సంపూర్ణ ఆరోగ్యానికి యోగా | Sampurna Arogyaniki Yoga | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
సంపూర్ణ ఆరోగ్యానికి యోగా
Sampurna Arogyaniki Yoga
Rs.36/-

 అంతర్జాతీయ యోగా దినోత్సవం 
నీలోని నీవు ఎలా ఉన్నావు?


రకరకాల ఆసనాలు, ప్రాణాయామం వంటి ప్రక్రియలను సాధన చేయడమే యోగా అని చాలామంది పొరబడతారు. వాస్తవానికి అవి సోపానాలు మాత్రమే! యోగజీవనం సిద్ధించడానికి అవి సాధనాల వంటివి. పరికరాల వంటివి. యోగమంటే పరిపూర్ణ జీవన విధానం. తొణికిసలాడే అద్భుతమైన జీవన కళ! యోగస్థితి ఉన్నతమైందని గీతాచార్యుడు బోధించాడు. యోగి కావాలని అర్జునుణ్ని స్వయంగా ఆదేశించాడు. 

శరీరాన్ని బుద్ధితో, బుద్ధిని మనస్సుతో, మనసును ఆత్మతో, ఆత్మను పరమాత్మతో ఐక్యం చేయగలగాలి. ఇలా చేయడం అంత తేలికేం కాదు. ఈ స్థితిని సాధించాలంటే ఒక క్రమ పద్ధతిలో జీవించాలి. ఆలోచించాలి. ఆ జీవన విధానాన్ని యోగ సాధన అంటారు. శరీరం, మనసు కేంద్రీకృతమైనప్పుడే ఈ లక్ష్యాన్ని సాధించగలుగుతాం. ప్రాణాయామ ధ్యాన ఆసనాదులు యోగసిద్ధికి దోహదం చేస్తాయి. 

రామాయణం ఆరంభంలో వాల్మీకి వర్ణించిన పదహారు సత్పురుష లక్షణాలలో ‘ఆత్మవాన్‌’ అనేదొకటి. ‘రాముడు ఆత్మవిదుడు’ అన్నారు వాల్మీకి. అది యోగి లక్షణం. ‘నీకు పట్టం కడుతున్నాను’ అని తండ్రి అన్నప్పుడు రాముడు పట్టరాని సంతోషంతో ఊగిపోలేదు. మర్నాడే అరణ్యాలకు పోవాలని తీర్పిస్తే కుంగిపోనూలేదు. అడవుల్లో కష్టాలకు కంటతడి పెట్టిన దాఖలాలు లేవు. ‘ఏనాడో పాపం చేసి పుట్టాను. ఈ కోతి మూకతో వేగుతున్నాను’ అని చింతించిన ఘట్టాలు లేవు. భరతునితో, విభీషణుడితో మధ్యలో గుహుడితోనూ ఆయన ఒకేలా ఉన్నాడు. అయోధ్యలో, అడవిలో ఒకేలా ఉండగలిగాడు. అదే యోగజీవనమంటే! 

ఇంతటి స్థిర చిత్తం, స్థిత ప్రజ్ఞత రావాలంటే తనను తాను తెలుసుకోవాలి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అదుపు చాలా ముఖ్యం. అందుకే యోగమంటే చిత్తవృత్తుల నిరోధంగా పతంజలి మహర్షి నిర్వచించారు. మన శరీరంలో 72వేల నాడులు, 206 ఎముకలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు కోశాలు అనేక ధాతువులు ఉన్నాయి. శరీరం పటిష్టంగా ఉండాలంటే నాడీ మండలం దృఢంగా ఉండాలి. నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తూ ప్రధాన శక్తి కేంద్రాల్ని షట్చక్రాలుగా వ్యవహరిస్తారు. మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అనే ఆరు చక్రాల్ని అధిగమిస్తే పరమపదమైన సహస్రార చక్రం ఉంటుంది. ఆ చక్రాన్ని అందుకోవడానికి సాధకులు సాగించే మార్గమే యోగ. ‘ఉద్ధరేదాత్మనాత్మనం’ తనను తానే ఉద్ధరించుకోవాలి. ఇది యోగావలంబనకు మౌలిక సూత్రం. ఆరోగ్యమనేది ఒకరి నుంచి అరువు తెచ్చుకునేది కాదు. ఆధ్యాత్మిక శక్తి ఒకరు ధారపోస్తే సంక్రమించేది కాదు. ఎవరికివారు శోధించుకోవాలి. సాధించాలి. ఆస్వాదించాలి. ‘యోగ ఫర్‌ లివ్‌ లైఫ్‌ టు పొటెన్షియల్‌’ అనే నినాదంతో నేటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించింది. ‘జీవితాన్ని శక్తివంతం చేసుకోవడానికి యోగ సాధన చేయాలి’ అనే శారీరక ఆరోగ్య సూత్రాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. యోగ అనేది మధురమైన మిఠాయి లాంటిది. ఆస్వాదిస్తేనే దాని వైశిష్ట్యం తెలుస్తుంది.

తిండీ యోగమే


    యోగం అనే పదానికి శబ్ధార్థ చంద్రిక సూచించిన అర్థాల్లో ‘కూడిక’, కూర్పు అనేవి చాలా ముఖ్యమైనవి. యోగ సాధనలు మనసును కట్టడి చేస్తాయి. దాని స్వేచ్ఛా సంచారాన్ని అదుపు చేయడం ద్వారా మనిషితో మనసుకు కూర్పునిస్తాయి. అలాగే తనువు, మనసు కూడి ఉండడమే అసలైన యోగం. చిత్త వృత్తుల నిరోధం ద్వారా మనసుతో చక్కటి స్నేహం, అవగాహన ఏర్పడితే మనిషికి ప్రస్తుతం తానున్న స్థితి గురించి పూర్తి ఎరుక ఉంటుంది. ఇలా మనసుకు, తనువుకు సంబంధాన్ని ఏర్పరచడంలో ఆహారం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే యోగా చేసేవారు తప్పనిసరిగా ఆహార నియమాలు పాటిస్తారు. మనం తినే ఆహారం రాజస, తామస, సత్త్వ గుణాల్లో ఉంటుంది. ఏరకమైన ఆహారం ఎక్కువగా తీసుకునే వ్యక్తులు అలాంటి స్వభావాలను కలిగి ఉంటారని యోగ శాస్త్రం చెబుతుంది. సత్త్వ శుద్ధి కలిగిన ఆహారం సాత్త్విక భావాలనిస్తుంది. ఇలాంటి ఆహారం తీసుకునే వారి శరీరానికి, మనసుకు ఒక దివ్య బంధం ఏర్పడుతుంది. ఈ కూడికే ఆహార యోగం. సాధన సమయంలో శారీరక, మానసిక మార్పులను, అనేక ప్రలోభాలను ఓర్పుతో, నేర్పుతో జయించాల్సి ఉంటుంది. రజో, తమో గుణాలున్న ఆహారం తీసుకునే వారికి ఈ శక్తి తక్కువగా ఉంటుంది. వీరు యోగ సాధనలో నిలవడం కష్టమవుతుంది. ఇలా నిలబడలేనివారిని రామకృష్ణ పరమహంస ‘అల్పబుద్ధులు’గా అభివర్ణించారు. సాధనలో అలా జారిపోతున్న వారి గురించి పతంజలి మహర్షి ‘స్థాన్యువని మంత్రణే సంగస్మయాకరణం పునరనిష్ట ప్రసంగాత్‌’ అనే సూత్రంతో హెచ్చరించారు. తీసుకునే ఆహారం యోగ సాధకుల పాలిట అపాయం అవుతుంది. దీన్ని జయించే ఏకైక ఉపాయం యుక్తాహారం. అదే సాత్త్వికాహారం.యోగ సాధనలో పరిపూర్ణత సాధించిన వారు సిద్ధులమవుతారు. వారి మానసిక స్థితి అనుక్షణం సాత్త్వికంగా ఉంటుంది. 

సరైన ఆహారం తీసుకోకపోవడమే కాదు అసలు ఆహారం తీసుకోకపోవడం కూడా సరైన విధానం కాదు. యోగ సాధకులకు ఇది మంచిది కాదని మాస్టర్‌ సి.వి.వి.(కంచుపాటి వెంకటరావు వెంకస్వామి రావు) చెప్పేవారు. సాధన ప్రారంభించే ముందు అందరినీ అల్పాహారం తీసుకోమని చెప్పేవారు. ఆయన రూపొందించిన యోగ విధానం పేరు ‘భ్రుక్త రహిత తారక రాజ యోగ సాధన’. ఈ సాధన చేస్తున్నప్పుడు ఎవరైనా అతిగా ఆహారం తీసుకుని వచ్చినా, ఎవరైనా అసలు ఆహారం తీసుకోకున్నా ఆ విషయాలు మాస్టర్‌కు వెంటనే తెలిసేది. వారికి ఆయన తగిన విధంగా యోగ మార్గాలను సూచించే వారు. సాధన చేస్తున్న సమయంలో కడుపు నిండిన వారు, ఖాళీ కడుపుతో ఉన్న వారు శారీరకంగా ఒకే స్థితిని పొందడం భక్తులు గమనించేవారు. కాబట్టి యోగ సాధకులు ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యోగశాస్త్రం చెబుతుంది.

పనిలో నైపుణ్యం చూపించు!


చేసే పనిలో నేర్పరితనాన్ని చూపించగలగడం కూడా యోగమే. యోగః కర్మాను కౌశలమ్‌ అంటారు. మనం ఒక పని చేస్తున్నప్పుడు మన మనసు దానిమీదే లగ్నం కావాలి. ఆ సమయంలో వేరే విషయాలేవీ మనసుపై ప్రసరించవు. యోగ పరిభాషలో దీన్ని చిత్త వృత్తి నిరోధం అంటారు. దీన్నే ఏకాగ్రత అని పిలుస్తాం. దీనివల్ల ఆ పని నాణ్యంగా ఉంటుంది. సత్ఫలితాలు వస్తాయి. ఇలా పని చేసేవాడు యోగి అవుతాడు. 

అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః 

అంటుంది ఆత్మ సంయమ యోగం. అంటే ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా పని చేయమంటుంది. మరి ఫలితాన్ని ఆశించకుండా కర్మాచరణం ఎలా సాధ్యపడుతుంది. నేల దున్ని, నారు పోసి, నీరు పెట్టిన రైతన్న ఎలాంటి ఫలితాన్ని ఆశించొద్దా... కచ్చితంగా ఆశించాలి. కానీ మనం పని చేసే విధానంలోనే మార్పులు రావాలి. కర్తవ్య కర్మను చేసుకుంటూ పోయేవాడు యోగి. ఇక్కడ కర్తవ్య కర్మ అంటే తనకు కేటాయించి ఉన్న పని అని అర్థం. అయితే నా పనిని నేను చేసుకుంటూ పోతున్నాను. అనే భావంతో పని చేయడం వల్ల ఒక సమత్వ స్థితి వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ స్థితిలో చేసే వారి పనిలో నాణ్యత ఉంటుంది. దినచర్యలో దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ, చేసే ప్రతి పనీ దైవ సేవగా భావిస్తూ, విశ్వ ప్రేమను, సర్వభూత దయా గుణాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ అభ్యాసం వల్ల సృష్టి అణువణువులో దైవత్వాన్ని చూడగలుగుతాం. ఇదే అనన్య చింతన. ఈ అభ్యాసం ఫలించిన సాధకుడికి భౌతికంగా, మానసికంగా సమ దృష్టి కలుగుతుంది. మనసులో ప్రతికూల, అనుకూల భావాలు క్రమంగా తగ్గిపోతాయి. వినియోగాన్ని బట్టి మాత్రమే ఆ వస్తువును స్వీకరిస్తాం తప్ప విలువను బట్టి కాదు. న్యాయమూర్తి చెడ్డవాడికి శిక్ష వేసినా అది కర్తవ్య నిర్వహణలో భాగమే తప్ప అతని మనసుకు తాకదు. అభ్యాస యోగ కౌశలుడు తనకు ఎదురైన పరిస్థితుల విషయంలో ఒక న్యాయమూర్తిగా మాత్రమే ప్రవర్తిస్తాడు. విశాలమైన విశ్వంలో తన పాత్రను గుర్తించి సమ దర్శనాన్ని, కర్మాచరణలో నైపుణ్యాన్ని సాధించి తన జీవన పయనంలో సురక్షితంగా గమ్యాన్నిచేరుకుంటాడు. కృతార్థుడు అవుతాడు.

నీకు నువ్వు ఇచ్చుకునే విలువైన నజరానా యోగ సాధన 
- టిబెట్‌ రచయిత రిన్‌పోచే!

‘హంస’ధ్వని


మనిషి బతుకుకే కాదు తనను తాను తెలుసుకునే యోగ ప్రక్రియలకు కూడా మనం పీల్చి వదిలే శ్వాసలే మూలాధారం. ముక్కులోని గాలి మోక్షానికి దారి... అన్నారు యోగి వేమన. మనిషి నిమిషానికి సగటున 15 సార్లు ఊపిరి పీలుస్తాడు. గంటకు 900 సార్లు. రోజుకు 21,600 సార్లు మన ప్రయత్నమేమీ లేకుండా శ్వాసక్రియ జరుగుతుంటుంది. శ్వాస లోనికి వెళ్లేటప్పుడు ‘స’ అని, బయటకు వచ్చేటప్పుడు ‘హ’కార ధ్వని చేస్తూ ఉంటుంది. దీన్నే హంస మంత్రమని వివరిస్తోంది క్రియా యోగం. మనిషి శరీరంలో సహజంగా జరిగే ఈ మంత్ర జపాన్ని పూర్తి ఎరుకతో... తెలిసి చేయడమే తనను తాను తెలుసుకునే మార్గమంటుంది ఈ యోగ ప్రక్రియ.

పంచప్రాణాలంటే..

యోగ అభ్యాసం అనగానే ముందుగా వినిపించే మాట ప్రాణాయామం. అసలీ ప్రాణం అంటే ఏంటి? అది ఎన్ని రకాలు?. లోక వ్యవహారంలో ‘‘నీమీదే పంచప్రాణాలు పెట్టుకున్నాను!’’ అనే మాట తరచూ వినిపిస్తుంటుంది. ఈ నానుడిలోని పంచప్రాణాల వివరణను మన రుషులు ఎంతో విశ్లేషించి చెప్పారు.

‘‘హృది ప్రాణోగుదే పానః సమానో నాభి సంస్థితః 
ఉదానః కంఠ దేశస్థో వ్యానః సర్వశరీరగః’’ 
ఈ శరీరంలో అయిదు ప్రాణవాయువులు ఉంటాయి. వాటికి ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన అని అయిదు పేర్లు. హృదయంలో ప్రాణవాయువు, గుదంలో అపానవాయువు, నాభిలో సమాన వాయువు, కంఠంలో ఉదాన వాయువు, శరీరం అంతటా వ్యాన వాయువు వ్యాపించి ఉంటుంది.

ఈ విషయం అర్ధం చేసుకో...


ఈ సృష్టి అంతా రేఖాగణిత సూత్రాల ఆధారంగా ఉంటుంది. మన శరీరం కూడా అంతే! కొన్నేళ్లు వెనక్కి వెళ్తే.. తుపాను వచ్చిన ప్రతిసారీ టీవీ ప్రసారాల్లో అంతరాయాలు వచ్చేవి. యాంటెన్నాని సరిచేయాల్సి వచ్చేది. అది ఒక విధమైన కోణంలో ఉంటేనే టీవీలో ప్రసారాలు బాగా వచ్చేవి. ఈ శరీరం కూడా అలాంటిదే! మీరు దానిని సరైన స్ధితిలో ఉంచితే, అది పూర్తి విశ్వాన్ని గ్రహించగలదు. మీరు దానిని వేరే విధంగా ఉంచితే సమస్యలు వస్తాయి. 

మీకు మీ పంచేంద్రియాలు తప్ప ఇంకేమీ తెలియవు. మన శరీరం ఒక బారోమీటర్‌ వంటిది. మీకు దానిని ఎలా చూడాలో తెలిస్తే, అది మీ గురించి, మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి అంతా తెలియజేస్తుంది. మీ శరీరం మీకు ఎప్పుడూ అబద్ధం చెప్పదు, అందుకనే మనం యోగాలో మన శరీరాన్ని నమ్మడం నేర్చుకుంటాము. యోగా ద్వారా మనం మన భౌతిక శరీరంలో జరిగే కొన్ని నిర్బంధపు ప్రక్రియలను స్పృహతో జరిపే ప్రక్రియలుగా మారుస్తాం. తద్వారా శరీరాన్ని అన్నింటినీ గ్రహంచగలిగే, తెలుసుకోగలిగే ఒక శక్తిమంతమైన పరికరంగా మారుస్తాం.శరీరాన్ని ఎలా చదవాలో తెలిస్తే, అది మీ సామర్ధ్యాన్ని, మీ పరిమితులని మీ భూత, భవిష్యత్‌, వర్తమానాలన్నిటినీ మీకు తెలియజేస్తుంది. 

యోగా అన్నప్పుడు చాలా మంది శరీరాన్ని అసాధ్యమైన భంగిమల్లోకి తిప్పడం అని అర్ధం చేసుకుంటారు. యోగా అంటే శరీరాన్ని మెలికలు తిప్పటం లేక తల్లక్రిందులుగా నుంచోవటం కాదు. యోగా అనేది ఒక వ్యాయామ పద్ధతి కాదు, అది మనిషిని తను చేరుకోగల అత్యునత్త స్థితికి చేరవేసే ఒక సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానం. అసలు యోగా అంటే ఐక్యం అని అర్థం . మీరు అన్నిటితో ఐక్యం అయితే, అదే యోగా!
- సద్గురు జగ్గీ వాసుదేవ్‌


చెట్లు చిగురిస్తాయి... ఆకులవుతాయి... 
అవి రాలి తిరిగి చెట్టుకు ఎరువుగా మారతాయి... కొత్త చిగుళ్లకు కారణమవుతాయి... 
ఆత్మ కూడా అంతే మనిషి రూపంలో పుడుతుంది. 
ఆ శరీరంతో ఎన్నో కర్మలు నిర్వర్తిస్తుంది. 
వాటినే భావి జన్మపరంపరకు బాటలుగా వేసుకుంటుంది. 
ఈ చక్రీయ భ్రమణంలో పుట్టుకకు, చావుకు అతీతమైన సహజ స్ధితి ఒకటుంటుంది. 
ఎవరినైనా సరే ఆ స్థితికి తీసుకెళ్లే సాధనా మార్గమే యోగం. 
ఒక్కమాటలో చెప్పాలంటే యోగా మనల్ని మనకు పరిచయం చేసే ఏకైక మార్గం. 
శరీరాన్ని సాధనంగా చేసుకుని... శ్వాసను మార్గంగా మార్చుకుని 
మనిషి చేసే ఈ ఆధ్యాత్మిక యాత్ర అద్భుతమైంది. అపురూపమైంది. 
ఆరోగ్యం, ఆనందం, ఆయుష్షు దీని ఉప ఉత్పత్తులు.

ఆయనే స్ఫూర్తి..


మహేశ్వరుడు యోగానంద స్వరూపుడు. భారతీయ సంప్రదాయంలోని యోగమంతా కలిసి ఒక మూర్తిగా రూపొందితే అదే శివ స్వరూపం.సాధకులకు ఆ రూపం, వ్యక్తిత్వం అంతులేని స్ఫూర్తినిస్తుంటాయి. చంచలమైన మనసును ఎలా అదుపు చేసుకోవాలో యోగశాస్త్రం ఒక్కో మెట్టుగా విధానాలన్నిటినీ పతంజలి మహర్షి చెప్పారు. మనసును స్థిరం చేసినప్పుడు చేరినప్పుడు మనిషి సమాజాన్ని చూసే దృక్కోణమే మారిపోతుంది. జ్ఞానాన్ని పొందాలనుకున్న ఏ సాధకుడైనా యోగ సమాధి నిష్ఠలో ఉన్న యోగమూర్తి అయిన శివుడి స్వరూపాన్ని గమనిస్తే తాను అనుసరించాల్సిన మార్గమేమిటో బోధపడుతుంది.

పద్మాసనం

యోగసాధనలో శివుడు ఈ ఆసనంలోనే ఉంటాడు. అందులో ఉండి ధ్యానం చేస్తే హృదయస్థానంలో మనసును ఏకాగ్రం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎడమకాలును కుడి తొడపై, కుడి కాలును ఎడమ తొడపై ఉంచి రెండు చేతులను మోకాళ్ల మీదకు తెచ్చి.. ఎడమ అరచేతిలో కుడి అరచేతిని ఉంచుతారు. ఆ స్థితిలో వెన్నెముక నిటారుగా ఉంటుంది. ధ్యానం చేయడానికి శరీరం అనువుగా ఉంటుంది. శివుడి చిన్ముద్ర జ్ఞానానికి చిహ్నం.

యోగ సమాధి

శివస్వరూపంలో కనిపించే మరొక మహోన్నత చిహ్నం సమాధి స్థితి. సమాధి అంటే సాధకుడు దేనినైతే ధ్యానిస్తున్నాడో దానిలో లీనమైపోవడం. యోగానికి సంబంధించిన ఎనిమిది అంశాలలో సమాధి చివరిది. ఉన్మని, మనోన్మని, అమరత్వం, లయం, తత్వం, శూన్యాశూన్యం, పరమపదం, అమనస్యం, అద్వైతం, నిరాలంబం, నిరంజనం, జీవన్ముక్తి, సహజం, తుర్యం, తురీయం... ఇవన్నీ సమాధికి పర్యాయపదాలు.

మూడు కళ్లూ...

యోగమూర్తి అయిన శివుడికి ఉండే మూడు కళ్లు ఆయన సాధనకు సంబంధించిన విషయాలను తెలియజేస్తుంటాయి. యోగసాధనలో సఫలీకృతులైన సాధకులు సమాధిస్థితిలో చేరుకున్నప్పుడు నుదురు భాగంలో ఉండే ఆజ్ఞాచక్రం దగ్గర ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది. ఆ స్వామికుండే మూడోకన్ను ఆజ్ఞాచక్రంలో ప్రకాశించే ఆత్మజ్యోతికి నిదర్శనం. అలాగే సత్వరజస్తమోగుణాలనే మూడు గుణాలకు శివుడు అతీతుడనే అర్థంకూడా ఉంది.

మెడలో పాములెందుకు?

యోగనిష్టలో ఉన్న పరమేశ్వరుడి మెడలో పాములు కనిపిస్తాయి. ఈ పాములు యోగసాధన ద్వారా చెడును అదుపు చేయవచ్చనే సందేశాన్నిస్తూ కనిపిస్తాయి. ఆ స్వామి శిరసున ధరించిన గంగ కూడా యోగ సాధనకు నిదర్శనమే! యోగ సాధకుడు సంపదలను స్వార్థం కోసం కాకుండా.. పరుల కోసం వినియోగించే తత్వాన్ని కలిగి ఉంటాడన్న సందేశం గంగ ద్వారా అందుతుంది.

రచన: ఎర్రాప్రగడ రామకృష్ణ, యల్లాప్రగడ మల్లికార్జునరావు, కావూరి రాజేష్‌పటేల్‌
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment