పిల్లల పేర్లు (బాబు) | Pillala Perlu (Babu) | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

పిల్లల పేర్లు (బాబు)
Pillala Perlu (Babu)
Rs 36/-
---------------------------------
జన్మోత్సవం!
పుట్టుక... ఓ వేడుక

జన్మ ఓ అద్భుతం... జన్మనివ్వడం అదో వరం...
తమ కలల పంట భూమిపై పడే ఆ క్షణం...
అమ్మ, నాన్న చేసే తపస్సు ఫలించే తరుణం...
ఇంత అపురూప క్షణాలను అంతే పదిలంగా దాచుకోవాలనే భావన ఇప్పుడు పెరుగుతోంది...
బిడ్డ తమ కుటుంబంలోకి వచ్చే రోజును పండగలా చేసుకునే సంస్కృతి విస్తరిస్తోంది...
దీనికోసం బిడ్డ కడుపులో పడ్డ క్షణం నుంచే ఎన్నో కార్యక్రమాలు, మరెన్నో ఆసక్తికర ఉత్సవాలు...


ఒకప్పటిలా కాదు...పిల్లలు అంటే ఒకరు తప్పితే ఇద్దరు. చాలా మంది భార్యభర్తలది ఇదే బాట. దీంతో వారికి సంబంధించిన ప్రతి సందర్భాన్ని ఎంతో అపురూపంగా మలుచుకునేందుకు ఆసక్తి పెరుగుతోంది. పెళ్లైన తర్వాత పిల్లల కోసం ఏడాది ముందే నుంచే భార్యాభర్తలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మేనరికం, దగ్గరి బంధువుల్లో పెళ్లిళ్లు చేసుకుంటే పుట్టే పిల్లలకు జన్యుపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. ఒకవేళ తప్పదని పెళ్లి చేసుకున్నా సరే... పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ఇబ్బందులూ రాకూడదు. అందుకే జన్యు కౌన్సెలింగ్‌ నిపుణులను సంప్రదించడం ఇటీవల బాగా పెరిగింది. బేగంపేటలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ జెనెటిక్స్‌ అండ్‌ హాస్పిటల్‌ ఫర్‌ జెనెటిక్‌ డిసీజెస్‌ సంస్థకు ఈ తరహా కౌన్సెలింగ్‌కు వచ్చే జంటల సంఖ్య బాగా పెరుగుతోంది.
* తొమ్మిదినెలల ప్రయాణంలో ఏం తినాలి... ఏం తినకూడదు అనే విషయంలో తల్లులకు బోలెడు అనుమానాలు. వాటిని తీర్చేందుకు పోషకాహార నిపుణుల ఆధ్వర్యంలో న్యూట్రిషనల్‌ తరగతులు జరుగుతున్నాయి. ఇటీవల వీటికి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. వీటికోసం ప్రత్యేక శిక్షణ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ఈ సంస్థలు సలహాలు, సూచనలు ఇవ్వడం మాత్రమే కాదు తగిన ఆహారాన్ని రెడీమేడ్‌గా అందిస్తున్నాయి కూడా.
* తొలిసారిగా అమ్మయిన వారికి అంతా అయోమయమే. అందులో పాపాయికి పాలుపట్టించడం కూడా ఒకటి. ఈ ఇబ్బంది లేకుండా చూసేందుకే ఆస్పత్రులు లాక్టేషన్‌ నిపుణులని నియమించి ఇందుకోసం కాబోయే తల్లులకు తరగతులు నిర్వహిస్తున్నాయి. దీనినే లాక్టేషన్‌ కౌన్సెలింగ్‌ అంటున్నారు.
* సీమంతం వేడుక ఆడవాళ్లదైతే ఈ డైపర్‌ షవర్‌ మగవాళ్ల వేడుక. ఈ పార్టీకి వచ్చినవాళ్లంతా కాబోయే తల్లిదండ్రులకు ఖర్చు తగ్గించడానికి ముందుగానే పాపాయిలకు అవసరం అయ్యే డైపర్లని అందమైన కానుకలుగా మలిచి ఇస్తారన్నమాట.


* తల్లిదండ్రులుగా మారే ఈ ప్రయాణాన్ని ఓ మధురమైన జ్ఞాపకంగా మలుచుకోవాలని అనుకోని అమ్మానాన్నలు ఉంటారా? ఈ పనిచేయడానికి నగరాల్లో ప్రత్యేకంగా కళాకారులు ఉంటున్నారు. ఇమ్‌ప్రెషన్స్‌ లేదా బెల్లీ కాస్టింగ్‌ పేరుతో ప్రత్యేకమైన రసాయనాలు లేని క్లేని వాడి అమ్మపొట్టని ఓ కళాఖండంగా తయారుచేస్తారు. పాపాయి పుట్టిన తర్వాత కూడా అమ్మపొట్టలో పడుకున్నట్లే ఉంటుంది. జీవితంలో ఎప్పుడైనా అమ్మపొట్టని తనివితీరా తాకి ఆనందించవచ్చు. పాపాయి ముద్దు పాదాలని, చేతులని ఇలా జ్ఞాపకాలుగా మలుచుకుని మురిసిపోవడం కూడా ట్రెండుగా మారింది.
* కాన్పు అనేది ఒక్క తల్లికి సంబంధించిన బాధ్యత మాత్రమే కాదు. తల్లిదండ్రులు ఇద్దరికీ సంబంధించింది. అందుకే పేరెంట్‌ థెరపీ తరగతులని ఇద్దరికీ నిర్వహిస్తున్నారు. భాగస్వామిని శారీరక, మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలిగితే ప్రసవం సులభంగా అవ్వడంతో పాటు పాపాయి ఆరోగ్యం కూడా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే కాబోయే తల్లిదండ్రుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు యోగా నిపుణుల ఆధ్వర్యంలో కపుల్‌ యోగా తరగతులు నిర్వహిస్తున్నారు.
* ఎంతగా ధైర్యం తెచ్చుకున్నా ప్రసవం అనేది తల్లికి పునర్జన్మలాంటిదే.. ముఖ్యంగా నొప్పులని తట్టుకుని సాధారణ ప్రసవం ఇవ్వడం తల్లి చేతిలోనే ఉంటుంది కాబట్టి.. నిపుణుల ఆధ్వర్యంలో జరిగే పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ తరగతులు ప్రాముఖ్యతని సంతరించుకుంటున్నాయి.
22వ వారం నుంచే...

* సాంకేతికత అందుబాటులోకి వచ్చాక తల్లిదండ్రులు మరో అడుగు ముందుకు వేస్తున్నారు. తమ చిన్నారి కడుపులో పడిన నుంచి వారు నెలానెలా పెరుగుతున్న తీరును ఒడిసి పట్టి జ్ఞాపకాలుగా భద్రపరుస్తున్నారు. 3డీ, 4డీ స్కాన్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కొన్ని కార్పొరేట్‌, ప్రైవేటు ఆసుపత్రులు ఈ సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. కడుపులో శిశువు పెరుగుదల క్రమపద్ధతిలో సాగుతుంది. మొత్తం 36 వారాల్లో 22 వారాల నుంచి కదలికలు ఎక్కువగా ఉంటాయి. కళ్లు తెరిచి చూడటం, నాలుక బయట పెట్టడం, కాళ్లు చేతులు ఆడించడం లాంటివి చేస్తారు. కొన్నిసార్లు హావభావాలు కూడా ప్రకటిస్తారు.ఇలాంటి కదలికలు తల్లికి ఎంతో అద్భుత అనుభూతినిస్తాయి. ఆ ఆనంద క్షణాలను ఒడిసి పట్టి తల్లిదండ్రులు జ్ఞాపకాల కింద పదిలపరుచుకోవడం ఇప్పుడు ఇదో కొత్త ట్రెండుగా సాగుతోంది. కడుపులో ఉన్నప్పుడే వీడియోలు...ఫొటోలు తీసుకునే వెసులుబాటు ఇస్తారంటే...శిశువు ఆడో మగో అని కూడా తెలుసుకోవచ్చుననే అనుమానం కలగవచ్చు. అది ఎంత మాత్రం కాదని వైద్యులు చెబుతున్నారు. కేవలం ముఖ కవలికలు...కాళ్లు, చేతులు వరకే చూపిస్తారు.


ప్రెసిడెన్షియల్‌ సూట్లో... పాపాయి...


ప్రసవం..అంటే ఒకప్పుడు దగ్గరలో మంచి ఆసుపత్రి చూసుకొని అక్కడ చేర్పించే వారు. భార్య ఆసుపత్రి గదిలో ఉంటే భర్త, కుటుంబ సభ్యులు అటు ఇటు తిరుగుతూ వైద్యులు.. ఏం కబురు చెబుతారా..అని వేచి ఉండడం... ఇప్పుడా పరిస్థితి మారింది. నయా ట్రెండ్‌లు ఆహ్వానం పలుకుతున్నాయి ప్రసవాన్ని కుటుంబం మొత్తం ఒక పెద్ద వేడుకలా చేసుకునేలా ఆసుపత్రులను తీర్చిదిద్దడం అందులో ఒకటి. తల్లి పక్కనే ఉంటూ ఆ ఆనందంలో అందరూ పాలు పంచుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాస్తంత డబ్బు పెట్టగలిగే స్తోమత ఉంటే చాలు... అడుగు పెట్టిన నుంచి పండింటి బిడ్డతో ఇంటికి తిరిగి వెళ్లే వరకు ప్రతి క్షణం మధురానుభూతిగా మార్చుకునే అవకాశాన్ని ఆసుపత్రులే కలిగిస్తున్నాయి. ఇప్పుడు పలు కార్పొరేట్‌ ఆసుపత్రులు ఈ రకమైన సౌకర్యాలు, వసతులతో ఆహ్వానం పలుకుతున్నాయి. ఆసుపత్రిలా కాకుండా ఓ స్టార్‌ హోటల్‌లో మాదిరి వాతావరణం కల్పిస్తున్నాయి. ప్రత్యేకంగా సూట్‌లు, ప్రెసిడెన్సియల్‌ సూట్‌లను తీర్చిదిద్దాయి. పరిశుభ్రతమైన...అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో శిశువుకు జన్మనిచ్చేలా ఇక్కడ వాతావరణం ఉంటుంది. ఒక్కో ప్రసవానికి ఒక్కో ఆసుపత్రి ప్యాకేజీ రూపంలో అందిస్తున్నాయి. రూ.2 నుంచి రూ.6 లక్షల వరకు దీనికోసం వసూలు చేస్తున్నాయి.


అదో వర్ణ చిత్రం...


ప్రెసిడెన్సియల్‌ సూట్లులో సకల సౌకర్యాలు ఉంటాయి. అయిదు, ఏడు నక్షతాల హోటళ్ల తరహాలో వసతులు కల్పిస్తారు. గర్భిణి కోసం ప్రత్యేక పడక గది, ప్రత్యేక బాత్‌రూం, కంటికి ఇంపుగా, మనసుకు ఆహ్లాదంగా ఉండే కర్టెన్లు, లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఉండడానికి ప్రత్యేక ఏర్పాట్లు అదనం. ఇన్‌ఫెక్షన్లకు 100 శాతం దూరంగా ఈ ప్రత్యేక సూట్లను తీర్చిదిద్దారు. పక్కనే 24 గంటల అత్యవసర విభాగం ఉంటుంది. తల్లి పిల్లలకు ఎలాంటి అత్యవసర చికిత్స అవసరమైన వెంటనే తరలించేలా ఏర్పాట్లు ఉంటాయి. అప్పుడే పుట్టే శిశువు కోసం ప్రత్యేకంగా ఎన్‌ఐసీయూ కూడా ఉంటుంది. బయట నుంచి వచ్చే కుటుంబ సభ్యులు, స్నేహితులకు అతిథి మర్యాదలను కూడా కొదవ లేదు. పోషకాహారం నిపుణుల సూచనలు, సలహాలతోపాటు చిన్న చిన్న వ్యాయామలపై తల్లులకు శిక్షణ ఇస్తారు. ప్రత్యేకంగా స్పా కూడా అందుబాటులో ఉంటుంది. డిశ్చార్జి అయ్యే రోజు శిశువు తల్లికి అవసరమైన సామాగ్రితో గిఫ్ట్‌ ప్యాక్‌, అందమైన ఆల్బమ్‌ కూడా బహుమతిగా అందిస్తూ ఆకట్టుకుంటున్నారు. ‘హైదరాబాద్‌ మాత్రమే కాదు...ఇతర ప్రాంతాల నుంచి కుటుంబాలతో సహా ఈ తరహా సౌకర్యాలు కోరుకునేవారి సంఖ్య పెరిగింది. గతంతో పోల్చితే సుఖవంతమైన, సౌకర్యమైన ప్రసవాన్ని చాలామంది కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా పరిమతంగా ప్రత్యేక వసతులతో ఇలాంటి వార్డులను నిర్వహిస్తున్నాం’ అంటున్నారు రెయిన్‌బో గైనకాలజీ విభాగం వైద్యురాలు ప్రణతీ రెడ్డి.
* చిన్న పిల్లలు చేసే అల్లరి నుంచి ప్రతి కదలికా తల్లిదండ్రులకు ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. ఫొటోషూట్స్‌: నిశ్చితార్థం, పెళ్లి, పుట్టినరోజు వేడుకల్లో ఫొటోషూట్ల ప్రాధాన్యత పెరిగినట్లే... అమ్మగా ఉండే జ్ఞాపకాలని పదిలపరుచుకునేందుకు మాటర్నిటీ ఫొటోషూట్స్‌కి ప్రాధాన్యత పెరిగింది.   - గొర్లె బాలకృష్ణ, హైదరాబాద్‌

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

No comments:

Post a Comment