సర్వకార్యసిద్దికి 
రామాయణ పారాయణ 

Sarva Karya Siddiki
Ramayana Parayanamu


   శ్రీరామ పట్టాభిషేకం సపరివార చిత్రపటంలో శత్రుఘ్నుడు ఒక తెల్లని గొడుగు పట్టుకొని ఉంటాడు. దాన్ని శ్వేతచ్ఛత్రం (వెల్లగొడుగు) అంటారు. భారతీయ రాజనీతి శాస్త్రాలకు వెల్లగొడుగే ప్రతీక. అయోధ్యాకాండలోని కచ్చిత్‌సర్గ రాముడి రాజనీతి వైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. ‘కారే రాజులు...’ పద్యంలో పోతన భాగవతం- బలిచక్రవర్తి నోట భారతీయ షోడశ చక్రవర్తుల పరిపాలనా శీలానికి యోగ్యతాపత్రాలు ప్రకటించింది. పరిపాలన అనేది భారతీయుల దృష్టిలో ఒక పవిత్ర బాధ్యత!

రాజ్యాలు అంతరించాయి. రాజులు గతించారు. కానీ ప్రజలున్నారు. పాలకులున్నారు. ప్రభుత్వం పాలకుల చేతుల్లోనే ఉంది. వ్యవస్థ అదే అయినా ‘ప్రజాస్వామ్యం’ అని పేరు మారింది. తమది ‘రామరాజ్యం’ అని పాలకులు ప్రకటిస్తూ ఉంటారు.

రామరాజ్యం అనేది అటు ప్రజారంజకమైన ఏలుబడికి, ఇటు ప్రజల ధార్మిక నేపథ్యానికి గీటురాయి. జాతి శీలానికి కలికితురాయి. రావణ సంహారం అనంతరం రాముడు అయోధ్యకు తిరిగివస్తూ హనుమంతుణ్ని నంది గ్రామానికి ముందుగా పంపించాడు. తన రాకను భరతుడికి తెలియజేయమన్నాడు. ‘ఈ సంగతి చెబుతున్నప్పుడు భరతుడి మొహంలో మార్పులను గమనించు. అతడి మనసు గ్రహించు. ఇన్నేళ్ల పరిపాలనతో భరతుడి మదిలో ఏమూలో కొద్దిగా అయినా రాజ్యకాంక్ష మొలకెత్తిందేమో గుర్తించు. అధికారయోగం, రాజ్యభోగం ఎంతటివారినైనా ప్రలోభపెడతాయి. ఒకవేళ భరతుడి విషయంలో అదే జరిగితే, నేను సర్వంసహా ఈ సామ్రాజ్యాన్ని తక్షణమే అతడికి ధారాదత్తం చేస్తాను’ అని విస్పష్టంగా ప్రకటించాడు. అలాగే భరతుడి పాలనపట్ల ప్రజాభిప్రాయాన్ని సైతం అర్థం చేసుకొమ్మన్నాడు. వారు అతడి పట్లే మొగ్గుచూపిస్తుంటే కూడా రాజ్యాధికారాన్ని వదులుకోవడానికి రాముడికి అభ్యంతరం లేనేలేదు. అది పురుషోత్తమ స్వభావం. అంతటి గొప్ప మానసిక స్థితి రాముడిది. పరమయోగ్యుడైన, పరిపూర్ణుడైన రాజు ఎవరంటే రాముడేనని ఈ జాతి విశ్వసించడానికి కారణం అది! అందుకే రామరాజ్యం అనేది సుపరిపాలనకు ఒక నమూనాగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది.

రామాయణంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన రాజ్యాలు మూడు. అయోధ్య, మిథిల, లంక! మిథిలాధిపతి జనకుడు గొప్ప రాజర్షి. ఆయన మహాయోగి. లంకేశ్వరుడైన రావణుడు పరమభోగి. ధర్మమూర్తి అయిన రాముడి రాజ్యంలో ప్రజలు చక్కని ధార్మిక ప్రవృత్తితో జీవించారు. జనకుడు ఏలికగా మిథిలావాసులు రుషితుల్యులై జీవనం సాగించారు. లంకలో రాక్షసులు భోగలాలసులై విచ్చలవిడిగా సంచరించారు. రామరాజ్యంలో ఆయుర్దాయం పూర్తి కాకుండా మరణించినవాడు లేడు. రావణుడి అనుచరుల్లో పూర్తికాలం జీవించినవాడంటూ ఒక్కడూ లేడు.‘యథా రాజా తథా ప్రజా’ అన్న నానుడికి తాత్పర్యం అదే. వాళ్లెలా ఉంటారో వీళ్ళూ అలానే ఉంటారు. వాళ్లెలా పోతారో వీళ్లూ అలానే పోతారు. నాకం అంటే స్వర్గం. ధర్మబద్ధంగా పాలించినవాళ్లు స్వర్గసుఖాలకు అర్హత పొందుతారు. లేనివాళ్లు నరకానికి పోతారని శాస్త్రాలు చెప్పాయి. పాలకులు దాన్ని నమ్మారు. కనుక అధికారంలో ఉన్నప్పుడు తాము పాటించే ధర్మాధర్మాలే చివరిలో తమకు నాకమా నరకమా అనేది తేలుస్తాయని గట్టిగా భావించారు. ఆ మేరకు ధర్మబద్ధంగా పాలించారు. చరిత్రలో నిలిచారు.
సర్వకార్యసిద్దికి రామాయణ పారాయణ | Sarvakaryasiddiki Ramayana Parayana | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktibooks



రామరాజ్యమే కావాలనుకునే ప్రజలు రామరాజ్య పౌరుల మాదిరే ఆలోచించాలి. ఎలాంటివారిని ఎన్నుకుంటే పరిపాలన ఆ తీరుగా నడుస్తుంది. వేప విత్తులు నాటినవాడు బంగినపల్లి మామిడి మొలకలు కోసం ఎదురుచూడటం అవివేకం. రామరాజ్యాన్ని కానుక చేద్దామనుకొనే పాలకులూ ఆ తీరుగానే ఆలోచించాలి. మంచిదారిలో నడచిన రాముడికి కోతులు, పక్షులు, ఉడతలు సైతం సహకరించాయి. చెడు మార్గం పట్టిన రావణుని సొంత తమ్ముడే విడిచిపెట్టేశాడు. ఈ సత్యాన్ని గుర్తించిన రోజు కలియుగంలోనూ రామరాజ్యం ఆవిర్భవిస్తుంది.
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment