుంటాం. బాధపోవడానికి బాధలోకి వెళ్లడంలోని సూక్ష్మం ఏమిటంటే.. సత్వరజస్తమోగుణములనబడే మూడుగుణములనుండి బయట పడడానికే సంసారములోనికి ప్రవేశించి సుఖములను అనుభవించి, ఈ సుఖములు సుఖములు కావు - నిజమయిన సుఖము ఈశ్వరుడే అనే లక్షణమును ఏర్పరచుకుని, వైరాగ్యసంపత్తిని పెంపొందించుకోవడం. దానివలన మనిషి ఇక ఇంద్రియాలు, మనసు చలించని స్థితికి వెడతాడు.

ఇంద్రియములను గెలవడంకాదు- మనస్సు కదలని స్థితికి పూర్ణవైరాగ్యం అనిపేరు. అంత వైరాగ్యం రావడం కూడ ఈశ్వరానుగ్రహమే!. ఈ వైరాగ్యసంపత్తిచేత శాశ్వతసుఖస్థానమయిన ఈశ్వరునియందు కలిసిపోతాడు. ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేని మోక్షస్థితిని పొందుతాడు. ఇలా పొందడానికి ‘శంభుః’ అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. శివుడి పాదములను మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే, శివాష్టోత్తరం చదువుకుంటూ ఉంటే, భస్మధారణ చేసినట్లయితే, బొట్టు పెట్టుకున్నట్లయితే ఏమీ చేత కాకపోయినా శివనామములు చెప్పడం మొదలు పెట్టినట్లయితే, మీకు తెలియకుండా ఒక రకమయిన మార్పు ప్రారంభం అయిపోతుంది. ఆ మార్పు మంచి ఆలోచనలవైపు తీసుకొని వెళ్లగలదు.- చాగంటి కోటేశ్వరరావు శర్మ
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment